19, నవంబర్ 2019, మంగళవారం

బొమ్మ

బొమ్మ....

చిన్నప్పుడు మా స్నేహితురాలికి వాళ్ళ బంధువులు అమెరికా నుండి కళ్ళు మూసి తెరిచే బొమ్మ తెచ్చిచ్చారు. తనని 'ప్లీజ్ ఆ బొమ్మ ఒక్కసారి చూపించవా" అని వాళ్ళింటి చుట్టూ (నిర్లజ్జగా చెప్పాలంటే శునక రాణి వలె) తిరిగేదాన్ని. ఆ అమ్మాయి ఎంత షాన్ చేసేదో. మర్చి పోలేను.
నా దగ్గరేమో నిట్ట నిలువుగా కాళ్ళూ చేతులూ అతుక్కు పోయిన రబ్బరు బొమ్మలే.

ఈ విషయం తెలిసిన ఈ మధ్య మా అమ్మాయి నాకు ఒక బొమ్మ కొనిచ్చింది, కానీ నేను సంతృప్తి చెందలేదు. నేననుకున్నది కాదది.

ఇప్పుడు నాకు కావాలి ఈ బొమ్మ? ఎలా? ఎలా?  ఎలా?

☝☝This is an android doll made in China. It is so real -What next China will make?

Thanks Aruna Vyas garu for sharing such a lovely doll.

29, అక్టోబర్ 2019, మంగళవారం

కలల రాణి

కలల రాణీ పుట్టిన రోజు జేజేలు...

మా చిన్న మనవరాలు శ్రియ ఒక నెల మాతో ఉండి వాళ్ళ అమ్మ నాన్నలతో అమెరికా వెళ్ళిన తరవాత కలిగిన భావ ఆవేశం తో రాసిన మైల్ మీ అందరి కోసం……………..

డియర్ చిన్నారి చిట్టి ప్రేయసీ! మా చంటి రాక్షసీ!
మా హృదయాలని దొంగిలించి న్యూ జెర్సీ పారి పోయిన " ఓ శ్రియమ్మా"!
మా ఇంట చక్కగా నడయాడి, నీ బోసి నవ్వులతో మా మనస్సులను దోచి, మా చేత అన్ని సేవలూ చేయించుకుని, కనిపించిన అందరినీ నగుమోముతో పలకరిస్తూ, వారు నీ వేపు చూస్తే చాలు చెంగుమని గెంతి…..వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి పోయి, వాళ్ళని ఆనంద పరుస్తూ, మాకు కొంత స్వాంతన చేకూరుస్తూ, (మా చేతులు నొప్పులు పుట్టకుండా చూసిన ఉపాయమంతురాలా) ఎంత చక్కగా వ్యవహరించేవు!
చివరికి మా హృదయాలని దొంగిలించి వెళ్ళి పోయేవు. మొన్న ఎవరో నిన్ను ఎత్తుకు పోతున్నట్లు కల వచ్చింది. (తీరా చూస్తే అది మీ అమ్మ నాన్నగారు నిన్ను న్యూజెర్సీ తీసుకెళ్ళి నందుకు వచ్చిన తిప్పలన్న మాట)
మరలా ఇవాళ నువ్వు పాకుతూ వస్తున్నట్లు కల.

" ఓ కలల రాణీ! కనికరించు" మమ్మల్ని మా పనులు చేసుకోనీ.

అన్నట్లు మన వారందరికీ చెప్పేవా? ఏమని అంటే :-
"మా అమ్మమ్మ చింత చిగురు పప్పు, ఆవకాయ అన్నం, చారూ, పెరుగూ, చాలా బాగా చేస్తుంది..( ఎలా తెలుసు అంటారా? నాకు అన్నప్రాసన మర్నాడే పెట్టింది కాబట్టి) అన్నట్లు అయిస్ క్రీం కూడా పెట్టింది తెలుసా?
అవును నిజం, మా అమ్మమ్మ నాకు అవన్నీ పెట్టింది. మా అమ్మకి చెప్పద్దు, నన్ను" ప.. ప్ప… ప్పా" అయితే- గియితే అమ్మమ్మని కూడా. కాబట్టి దయ చేసి చెప్పద్దు.
మా అక్క కూడా నన్ను చిట్టి తల్లీ అనీ, పండూ అనీ, ముద్దు లాడు తోంది. (నాకు అర్ధంకాడంలేదు, మా అక్క కూడా చిట్టి తల్లే కదా !నన్ను ఎందుకు అలా అంటోంది? )
అయినా నాకెందుకు లెండి. నేను బహుసా అందరికీ చాలా……….ముద్దు వస్తున్నాననుక్కుంట. " అని అందరికీ చెప్పేవా? లేదా? లేకపోతే ఇది చదివి తెలుసుకోమను.
అమ్మమ్మ

ఇది చూసి ఇంకా పసి పాప అనుక్కుంటున్నారా? కాదండీ కొంచెం పెద్దదే అయ్యింది మా మల్లె మొగ్గ. ఎన్ని కబుర్లు, ఎంత అల్లరి, ఎంతటి విశ్లేషణ. (మా కళ్ళ ముందు పుట్టిన ఈ చిన్నారి పెద్దదయి పోతోందా! ఓహో అయితే మేమూ పెద్దయి పోతున్నామా కొంపదీసి, ఒప్పుకోను... "ముసలి తనపు అడుగుల సడి వినపడితే, ఇంట లేడనీ చెప్పించూ, ఇపుడు వీలు కాదనీ పంపించు" కదా మన సిధ్ధాంతం, అప్రస్తుత ప్రసంగం! మన గోలెందుకు ఇక్కడ? )

అంతే కాదు మీకు మరో గురుతర బాధ్యత కూడా ఇస్తున్నాను. ఈ రోజు పుట్టిన రోజు మా మల్లె మొగ్గకు ఆశీస్సులు ఇద్దామా?......

బ్రాడ్వే షో

చిరకాల వాంఛ సాకారమైన వేళ

అమ్మమ్మా, తాతగారూ! మా కాలేజ్ కి రండి ప్లీజ్, మనవరాలి కోరిక. మరి కొత్తగా కాలేజీలో చేరిందాయను, మాకు చూపించాలని తహతహ.పైగా మేము ఇండియా బయలుదేరే ప్రయత్నంలో వున్నామని తొందర చేసి బయలుదేరదీయించింది మా అమ్మాయి.

సరే సరస్వతీ ఆలయాన్ని కన్నులారా సేవించి, నలుగురం కలిపి న్యూయార్క్ వెళ్ళాం. పరిగెట్టిస్తున్నారు మా ఇద్దరినీ. ఎందుకో అనుకున్నాం. 1.30 కల్లా బ్రాడ్వే షోకి తీసుకెళ్ళారు.”అల్లాడిన్”. 

ఆ ధియేటర్, లోపల ఎంత అందంగా వుందో చెప్పలేను. షో జరుగుతున్నంత సేపూ కనురెప్ప మూయకుండా, ఆఅద్బుత రసరమ్య కళారూపాన్ని ఆస్వాదించాము. సినిమాలో షాట్ షాట్ తీసి కలుపుతారు. ఇక్కడ మన కళ్ళ ఎదుట అద్భుతమైన సెట్స్ కనురెప్ప పాటులో మాయా, మంత్ర జాలంలా మారి పోతోంది.. కళ్ళల్లో ముద్రించుకు పోయాయి సన్నివేశాలు. మరవలేము, మరువనీదు. జీని పాత్రధారి స్థూల కాయుడు, అయినా అతని డాన్స్, హుషారు చూసి అచ్చెరువొందాల్సిందే. ఏమి షో అండి.జీవింతంలో తప్పక చూసి తీరవలసిన షో.

మన సురభీ నాటకాలు కూడా తక్కువ కాదండీ. కానీ అమెరికాలో ఆదరణ వుంది. మన దగ్గర ఆదరణ ఎలాంటిదో మీకు తెలీనిదేముంది. విత్తం కొద్దీ వైభోగం, పిండి కొలదీ రొట్టె,కలగిన వాడు గుఱ్ఱంఎక్కుతాడు, లేని వాడు గాడిద ఎక్కుతాడు లాండి నానుడులు విన్నారు కదా¡ అంతే అర్ధం చేసుకోండి.

నేను జీవితంలో యూరప్ చూడాలనేది, బ్రాడ్వే షో చూడాలనే కోరికలు తీరిపోయాయి.

ప్రస్తుతం భగవద్గీత అర్ధం, సౌందర్య లహరి వివరణ తెలుసుకోడంలో నిమగ్నమయి వున్నాను. ఓం శ్రీ పరమాత్మనేనమః. ఓం శ్రీ మాత్రేనమః

డైట్ మీద

ఒరే ఒరు కన్ఫ్యూజన్.......
ఒక పక్క తిండి మితంగా మిల్లెట్స్ తినమని ఘోష, మరో పక్క భోజన గ్రూప్ లూ, నోరూరించే కొత్త కొత్త వంటకాలు. ఎవరి మాట వినాలి?

బుఱ్ఱ తిరిగి పోతోంది బాబోయ్ నాయనోయ్.

మన పెద్దలు ఏ సమస్యా లేకుండా హాయిగా తిని అరగించుకున్నారు.

మనం చూస్తూ చూస్తూ తినలేమూ, తింటే అరగించుకోలేము.
ఏం చేద్దాం?

సింద్ బాద్ కధలు

బాల్యం ఒక తీపి గుర్తు.......

సింద్ బాద్ కధలు, అరేబియన్ నైట్స్, తెనాలి రామలింగడు,పరమానందయ్య శిష్యుల కధలు,అక్బర్ బీర్బల్ కధలు, చందమామ, బాలమిత్ర కధలు, బాలానంద కార్యక్రమాలు నాకు ఎనలేని ఆనందాన్ని ఇచ్చాయి. మీకు కూడానా.
ఎంత మంది వీటిని తలచుకుని ఆనందించ గలరు?

27, అక్టోబర్ 2019, ఆదివారం

దీపావళి

నరక చతుర్దశి, దీపావళి

అబ్బా అప్పుడే నిద్ర లేవాలా అనుక్కుని బిగుసుకు పడుక్కున్నా అమ్మలు వూరుకుంటారా? చెవులో రొద పెట్టి ఛం....రూ? చిన్న పిల్లలని కనికరం వుండదు.

లేవగానే బ్రష్ చేయనిచ్చి, పాలు తాగడానికి ఇచ్చి, ఒంటి నిండా నూనె పట్టించి, నలుగు పెట్టి, కుంకుడుకాయ పులుసు వేసి తలంట్లు. నలుగురం కళ్ళల్లో పడిందని గీవురు బావుర్లు.అప్పుడు తినడానికి రస్కులు.

అది అవ్వగానే నాన్నగారు తలకు చిక్కుతీసి, రిబ్బన్లతో జడలు. కాళ్ళ మీద చిన్న టవల్ కప్పి కేపులు కొట్టించడం. వాటి రవ్వలు పడ్డాయని కేపులు చిన్న  గూటాంతో  కొట్టనని మారాం.

తరువాత కల్పకం గాయత్రీ ఇంటికి పరుగు. 12.30 అయినా అక్కడే వేళ్ళాడిపోతూ ఊడిరాడం లేదని మా అమ్మ వెరైటీగా మా చెల్లికో కుంకంభరిణ ఇచ్చి "వంటలయ్యాయి మళ్ళు కట్టుకోండని" పిలిపించడం. అందరూ ఇప్పటికీ తలచుకునేలా చేసిన ఆ చర్య తలచుకుంటే పెదవిపై చిరునవ్వు.

సాయంత్రం కొద్దిగా టపాకాయలు కాల్చుకుని రేపటికి దాచుకోడం. కాటన్ బట్టలు కట్టుకోవాలండీ బాబూ, నైలెక్స్ చీర కట్టుకున్న మా పై ఆవిడ చీర అంటుకోడం. అరే! ఎన్ని గుర్తులు.

ఇక మర్నాడు పులిహోర, గారెలు, పరవాన్నం. తెగ మెక్కినా ఇప్పటిలా మధ్యహ్నం కునుకు లేదు. గెంతులే గెంతులు.

సాయంత్రం ఎప్పుడబ్బా ఇంకా? అని ఎదురు చూసి,దివిటీ కొట్టి ( బొప్పాయి కఱ్ఱకు ఆవదంలో ముంచిన గుడ్డలు) కాళ్ళూ చేతులూ కడుక్కుని,తీపి తిని ఇంక నేనూ మా చెల్లీ కాకరపువ్వొత్తులూ, మతాబులూ, చిచ్చుబుడ్లూ లాంటివీ, మా తమ్ముళ్ళు చిన్న సీమటపాకాయలూ కాల్చుకుని, టపాకాయలతో పాటూ మధ్య మధ్యలో అమ్మా వాళ్ళు ఇచ్చే మొట్టికాయలు, చీవాట్లూ తింటూ, టపాకాయల పర్వం ముగించుకుని భోజనాలూ, నిద్రలూ.

ఇదండీ చిన్నప్పటి మా దీపావళి విశేషాలు.

13, సెప్టెంబర్ 2019, శుక్రవారం

స్మృతి సమీరం

స్మృతి సమీరం

"ఓ మునీ !మీ దంపతుల కు ముద్దుగా పుట్టిన తనయులం -కారణ జన్ములం - ఇద్దర్నీ కలిసి ఎత్తుకోనే శక్తి - నీకు ఇదే ఇస్తున్నాము - ప్రతిఫలం గా ఎవ్వరూ సంపాదించ లేనంత పుణ్యం - ఇదుగో." అని వీరి తనయులు దీవించారు.

తనయులు తల్లితండ్రులను దీవించడమేమిటని? విడ్డూర పడకండి. అవును! వారిరువురూ పసికూనలైన మునిపుంగవులు. వారిని గడ్డాలు మీసాలూ వచ్చినా అడ్డాలలోని పిల్లల్లా సాకారు, ముద్దుగా వారి ఇష్టాఇష్టాలని ఊహించుకుని వాటిని అమరుస్తూ, వారిని ఒక్క క్షణం కూడా ఏమరుపాటున వదలక,వెన్నంటి చూసుకున్న ఆ తల్లితండ్రులు పరమ పూజ్యులు. వారిలో పెద్ద మౌని భగవంతుని 9సంవత్సరాల క్రితం చేరుకుని జన్మ రాహిత్యం పొందాడు. చిన్న వాడు తపస్సులోనే వున్నాడు.

పిల్లల దీవెనల ఫలితంగా ఆ భార్యాభర్తలిరువురూ స్వార్ధ రహితులుగా మారిపోయినారు. ప్రపంచం అంతా వారికి పిల్లలే. నా మటుకు నేను, వారిని నాకూ, నా భర్తకూ, నా తల్లితండ్రులకూ, నా పిల్లలకు కూడా తల్లి తండ్రులుగా భావిస్తాను. అది నిజం కూడా. వారికి తెలిసిన యావన్మందీ ఉమా,మూర్తి దంపతుల గూర్చి ముక్తకంఠంతో ఇలాగే చెప్పితీరుతారు.

వారికి పరిచయస్తు లెవరైనా వారినుండీ కించిత్తైనా ప్రయోజనం పొందకుండా లేరు. (ఈ విషయం బయటకు అన్నా అనలేక పోయినా.)

మేమెవరమైనా వారి కుటుంబానికి ఏదైనా ఆత్మీయంగా వెన్నంటి వున్నామంటే కారణం, మేము కృతజ్ఞులం అనీ, కృతఘ్నులం కాదనీ, ఇంకా మానవత్వం మాలో మిగులున్నదని అర్ధం. ఇది మా గొప్పతనం కాదు. వారిరువురూ సంపాయించుకున్నది డబ్బూ కీర్తి ప్రతిష్టలు కానే కాదు, సర్వ జనాభిమాన ధనం. అనితర సాధ్యమైన ఈ ధనం వారు అప్పనంగా సంపాయించ లేదు, వారు నిస్వార్ధంగా పంచిన అభిమానమే ఈనాడు వారు సంపాయించిన ఈ అభిమానధనం. ఉమా మూర్తీ మీరిరువురూ అన్ని విధాలా ధన్యజీవులు.

ఆ మూర్తిని ఇక చూడలేక పోయినా, అందరి హృదయాలనూ జయించిన అజేయుడు. అతి సామాన్యుడుగా పుట్టి, అసమాన్యుడిగా ఎదిగి, మాన్యుడిగా మారిన స్వయంసిద్ధుడు.కడలిలా కష్టాలను కడుపులో దాచుకుని సముద్ర గాంభీర్యం హృదయంలో నింపుకొని,ఎల్లప్పుడూ చిరు మందహాసం తో అందరిని పలకరిస్తూ, ఎంతో శ్రమ కోర్చి పట్టుదలతో కంపెనీ సెక్రెటరీ, కాస్ట్ అకౌంటన్సీ పరీక్షలను అవలీలగా పాసై, జ్యోతిష్య శాస్త్రం లో అద్భుత ప్రతిభ కనబరిచే శ్రీ మూర్తిగారు సర్వదా అభినందనీయులు. వారు ఈ లోకం విడచి తిరిగిరాని లోకాలకు వెళ్ళి నిన్నటికి మూడు సంవత్సరాలు.

ఆ ఇద్దరి అన్యోన్యతా చెప్పనలవి కానిది. అన్యోన్యంగా భార్యాభర్తలు మంచి ఆలోచనా చెయ్యవచ్చు, అప్పుడప్పుడు ఇరువురూ కూడి చెడు ఆలోచనలు కూడా అమలు చెయ్సవచ్చు. కానీ ఈ భార్యాభర్తా కలసికట్టుగా ఇతరుల మంచే ఆలోచించారు, ఇతరులకు మంచే చేసారు.

మూర్తిగారు పరమపదించే ముందు రోజు " ఉమాదేవి చాలా మంచిది, నాకు మరు జన్మలో కూడా తనే భార్యగా రావాలని" చెప్పారట. అంత కన్నా ఒక స్త్రీకి కావల్సిన/రావల్సిన కితాబు ఏముంటుంది భర్త నుండీ?

పిల్లలు ఇరువురూ దీవెనల ఫలితంగా, మూర్తిగారు క్రితం 3 సంవత్సరాల క్రితం ఇదే రోజు,ఉమాదేవి చెయ్యి గట్టిగా పట్టుకుని వుండగానే క్షణంలో భగవంతుని సాన్నిత్యాన్ని చేరేరు.

గొప్పచెప్పుకోడం కాదు........ గొప్పగా చెపుతున్నాను వీరు మా చెల్లెలు ఓరుగంటి ఉమాదేవి, మరిది ఓరుగంటి వేంకట నరశింహ మూర్తి గారు. పవిత్రమైన జీవితం గడిపిన మూర్తిగారికి, ఉమా దేవులకు సద్గతులు ప్రాప్తించు గాక!

మా  చెల్లి  నేనూ  ఇప్పుడు  ఎంతో  మంచి  దోస్తులము,   కానీ   చిన్నప్పుడు  ప్రియమైన శత్రువులం.. 

 నా ప్రాణ స్నేహితురాలు, నా భర్తకూ, నా పిల్లలకూ, నాకూ తల్లి అయిన ఉమ, నిన్న మమ్మల్ని విడిచి వాళ్ళాయనిని వెదుక్కుంటూ వెళ్ళి పోయింది.

నా 64 సంవత్సరాల వయస్సులో జరిగిన ప్రతీ సెకండూ తెలిసిన నా ప్రాణమా, నా అంతరంగమా  ఏదీ? నిన్ను ఎక్కడని వెదకను.

సునాయస మరణం కోరుకున్న నీ మొర ఆలకించాడు దేముడు. భగవంతుడు నీకు జీవితంలో ఆనందం ఇవ్వక పోయినా,   నువ్వు ఇతరుల జీవితాల్లో ఆనందం  కల్గించి, అది చూసి ఆనందించే గొప్ప హృదయం ఇచ్చాడు. నీకు సంపూర్ణ సహకారాన్నిచ్చే భర్తనిచ్చాడు.

ఒద్దు ఉమా ఒద్దు, నీకు మరు జన్మ ఒద్దు. నీకు పుణ్య ఫలంగా " జన్మ రాహిత్యాన్ని" ప్రసాదించమ ని ఆ దేవ దేవుణ్ణి కోరుకుంటుంన్నా!

ఉమా!  చిన్నప్పుడు  చాలా  సార్లు  నీకు  నా మీద కోపం  వచ్చింది,  సారీనే.

నిన్ననే గుర్తు చేసేవు కదా " ఏ జయా, ఓ ఉమా" మనిద్దరం అని.😃😃😃

వుంటా మరి....

3, సెప్టెంబర్ 2019, మంగళవారం

పుట్టిన రోజు జేజేలు ఆదిత్యా

అది 1974 . రాత్రి 10 గంటలు. చిమ్మ చీకటి.

నేనూ మా వారూ, మా అబ్బాయి బుజ్జి "ఆదిత్యా" ఫస్ట్ షో సినిమా చూసి ఇంటికి వచ్చాము. అసలయిన కధ ఇక్కడ మొదలవుతోంది.

జాగ్రత్తగా భయపడకుండా చదవండి. ఏమీ భయంలేదు, సరేనా? ఇక ముందుకెళ్దాము…………….

విజయవాడ లో మా ఇల్లు గవర్నమెంట్ క్వార్టర్స్. మేడ మీద ఇల్లు మాది. కింద రెండు , పైన రెండు ఇళ్ళు. పైకి వెళ్ళడానికి మధ్య నుండీ మెట్లు. మెట్ల గదికి కింద చక్కటి తలుపు.

అన్నట్లు ఇక్కడ ఒక విషయంచెప్పలి:- మా మేడ మీద ఎదురు పోర్షను వాళ్ళింట్లోకి, కింద మెట్ల తాలూకు కామను బల్బు కనక్షను ఉంది. పైన ఉన్న కనక్షను మాకు. దాని వల్ల మా ఎదురు ఇంటి ఆయన మెట్ల మీద బల్బ్ పెట్టనిచ్చే వారు కాదు. బిల్లు వాళ్ళు కట్టాల్సి వస్తుందని. మేము సొంతం గా ఏర్పాటు చేసుకోవచ్చని తెలీని అమాయకత. దాంతో మెట్ల తలుపు వేసెయ్యంగానే చిమ్మ చీకటి.
ఎప్పటి లాగానే కింద తలుపు గొళ్ళెం పెట్టి పైకి ఎక్కుతున్నాము, సగం మెట్లు ఎక్కగానే నా కాలు ఎవరో గట్టిగా పట్టుకున్నారు. నేను భయంతో దొంగా. దొంగా……..అని గట్టిగా కేకలు మొదలెట్టేను ఆ దొంగ నా రెండు కాళ్ళూ ఇంకా గట్టిగా పట్టు కున్నాడు.

నా అరుపుకి మా వారు కూడా చాలా………భయ పడి పోతూ ఏమయ్యిందని అరుస్తున్నారు. దొంగ నా కాళ్ళు వదడంలేదు. నేను భయంతో కాళ్ళు విదిలించుకుంటున్నాను.

ఇంతలొ ఈ హడావిడికి మా అత్తగారు ఖంగారు పడిపోతూ, తలుపు తీసేరు……………

దొంగ దొరికేడు.

దొంగ ముద్దుగా, బిత్తర చూపులతో, చిన్నిచిన్ని అరచేతుల తో , చిట్టి చిట్టి పాదాల తో, "అమ్మానన్నంటావా…………..దొంగననీ అంటావా? '' అని ప్రశ్నిస్తూ నుంచుని ఉన్నాడు.

అర్ధమయ్యిందనుక్కుంటాను. దొంగ ఎవరో.

ఎవరో కాదండీ మా అబ్బాయి "బుజ్జి ఆదిత్యే" ఆ ఇంటి దొంగ.

ఆదిత్య మొదటిసారిగా మమ్మల్ని అమ్మా నాన్నగారూ అని పిలిచి ఎనలేని ఆనందం కల్గ చేసాడు.అన్ని ఏళ్ళ క్రితం విషయాలూ కబుర్లూ నిన్నా మొన్నలా జ్ఞాపకాల మంజూషలో పదిలంగా పచ్చగా వున్నాయి.

వస పిట్టలా తను చెప్పిన కబుర్లు ఎన్నో ఎన్నెన్నో. “ చికల” ఎకల”., ఏంతి బంతి, “ లక్ష్మడికి ఆగాయిత్యం సీతా దేవికి  ఊ అంటే తప్పు, ఆ అంటే తప్పు” అంటూ రామాయణ ఘట్టం ఒకటి చెప్పడం నుంచీ రోజు రోజూ వేవేల జ్ఞాపకాలు.

చదువుకుంటున్న రోజుల్లో, నాతో అన్ని విషయాలూ వెనక వెనకే తిరుగుతూ చెప్పుతుంటే నేను కూడా కాలేజీకి వెళ్ళి చదువు కుంటున్న భావనలో వుండేదాన్ని (కాలేజీ గుమ్మం ఎక్కని దాన్ని).

తను MTech కి Calicut  వెళిపోతే, నాకు నిత్యం విజ్ఞానం ప్రసాదించే నా స్నేహితుడు  వెళ్ళి పోయాడని మనస్సు ఎంత దుఃఖించిందో. కానీ చక్కటి నడవడికతో, అక్కడ చాలా బాగా చదువుకొని, అక్కడ నుండి బెంగళూరులో CAIR లో Sr. Research fellowship తీసుకుని, తరవాత అక్కడే  scientist గా appoint అయి
, వివాహం చేసుకుని,ఇక అక్కడ నుండి అమెరికా వెళ్ళి భార్యా, కొడుకుతో కలపి సుఖజీవనం సాగిస్తున్నాడు.

నేను కోరుకున్న విధంగా సత్సాంగత్యంతో,సత్ప్రవర్తనతో, సన్మార్గంలో వెళ్ళే ఆదిత్య నా ప్రాణం. సుఖీభవా ఆదిత్యా.

వీణ, కీబోర్డ్ చాలా బాగా వాయించి, ఇంటి వారసత్వ సంపద అంది పుచ్చుకుని కొనసాగిస్తున్నాడు.

ఈ రోజు మా అబ్బాయి ఆదిత్య పుట్టిన రోజు. 
ఆదిత్యా! వంద సంవత్సరాలు నీ భార్యా టీనా, పిల్లవాడు తేజస్ తో , మనవలూ మునిమనవలతో కలపి చల్లగుండు బేటా.
దీర్ఘాయుష్మాన్ భవ, శతాయుష్మాన్ భవ, ఆయురారోగ్య ఐశ్వర్య , దిగ్విజయ ప్రాప్తిరస్తు. తథాస్తు తథాస్తు తథాస్తు.

26, ఆగస్టు 2019, సోమవారం

బాల్యం మరలా తిరిగి రావా ప్లీజ్

బాల్యం మరలా ఒకసారి తిరిగి రావా ప్లీజ్

ఎటు చూసినా ఎంత చక్కటి పచ్చిక బయళ్ళు, గుబుర్లూ, తలలూపుకుంటూ అందమైన పేద్ద చెట్లు, చల్లటి  వాతావరణం. ఎటు చూసినా పచ్చదనం, కాలుష్యం లేని చల్లగాలి. ఇళ్ళ మధ్య నుండి తాచు పాములా మెలికలు తిరుగుతూ తెల్లగా సాగి పోతున్న రోడ్.

ఇంత మంచి వాతావరణం మా చిన్నప్పుడు వుంటే, ఎన్ని లక్కపిడతలూ, ఉప్పు ఆటలు,  నేల బండా ఆటలూ, కల్పించి కల్పించి కట్టు కధలూ, సినిమా కధలూ ఎన్ని చెప్పుకునేవాళ్ళం.

ఆ ఇరుకు ఇరుకు చిక్కడపల్లీ సందుల్లోనే మేమనుభవించిన ఆనందం తలచుకుంటే ఎంత ఆనందమో.

ఇక్కడి పిల్లలు పాపం.....ఇంట్లో కూర్చుని వీడియో గేమ్స్, టివీలు, వగైరాలే పాపం.

అందుకే "దేముడా ప్లీజ్ వెంఠనే నాకు ఒక్కరోజు నా బాల్యాన్నీ, దానితో పాటూ నా చిన్న నాటి స్నేహితులనూ కూడా ఇవ్వావా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్" 🙏🙏🙏

27, జూన్ 2019, గురువారం

చిరునవ్వుకు చిరునామా

చిరునవ్వు కు  చిరునామా - చిన్నారి  చిలిపి నవ్వు ల  లాస్య.
అందాల యువతివి  - సార్థక  నామధేయవతివి.
కల్యాణీ క్రృష్ణ ల  గారాల  తనయ  -  జ్యోస్యుల వంశస్థుల  జీవన జ్యోతివి.
సంగీతజ్ణుల  ఇంటి గారాల మనుమరాలివై, " పువ్వు  పుట్ఠగనే  పరిమళించెనట్లు"   సంగీతమే  "ఓనమాలు"  గా
సాక్షాత్తు సరస్వతీ పుత్రులు సంగీత నిథి,  అపర త్యాగబ్రహ్మ , తాతగారు గురుదేవులై   ప్రేమగా  నీచే  వీణ  మీటించగా,
సంగీత సరస్వతి  అమ్మమ్మ  లాలనగా  మథుర  శ్రుతి  పలికించగా,
మాతృదేవత   మమతానురాగాలతో  నిత్యము సాథన చేయించగా,
పిత్రృదేవుని  ప్రేమానురాగాలు పొందుతూ,
సంగీత  జ్ఞాని  మామయ్య  ముద్దుల మేనకోడలివై,
తరతరాల సంగీత కుటుంబ వారసురాలివై,
ఈతరం  యువతరానికి  మార్గదర్శకురాలివై,
సంగీత సరస్వతి వై - తరగని పెన్నిధి వై,
నవ యువతకు  ప్రతినిథివై - దిక్సూచి వై,
అందము‌, సౌజన్య, సౌశీల్యాలు  తొణికిసలాడగా,
సదా చిరునవ్వు తో  వినయ విథెయతలే  నీ చిరునామా గా,
రాబోయే  సంగీత ప్రపంచానికి  మకుటం లేని మహారాణివై,
జగద్విఖ్యాతులు, సంగీత దిగ్గజములైన  తాత - అమ్మమ్మల  పేరు  - ప్రతిష్టలు  మరింత   ఇనుమడింప  చేసేలా   ముందుకు  తీసుకువెళుతూ,  దేదీప్యంగా , లాస్యంగా  వెలుగొందే   తెల్ల గులాబీ  బాల-చిరునవ్వుల  పూబాల  లాస్య.

.....నీరజ హరి.

గులాబీ బాల

మా గులాబీ బాల  kindergarten graduation కి వెళ్ళింది మొన్నీ మధ్యే కదా! అరే అప్పుడే  High school graduation  వచ్చేసిందా ఈ రోజు. రోజులెంత వేగంగా పరుగెడుతున్నాయి.

ఇంకా ఆ పసి పాప స్కూల్ కి వెళ్ళడానికి వున్న బెంగని, నా బెంగగా అభివర్ణిస్తూ, కారు దిగి పోతుండడం,  hug  చేసుకుంటుండడం, నేను తొందరగా వచ్చేస్తాను బెంగపెట్టుకోకు అంటూ ఏడుస్తూ నన్ను ఓదార్చడం.....

మెట్టు తర్వాత మెట్టు మంచి మార్క్స్ తో పూర్తి చేసుకుంటూ ఇవాళ గాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది.

నాకే ఇలా వుంటే తన తల్లితండ్రులకు ఎలా వుండి వుంటుందో?

గ్రాడ్యుయేషన్ వేడుకలో వందల మంది విద్యార్ధుల కేరింతలూ, బేండూ, టీచర్ల చక్కని సందేశాలతో ఉదయం అంతా సందడిగా గడిచి పోయింది.

చిట్టి తల్లీ! నువ్వు పరిపూర్ణమైన సఫలీకృత జీవితం అనుభవించాలని మనః పూర్వక ఆశీస్సులు.

అమ్మమ్మ, తాతగారు

లాస్య వీణ కచేరీ పై

చాలాకాలానికి యివాళ రవీంద్రభారతిలో నాదప్రభ సంస్థవారి దశాబ్ది ఉత్సవాలలో మన జయలక్ష్మి ...శ్యామసుందర్ అయ్యగారి గార్ల మనవరాలు ... లాస్యజోస్యుల వీణావాద్యం గంటపాటు రెప్పవాల్చకుండా...తాళంవేస్తూ .. తాదాత్మ్యంలో తలూపుకుంటూ భలేఎంజాయ్ చేశానండి!

రెప్పవాల్చకుండా సంగీతం వినడమేవిటో... చెవులు పెద్దవిచేసుకునో రిక్కించో అనాలికదా.... అనుకుంటున్నారా?
మీకు సంజాయిషీ యివ్వాల్సిందే!

పదహారేళ్ల లాస్య... అచ్చంగా పదహారణాలతెలుగింటి ముస్తాబులో ముద్దొస్తూనేవుంది.అంతేనా...చంద్రబింబంకన్నా అందమైన ముఖవర్ఛస్సు..
చారెడేసికళ్లు...చెంపలూ చాలావిశాలం.మేకప్పులేకుండా పసిమిచాయతో ఎంత సహజంగా వుందో పిల్ల లావణ్యం.
దానికితోడు అమ్మమ్మ తాతయ్యల లాగే మంచిపొడవు!

ఇవన్నీ అదనపు అసెట్లు .
అసలు మాట... లాస్య కచేరీకి ... గురువుగారు కూడాఅయిన తాతయ్య ...మైకులు దగ్గరుండి అమర్చడం...తిరిగి ఆడియన్స్ లోచేరి .. తాళంచూపిస్తూ ...లాస్యకి కనుసన్నలతోనే యిచ్చిన ప్రోత్సాహం...నాకుసంబరమనిపించింది.

నాట.. కీరవాణి.. ఆనందభైరవి... పూర్వీకల్యాణి..నీలాంబరి రాగాలలో చాలా గంభీరంగా వీణా వాదనం ప్రదర్శించింది.
మధ్యమధ్య ... పక్కవాద్యాలతోనేకాదు ... ప్రేక్షక జనంతోనూ ... దరహాసంతో ఆకట్టుకుంది.

విదేశాలలోనూ లాస్యకు ప్రదర్శనలివ్వడం కొత్తేమీకాదనీ తెలిసింది. వైణికులకుటుంబంలో మరో ముత్యమనుకోండి.పేరుచూశారా ప్రాస కలిగిఎంతబాగుందో!

ఆపుకున్న ముద్దును ..కచేరీ అవగానే వేదికఎక్కి .. కరచాలనంతోపాటూ కానిచ్చేశాను.

గురువులు వేదిక పైనా ... కిందా కూడా ఎంత బిజీ నో వేరేచెప్పాలా??

8, జూన్ 2019, శనివారం

ధన్యవాదాలు

హితులారా, సన్నిహితులారా, స్నేహితులారా!

మీ ప్రేమాస్పదమైన శుభాశీస్సుల, శుభాకాంక్షల జడివానలో తడిసి ముద్దయి పోయాను. మీ అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు.

"ఏనాటి నోము ఫలమో ఏదాన బలమో"
" తొలి నే జేసిన పూజా ఫలమో, నా పూర్వజుల పుణ్య ఫలమో"
ఇంత మంది శ్రేయోభిలాషులను పొంద గలగడం....
మా కుటుంబానికి మీ అందరి ఆశీస్సులు పుష్కలంగా దొరకాలని మనః పూర్వకంగా వాంఛిస్తున్నాను.

మా ఈ మనుగడ ఇలానే సాగాలని ఆకాంక్షిస్తూ,

      జయలక్ష్మి అయ్యగారి

గులాబీ బాల పుట్టింది

2001 మే 15 అర్ధరాత్రి 2.36 నిమిషాలు, JFK Hospital New Jersey. మా పెళ్ళి రోజు, పెళ్ళి ముహుర్తం......

“అరే బాప్రే బాప్! మళ్ళీ మొదలా. నిన్ననేగా పెళ్ళి రోజన్నారు. మళ్ళీ 18 ఏళ్ళ క్రితం పెళ్ళి రోజు తలచుకుంటున్నారు.ఈవిడ ఈ మత్తులోంచి బయట పడదురా నాయనా”  అనుక్కుంటున్నారని బెట్.

మరి విషయం వుంది వినండి. 2001 మే 15  రాత్రి ఇలా కునుకు పట్టిందో లేదో, ఒక సుందర దివ్య విగ్రహం ప్రత్యక్షమై  నీకు పెళ్ళి రోజు కానుకగా గులాబీల బుట్ట కావాలా/ మల్లెల బుట్ట కావాలా అని అడిగారు!  నేను నాకు అందమైన గులాబీల బుట్ట కావాలని కోరేను.

ఇంతలో ఎక్కడో “ఉవ్వా, ఉవ్వా, ఉవ్వా” అని వినిపిస్తోంది, కళ్ళు నులుము కుంటూ టైమ్ చూస్తే 2.36, సరిగ్గా 30 సంవత్సరాల క్రితం మావారు నాకు మంగళ సూత్రధారణ చేస్తున్న సమయం అనుక్కున్నాను మనస్సులో , ఇంతలో మా అమ్మాయి, అమ్మా మంచం కింద చూడూ అంది.మా అమ్మాయి మంచం కింద పెద్ద గులాబీ రంగు గులాబీల బుట్ట.

పేధ్ధ పేధ్ధ గులాబీలు అందంగా పరచబడి సువాసనలు వెదజల్లుతున్నాయి. బయటకి నెమ్మదిగా బుట్ట జరిపాం నేనూ మా అల్లుడూ. అందులోంచి వున్నట్టుండి కాళ్ళూ చేతులూ కదులుతున్నాయి. బాబోయ్!  చాలా భయం వేసింది. ఇంతలో చంద్ర బింబంలాంటి వదనంతో ఒక గులాబీ బాల. ఎఱ్ఱటి పెదవులు, ముద్దుగా వున్న  ఒక ముద్దులొలుకే బొమ్మలాంటి “లాస్య”

ఓహో! ఆ దివ్యసుందర విగ్రహం మాకు ఒసగిన ఈ గులాబీ బాల ఎవరంటే......30వత్సరాల మా వైవాహిక జీవితానికి ఒక తీపి గుర్తు.

మా పెళ్ళి రోజు, పెళ్ళి ముహర్తంలో  ఆ దేవ దేవుడు ప్రసాదించిన ఆ బుజ్జి పాప మనవరాలుగా మాకు అనంతమైన ఆనందం కలగజేసింది, జేస్తుంది, చేస్తూనే వుంటుంది.

మొన్నీమధ్యే పుట్టిన మా మనవరాలు బాగా చదువుకుంటూ, వీణ వాయిస్తూ మమ్మల్ని చాలా ఆనంద పరుస్తోంది.

అప్పుడే 3 గంటల వీణ అరంగేట్రం, ఇచ్చి ఇప్పుడు మంచి కాలేజీలో చేరబోతోంది..భగవద్గీత 18 అధ్యాయాలూ చూడకుండా చదువుతుంది.

మొదటి మనవలు ఎప్పుడూ అపురూపమే....

చిట్టి “లాస్యమ్మా” భగవంతుడు నీకు అఖండ విద్య, ఆయురారోగ్య ఐశ్వర్యాలనిచ్చి, పరిపూర్ణమైన జీవితాన్నివ్వాలని మనఃపూర్వకంగా కోరుకుంటూ........   అమ్మమ్మ, తాతగారు.

మా పెళ్ళి

1971 లో జరిగిన మా పెళ్ళి ఇంటిముందు తాటాకుల పందిరి వేసి, ఉప్మా, లడ్డూ, బూందీ,చక్కటి పప్పు, నెయ్యీ, కూరలూ పులుసూ, మజ్జిగ, ఒడియాలూ, అప్పడాలూ, లాంటి వాటితో 2 1/2 రోజుల జరిగింది.మంచి సుస్వరమైన సన్నాయి, పెళ్ళికి ముందూ వెనుకా కూడా కోటిపల్లి ప్రకాశరావు గారు, నూకల వారూ మొదలైన ఉద్దండులచే కచేరీలు, భావనా కళా సమితి వారితో సినిమా పాటల ప్రోగ్రాం ( అందులో మాధవపెద్ది సురేష్, రమేష్, చంద్రకాంతా మొదలైన లబ్ధ ప్రతిష్టులు పాల్గొన్నారు). అప్పట్లో చాలా తృప్తిగా ఆనందంగా జరిగింది మా పెళ్ళి.

వివాహం కన్నా ఆ తర్వాత గడిపే జీవితమే ముఖ్యమైనది. ఇద్దరూ కలసి మెలసి బాధ్యతలు పంచుకుని, సుఖాలనూ పంచుకుని జీవించాలి. అలకలు కూడా వారిద్దరి మధ్యా సఖ్యతను పెంచుతాయి. కానీ ఆలు మగల మధ్య పొరపొచ్చాలు అద్దం మీద ఆవగింజలా అరక్షణం వుండాలి కానీ పంతాలుగా మారి జీవితాలని పాడుచేసుకోకూడదు. ఇప్పటి పెళ్ళిళ్ళతో చూస్తే మా పెళ్ళి కి ఖర్చు అతి తక్కకవ, ఆడంబరం అసలు లేదు, కానీ అంతు లేని ఆనందం పెళ్ళి జరుగుతున్నప్పుడూ, పెళ్ళి జరిగాక ఈనాటి వరకూ.

అప్పట్లో అందరి పెళ్ళిళ్ళూ అదే స్ధాయిలో జరిగేవి, తరువాత కూడా కొన్ని దశాబ్దాల వరకూ అదే విధంగా కొనసాగింది.

ఇప్పుడు ఎన్ని లక్షలు ఖర్చండీ పెళ్ళంటే? తల్లితండ్రులు కూడా వారి స్థితి గతులు తెలియజేసుకోడానికీ, ఈ పోటీ ప్రపంచంలో నిలవడానికీ వారు సంపాయించింది అంతా ఖర్చు పెడుతున్నారు. పోనీ ఇది కూడా సరే, కొన్ని నెలలు తిరక్కుండానే విడాకులు. తల్లితండ్రులకు ఎంత ఖర్చు, ఎంత శ్రమ, ఎంతటి మన స్థాపం?

వీలయినంతవరకూ సర్దుకోడానికి ప్రయత్నించాలి. మరీ అలవికాని పరిస్థితి అయితే తప్పదు.

ఒక పక్కకొత్త పెళ్ళి కొడుకులూ/ కూతుళ్ళ క్యూ, ప్రక్కనే విడాకుల వారి క్యూ!

ఈ వ్యవస్థ మారి, పెళ్ళి ఖర్చులు, పెట్టుబళ్శూ తగ్గించి, పెళ్ళి తాలూకు అంతరార్ధం అర్ధం చేసుకుని,ఆనందంగా జీవించాలి కొత్త దంపతులందరూ!

12, ఏప్రిల్ 2019, శుక్రవారం

చంద్రశేఖర్ వారి.......మా ఇంటి ఆణిముత్యాలు.

చైతన్య స్రవంతి...చిన్మయ రూపుడు..నాదా తన్మయుడీ  శేఖరుడు. చంద్ర శేఖరుడు....
స్మృతి సమీరం..........



   నా సోదరుడు "వైణిక సార్వభౌమ" చిరంజీవి పప్పు చంద్రశేఖర్ నేటికి 18 సంవత్సరాల క్రితం భువి  నుండి దివి కేగాడు. (బహుశా అక్కడ  సుర , కిన్నెర, కింపురుషలను  తన గాంధర్వ విద్య తో ఆనంద పరశుల్ని చేయ్యలనేమో 43 సంవత్సరాల  చిన్న వయస్సులో తొందరపడి వెళ్ళిపోయాడు).

  "జాతస్య మరణం ధ్రువం" అనేది నిజమైనా యశోకాయులయిన నట, గాయక, కవీశ్వరులు, జరా మరణములనతిక్రమించి సర్వదా ప్రకాశించుతారు.

ఏనుగు లక్ష్మణ కవి గారు తన "భర్తృహరి సుభాషితం" లో చెప్పిన ఒక శ్లోకం స్మరించుకున్దాము ఇక్కడ  ............

           "జయంతి తే సుకృతినో రససిధాః కవీశ్వరాః
          నాస్తి తేషాం యశఃకాయే జరామరణజం  భయం"

              కళలకూ, కళాకారులకూ మరణం లేదు.

అతని ఉనికి ఉల్లాస సహితం , ఉత్తేజ భరితం.
సంగీతం ప్రాణం, ఊపిరి.
కఠోర సాధన, నిజాయతి, క్రమశిక్షణ  అతని బాట. 
అనేక పెద్ద సభలలో కచేరీలు, తండ్రి గారితో, స్వతంత్రంగా కచేరీలు.ఆకాశవాణి ఢిల్లీ లో, హైదరాబాద్ లోనూ  స్టాఫ్ ఆర్టిస్ట్ గా ఉద్యోగం. 
అనేక రేడియో, దూరదర్శన్ జాతీయ కార్యక్రమమాలలో పాల్గొనడం. అనేక సన్మానాలూ, సత్కారాలూ పొందడం జరిగింది.

తనకంటూ ఒక ప్రత్యేక మయిన గుర్తింపు  తెచ్చుకుని, ఇంకా ఎంతో బంగారు భవిష్యత్త్తు ముందు ఉండగా  హడావిడి పడి  రాలి పోయాడు. (కాదు కాదు "నవదీప్" సినీ హీరో డ్రైవింగ్కి బలయి పోయాడు) 
అందమయిన, మంచి గుబాళింపు ఇచ్ఛే పూలను భగవంతుడు తన అక్కున చేర్చు కుంటాడుట ముందుగా, అంతే అయింది.
మమ్మల్నదరిని శోక సముద్రంలో ముంచి వెళ్లి పోయాడు.

ఈ దిగువన " వైణిక సార్వభౌమ" శ్రీ పప్పు చంద్ర శేఖర్ వీణ రికార్డింగ్ ఉంది వినండి.......

9, ఏప్రిల్ 2019, మంగళవారం

పప్పు సోమేశ్వర రావుగారు



మా ఇంటి ఆణిముత్యాలు 2:-
నా తండ్రి గారు - శ్రీ పప్పు సోమేశ్వర రావు గారు...
ఆజాను బాహువు, బహుభాషా కోవిదులు, క్రమశిక్షణ, కార్యదీక్ష, నిజాయతీ, దృఢనిర్ణయం వెరసి "పప్పు సోమేశ్వర రావు గారు".
శ్రీ పప్పు సోమేశ్వర రావు గారు విజయనగరం జిల్లా లోని, "లోగీశ" అగ్రహారంలో 1934 లో సంస్కృత పండితులు శ్రీ చంద్రశేఖర్ శాస్త్రి గారు, పేరమ్మ దంపతులకు జన్మించారు.
విజయనగరంలో విద్యాభ్యాసం, BA Bed, వీణా వాద్యం తన బావగారైన "వైణిక రత్న" శ్రీ అయ్యగారి సోమేశ్వర రావు గారి వద్ద నేర్చుకున్నారు.
పేరుకు ఇద్దరూ సోమేశ్వర రావులే. ఇద్దరూ బావ మరుదులూ/ గురు శిష్యులూ/వియ్యంకులూ.
వీరిద్దరివీ ఇంటర్ లింక్ డ్ కుటుంబాలు.
మా మామగారు , తన పెళ్ళి అయినప్పటినుండీ,10 సంవత్సరాల భార్యకు వీణ నేర్పేవారట. అప్పుడు బాల్య వివాహాలు కదా! నిజానికి మా అత్తగారు 7 , మా మామగారు 17 సంవత్సరాల వయస్సులో వారి వివాహం జరిగిందట.
ఒక రోజు మిత్రులు వాసా వారూ, అయ్యగారి వారూ, ఇద్దరూ ఇంటికి వచ్చే సరికి మంచం కింద నుండీ బిలహరి స్వరపల్లవి వీణపై వినిపిస్తోందట. ఎవరా అని చూస్తే 7 సంవత్సరాల వయస్సు బాలుడు. అది చూసినప్పటి నుండీ అయ్యగారి వారు తన భార్యకూ, బావమరిదికీ అప్రతిహతంగా విద్య కొనసాగించేరు.
మా అత్తగారు జయకుమారి, తను నేర్చుకొన్న విద్య తన పిల్లలందరికీ మొదటి దశ చెప్పి మా మామగారుకి అందించే వారు. ఆ విధంగా తన విద్యకు సార్ధకత చేకూర్చుకున్నారు.
మా నాన్నగారు అద్భుతమైన విద్వాంసులుగా రూపొంది, గురువుగారికి గర్వ కారణమై నిలిచారు.
మా నాన్నగారు లౌక్యం తెలీని అమాయకులు. విద్య తప్పితే మరో దృష్టి లేదు. తన 14 వ ఏట బాపట్లలో వున్న మా మామగారితో కలసి విజయవాడ రేడియోకి వస్తే అక్కడ సంధ్యావందనం శ్రీనివాస రావుగారు మా నాన్నగారి వీణ విని ఆడిషన్ లేకుండా రేడియో ప్రోగ్రాం ఇచ్చేసారట.తన 14 వఏట నుండీ 21 ఏళ్ళ వరకూ Radio cheque minority తీరని కారణంగా విజయనగరంలో వున్న వారి నాన్నగారికి వెళ్ళి పోయేదట.
చాలా రోజులు up gradation వుంటుందని తెలియక రేడియో వారు ఇస్తున్నారని b class లో నుండే అనేక రాగం తానం పల్లవి ప్రోగ్రాం లు వాయించారట. తరవాత ఒక duty officer సలహాపై up gradation apply చేసి,A గ్రేడ్ తెచ్చుకొని సంగీత సమ్మేళనం.అఖిల భారత సంగీత కార్యక్రమాలు రేడియో లోనూ దూరదర్శన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు ప్రదర్శించి చాలా చాలా ముందుకు వెళ్ళారు. సంస్కృత ఆంధ్రాలలో అనేక సంగీత రచనలు రచించేరు.
నాన్నగారికి తన 19వ ఏట అత్తగారి శిష్యురాలు .పేరి భానుమతి తో వివాహం జరిగింది.
హైదరాబాదు కు 1955 లో వచ్చి,ముందులో BA Bed teacher గా పని చేసి, అనంతరం జంట నగరాల గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజీలలో వీణా లెక్చరర్ గా పని చేసి పదవీ విరమణ చేసేరు.
హైదరాబాద్ లో సంగీత సేవ చేసిన పాతతరం విద్వాంసులలో ఒకరు. అనేక మంది శిష్యులను తయారు చేసేరు. వారిలో ప్రప్రధమంగా చెప్పుకోవల్సింది మా జ్యేష్ఠ సోదరుడు "వైణిక సార్వభౌమ" చిరంజీవి పప్పు చంద్రశేఖర్ ను. చాలా మంది శిష్యులు రేడియోలలో దూరదర్శన్ లోనూ కళాకారులుగా వున్నారు. నేను వర్ణాల వరకూ వారి వద్ద శిక్షణ పొంది, వివాహానంతరం మా వారి వద్ద నేర్చుకోడం జరిగింది.
సంస్కృత, జ్యోతీష్య శాస్త్రా పండితులవ్వడం వల్ల మంచి సాహితీ సౌరభాలను వెదజల్లే సంగీత రచనలను చేసేరు. నవగ్రహాలనూ జ్యోతీష్య పరంగా అన్వయిస్తూ నవగ్రహ ఆరాధన, సర్వ దేవతా స్తుతి మొదలగు 30 కృతులు పుస్తక రూపం దాల్చాయి. మా వారు పూనుకొని వీటిని గాత్ర ధర్మానికి అనువుగా చిన్న మార్పులూ చేర్పులూ చేసి, మంచి విద్వాంసులతో పాడించి, అవన్నీ సిడి రూపంలో భద్ర పరిచారు.
మా నాన్నగారు తను స్వయాన పండితులే కాక, అల్లుడూ, కొడుకూ ఉద్దండ పండితులు. కూతుర్లు ఇద్దరూ, రెండవ కోడలు, అంతే కాక మనవలూ అందరూ విద్వాంసులే. ఒకరకంగా అయ్యగారి, పప్పూ అని రెండు ప్రత్యేకమైన కుటుంబాలుగా కన్పించినా, అందరూ ఒకే కుటుంబంగా పరిగణించాలి.
శ్రీ పప్పు సోమేశ్వర రావు గారికి అనేక సన్మానాలూ సత్కారాలు జరిగేయి. "వైణిక చక్రవర్తి", వైణిక శిరోమణి" ఇత్యాది బిరుదులు వరించాయి.హైదరాబాద్ లోని త్యాగరాజ గాన సభ వ్యవస్థాపక కార్యవర్గం లో ఒకరు.
వారు 2002 లో పరమపదించారు.

11, జనవరి 2019, శుక్రవారం

టెలీఫోన్

తి తి తి తీ తిక మక......మ మ  మ  మా మక తిక..
అదంటే ఎంత ఇష్టమో, దాని శబ్దం వినగానే చెవుల్లో అమృతం పోసినట్లే,  ఒఖ్ఖ ఉదుటన పరిగెడతాం దాని బాధ్యత  అది నిర్వర్తిస్తుంటే.

నల్లగా ఉంటుంది, నెమ్మదిగా ఎర్రగా, తెల్లగా ఇంకా ఎన్నో రకాలుగా రూపాంతరం చెందింది.
దాని రాకకై మొదట్లో ఏళ్ళ తరబడి ఎదురు చూపులు. మాకు అది వచ్చిందని సంబర పడి  పోయి, ఊరూ వాడా టముకు.
 దాన్ని సందర్శించడానికి అందరూ  వచ్చ్చినప్పుడు మన గర్విష్ఠి  మొహాలూ, మన వెలుగు వాదనాలూ  చూసి తీర వలసిందే., 

నెమ్మదిగా  దాని కోసమే అందరూ రావడం మొదలెట్టగానే , వీళ్ళని ఎలా వొదుల్చుకోవాలా  అని ఎన్నెన్నో దురాలోచనాలూ, దుష్ట బుధ్ధులూ ప్రదర్శించాము. 

నాకైతే దాన్ని వాడాలని చాలా ఉబలాటం. ఒక సారి ఒకరింటికి వెళ్ళినప్పుడు, (మా ఇంట్లో లేదు అప్పటికి అది) ఎలాగోలా సంపాయించుకున్న ఒక దాన్ని ప్రయోగించాను. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళగానే చోర వృత్త్తిలో నా నైపుణ్యాన్ని ప్రదర్శించాను,  

కానీ ప్రయోజనం లేదు, రాడం లేదు , 
ఎందుకూ? ఎందుకూ? చెప్పండి అది ఏమిటో? ఎందుకో?  అంతా  తికమక . మకతిక.. తికమక.

9, జనవరి 2019, బుధవారం

నీటి సన్మానం

నీటి సన్మానం 

అది ఒక సెప్టెంబర్ నెల, స్కూల్ సమయం ఆసన్నమైంది పొద్దున్నించీ సన్న తుంపర.. మేము 5,4 క్లాసులు. (మేము అంటే నేనూ మా చెల్లి) మబ్బు గా ఉంది, చలి గాలి, బహుశా జడి  వాన పడే అవకాశం ఉంది.

మేము స్కూల్ కి వెళ్లాలా వద్దా? మానేస్తే బాగుండు అని మనస్సులో. టీచర్ తిడుతారేమోనని భయం మాది.

మా అమ్మా  వాళ్ళు పోనీ bad weather holiday ఇస్తారా అని అనుమాన పడుతున్నారు. ఇప్పటిలా ఫోన్ చేసి కనుక్కుందుకు ఫోన్స్ లేవు.
కానీ ఇలాటప్పుడే మనం మన సిన్సియారిటీ చూపించి మార్కులు కొట్టాలి అమ్మ నాన్న దగ్గర! ఏమంటారు. పిల్లలు ఎన్ని ట్రిక్కులు వేస్తారో కదా.

సరే మేము స్కూల్ కి వెళ్తామని గొడవ, వాళ్ళ చేతే ఒద్దనిపించుకుని, కూడా వెడితే పడే మార్కులు  ఇంకా ఎక్కువ కదా. మా నాన్నగారు మా ఇద్దరికీ raincoat వేసి oyoma   గాముల్లా  తాయారు చేసి, (వింతగా) షూ వేసుకుంటే తడిసి పోతాయని చెప్పి చెప్పులేసుకుని బయలుదేరామన్నారు. ఎంతో అవమాన భారంతో అందరూ మమ్మల్ని చూసి నవ్వుతున్నారని అని భావిస్తూ తల వంచుకుని చక చకా అడుగులేసాం.

ఇంతలో చిక్కడ పల్లి మెయిన్ రోడ్ మీద గుల్షన్ రెస్టారెంట్  దగ్గర రోడ్ మీద నీళ్లు వరదలై, నదుల్లా ప్రవహిస్తున్నాయి. దానిలో మా చెల్లి చెప్పు చూస్తుండగా కొట్టుకుంటూ వెళ్లి పోతోంది. దాన్ని పట్టుకుందుకు వంగే సరికి, బాగ్ లోంచి కింద బుక్స్ కింద చిందర వందరగా పడి  పోయాయి.  ఆ చెప్పు అందుకుందుకు మేము నది లో ఈదాము తెలుసా? మా బుక్స్ నీళ్ళల్లో పడి  తడిసి పోయినా, లేఖ్ఖ చేయ లేదు. ఇంతలో  పెద్ద పెద్ద తిమింగలాలు మా దగ్గరగా వచ్ఛేయి. మేము వాటిని అవతలికి తోసి  పారేశాము.

 అప్పుడు మాకు చిన్ని చిన్ని గోల్డ్ ఫిష్లు, బ్లాక్ మాలీలూ, ఫైటర్లూ, గప్పిలూ, కిస్సింగ్ గొర్మీలు అన్నీ వఛ్చి మా ఇద్దరికీ thanks చెప్పి, అప్పటికప్పుడు మాకు సన్మానం చేస్తామని కూర్చున్నాయి. మొదటి సారి సన్మానం అని చాల సంబర పడి, సరే నన్నాము. అంత నీళ్ళల్లోనూ కింద కూర్చోబెట్టి మాకు నీళ్ళల్లో, నీళ్లతో అభిషేకం చేసి, నీళ్ల మాల వేసి, నీళ్ల శాలువా కప్పేరు, తెలుసా?

మేము చాలా ఆనందంగా ఉండగా, ఏయ్ ఎంత సేపా నిద్ర, ఇంక లేవండి అని  అని మా మా అమ్మ అరుపు. కళ్ళు నలుపుకుంటూ నెమ్మదిగా పక్క మీంచి లేచాం. వాన లేదూ, పాడు లేదు. మళ్ళీ గంపెడు స్కూల్ బాగ్ బరువు వేసుకుని, చిక్కడ పల్లి నుండి నారాయణగూడా దాకా,స్నానం చేసి, భోజనం చేసి ఏడుపు మొహాలతో బయలుదేరి వెళ్లాం.

ఎందుకూ నవ్వుతున్నారు, అంత నవ్వు వస్తోందా మీకు, మాతో చతురులా మీకు, మాకు ఏడుపుగా ఉంటె?ఫర్లేదు లెండి.

రేపు నవ్విస్తా లెండి ....

.


నాదనిధి



కంచికి వెళ్తే అంతా మంచే
మా గురువుగారికి "నాద నిధి" పురస్కారం

అవునండీ నిజం, ముమ్మాటికీ నిజం. మా గురువు గారు శ్రీ అయ్యగారి శ్యామసుందర్ గారు క్రితం సారి కంచి ఆస్థానవిద్వాంసులుగా నియమితులై రాగానే, ఇంటికి వచ్చే సరికి సంగీత నాటక ఎకాడమీ అవార్డ్ శుభవార్త.

మరి ఈసారో?

మైసూర్ దత్తపీఠం వారు పూజ్య గణపతి సచ్చిదానంద స్వామీజి 75 వ పుట్టిన రోజు వేడుకలలో 9 మంది eminent artists కి "నాద నిధి" పురస్కారంతో సత్కరిస్తున్నారు. వారు...

  1. శ్రీ అంజాద్ అలీఖాన్.. సరోద్
  2. కుమారి అవసరాల కన్యాకుమారి.. వయోలిన్
  3. శ్రీ T.H.వినాయక్ రామ్.. ఘటం
  4. శ్రీ గురువాయూర్ దొరై.. మృదంగం
  5. బోంబే సిస్టర్స్ శ్రీమతులు సరోజా & లలిత.. గాత్రం
  6. శ్రీ అయ్యగారి శ్యామసుందరం .. వీణ
  7. శ్రీ కదిరి గోపాల్ నాథ్.. సాక్సోఫోన్
  8. శ్రీయుతులు రాజన్ మిశ్రా, సాజన్ మిశ్రా హిందుస్థానీ గాత్రం
  9. శ్రీ వెంకటేష్ కుమార్.. హిందుస్థానీ గాత్రం .

  • మా గురువుగారు ఈ అవార్డ్ May 27 th పూజ్య స్వామీజీ కరకమలముల ద్వారా అందుకోబోడం అమితమైన ఆనందం కలగజేస్తోంది. మా శ్రేయోభిలాషులైన మీ అందరితో ఈ శుభ వార్త పంచుకుంటున్నాను..... అయ్యగారి జయలక్ష్మి

కంచి



ఏనాటి నోము ఫలమో ఏ దాన బలమో
గుమ్మం లోపల అమ్మ, గుమ్మం బయట ఆమె కుమారులు, కుమార్తెలు.

ఎంత గొప్ప అనుభూతో చెప్పనలవి కావడం లేదు. హాయిగా కూర్చొని అమ్మని స్తుతిస్తూ ఎన్ని కృతులు పాడుకున్నాం. నిన్న ఉదయం ఏకంగా గంటన్నర అమ్మ సముఖంలో కూర్చొని అభిషేకం. అనంతరం అలంకరణ. అంతసేపూ శ్యామశాస్త్రి కృతులు పాడడం, వినడం. ఇంతకంటే జీవిత సార్ధకత ఏముంటుందండీ?

గుడి, గుడి ప్రాంగణంలో నవరత్న మండపంలో మగ వారి కచేరీలు, ప్రక్కనే కళ్యాణ మండపంలో ఆడవారి కచేరీలు. అక్కడే 4 పూటలా భోజనాలూ వగైరా!

ఇంత కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించిన శ్రీనివాస గోపాలన్ బృందంకు 🙏🏽🙏🏽🙏🏽 ఇంత కంటే చెప్పగలిగింది లేదు.

సంకల్ప శుధ్ధి వున్న చోట తప్పక సంకల్ప సిధ్ధి కలుగుతుంది. మహా సంగీత విద్వాంసులు పాల్గొన్న ఈ ఉత్సవం మున్ముందు మరింత ప్రాచుర్యం పొంది తిరువాయూర్ త్యాగరాజ ఉత్సవం మాదిరిగా విద్వాంసులందరూ పోటీపడి పాల్గొనే రోజు వస్తుంది, రావాలి!🙏🏽🙏🏽🙏🏽

ఓవీఎన్ మూర్తి



స్మృతి సమీరం

అప్పుడే సంవత్సరం అయిపోయింది.
ఆ మూర్తిని ఇక చూడలేక పోయినా, అందరి హృదయాలనూ జయించిన అజేయుడు. అతి సామాన్యుడుగా పుట్టి, అసమాన్యుడిగా ఎదిగి, మాన్యుడిగా మారిన స్వయంసిద్ధుడు.కడలిలా కష్టాలను కడుపులో దాచుకుని సముద్ర గాంభీర్యం హృదయంలో నింపుకొని,ఎల్లప్పుడూ చిరు మందహాసం తో అందరిని పలకరిస్తూ, ఎంతో శ్రమ కోర్చి పట్టుదలతో కంపెనీ సెక్రెటరీ, కాస్ట్ అకౌంటన్సీ పరీక్షలను అవలీలగా పాసై, జ్యోతిష్య శాస్త్రం లో అద్భుత ప్రతిభ కనబరిచే శ్రీ మూర్తిగారు సర్వదా అభినందనీయులు. వారు ఈ లోకం విడచి తిరిగిరాని లోకాలకు వెళ్ళి అప్పుడే సంవత్సరం. వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి భగవదనుగ్రహము సంపూర్ణంగా ఉండాలని ఆశిస్తున్నాము

ఫాన్ బాల్యం

చిన్నప్పటి విషయం గుర్తు చేసుకుంటూ, కాలంలో మార్పుల గూర్చి మాట్లాడుకుందామా!

మేడ మీద పడుక్కుని వుండగా చల్లగాలిలో దూరంగా ఎక్కడి నుండో చక్కటి పాటలు వినిపిస్తుండగా, చందమామను చూస్తూ, నక్షత్రాలు లెఖ్ఖపెట్టుకుంటూ ఆద మరచి పడుక్కున్నప్పుడు, చిన్న తుంపరగా వాన పడడం మొదలవగానే, ఎరగనట్లు పడుక్కుందామని ప్రయత్నించడం, వానదేముడు మన టక్కులు గ్రహించి పేధ్ధ పేధ్ధ చినుకుల రూపంలో ప్రవేశించడం, తప్పని సరిగా లేచి పక్క బట్టలన్నీ లుంగ చుట్టి కిందకి విసిరేసి, పరిగెట్టుకుంటూ కింద దిగగానే,ఠక్కున వాన ఆగి పోయి ఉడకపోత గుర్తుందా?

అలాగే పండు వెన్నెల అని పడుక్కున్న రోజు ఆ వెలుతురుకి ఎప్పటికీ నిద్ర పట్టకపోడం.

తరవాత నెమ్మదిగా pedastal fan, table fan, ceiling fan, room Ac నుండీ centrally air conditioned వరకూ అన్నీ చూసాం.

ఇందు మూలముగా తెలిసింది ఏమంటే నేను పాత తరం దాన్ని. 

ఒప్పుకోను “అవును” అందామనుక్కుంటున్నారేమో?

Never say Never again! 😃

అబ్దుల్ కలాం

My son Aditya’s wonderful experience meeting great personality Sri Abdul Kalam ji! In his own words........

20 years ago, working intently on a project in the robotics lab of CAIR, Bangalore, time had eluded me. It was past 7:30pm. Lights were being switched off throughout the center, preparing to close for the day. It was just me and my colleague Sartaj in the lab. Sartaj used to drop me to the bus stop everyday after work, to take my bus to CV Raman Nagar. That evening, he couldn't do it. Immersed in my work, I forgot that I didn't have a ride to go home, but not being bothered by it, I continued on my work.
Around 8pm, I heard what sounded like someone coming down the steps. The door to the lab opened and the director of the center, Mr. Vidyasagar peeped in and asked 'Aditya, I am going towards CV Raman Nagar. Do you want me to drop you?' I quickly jumped up to his offer. It was like a God send help. I followed Mr. Vidyasagar and hoped in his car, happy that my problem to go home was resolved.
On our way Mr. Vidyadagar mentioned that he wanted to pick up some masala dosas for a bachelor friend of his. We stopped at Shanbhagh hotel, a popular joint for us scientists from CAIR and picked up some masala dosas. We proceeded from there to the home of his friend living in ISRO, which was on our way to CV Raman Nagar. At the gates to the home, our car was stopped by a security guard. Mr. Vidyasagar quickly waved his badge to the security guard and the gates opened. We drove in and as we neared the entrance to the home, an old man dressed plainly and if I can recollect, in his lungis came to greet us. Mr. Vidyasagar introduced me to his friend - Mr. ABDUL KALAM. At that time, I didn't think much on hearing the name. Yes, he was well spoken about and considered an important figure in our defense scientific world, but probably not widely popular.
Mr. KALAM led us inside his home. As we walked past his living room, I noticed the Indian instrument Veena kept there and next to it was a diwan and few books, neatly arranged. Mr. KALAM and Mr. Vidyasagar chatted like they were friends meeting regularly. Their conversation mostly dipped in the various projects both their centers were involved in. My thoughts rambled to various subjects and occasionally thought about the Veena I had just seen in the room. During that evening's conversation, Mr. Vidyasagar mentioned to Mr. KALAM that I was a scientist who played the Veena. Mr. KALAM looked at me with a soft smile and responded "Oh! just like me". Later, Mr. KALAM had an urgent call to attend and we quietly exited from his place.
Those words 'Oh! Just like me' continued to ring in my ears, rewarding and inspiring, every time his name crossed my eyes or ears. What a humble man! That was the first time I had met him in person. He later did come to CAIR on few occasions to check on our projects as we used to work closely with ISRO. However his remark 'Oh! Just like me' will forever be with me. A great son of India. May his soul rest in peace.....

ఉమ నిష్క్రమణ



స్మృతి సమీరం 2

మౌనముద్రా - యోగనిద్రా !....
"ఓ మునీ !.కనులు మూసుకొన్నావు..మీ దంపతుల కు ముద్దుగా పుట్టిన తనయులం -కారణ జన్ములం - ఇద్దర్నీ కలిసి ఎత్తుకోనే శక్తి - నీకు ఇదే ఇస్తున్నాము - ప్రతిఫలం గా ఎవ్వరూ సంపాదించ లేనంత పుణ్యం - ఇదుగో." అని వీరి తనయులు దీవించారు.

తనయులు తల్లితండ్రులను దీవించడమేమిటని? విడ్డూర పడకండి. అవును! వారిరువురూ పసికూనలైన మునిపుంగవులు. వారిని గడ్డాలు మీసాలూ వచ్చినా అడ్డాలలోని పిల్లల్లా సాకారు, ముద్దుగా వారి ఇష్టాఇష్టాలని ఊహించుకుని వాటిని అమరుస్తూ, వారిని ఒక్క క్షణం కూడా ఏమరుపాటున వదలక,వెన్నంటి చూసుకున్న ఆ తల్లితండ్రులు పరమ పూజ్యులు. వారిలో పెద్ద మౌని భగవంతుని 5 సంవత్సరాల క్రితం చేరుకుని జన్మ రాహిత్యం పొందాడు.

పిల్లల దీవెనల ఫలితంగా ఆ భార్యాభర్తలిరువురూ స్వార్ధ రహితులుగా మారిపోయినారు. ప్రపంచం అంతా వారికి పిల్లలే. నా మటుకు నేను, వారిని నాకూ, నా భర్తకూ, నా తల్లితండ్రులకూ, నా పిల్లలకు కూడా తల్లి తండ్రులుగా భావిస్తాను. అది నిజం కూడా. వారికి తెలిసిన యావన్మందీ ఉమా,మూర్తి దంపతుల గూర్చి ముక్తకంఠంతో ఇలాగే చెప్పితీరుతారు.

వారికి పరిచయస్తు లెవరైనా వారినుండీ కించిత్తైనా ప్రయోజనం పొందకుండా లేరు. (ఈ విషయం బయటకు అన్నా అనలేక పోయినా.)
మేమెవరమైనా వారి కుటుంబానికి ఏదైనా ఆత్మీయంగా వెన్నంటి వున్నామంటే కారణం, మేము కృతజ్ఞులం అనీ, కృతఘ్నులం కాదనీ, ఇంకా మానవత్వం మాలో మిగులున్నదని అర్ధం. ఇది మా గొప్పతనం కాదు. వారిరువురూ సంపాయించుకున్నది డబ్బూ కీర్తి ప్రతిష్టలు కానే కాదు, సర్వ జనాభిమాన ధనం. అనితర సాధ్యమైన ఈ ధనం వారు అప్పనంగా సంపాయించ లేదు, వారు నిస్వార్ధంగా పంచిన అభిమానమే ఈనాడు వారు సంపాయించిన ఈ అభిమానధనం. ఉమా మూర్తీ మీరిరువురూ అన్ని విధాలా ధన్యజీవులు.

ఆ ఇద్దరి అన్యోన్యతా చెప్పనలవి కానిది. అన్యోన్యంగా భార్యాభర్తలు మంచి ఆలోచనా చెయ్యవచ్చు, అప్పుడప్పుడు ఇరువురూ కూడి చెడు ఆలోచనలు కూడా అమలు చెయ్సవచ్చు. కానీ ఈ భార్యాభర్తా కలసికట్టుగా ఇతరుల మంచే ఆలోచించారు, ఇతరులకు మంచే చేసారు.

మూర్తిగారు పరమపదించే ముందు రోజు " ఉమాదేవి చాలా మంచిది, నాకు మరు జన్మలో కూడా తనే భార్యగా రావాలని" చెప్పారట. అంత కన్నా ఒక స్త్రీకి కావల్సిన/రావల్సిన కితాబు ఏముంటుంది భర్త నుండీ?

పిల్లలు ఇరువురూ దీవెనల ఫలితంగా, మూర్తిగారు క్రితం సంవత్సరం ఇదే రోజు,ఉమాదేవి చెయ్యి గట్టిగా పట్టుకుని వుండగానే క్షణంలో భగవంతుని సాన్నిత్యాన్ని చేరేరు.

గొప్పచెప్పుకోడం కాదు........ గొప్పగా చెపుతున్నాను వీరు మా చెల్లెలు ఓరుగంటి ఉమాదేవి, మరిది ఓరుగంటి వేంకట నరశింహ మూర్తి గారు. పవిత్రమైన జీవితం గడిపిన మూర్తిగారికి సద్గతులు ప్రాప్తించు గాక!

రేడియో



రేడియో..........

1960 మే నెల, సాయంత్రం 5. Electrician మా ఇంటికి వచ్చాడు. Wires ఇంకా మిగతా పరికరాలు పట్టుకుని వచ్చి అంతా బిగించేస్తున్నాడు. ఇంతలో రేడియో తెచ్చారు మా నాన్నగారు. ఆనందానికి పట్టపగ్గాలు లేవు.

7 గంటలకి లైట్ వేసి రేడియో పెట్టే సరికి Mr పెళ్ళాం సినిమాలో లాగా ఓ 15 మంది గుంపు గూడారు తెల్సిన వాళ్ళు.
అన్నట్లు రేడియో పెట్టే ముందు దానికి కొబ్బరి కాయ కొట్టి, హారతి ఇచ్చి మరీ on చేసారు.

ఆరాత్రి మా నాన్నగారి ప్రోగ్రాం రేడియో లో వచ్చింది. రేడియో ముందు వేపు వున్న speakers place లో వున్న cloth మీద మా నాన్నగారు వీణ వాయిస్తున్నట్లు, పక్కనే ఎవరో మృదంగం వాయిస్తున్నట్లు ఊహించుకుని, అలా వుంటే ఎంత బాగుంటుందో నని అనుకున్నాను,మరి అలానే కదా ముందు ముందు టివీ రూపాంతరం చెందింది.

ఇప్పుడుంది మిరపకాయ 🤧🤧🤧

మర్నాడు మధ్యాహ్నం......భోజనాలయి మా నాన్నగారు ఆదివారం మధ్యాహ్నం కాబట్టి నిద్ర పోయారు.

మేము రోడ్ మీద పడి పిచ్చి పిచ్చిగా ఆడుకుంటుంన్నాం.
ఇంతలో ఎక్కడి నుండో “ ఉల్లి పూలా చీరా కట్టే మామా” అని పాట వినపడింది ఎక్కడినుండో. ఆహా! రేడియోలో మంచి పాట వస్తోంది అని ఎగురుకుంటూ ఇంట్లోకి పరుగెత్తుకుంటూ మా నాన్నగారు పడుక్కున్న గది తలుపు హడావిడిగా తోసుకుంటూ తీసి, తను పడుక్కున్న మంచి చివర్లో అలమారలో వున్న రేడియో పెట్టాను. పెట్టగానే వెంటనే sound రాదు ఇదివరకటి రేడియో లో. Sound రావడం లేదని on off button + volume control కూడా అదే అవ్వడం వల్ల బాగా పెంచేసాను.

ఒక రెండు నిమిషాలవగానే భువన భోంతరాళాలు దద్దరిల్లేలా పే......ధ్ధ శబ్దంతో గందరగోళంగా ఏమిటో కూడా అర్ధం కాని sound..........

మా నాన్నగారు మంచి నిద్రలోంచి ఉలిక్కి పడి లేచి ఎఱ్ఱటి కళ్ళతో భయంకరంగా
నాకు చేతి పాయసం (తొడ పాయసం లాగాన్న మాట)ఇచ్చారు.
గిచ్చిన నొప్పి కంటే, ఎప్పుడూ ముద్దు చేసే నాన్నగారి భయంకర రూపం, కోపం చాలా మానసికావమానానికి గురి చేసేయి.

రేడియో అనగానే గుర్తుకు వచ్చే చేదు అనుభవం ఇదే....

Story of Story

My son Aditya is teaching weekly twice in university of Michigan apart from his job. Last week he faced another great experience. He wrote this message to me. It is very inspiring message, so I am sharing it with you all.

Story of Story .......

Story Musgrave was born in 1935 on a dairy farm in Stockbridge, MA. He was in the forests alone at 3 and by 5 floated his homebuilt rafts on the rivers. He rode combines at 5, drove trucks and tractors at 10 and when alone in remote fields, repaired them by 13.

Story never finished school, ran off to Korea with the U.S. Marines where he was an aircraft electrician and an engine mechanic. He started flying with the Marines and over the next 55 years accumulated 18,000 hours in over 160 aircraft. He is a parachutist with over 800 freefalls. He has 7 graduate degrees in math, computers, chemistry, medicine, physiology, literature and psychology. He has been awarded 20 honorary doctorates. He was a part-time trauma surgeon during his 30 year astronaut career.

Story was an NASA astronaut for over 30 years and flew on six spaceflights. He performed the first shuttle spacewalk on Challenger's first flight, was a pilot on an astronomy mission, conducted two classified DOD missions, was the lead spacewalker on the Hubble Telescope repair mission and on his last flight, he operated an electronic chip manufacturing satellite on Columbia.

Today he operates a palm farm in Orlando, FL, a production company in Sydney and a sculpture company in Burbank, CA. He is also a landscape architect, a concept artist with Walt Disney Imagineering, an innovator with Applied Minds Inc. and a professor of design at Art Center College of Design in Pasadena, CA. Story also performs multimedia presentations on topics such as vision, leadership, motivation, safety, quality, innovation, creativity, design, simplicity, beauty and ecology. He has 7 beautiful children: Lorelei, Scott, Holly, Todd, Jeff, Lane and Story, ranging from age 48 to 2 years; 3 beautiful grandchildren, and a beautiful wife Amanda.

Amma, I am really fortunate that *Story Musgrave*, the NASA astronaut visiting my class and listen to my lecture and talk to students at University of Michigan - this semester I challenged myself to teach class about some fun pre-engineering topics all to the dual enrollment program for high school students who are selected into UMich next year - we are rocking in spirit - two hours of my time a week is so much rewarding than anything else

Amma, he is a genius - Astronaut, neurologists surgeon and Hubble telescope designer, and six times in space - he attended my class - today is a special day 😃

దీపావళీ అరిసెలు



అందరికీ దీపావళి శుభాకాంక్షలు.

అమ్మయ్య! ఇప్పుడే జంతికలూ, కజ్జికాయలూ, 7 cups sweet, నేనూ మా అమ్మాయీ కలిపి చేసి అలసి సొలసి కూర్చున్నాం.

ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు వచ్చింది.

అప్పుడు నా వయస్సు 20. సంక్రాంతి వచ్చింది, మా అత్తగారు ఊరు వెళ్ళారు. నా ప్రతాపం నిరూపించుకుందుకు ఇదే అదనని భావించి, పొద్దున్నే పాలు పోసే దుర్గ సాయంతో అరిసెలు చేసేను,(చేస్తుంటే చూసాను, మరీ బాగుండదని పించినప్పుడు కొద్దిగా చెయ్యి వేసాను) అమ్మయ్య! అరిసెలు అయిపోయాయి చెయ్యడం, మరి combination గా జంతికలుండద్దూ! ఉండాలుండాలి, అంతే బుఱ్ఱకి హుషారెక్కువై 2 kg జంతికల పిండి ఎలాగోలా కలిపాను.

ఒక అంకం అయ్యిందా! మామూలుగా జంతికలు చేసేస్తే జయలక్ష్మి ఎలా అవుతుంది? ఇప్పుడుంది మజాక్ అంతా..........

మా వారు college కి వెళ్ళగానే మొదలెట్టబోయాను! టక్ టక్ టక్....... తలుపు కొడుతున్నారెవరో. తీరా చూద్దును కదా, పాఠానికి వీణ నేర్చుకుందుకు students, ఆ పట్టు పట్టూ 7 దాకా lessons. మళ్ళీ ఆశ తీరక మొదలెట్టి ఒక్కటే ఒక్క జంతిక చేసాను, ఇంతలో పిల్లలు ఆట నుండీ మా వారు college నుండి వచ్చేసారు. ఇక వంటలూ భోజనాలూ ఏర్పాటు చెయ్యాలి కదా!

ఈ పిండి గుదిబండ అయి కూర్చుంది, అది కంటికి కన్పిస్తే కదా బాధ! వెంటనే అంత పిండినీ bucket లో వేసి బోరింగ్ కొట్టి నిండా నీళ్ళు కలిపి ఆ పిండి నీళ్ళని మోరీలో పోసి బాత్రూం కడిగాను. వెంఠనే గుర్తు వచ్చింది కింద వాళ్ళింటి ముందు వున్న open కాలువలో ఈ శనగపిండి నీళ్ళు ప్రవహిస్తే, ఆవిడ చూసి మా అత్తగారికి చెప్తారని, ఇహ చూసుకోండీ నీళ్ళు కొట్టీ కొట్టీ కాలవ అంతా clean గా clear గా అయ్యేదాకా ఒక 15 buckets నీళ్ళు కొట్టి తోటకూర కాడై పోయి
వంట చేసి భోజనాలు పెట్టి పడుకున్నా.

కొన్ని రోజులు దాని జోలికెళ్ళనని ఒట్టేసుకున్నా.

ఇప్పడైతే ఆ పిండి అంతా pack చేసి trash లో గుట్టు చప్పుడు కాకుండా పడేశేదాన్ని. అనుభవరాహిత్యము/ అమాయకత్వం కలగలపు.

ఇప్పుడు ఇంట్లో చేస్తే కదా, మేమిద్దరమే, స్వగృహ దర్శించు కోడమే.

అంతా కళ్ళ ముందు రీలు తిరిగింది.

ప్రాణ మిత్రురాలు

ఈవిడ నా ప్రాణ మిత్రురాలు.
ఆశ్చర్య పడకండి నిజం ముమ్మాటికీ నిజం.
ఈవిడ ముందు ఎప్పుడూ నేను నేను లాగే వుండగలను. ఏ విషయమైనా ముందు ఈవిడకి చెప్పి, మంచీ చెడూ ఆలోచించుకుని ఆచరణలో పెడతాను. తిట్టినా, కోప్పడినా నవ్వించినా, కసిరినా, విసుకున్నా, కష్టపెట్టినా, హాయిని పంచినా మార్పు వుండదు, అన్నిటికీ ఒకేలాంటి ప్రతిస్పందన.ఒక్క క్షణం కూడా లౌక్యం ప్రదర్శించఖ్ఖర లేదు. చిన్న చిన్న ఆపధ్ధర్మాలు ఆడఖ్ఖర లేదు.

అందుకనే అంటున్నాను నా best friend నేనే. తరువాతే ఎవరైనా!

ఇక మా వారంటారా మా ఇద్దరి తనువులు వేరైనా మనస్సూ వాక్కూ ఒక్కటే.

మరి మీరో?
మనమందరం ఒకరికొకరం హితులం, స్నేహితులం, సన్నిహితులం.

“అనుకున్నది ఒకటీ, అయినది ఒకటీ, బోల్తా కొట్టావులే బుల్ బుల్ పిట్టా!” (ఆదిత్యా & కళ్యాణీ 😜)

63 వ పుట్టిన రోజు

పెళ్ళిపాటల కథ


S
మీ అందరి కోరిక మేరకూ మీకు ఒక అపురూప, అపూర్వ, వెలకట్టలేని కానుక. Don’t miss it friends.

దీని వెనుక ఒక interesting story వుంది. మా నాన్నగారు శ్రీ పప్పుసోమేశ్వర రావు గారు హైదరాబాద్ music college లో వీణ lecturer గా work చేస్తునప్పుడు, గోపాలరత్నంగారు principal. ఒకసారి మాటల్లో పెళ్ళి పాటల ప్రోగ్రాం గూర్చి చెప్పగా, మా నాన్నగారు, మా నాయనమ్మ గారు పాడిన సాంప్రదాయ సిధ్ధంగా , అనూచానంగా వస్తున్న ఈ పెళ్ళి పాటల పుస్తకం గోపాలరత్నం గారికి ఇవ్వడం జరిగిందట. వాటిని ఆవిడ దూరదర్శన్లో కార్యక్రమంగా present చేసేరు.

అది టివి లో వస్తుండగా మా చెల్లెలూ వాళ్ళు వీడియో రికార్డింగ్ చేసేరు. దానిని copy చేసుకుని సిడి రూపంలో భద్ర పరిచాం.

దానిని మా వారు Sri Ayyagari Syamasundaram garu మా అమ్మాయి పెళ్ళిలో stage చేసేరు. అది ముందు audio రూపంలో youtube లో పెట్టడం అనేక వేల మంది వినడం జరిగింది.

35 సంవత్సరాల క్రితం ప్రసారమైన ఈ రికార్డింగు దూరదర్శన్ వారి వద్ద కూడా ఉండి ఉండదు.
ఇప్పుడు పాత భాండాగారాలు తవ్వి తీస్తుంటే original వీడియో బయట పడింది.

ఇప్పుడు దీనిని youtube కి upload చేసేను.

చూసారా మీరు చూస్తున్న ఈ వీడియో వెనుక ఎంత పెద్ద కథ వుందో! ఇక వినండి.........

(అన్నట్లు.... ఇందులో గోపాలరత్నం గారి కుడి పక్కన కూర్చొని పాడుతున్నది మోదుమూడి సుధాకర్ గారి భార్య శ్రీమతి అంజనా సుధాకర్, అప్పటికి ఇంకా కుమారే.)

https://youtu.be/v85WAojnhFI

మా స్నేహపు షష్టి పూర్తి

మా స్నేహపు షష్టి పూర్తి..............

(.అవును నిజం!  మేము  ఐదు  ఏళ్ల  వయస్సులో  మా ఫ్రెండ్స్  కల్పకం,  గాయత్రీ  తో  కలసి  హైదరాబాద్  నుండి  విజయవాడ  పెళ్ళికి  వెళ్తూ  ఉండగా  ఒక  ఇల్లు  చూసాం....... ఇది  చదివి  మీరు  కూడా  చూసారా  చెప్పండి......
  మంచి  అడవిలో  ఉండగా  రైల్  ఆగిపోయింది.  అంతా నిశబ్దం .  నేను  మా చెల్లి, మా స్నేహితులు బండి కల్పకం, బండి గాయత్రి కలసి   దూరంగా  మిణుకు  మిణుకు  కనిపిస్తోంది  ఏమిటా అని  నెమ్మదిగా  నడుచుకుంటూ   వెళ్లాం.   వెళ్లి చూద్దుం  కదా  అక్కడ  అంత  తెల్లగా  పండు  వెన్నెల.  ఆ  వెన్నెలలో  ఒక  ఇల్లు.   ఆ ఇల్లు  చూస్తే  నూరూరిపోతుంది  ఎవరికైనా....  ఏమిటో  తెలుసా? 
   ఆ ఇంటి   గోడలన్నీ  పాలకోవా.  తలుపులన్నీ  కాడ్బరీ  చాక్లెట్లు .  రూఫ్  జున్ను,  కిటికీల  గ్రిల్ల్స్ అన్నీ  జిలేబీలు,  అన్నట్లు  నేల  కాజూ  బర్ఫీ,  వాటర్  పైప్స్  ఏమో  జంతికలు/మురుకులు,  డైనింగ్  టేబుల్  ఏమో  నేను  చేసేలాంటి  (గట్టి) మైసూర్పాక్ ,,  దాని  మీద  ఐస్  క్రీం,  రక  రకాల పళ్ళూ,  జీడి పప్పు  అన్నీ  పెద్ద  పెద్ద  గిన్నెల్లో  పెట్టి  ఉన్నాయి.  ఒక  వాటర్  పైప్ (జంతిక)  తిప్పితే  చెరుకు  రసం,  ఒక  దాన్లోంచి  మాజా,  ఇంకో  దాన్లో  స్ప్రైట్.   వెంటనే  నేను  ఒక  నిచ్చెన  వేసుకుని రూఫ్ కి కొంచెం  చిల్లు  పెట్టి  రూఫ్  తినేసి,  జంతిక  చివర  ఉన్న  చాక్లెట్  నల్లా   తిప్పి  మాజా  తాగేను.  అలాగే  మా స్నేహితులు,  మా చెల్లీ  కూడా.  ఇంతలో  రైల్  కూత  విని  పరుగెట్టుకుంటూ  ఆయాస  పడుతూ  రైల్  ఎక్కి  పైబెర్త్  ఎక్కేశాం.........
  బాగుందా కధ!.   ఇదంతా  పై బెర్త్  మహిమ.  మా  పిల్లలకి  ఒక  లోకాన్నిచ్చింది, . అలాగే   మాకు  ఒక  ఊహా జనిత  ప్రపంచాన్నిచ్చింది.  మాలో  సృజనాత్మకతకు తెర  తీసింది.
 మరి  ఇప్పుడు?  పైబెర్త్  వస్తే  ప్రయాణం  కాన్సిల్,  అదీ  పరిస్థితి.  పెద్ద  వాళ్ళమైపోయి  బాల్యాన్ని  ఎంత/ ఎలా  కోల్పోయాం?  ప్చ్  ప్చ్  ప్చ్.............  ....)

ఇది ఇంతక ముందు చదివిందే కదా అని మీరు మనస్సులో ఏమనుక్కుంటున్నారో నాకు తెలుసుగా!

అసలు విషయం ఏమి చెప్పాలనుకున్నానబ్బా 🤔🤔🤔🤔🤔🤔

హమ్మయ్యా! గుర్తు వచ్చింది. ఇందులో హీరోయిన్స్ నలుగురు. జమా ఉయా, బాకా బాజా గూర్చి.......

మలినం లేని మా స్నేహానికి షష్టి పూర్తి ఈ రోజు.

మేము చాలా దగ్గర బంధువులం,కానీ మాకు ఏనాడూ ఆ విషయం తెలీదు, లెఖ్ఖ పెట్ట లేదు. ఏనాడూముందు గానీ వెనుక కానీ ఒకరిని ఒకరం విమర్శించు కోలేదు, మా ముందు ఎవరైనా మమ్మల్ని కానీ మా తత్సంబంధీకులను గానీ విమర్శించు కుంటున్నా, మాకు అవేమీ పట్టవు. మేము నల్గురం మటుకూ బంధుత్వాన్ని, అవతల పెట్టి నిర్మాలిన్యమైన, నిష్కల్మషమైన, నిష్కపటమైన, నిరుపమానమైన స్నేహాన్ని ఆవిష్కరించుకున్నాం.

ఎప్పుడు కలసినా బాల్యానికి పయనమవుతాము.
 పరేక్షలైనా సరే నేనూ మా కల్పకం నోట్ బుక్ లో పెట్టుకుని నవలలు, ముఖ్యంగా డిటెక్టివ్ నవలలు చదివే వాళ్ళం. వయస్సు 8/9. మద్రాస్ పెళ్ళయ్యాక వెళ్ళినా , డిటెక్టివ్ నవల పరిజ్ఞానం వల్ల గిండీ, పూనమల్లీ హైవే, రేస్కోర్స్ రోడ్ , కాత్య, రాజు,, యుగంధర్ వీళ్లందరూ పరిచయ మయ్యారు.

      ఇక బలిపీట్టం, శంకుతీర్ధం మొదలైన నవలలు ధారా వాహికంగా వస్తున్నప్పుడే క్యాచ్ పట్టి చదివేసాం (చిన్న వయస్సులోనే)..

నిజం చిన్నప్పుడు ఎంత, ఎంతెంత చదివే వాళ్ళం (క్లాసు బుక్స్ కాకుండా కాదు, క్లాసులో ఫస్ట్ లేక సెకండ్ వచ్చేదాన్నండోయ్ అపార్ధ చేసుకోకండి. పదవ క్లాసు ఊరంతటికీ ఫస్ట్, స్కూల్ లోనే కాదు)

       చిక్కడపల్లిలో చందనా ప్లేస్లో సిటీ సెంట్రల్ లైబ్రరీ ఉండేది. వేసవి సెలవలోస్తే చాలు పొద్దున్నే చద్దేన్నం (తరవాణీ అన్నం) తిని వెళ్లి మధ్యానం భోజనానికి ఇంటికి రావడం.
వింత లోకంలో విమల, బొమ్మల కొలువులో బొమ్మలు ఒకదానితో ఒకటి మాట్లాడుకోడం......చందమామ, బాలమిత్ర........ ఎన్నెన్నో! మళ్ళీ చిన్నగా అయిపోడం ఎలా? ఉండండి మళ్ళీ “వింతలోకంలో విమల” చదివితే చిన్నగా అయ్యే ఉపాయం తెలుస్తుంది.

గాయత్రిలో అమ్మ భావం మెండు. అంత చిన్న వయస్సులోనే ఏంతెస్తే అది నాకు సగం ఇచ్చేస్తంది, నేను గబగబాతినేసి గాయత్రీ నాకు కొంచెం ఇవ్వానే ప్లీజ్ అంటూ ఇంకా సగం తీసు కోడం. అంటే నేను 80% తను 20%. ఏమనుక్కునేది కాదు, ఏమనేదికూడా కాదు. అన్నట్లు కాకి ఎంగిలి కూడా. అన్నట్లు ఈ ఆటపేరు “మూగనోము”. పిచ్చి మొహాలం. నిజానికి నేను గాయత్రీ ఒకే క్లాసు. ఒకసారి section మార్చేరని నా హృదయం ఎంత ఏడ్చిందో చెప్పలేను.

ఇక మా చెల్లి మీద చాలానే దాష్టీకం చేసేను, అన్నీ చెయ్యనిచ్చి ఒకే ఒక పెట్టుపెట్టేది. ఉయా సారీనే. ఇప్పుడు అప్పుడూ కూడా ఉయ నా ప్రాణం.

అలా మా స్నేహానికి షష్టి పూర్తి నేడు. మీఅందరూ శతమానం భవతి అని దీవించండి....

మా ఫోటోస్ జత పరిచాను......