28, నవంబర్ 2020, శనివారం

 పాపం నేను....

ఆ ఇంటి వాళ్ళు లోపలికి వెళ్ళి వచ్చే లోగా ఫోన్ చేసేను మా ఒకానొక ఫ్రెండ్ దేవికా రాణికి. వాళ్ళింట్లో ఫోన్ వుందంటే, నంబరు అడిగి తెచ్చుకున్నాను. అది పట్టుకుని చేసాను గబ గబా..... వినిపించదే.... అస్సలు  వినపడ్డం  లేదు. 

ఎలా వినిపిస్తుందండీ ఎలా వినిపిస్తుందీ? మౌత్ పీస్ చెవి దగ్గరా, ఇయర్ పీస్ మూతి దగ్గర పెట్టు కుంటే. 😄😄😄😄


చాలా రోజులు పాటూ...ముందు మనం హలో అనాలా? వాళ్ళు అనేదాకా ఆగాలా? సందేహంతో తలకిందుల తపస్సు.🤔🤔🤔 .చివరికి అవమానం దిగమింగి, మొహమాటం ఒదులుకుని ఎలాగోలా నా ఆంతరంగిక  ప్రియ మిత్రురాలిని రహస్యంగా అడిగితే.... నాకూ తెలీదని సమాధానం. ఎవరింట్లో ఫోన్ వుందని?. చివరికి ఎలాగోలా తెలుసుకున్నాను. 


ఇప్పుడు సెల్లు హస్తభూషణం. పైగా మొన్ననే  ఎంతో అపురూపంగా సంపాయించుకున్న లాండ్ లైన్ తీయించేసాము. 


కాలం పెను మార్పులు  తీసుకు రావచ్చు, కానీ జ్ఞాపకాలు మటుకూ మనం వున్నంత వరకూ మనతోనే పదిలంగా వుంటాయి. ఏమంటారు?

1, నవంబర్ 2020, ఆదివారం

ఆ గతానికి స్వాగతం

 (ఆ గతానికి స్వాగతం).... 


నేనే ఉమాదేవిని. ఎందుకూ అంత ఆశ్చర్య చకితులవుతున్నారు. ఇంత మంది నా వాళ్ళు నాకిష్టమైన సంగీతం పాడుతుంటే నేను ఎక్కడకెళ్లగలను చెప్పండి, ఇక్కడే మీ మధ్యే తిరుగుతున్నా.  మా అక్క మీ అందరినీ పాడమంది కదా, నేను కూడా నా చిన్ని శిష్యుడు బబ్లూతో కలసి పాడుతాను, విని మీ

 అభిప్రాయాలు చెప్పాల్సిందే. 


నా గురించి...


 నాకు ప్రకృతి ఇష్టం, అందమైనవి ఏమైనా ఇష్టం, వంటలిష్టం, పాటలు, మాటలు,చీరలు, నగలు, నవ్వులు, పువ్వులు, మనషులు, మమతలు, ఆటలూ, అందంగా తయారవ్వడం. వేయేల నాకు ఈ మానవ జన్మ ఇష్టం. 


కానీ భగవంతుడు నన్ను ( 18 వ ఏటనుండి) కేవలం బాధల్ని భరించడానికే పుట్టించినట్లున్నాడు... అయినా చెదరని చిరునవ్వుతో జీవితపు challenges ని నా భర్త సహకారంతో  ఎదుర్కొంటూ.....నలుగురికీ నా సంగీత విద్యనే పంచి.... బాధలని..... భావోద్వేగాలనీ నాతోనే తీసికెళ్ళిపోయాను సెప్టెంబరు 2019 లో ...  అంత వరకూ, "మేమే బాధలు పడిపోతున్నాం అనుకునే ఎవ్వరైనా నా నుండి ఎంతైనా నేర్చుకోవాలి"  అనే విధంగానే బతికాను. .... అందరికీ ఆనందం  పంచి, అందులోంచి నా ఆనందాన్ని వెతుక్కున్నా. 


మీ అందరికీ " పుత్తడి బొమ్మ పూర్ణమ్మ" పాట తెలుసుగా. అందులో పూర్ణమ్మలా అడుగుతున్నా " మీ అందరూ కలసి నప్పుడు ఒకసారి ఈ ఉమపిన్నిని తలచుకోండి"......

నవగ్రహ కీర్తనల చరిత్ర

 అది 1972. మా నాన్నగారు నవగ్రహ కీర్తనలూ, కొన్ని సర్వ దేవతలనూ స్తుతిస్తూ కీర్తనలూ రచించారు. ఆయన సంస్కృతమూ, జ్యోతీష్యమూ అభ్యసించడము వలన వాటిని అన్వయిస్తూ కృతులు రచించారు. తరువాత ఒక దశకం పాటూ ఇవి వెలుగు చూడ లేదు. 

 తరువాత తను వీటిని స్వయముగా వాయించి త్యాగరాజ గాన సభలో ఆవిష్కరించారు. 


వీటిని పుస్తక రూపంలో తీసుకు రమ్మని గురువు గారిని  పదే పదే కోరేవారు. 


కళ్యాణి పెళ్ళి సమయంలో అత్యంత క్లిష్టమైన పనుల ఒత్తిడిలో కూడా గురువు గారు ప్రతీ రోజూ ప్రింటింగ్ ప్రెస్ లో స్వయంగా కూర్చొని కంపోజ్ చేయించి, దానిని పుస్తక రూపంలో ముద్రించి, పెళ్ళిలో పుస్తరావిష్కరణ చేయించారు. కళ్యాణి పెళ్లి రిసెప్షన్ ఒక పండిత సభలా వుంది. 


మళ్ళీ ఒక రెండు సంవత్సరాల తర్వాత అవి సిడీ రూపంలోకి తీసుకు వచ్చారు గురువు గారు. మా చెల్వెలు మా అమ్మగారిని " అమ్మా మీకు ఇంకో కూతురు వుంటే పెళ్ళి చేస్తారు కదా" అలా అనుక్కుని ఖర్చు పెట్టు, నాన్నగారు వుండగా బావ లాంటి విద్వాంసుని సహకారంతో వాటికి వెలుగునిప్పిస్తే నాన్నగారు వుండగా విని సంతోషిస్తారు, పాట రూపంలో అయితే సాహిత్యం అర్ధ మవుతుందని సిడీ చెయ్యడానికి ఖర్చు పెట్టించింది. దాని వల్లే ఇంత ప్రాచుర్యం పొందుతున్నాయి. 


ఇక అసలు విషయం... అవన్నీ పాడించడానికి గురువుగారు మా నాన్నగారి అంగీకారం తీసుకుని నవగ్రహాల కృతులు మొత్తం రాగాల ముద్దలుగా, పాడటానికి అనువుగా తన బాణీలో మార్చేసారు. వెరసి ఏమైందీ? మా నాన్నగారి సాహిత్యం, వారు సూచించిన రాగంలో గురువుగారి స్వర రచనతో రూపొందాయన్నమాట. విజయవాడలో మల్లాది వాళ్ళూ, మోదుమూడి దంపతులూ, విష్ణుభొట్ల సరస్వతీ, మండా కృష్ణ మోహన్, నర్సమ్మ ( మల్లిక్ గారి మనవరాలు) పాడడం గురువుగారు వీణ, పాలపర్తి వారు వైలిన్, ఫల్గుణ్ మృదంగంతో ముందు నవగ్రహ స్తోత్రంతో అద్భుతమైన నవగ్రహ కృతులు ఏర్పడ్డాయి. దీనికి ముందు మాట బాలమురళీ గారు రచించారు. 


దీక్షితార్ కృతులతో సమాన స్థాయిలో, రాగాల ముద్దలు, ఉత్సాహంగా సాగే ఈ నవగ్రహ కృతులు నేర్చుకొనినా,వినినా మీ అందరూ ఆయా గ్రహాల కృపకి పాత్రులవుదురు గాక! 


నవగ్రహ కృతులు పరి సమాప్తి అయిన సందర్భంగా మీతో నా అంతరంగం పంచుకున్నాను. 

ఇకపై ఎప్పుడో సర్వ దేవతా స్తుతి...

మౌనమే నీ భాష

 "మౌనమే  నీ  భాష  ఓ  మూగ  మనసా" అన్నట్లు......  భాష  కందని  భావం. ఎంతమంది  మమ్మల్ని ఆశీర్వదించేరో,  ఎంత  మంది  శుభాకాంక్షలు  అందించేరో అందరికీ  పేరు  పేరునా  కృతజ్ఞతలు.


           ఆత్రేయ  గారు అన్నట్లు  "నవ్వినా ఏడ్చినా  కన్నీళ్ళు  వస్తాయి" అని,  నాకు  కూడా  కన్నీళ్ళు   వస్తున్నాయి. ఏడుపుతో  కాదండీ  బాబూ!  ఆనందంతో.  వాటినీ  " ఆనంద  భాష్పాలు"  అంటారు  లెండి....


             ఈ  కార్యక్రమాన్ని  ఎంతో  సుందరంగా,  సుమనోహరంగా  తీర్చి దిద్దిన  ప్రతీ ఒక్కరికీ  (ముఖ్యంగా  సంకల్పించిన  నా చెల్లెలు  ఉమాదేవి,  దానిని  అందంగా  ఆచరణలో  పెట్టిన  నా  భర్త  శ్రీ  శ్యామసుందర్  గారికి)  ధన్యవాదాలు. 


       ఇంతమంది  స్నేహితులు,  శిష్యులూ,  బంధువులూ  ఆత్మీయులను  సంపాయిన్చుకున్నామనే  భావన  చాలా  త్రుప్తినిస్తోంది.


  

          ఇంతకనా  పరిపూర్ణత  ఏముందండి  జీవితానికి.


      రోజూ  రాయడం  అలవాటయి  పోయి  చేతులు...........పుట్టేస్తున్నాయి. ఏం  చెయ్యాలబ్బా?  సరే  ఎదో  ఒకటి  చేద్దాంలే.  అయినా  నా  వీణో,  మళ్ళీ  వీణ  వాయిన్చుకోవాలి..  అసలే  ఈ  మధ్య   "ఊహూ!  అస్సలు.........  లేదు"  అయినా   గురువుగారు   ఊరుకోరుగా.


               అయినా నాకు మరీ  ఉబలాటం  ఎక్కువైతే   రాసేస్తా,  తప్పదు  మీరు  చదవక............

తృప్తి

 తృప్తి


అంతులేని తృప్తిగా వుంది. సంకల్ప శుధ్ధి వుంటే సంకల్ప సిధ్ధి కలుగుతుంది. 


ఎప్పుడూ ఆకాశానికి నిచ్చెనలు వేయ లేదు. అందరి తల్లిదండ్రులలాగానే మేము కూడా మా పిల్లలు ధనార్జనలో కన్నా, జ్ఞాన సముపార్జనలో ముందుండాలనీ, సజ్జన సాంగత్యం మెండుగా వుండాలనీ, సంగీత,సంస్కార, సంస్కృతీ, పరులవ్వాలని కోరుకున్నాము.భగవంతుడు అనుగ్రహించాడు. ఇద్దరు పిల్లలూ వారి కుటుంటుంబ సభ్యులతో సహా మా ఆశయాల మేరకూ సదలవాట్లతో,సత్సాంగత్యం కలిగి,  సదాచార పరులుగా జీవిస్తున్నారు.


చాలు ఈ జన్మకి ఈ వరం భగవంతుడా! నీకు వేవేల ప్రణామాలు 🙏🏽🙏🏽🙏🏽

ఆత్మహత్యా యత్నం

 ఆత్మహత్యా యత్నం.....

మీరు నమ్మరు కదా! నిజం ఒట్టు!


 ఈ రోజు మా ఇంట్లో బియ్యం, కుక్కర్ లో వున్న అన్నం గిన్నెలోంచి చుట్టూ వున్న బావి లోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.  


  అయినా దానికి జవ జీవాలనిచ్చి (మొన్న చెప్పేను  కదండీ మన తప్పు మనమే అనుభవించాలని) ముద్ద పప్పు, పులుసన్నం, పెరుగుకు వాడుకున్నాను.


  మా వారు అన్నారు....రేపు అన్నం నీ చేజిక్కకుండా కుక్కర్ విజిల్ ఎగిరి పోయి,అన్నం అంతా కన్నం లోంచి మింట కలవాలని, అప్పడెలా దానికి జీవాన్నిచ్చి కాపాడుతావన్నారు? 


 ఆ పరిస్ధితే కనుక ఎదురవుతే ఏమి చేసి దానికి జీవాన్నివాలో ఉపాయం చెప్పరూ ప్లీజ్!