20, ఆగస్టు 2016, శనివారం

టీచరు గారు

టీచరు గారూ 🙏🙏🙏
 
   మాధవపెద్ది సుబ్బలక్ష్మీ మూర్తిగారు.......

 ఆవిడ ఒకసారి పరిచయమౌతే గుర్తుండి పోయే వ్యక్తి. ఇక అలాటిది ఆవిడ నాకు గురువు, గైడ్, స్ఫూర్తిప్రదాయని, నాకు ఆదర్శం,ఇంకా చెప్పాలంటే తల్లి,తండ్రీ,గురువూ, దైవం, ఇంతకన్నా చెప్పడానికి నా భావానికి భాష లేదు.

  టీచర్ గారు మంచి ఝరితో ఎగిసి దూకే జలపాతం,  చల్లగా సాగే సెలయేరు,  చల్లటి మలయమారుతం, సుడులు తిరుగుతూ చుట్టబెట్టే సుడిగాలి, సన్నజాజీ-సంపెంగలు కలబోసిన సువాసన! వారి గూర్చి ఎంత చెప్పినా నాకు తృప్తి తీరదు.

మనకి ఏదైనా సమస్య వున్నప్పుడు సానుభూతి చెప్పేవారి వల్ల మనం మరింత డీలా పడి పోతాం, ఆవిడ సానుభూతి చెప్పరు ధైర్యం చెబుతారు (నయానా భయాన)

 వారి గూర్చి ఒక పుస్తకం రాయచ్చు, ఇంకా ఎంతో చెప్పాలని వుంది కానీ ఇంతటితో ముగిస్తున్నా!

   టీచరు గారూ! మీరు నా జీవితంలో తారస పడడం,  నా పూర్వ జన్మసుకృతం.............🙏🙏🙏

కాలం

కాలం

  ఆగదు, ఆపలేం. అందుకే అన్నారు జ్ఞాపకాలు పదిల పరచుకోమని. ఏమో బాబూ నా కైతే నా జీవితపు మంచి పుటలన్నీ కంఠోపాఠమే.

 మొన్న నేను పుట్టగానే శ్యామసుందరం నీకు భార్య పుట్టింది అని టార్చ్ వేసి చూపించారట తెలుసా!

 ఐదవ తరగతి శెలవలకు అమ్మ్మమగారి వూరు బాపట్ల, అక్కడ నుండి అత్తయ్యగారు, పెద్దమ్మగార్ల వూరు విజయ వాడ వెళ్ళాం.

 బస్ దిగగానే మా పెద్దమ్మగారి అమ్మాయి నన్ను మా బావను ఒకే రిక్షాలో కుదేసింది. రిక్షాలో ఈమూల ఒకరు, ఆ మూలకి ఒకరు తగలకుండా జాగ్రత్త పడ్డాం. మా మధ్య రిక్షాలో ఆమడ దూరం. నిజం నమ్మండి నవ్వకండి.

 ఆ సారి మా బావ మాకు విజయవాడ అంతా చూపించడం, సత్యహరిశ్చంద్ర సినిమా అన్నీ మొన్నేగా చూసాం, అరే అప్పుడే ముందుకొచ్చేసామా!

   సరే 1968 లో విజయవాడ స్టేషన్లో నేనూ మా నాన్నగారూ, తమ్ముడూ దిగే సరికి బ్రిడ్జ్ మీదనుండి దిగుతూ మా బావ నా వేపు చూసి నవ్వుతే మదిలో కోటి వీణలు మ్రోగాయి, ఇంకా ఆ నాదం చెవుల్లో రింగు రింగు మంటోందిగా.

 1969 మేము హైదరాబాదు నుండీ వస్తుంటే మా బావ సైకిల్పై  వస్తూ  మమ్మల్ని చూసి, ఆగి వెనుదిరిగి ఇంటికి వచ్చేసి (పని మానుకుని) నాకూ మాచెల్లికీ జామ తోటలు చూపించి మంచి సంపెంగ పువ్వు ఇస్తే, ఎన్ని రోజులు పుస్తకంలో దాచుకున్నానూ!

 ప్రేమ లేఖలు రాయమంటే ప్రోగ్రస్ రిపోర్ట్ పంపింస్తున్నానని కోపం తెచ్చుకున్నది మొన్ననే కదా! ( అప్పటి పదవ తరగతి పిల్లలంతకంటే ఏం రాస్తారండీ సోద్యం కాకపోతే)

 ఇంతలోనే చిటుక్కున బావతో పెళ్ళి, పిల్లలు ,వారి చదువులూ,వారి పెళ్ళిళ్ళూ, మనవలూ మనవరాళ్ళూ.........ఇలా విస్తరించుకుంటూ ఇంత దూరం వచ్చేసామా?

 నా మటుకూ గడిచిన కాలం, గడుస్తున్న కాలం అంతా ఆనందమయమే.

 నిన్న పుట్టినరోజు పెళ్ళి కొడుకేనండీ ఈ హీరో!
క్రిందటి  సంవత్సరం ఆగస్ట్ 15 మా పిల్లలు ఇద్దరూ కుటుంబ సమేతంగా వచ్చి నా
షష్టిపూర్తి వేడుకలు నిర్వహించిన తరువాత రాసిన పోస్ట్ మళ్ళీ నా కోసం.... చదవక పోయినా సరే ఏమీ అనుక్కోను.......

"గుండె  గొంతుకలో  కొట్లాడుతోంది"
                                                   ఏమని?

        మనస్సులో  కలిగిన  భావం  ఇక్కడ  రాయమని.

అందరూ  ఏమైనా  అనుక్కుంటారేమోనని  మొహమాటం,  కానీ ఇది  నా పేజీ! నా ఇష్టం  వచ్చినది  రాయచ్చు కదా?
ఏమంటారు?

    అవును  నిజమే!  ఎవరి  పిల్లలు వాళ్లకు ప్యారీ,  ఎవ్వరి  తల్లి తండ్రులు  అంటే  వాళ్ళ  పిల్లలకు  ఇష్టం, కృతజ్ఞతా  భావం.  కానీ  నా అనుభవం,  భావం  చెప్పుకునే్ుందుకు.... నాకు  అవకాశం  దక్కింది.  మరి   చెప్పద్దూ....

  ఈ  అవకాశం  నాకు  కల్పించిన   మా అబ్బాయి  కోడలికి  సంతోషాన్ని తెలియజేస్తున్నా..........

                ఇక  అసలు విషయానికి వద్దాం.....

ఒక పండితునింట  పుట్టి, ఒక పండితునింటిని మెట్టి , ఒక పండితుని  చేపట్టే  మహద్భాగ్యం  కలిగించిన  భగవంతునికి  ముందుగా కృతజ్ఞతలు  తెలియజేసుకుంటున్నాను.
   
  ఎంతో  బాగా  నిర్విహించి  ఈ   సన్నివేసాన్ని  రక్తి  కట్టించారు  మా  పిల్లలూ,  మావారూ. మా  కోడలి  నిర్వహణ లో  మనవలూ, పిల్లందరూ  నాపట్ల  వారి  ఇష్టాన్ని ప్రకటిస్తుంటే  ఆనందభాష్పాలు.

       మా అమ్మాయి అబ్బాయి  మాటలు  వింటుంటే  కన్నీరు   వరదలై  ప్రవహించింది.  (ఏడుపు కాదు  ఆనందం.)  పిల్లల్ని  పెంచినప్పుడు  మనకు తెలీదు  కర్తవ్యంగా  భావించి  పెంచుతం. వారు  వ్యక్తీకరించినప్పుడు   అవునా  అలా పెంచామా,  అంత  ప్రేమ  పంచామా?  అని  ఆశ్చర్యం  వేస్తుంది.  అయితే  నేను   బాగా పెంచానన్నమాట.  అందుకే  అంత మంచి  మాటలు విన్నాను. అని  సంతృప్తి  కలిగింది. (వీడియో చూస్తే  మీకు  కూడా  నా స్పందన  తాలూకు భావం అర్ధమవుతుంది)

   ఇక మనవలు ముగ్గురూ అమ్మమ్మ/ నానమ్మ అంటే ఎందుకిష్టమో వారు వారి మనస్సులోనిది  మాటల్లో రాసుకుని చదువుతుంటే  జన్మ ధన్యమయిపోయింది  అనిపించింది.  

     కడుపున  పుట్టిన  పిల్లలూ ,.. వారి  పిల్లలూ  ఒకలా  భావ  ప్రకటన  చేస్తే ...మా  అల్లుడూ,   కోడలూ  నా  వ్యక్తిత్వం  గూర్చి,  నా   టాలెన్ట్స్   గూర్చి  నా  వాత్సల్యం   గూర్చి  చెబుతుంటే  అనిపించింది  " ఏ  నాటి  నోము ఫలమో  ఏ  దాన  బలమో"  అని.

  ఇంతటితో సరిపోలేదు..... మా మనవరాళ్ళు  ఇద్దరూ వీణలు,  మా  మనవడి  పియానో, మా పిల్లలిద్దరూ కలసి  వీణలతో  నాకు మంచి మరువలేని  బహుమతినిచ్చేరు.

   వీనుల విందు అయ్యింది  కదా ఆ తరువాత  బహు   పసందు (విందు).

   నా  జీవితం  పరిపూర్ణం  అని   చెప్పుకోడానికిాిి  కొన్ని  విషయాలను   మీతో పంచుకుంటున్నాను.....

1)  మా నాన్నగారు   ఒకసారి   చెప్పారు "మళ్ళీ  జన్మ  అంటూ ఉంటే  జయలక్ష్మే  నాకు కూతురుగా పుట్టాలి"  అని.

2)  మా అమ్మ  గారు మా పిల్లలకి చెప్పారు" పిల్లలంటే  ఎవరికైనా అభిమానం ఉంటుంది,  కానీ  జయలక్ష్మి  అంటే  మాకు  గౌరవంతో కూడిన అభిమానం....అబిమానం  తన  హక్కు!  గౌరవం  తను సంపాయిన్చుకున్నది"  అని.

3)  అలానే మా అత్తగారు  చెప్పేరు "  జయలక్ష్మి నువ్వు  జంటిల్మాన్ (పాపం తనకు తెలిసిన పదం)  నువ్వు మా కోడలివి  అయ్యావు  కనుక  మా ఇంటికి   ఉపయోగ  పడ్డావు,  ఇదే అబ్బాయి  అయి  ఉంటె  మా  తమ్ముడుకి  ఉపయోగ పేడేదానివి"  "నువ్వు  లేకపోతే  నేను  చెరువులోంచి  బయట పడేసిన  చేపలా అయి పోతాను.   నన్ను కడవరకు  చూసి సాగనంపు"  అని. (ఆవిడ ఆజ్ఞ శిరసావహించాను.)

  ఇక మా  వారి గూర్చి  వేరే  చెప్పఖర్లేదు.  పిల్లలు  సరే  సరి.

       మా  శిష్యులు   తమకి  ఛాన్స్  ఇస్తే  వాళ్ళ టీచర్  గారు గూర్చి  బోలెడన్ని  చెప్పుకునే వారం  అనుక్కున్నారు.   మళ్ళీ  మా   ఏభైవ పెళ్లి  రోజుకు  కలసి  బోలెడన్ని  కబుర్లు చెప్పుకుందాం.......  అప్పుడు  ఛాన్స్  మీదే...సరేనా?

ఆనందంతో  కన్నీటి తెర  అడ్డు  వస్తోంది  రాయలేకపోతున్నా....... ఉంటాను మరి........