13, సెప్టెంబర్ 2019, శుక్రవారం

స్మృతి సమీరం

స్మృతి సమీరం

"ఓ మునీ !మీ దంపతుల కు ముద్దుగా పుట్టిన తనయులం -కారణ జన్ములం - ఇద్దర్నీ కలిసి ఎత్తుకోనే శక్తి - నీకు ఇదే ఇస్తున్నాము - ప్రతిఫలం గా ఎవ్వరూ సంపాదించ లేనంత పుణ్యం - ఇదుగో." అని వీరి తనయులు దీవించారు.

తనయులు తల్లితండ్రులను దీవించడమేమిటని? విడ్డూర పడకండి. అవును! వారిరువురూ పసికూనలైన మునిపుంగవులు. వారిని గడ్డాలు మీసాలూ వచ్చినా అడ్డాలలోని పిల్లల్లా సాకారు, ముద్దుగా వారి ఇష్టాఇష్టాలని ఊహించుకుని వాటిని అమరుస్తూ, వారిని ఒక్క క్షణం కూడా ఏమరుపాటున వదలక,వెన్నంటి చూసుకున్న ఆ తల్లితండ్రులు పరమ పూజ్యులు. వారిలో పెద్ద మౌని భగవంతుని 9సంవత్సరాల క్రితం చేరుకుని జన్మ రాహిత్యం పొందాడు. చిన్న వాడు తపస్సులోనే వున్నాడు.

పిల్లల దీవెనల ఫలితంగా ఆ భార్యాభర్తలిరువురూ స్వార్ధ రహితులుగా మారిపోయినారు. ప్రపంచం అంతా వారికి పిల్లలే. నా మటుకు నేను, వారిని నాకూ, నా భర్తకూ, నా తల్లితండ్రులకూ, నా పిల్లలకు కూడా తల్లి తండ్రులుగా భావిస్తాను. అది నిజం కూడా. వారికి తెలిసిన యావన్మందీ ఉమా,మూర్తి దంపతుల గూర్చి ముక్తకంఠంతో ఇలాగే చెప్పితీరుతారు.

వారికి పరిచయస్తు లెవరైనా వారినుండీ కించిత్తైనా ప్రయోజనం పొందకుండా లేరు. (ఈ విషయం బయటకు అన్నా అనలేక పోయినా.)

మేమెవరమైనా వారి కుటుంబానికి ఏదైనా ఆత్మీయంగా వెన్నంటి వున్నామంటే కారణం, మేము కృతజ్ఞులం అనీ, కృతఘ్నులం కాదనీ, ఇంకా మానవత్వం మాలో మిగులున్నదని అర్ధం. ఇది మా గొప్పతనం కాదు. వారిరువురూ సంపాయించుకున్నది డబ్బూ కీర్తి ప్రతిష్టలు కానే కాదు, సర్వ జనాభిమాన ధనం. అనితర సాధ్యమైన ఈ ధనం వారు అప్పనంగా సంపాయించ లేదు, వారు నిస్వార్ధంగా పంచిన అభిమానమే ఈనాడు వారు సంపాయించిన ఈ అభిమానధనం. ఉమా మూర్తీ మీరిరువురూ అన్ని విధాలా ధన్యజీవులు.

ఆ మూర్తిని ఇక చూడలేక పోయినా, అందరి హృదయాలనూ జయించిన అజేయుడు. అతి సామాన్యుడుగా పుట్టి, అసమాన్యుడిగా ఎదిగి, మాన్యుడిగా మారిన స్వయంసిద్ధుడు.కడలిలా కష్టాలను కడుపులో దాచుకుని సముద్ర గాంభీర్యం హృదయంలో నింపుకొని,ఎల్లప్పుడూ చిరు మందహాసం తో అందరిని పలకరిస్తూ, ఎంతో శ్రమ కోర్చి పట్టుదలతో కంపెనీ సెక్రెటరీ, కాస్ట్ అకౌంటన్సీ పరీక్షలను అవలీలగా పాసై, జ్యోతిష్య శాస్త్రం లో అద్భుత ప్రతిభ కనబరిచే శ్రీ మూర్తిగారు సర్వదా అభినందనీయులు. వారు ఈ లోకం విడచి తిరిగిరాని లోకాలకు వెళ్ళి నిన్నటికి మూడు సంవత్సరాలు.

ఆ ఇద్దరి అన్యోన్యతా చెప్పనలవి కానిది. అన్యోన్యంగా భార్యాభర్తలు మంచి ఆలోచనా చెయ్యవచ్చు, అప్పుడప్పుడు ఇరువురూ కూడి చెడు ఆలోచనలు కూడా అమలు చెయ్సవచ్చు. కానీ ఈ భార్యాభర్తా కలసికట్టుగా ఇతరుల మంచే ఆలోచించారు, ఇతరులకు మంచే చేసారు.

మూర్తిగారు పరమపదించే ముందు రోజు " ఉమాదేవి చాలా మంచిది, నాకు మరు జన్మలో కూడా తనే భార్యగా రావాలని" చెప్పారట. అంత కన్నా ఒక స్త్రీకి కావల్సిన/రావల్సిన కితాబు ఏముంటుంది భర్త నుండీ?

పిల్లలు ఇరువురూ దీవెనల ఫలితంగా, మూర్తిగారు క్రితం 3 సంవత్సరాల క్రితం ఇదే రోజు,ఉమాదేవి చెయ్యి గట్టిగా పట్టుకుని వుండగానే క్షణంలో భగవంతుని సాన్నిత్యాన్ని చేరేరు.

గొప్పచెప్పుకోడం కాదు........ గొప్పగా చెపుతున్నాను వీరు మా చెల్లెలు ఓరుగంటి ఉమాదేవి, మరిది ఓరుగంటి వేంకట నరశింహ మూర్తి గారు. పవిత్రమైన జీవితం గడిపిన మూర్తిగారికి, ఉమా దేవులకు సద్గతులు ప్రాప్తించు గాక!

మా  చెల్లి  నేనూ  ఇప్పుడు  ఎంతో  మంచి  దోస్తులము,   కానీ   చిన్నప్పుడు  ప్రియమైన శత్రువులం.. 

 నా ప్రాణ స్నేహితురాలు, నా భర్తకూ, నా పిల్లలకూ, నాకూ తల్లి అయిన ఉమ, నిన్న మమ్మల్ని విడిచి వాళ్ళాయనిని వెదుక్కుంటూ వెళ్ళి పోయింది.

నా 64 సంవత్సరాల వయస్సులో జరిగిన ప్రతీ సెకండూ తెలిసిన నా ప్రాణమా, నా అంతరంగమా  ఏదీ? నిన్ను ఎక్కడని వెదకను.

సునాయస మరణం కోరుకున్న నీ మొర ఆలకించాడు దేముడు. భగవంతుడు నీకు జీవితంలో ఆనందం ఇవ్వక పోయినా,   నువ్వు ఇతరుల జీవితాల్లో ఆనందం  కల్గించి, అది చూసి ఆనందించే గొప్ప హృదయం ఇచ్చాడు. నీకు సంపూర్ణ సహకారాన్నిచ్చే భర్తనిచ్చాడు.

ఒద్దు ఉమా ఒద్దు, నీకు మరు జన్మ ఒద్దు. నీకు పుణ్య ఫలంగా " జన్మ రాహిత్యాన్ని" ప్రసాదించమ ని ఆ దేవ దేవుణ్ణి కోరుకుంటుంన్నా!

ఉమా!  చిన్నప్పుడు  చాలా  సార్లు  నీకు  నా మీద కోపం  వచ్చింది,  సారీనే.

నిన్ననే గుర్తు చేసేవు కదా " ఏ జయా, ఓ ఉమా" మనిద్దరం అని.😃😃😃

వుంటా మరి....

3, సెప్టెంబర్ 2019, మంగళవారం

పుట్టిన రోజు జేజేలు ఆదిత్యా

అది 1974 . రాత్రి 10 గంటలు. చిమ్మ చీకటి.

నేనూ మా వారూ, మా అబ్బాయి బుజ్జి "ఆదిత్యా" ఫస్ట్ షో సినిమా చూసి ఇంటికి వచ్చాము. అసలయిన కధ ఇక్కడ మొదలవుతోంది.

జాగ్రత్తగా భయపడకుండా చదవండి. ఏమీ భయంలేదు, సరేనా? ఇక ముందుకెళ్దాము…………….

విజయవాడ లో మా ఇల్లు గవర్నమెంట్ క్వార్టర్స్. మేడ మీద ఇల్లు మాది. కింద రెండు , పైన రెండు ఇళ్ళు. పైకి వెళ్ళడానికి మధ్య నుండీ మెట్లు. మెట్ల గదికి కింద చక్కటి తలుపు.

అన్నట్లు ఇక్కడ ఒక విషయంచెప్పలి:- మా మేడ మీద ఎదురు పోర్షను వాళ్ళింట్లోకి, కింద మెట్ల తాలూకు కామను బల్బు కనక్షను ఉంది. పైన ఉన్న కనక్షను మాకు. దాని వల్ల మా ఎదురు ఇంటి ఆయన మెట్ల మీద బల్బ్ పెట్టనిచ్చే వారు కాదు. బిల్లు వాళ్ళు కట్టాల్సి వస్తుందని. మేము సొంతం గా ఏర్పాటు చేసుకోవచ్చని తెలీని అమాయకత. దాంతో మెట్ల తలుపు వేసెయ్యంగానే చిమ్మ చీకటి.
ఎప్పటి లాగానే కింద తలుపు గొళ్ళెం పెట్టి పైకి ఎక్కుతున్నాము, సగం మెట్లు ఎక్కగానే నా కాలు ఎవరో గట్టిగా పట్టుకున్నారు. నేను భయంతో దొంగా. దొంగా……..అని గట్టిగా కేకలు మొదలెట్టేను ఆ దొంగ నా రెండు కాళ్ళూ ఇంకా గట్టిగా పట్టు కున్నాడు.

నా అరుపుకి మా వారు కూడా చాలా………భయ పడి పోతూ ఏమయ్యిందని అరుస్తున్నారు. దొంగ నా కాళ్ళు వదడంలేదు. నేను భయంతో కాళ్ళు విదిలించుకుంటున్నాను.

ఇంతలొ ఈ హడావిడికి మా అత్తగారు ఖంగారు పడిపోతూ, తలుపు తీసేరు……………

దొంగ దొరికేడు.

దొంగ ముద్దుగా, బిత్తర చూపులతో, చిన్నిచిన్ని అరచేతుల తో , చిట్టి చిట్టి పాదాల తో, "అమ్మానన్నంటావా…………..దొంగననీ అంటావా? '' అని ప్రశ్నిస్తూ నుంచుని ఉన్నాడు.

అర్ధమయ్యిందనుక్కుంటాను. దొంగ ఎవరో.

ఎవరో కాదండీ మా అబ్బాయి "బుజ్జి ఆదిత్యే" ఆ ఇంటి దొంగ.

ఆదిత్య మొదటిసారిగా మమ్మల్ని అమ్మా నాన్నగారూ అని పిలిచి ఎనలేని ఆనందం కల్గ చేసాడు.అన్ని ఏళ్ళ క్రితం విషయాలూ కబుర్లూ నిన్నా మొన్నలా జ్ఞాపకాల మంజూషలో పదిలంగా పచ్చగా వున్నాయి.

వస పిట్టలా తను చెప్పిన కబుర్లు ఎన్నో ఎన్నెన్నో. “ చికల” ఎకల”., ఏంతి బంతి, “ లక్ష్మడికి ఆగాయిత్యం సీతా దేవికి  ఊ అంటే తప్పు, ఆ అంటే తప్పు” అంటూ రామాయణ ఘట్టం ఒకటి చెప్పడం నుంచీ రోజు రోజూ వేవేల జ్ఞాపకాలు.

చదువుకుంటున్న రోజుల్లో, నాతో అన్ని విషయాలూ వెనక వెనకే తిరుగుతూ చెప్పుతుంటే నేను కూడా కాలేజీకి వెళ్ళి చదువు కుంటున్న భావనలో వుండేదాన్ని (కాలేజీ గుమ్మం ఎక్కని దాన్ని).

తను MTech కి Calicut  వెళిపోతే, నాకు నిత్యం విజ్ఞానం ప్రసాదించే నా స్నేహితుడు  వెళ్ళి పోయాడని మనస్సు ఎంత దుఃఖించిందో. కానీ చక్కటి నడవడికతో, అక్కడ చాలా బాగా చదువుకొని, అక్కడ నుండి బెంగళూరులో CAIR లో Sr. Research fellowship తీసుకుని, తరవాత అక్కడే  scientist గా appoint అయి
, వివాహం చేసుకుని,ఇక అక్కడ నుండి అమెరికా వెళ్ళి భార్యా, కొడుకుతో కలపి సుఖజీవనం సాగిస్తున్నాడు.

నేను కోరుకున్న విధంగా సత్సాంగత్యంతో,సత్ప్రవర్తనతో, సన్మార్గంలో వెళ్ళే ఆదిత్య నా ప్రాణం. సుఖీభవా ఆదిత్యా.

వీణ, కీబోర్డ్ చాలా బాగా వాయించి, ఇంటి వారసత్వ సంపద అంది పుచ్చుకుని కొనసాగిస్తున్నాడు.

ఈ రోజు మా అబ్బాయి ఆదిత్య పుట్టిన రోజు. 
ఆదిత్యా! వంద సంవత్సరాలు నీ భార్యా టీనా, పిల్లవాడు తేజస్ తో , మనవలూ మునిమనవలతో కలపి చల్లగుండు బేటా.
దీర్ఘాయుష్మాన్ భవ, శతాయుష్మాన్ భవ, ఆయురారోగ్య ఐశ్వర్య , దిగ్విజయ ప్రాప్తిరస్తు. తథాస్తు తథాస్తు తథాస్తు.