29, అక్టోబర్ 2019, మంగళవారం

కలల రాణి

కలల రాణీ పుట్టిన రోజు జేజేలు...

మా చిన్న మనవరాలు శ్రియ ఒక నెల మాతో ఉండి వాళ్ళ అమ్మ నాన్నలతో అమెరికా వెళ్ళిన తరవాత కలిగిన భావ ఆవేశం తో రాసిన మైల్ మీ అందరి కోసం……………..

డియర్ చిన్నారి చిట్టి ప్రేయసీ! మా చంటి రాక్షసీ!
మా హృదయాలని దొంగిలించి న్యూ జెర్సీ పారి పోయిన " ఓ శ్రియమ్మా"!
మా ఇంట చక్కగా నడయాడి, నీ బోసి నవ్వులతో మా మనస్సులను దోచి, మా చేత అన్ని సేవలూ చేయించుకుని, కనిపించిన అందరినీ నగుమోముతో పలకరిస్తూ, వారు నీ వేపు చూస్తే చాలు చెంగుమని గెంతి…..వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి పోయి, వాళ్ళని ఆనంద పరుస్తూ, మాకు కొంత స్వాంతన చేకూరుస్తూ, (మా చేతులు నొప్పులు పుట్టకుండా చూసిన ఉపాయమంతురాలా) ఎంత చక్కగా వ్యవహరించేవు!
చివరికి మా హృదయాలని దొంగిలించి వెళ్ళి పోయేవు. మొన్న ఎవరో నిన్ను ఎత్తుకు పోతున్నట్లు కల వచ్చింది. (తీరా చూస్తే అది మీ అమ్మ నాన్నగారు నిన్ను న్యూజెర్సీ తీసుకెళ్ళి నందుకు వచ్చిన తిప్పలన్న మాట)
మరలా ఇవాళ నువ్వు పాకుతూ వస్తున్నట్లు కల.

" ఓ కలల రాణీ! కనికరించు" మమ్మల్ని మా పనులు చేసుకోనీ.

అన్నట్లు మన వారందరికీ చెప్పేవా? ఏమని అంటే :-
"మా అమ్మమ్మ చింత చిగురు పప్పు, ఆవకాయ అన్నం, చారూ, పెరుగూ, చాలా బాగా చేస్తుంది..( ఎలా తెలుసు అంటారా? నాకు అన్నప్రాసన మర్నాడే పెట్టింది కాబట్టి) అన్నట్లు అయిస్ క్రీం కూడా పెట్టింది తెలుసా?
అవును నిజం, మా అమ్మమ్మ నాకు అవన్నీ పెట్టింది. మా అమ్మకి చెప్పద్దు, నన్ను" ప.. ప్ప… ప్పా" అయితే- గియితే అమ్మమ్మని కూడా. కాబట్టి దయ చేసి చెప్పద్దు.
మా అక్క కూడా నన్ను చిట్టి తల్లీ అనీ, పండూ అనీ, ముద్దు లాడు తోంది. (నాకు అర్ధంకాడంలేదు, మా అక్క కూడా చిట్టి తల్లే కదా !నన్ను ఎందుకు అలా అంటోంది? )
అయినా నాకెందుకు లెండి. నేను బహుసా అందరికీ చాలా……….ముద్దు వస్తున్నాననుక్కుంట. " అని అందరికీ చెప్పేవా? లేదా? లేకపోతే ఇది చదివి తెలుసుకోమను.
అమ్మమ్మ

ఇది చూసి ఇంకా పసి పాప అనుక్కుంటున్నారా? కాదండీ కొంచెం పెద్దదే అయ్యింది మా మల్లె మొగ్గ. ఎన్ని కబుర్లు, ఎంత అల్లరి, ఎంతటి విశ్లేషణ. (మా కళ్ళ ముందు పుట్టిన ఈ చిన్నారి పెద్దదయి పోతోందా! ఓహో అయితే మేమూ పెద్దయి పోతున్నామా కొంపదీసి, ఒప్పుకోను... "ముసలి తనపు అడుగుల సడి వినపడితే, ఇంట లేడనీ చెప్పించూ, ఇపుడు వీలు కాదనీ పంపించు" కదా మన సిధ్ధాంతం, అప్రస్తుత ప్రసంగం! మన గోలెందుకు ఇక్కడ? )

అంతే కాదు మీకు మరో గురుతర బాధ్యత కూడా ఇస్తున్నాను. ఈ రోజు పుట్టిన రోజు మా మల్లె మొగ్గకు ఆశీస్సులు ఇద్దామా?......

బ్రాడ్వే షో

చిరకాల వాంఛ సాకారమైన వేళ

అమ్మమ్మా, తాతగారూ! మా కాలేజ్ కి రండి ప్లీజ్, మనవరాలి కోరిక. మరి కొత్తగా కాలేజీలో చేరిందాయను, మాకు చూపించాలని తహతహ.పైగా మేము ఇండియా బయలుదేరే ప్రయత్నంలో వున్నామని తొందర చేసి బయలుదేరదీయించింది మా అమ్మాయి.

సరే సరస్వతీ ఆలయాన్ని కన్నులారా సేవించి, నలుగురం కలిపి న్యూయార్క్ వెళ్ళాం. పరిగెట్టిస్తున్నారు మా ఇద్దరినీ. ఎందుకో అనుకున్నాం. 1.30 కల్లా బ్రాడ్వే షోకి తీసుకెళ్ళారు.”అల్లాడిన్”. 

ఆ ధియేటర్, లోపల ఎంత అందంగా వుందో చెప్పలేను. షో జరుగుతున్నంత సేపూ కనురెప్ప మూయకుండా, ఆఅద్బుత రసరమ్య కళారూపాన్ని ఆస్వాదించాము. సినిమాలో షాట్ షాట్ తీసి కలుపుతారు. ఇక్కడ మన కళ్ళ ఎదుట అద్భుతమైన సెట్స్ కనురెప్ప పాటులో మాయా, మంత్ర జాలంలా మారి పోతోంది.. కళ్ళల్లో ముద్రించుకు పోయాయి సన్నివేశాలు. మరవలేము, మరువనీదు. జీని పాత్రధారి స్థూల కాయుడు, అయినా అతని డాన్స్, హుషారు చూసి అచ్చెరువొందాల్సిందే. ఏమి షో అండి.జీవింతంలో తప్పక చూసి తీరవలసిన షో.

మన సురభీ నాటకాలు కూడా తక్కువ కాదండీ. కానీ అమెరికాలో ఆదరణ వుంది. మన దగ్గర ఆదరణ ఎలాంటిదో మీకు తెలీనిదేముంది. విత్తం కొద్దీ వైభోగం, పిండి కొలదీ రొట్టె,కలగిన వాడు గుఱ్ఱంఎక్కుతాడు, లేని వాడు గాడిద ఎక్కుతాడు లాండి నానుడులు విన్నారు కదా¡ అంతే అర్ధం చేసుకోండి.

నేను జీవితంలో యూరప్ చూడాలనేది, బ్రాడ్వే షో చూడాలనే కోరికలు తీరిపోయాయి.

ప్రస్తుతం భగవద్గీత అర్ధం, సౌందర్య లహరి వివరణ తెలుసుకోడంలో నిమగ్నమయి వున్నాను. ఓం శ్రీ పరమాత్మనేనమః. ఓం శ్రీ మాత్రేనమః

డైట్ మీద

ఒరే ఒరు కన్ఫ్యూజన్.......
ఒక పక్క తిండి మితంగా మిల్లెట్స్ తినమని ఘోష, మరో పక్క భోజన గ్రూప్ లూ, నోరూరించే కొత్త కొత్త వంటకాలు. ఎవరి మాట వినాలి?

బుఱ్ఱ తిరిగి పోతోంది బాబోయ్ నాయనోయ్.

మన పెద్దలు ఏ సమస్యా లేకుండా హాయిగా తిని అరగించుకున్నారు.

మనం చూస్తూ చూస్తూ తినలేమూ, తింటే అరగించుకోలేము.
ఏం చేద్దాం?

సింద్ బాద్ కధలు

బాల్యం ఒక తీపి గుర్తు.......

సింద్ బాద్ కధలు, అరేబియన్ నైట్స్, తెనాలి రామలింగడు,పరమానందయ్య శిష్యుల కధలు,అక్బర్ బీర్బల్ కధలు, చందమామ, బాలమిత్ర కధలు, బాలానంద కార్యక్రమాలు నాకు ఎనలేని ఆనందాన్ని ఇచ్చాయి. మీకు కూడానా.
ఎంత మంది వీటిని తలచుకుని ఆనందించ గలరు?

27, అక్టోబర్ 2019, ఆదివారం

దీపావళి

నరక చతుర్దశి, దీపావళి

అబ్బా అప్పుడే నిద్ర లేవాలా అనుక్కుని బిగుసుకు పడుక్కున్నా అమ్మలు వూరుకుంటారా? చెవులో రొద పెట్టి ఛం....రూ? చిన్న పిల్లలని కనికరం వుండదు.

లేవగానే బ్రష్ చేయనిచ్చి, పాలు తాగడానికి ఇచ్చి, ఒంటి నిండా నూనె పట్టించి, నలుగు పెట్టి, కుంకుడుకాయ పులుసు వేసి తలంట్లు. నలుగురం కళ్ళల్లో పడిందని గీవురు బావుర్లు.అప్పుడు తినడానికి రస్కులు.

అది అవ్వగానే నాన్నగారు తలకు చిక్కుతీసి, రిబ్బన్లతో జడలు. కాళ్ళ మీద చిన్న టవల్ కప్పి కేపులు కొట్టించడం. వాటి రవ్వలు పడ్డాయని కేపులు చిన్న  గూటాంతో  కొట్టనని మారాం.

తరువాత కల్పకం గాయత్రీ ఇంటికి పరుగు. 12.30 అయినా అక్కడే వేళ్ళాడిపోతూ ఊడిరాడం లేదని మా అమ్మ వెరైటీగా మా చెల్లికో కుంకంభరిణ ఇచ్చి "వంటలయ్యాయి మళ్ళు కట్టుకోండని" పిలిపించడం. అందరూ ఇప్పటికీ తలచుకునేలా చేసిన ఆ చర్య తలచుకుంటే పెదవిపై చిరునవ్వు.

సాయంత్రం కొద్దిగా టపాకాయలు కాల్చుకుని రేపటికి దాచుకోడం. కాటన్ బట్టలు కట్టుకోవాలండీ బాబూ, నైలెక్స్ చీర కట్టుకున్న మా పై ఆవిడ చీర అంటుకోడం. అరే! ఎన్ని గుర్తులు.

ఇక మర్నాడు పులిహోర, గారెలు, పరవాన్నం. తెగ మెక్కినా ఇప్పటిలా మధ్యహ్నం కునుకు లేదు. గెంతులే గెంతులు.

సాయంత్రం ఎప్పుడబ్బా ఇంకా? అని ఎదురు చూసి,దివిటీ కొట్టి ( బొప్పాయి కఱ్ఱకు ఆవదంలో ముంచిన గుడ్డలు) కాళ్ళూ చేతులూ కడుక్కుని,తీపి తిని ఇంక నేనూ మా చెల్లీ కాకరపువ్వొత్తులూ, మతాబులూ, చిచ్చుబుడ్లూ లాంటివీ, మా తమ్ముళ్ళు చిన్న సీమటపాకాయలూ కాల్చుకుని, టపాకాయలతో పాటూ మధ్య మధ్యలో అమ్మా వాళ్ళు ఇచ్చే మొట్టికాయలు, చీవాట్లూ తింటూ, టపాకాయల పర్వం ముగించుకుని భోజనాలూ, నిద్రలూ.

ఇదండీ చిన్నప్పటి మా దీపావళి విశేషాలు.