29, అక్టోబర్ 2019, మంగళవారం

కలల రాణి

కలల రాణీ పుట్టిన రోజు జేజేలు...

మా చిన్న మనవరాలు శ్రియ ఒక నెల మాతో ఉండి వాళ్ళ అమ్మ నాన్నలతో అమెరికా వెళ్ళిన తరవాత కలిగిన భావ ఆవేశం తో రాసిన మైల్ మీ అందరి కోసం……………..

డియర్ చిన్నారి చిట్టి ప్రేయసీ! మా చంటి రాక్షసీ!
మా హృదయాలని దొంగిలించి న్యూ జెర్సీ పారి పోయిన " ఓ శ్రియమ్మా"!
మా ఇంట చక్కగా నడయాడి, నీ బోసి నవ్వులతో మా మనస్సులను దోచి, మా చేత అన్ని సేవలూ చేయించుకుని, కనిపించిన అందరినీ నగుమోముతో పలకరిస్తూ, వారు నీ వేపు చూస్తే చాలు చెంగుమని గెంతి…..వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి పోయి, వాళ్ళని ఆనంద పరుస్తూ, మాకు కొంత స్వాంతన చేకూరుస్తూ, (మా చేతులు నొప్పులు పుట్టకుండా చూసిన ఉపాయమంతురాలా) ఎంత చక్కగా వ్యవహరించేవు!
చివరికి మా హృదయాలని దొంగిలించి వెళ్ళి పోయేవు. మొన్న ఎవరో నిన్ను ఎత్తుకు పోతున్నట్లు కల వచ్చింది. (తీరా చూస్తే అది మీ అమ్మ నాన్నగారు నిన్ను న్యూజెర్సీ తీసుకెళ్ళి నందుకు వచ్చిన తిప్పలన్న మాట)
మరలా ఇవాళ నువ్వు పాకుతూ వస్తున్నట్లు కల.

" ఓ కలల రాణీ! కనికరించు" మమ్మల్ని మా పనులు చేసుకోనీ.

అన్నట్లు మన వారందరికీ చెప్పేవా? ఏమని అంటే :-
"మా అమ్మమ్మ చింత చిగురు పప్పు, ఆవకాయ అన్నం, చారూ, పెరుగూ, చాలా బాగా చేస్తుంది..( ఎలా తెలుసు అంటారా? నాకు అన్నప్రాసన మర్నాడే పెట్టింది కాబట్టి) అన్నట్లు అయిస్ క్రీం కూడా పెట్టింది తెలుసా?
అవును నిజం, మా అమ్మమ్మ నాకు అవన్నీ పెట్టింది. మా అమ్మకి చెప్పద్దు, నన్ను" ప.. ప్ప… ప్పా" అయితే- గియితే అమ్మమ్మని కూడా. కాబట్టి దయ చేసి చెప్పద్దు.
మా అక్క కూడా నన్ను చిట్టి తల్లీ అనీ, పండూ అనీ, ముద్దు లాడు తోంది. (నాకు అర్ధంకాడంలేదు, మా అక్క కూడా చిట్టి తల్లే కదా !నన్ను ఎందుకు అలా అంటోంది? )
అయినా నాకెందుకు లెండి. నేను బహుసా అందరికీ చాలా……….ముద్దు వస్తున్నాననుక్కుంట. " అని అందరికీ చెప్పేవా? లేదా? లేకపోతే ఇది చదివి తెలుసుకోమను.
అమ్మమ్మ

ఇది చూసి ఇంకా పసి పాప అనుక్కుంటున్నారా? కాదండీ కొంచెం పెద్దదే అయ్యింది మా మల్లె మొగ్గ. ఎన్ని కబుర్లు, ఎంత అల్లరి, ఎంతటి విశ్లేషణ. (మా కళ్ళ ముందు పుట్టిన ఈ చిన్నారి పెద్దదయి పోతోందా! ఓహో అయితే మేమూ పెద్దయి పోతున్నామా కొంపదీసి, ఒప్పుకోను... "ముసలి తనపు అడుగుల సడి వినపడితే, ఇంట లేడనీ చెప్పించూ, ఇపుడు వీలు కాదనీ పంపించు" కదా మన సిధ్ధాంతం, అప్రస్తుత ప్రసంగం! మన గోలెందుకు ఇక్కడ? )

అంతే కాదు మీకు మరో గురుతర బాధ్యత కూడా ఇస్తున్నాను. ఈ రోజు పుట్టిన రోజు మా మల్లె మొగ్గకు ఆశీస్సులు ఇద్దామా?......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి