29, అక్టోబర్ 2019, మంగళవారం

బ్రాడ్వే షో

చిరకాల వాంఛ సాకారమైన వేళ

అమ్మమ్మా, తాతగారూ! మా కాలేజ్ కి రండి ప్లీజ్, మనవరాలి కోరిక. మరి కొత్తగా కాలేజీలో చేరిందాయను, మాకు చూపించాలని తహతహ.పైగా మేము ఇండియా బయలుదేరే ప్రయత్నంలో వున్నామని తొందర చేసి బయలుదేరదీయించింది మా అమ్మాయి.

సరే సరస్వతీ ఆలయాన్ని కన్నులారా సేవించి, నలుగురం కలిపి న్యూయార్క్ వెళ్ళాం. పరిగెట్టిస్తున్నారు మా ఇద్దరినీ. ఎందుకో అనుకున్నాం. 1.30 కల్లా బ్రాడ్వే షోకి తీసుకెళ్ళారు.”అల్లాడిన్”. 

ఆ ధియేటర్, లోపల ఎంత అందంగా వుందో చెప్పలేను. షో జరుగుతున్నంత సేపూ కనురెప్ప మూయకుండా, ఆఅద్బుత రసరమ్య కళారూపాన్ని ఆస్వాదించాము. సినిమాలో షాట్ షాట్ తీసి కలుపుతారు. ఇక్కడ మన కళ్ళ ఎదుట అద్భుతమైన సెట్స్ కనురెప్ప పాటులో మాయా, మంత్ర జాలంలా మారి పోతోంది.. కళ్ళల్లో ముద్రించుకు పోయాయి సన్నివేశాలు. మరవలేము, మరువనీదు. జీని పాత్రధారి స్థూల కాయుడు, అయినా అతని డాన్స్, హుషారు చూసి అచ్చెరువొందాల్సిందే. ఏమి షో అండి.జీవింతంలో తప్పక చూసి తీరవలసిన షో.

మన సురభీ నాటకాలు కూడా తక్కువ కాదండీ. కానీ అమెరికాలో ఆదరణ వుంది. మన దగ్గర ఆదరణ ఎలాంటిదో మీకు తెలీనిదేముంది. విత్తం కొద్దీ వైభోగం, పిండి కొలదీ రొట్టె,కలగిన వాడు గుఱ్ఱంఎక్కుతాడు, లేని వాడు గాడిద ఎక్కుతాడు లాండి నానుడులు విన్నారు కదా¡ అంతే అర్ధం చేసుకోండి.

నేను జీవితంలో యూరప్ చూడాలనేది, బ్రాడ్వే షో చూడాలనే కోరికలు తీరిపోయాయి.

ప్రస్తుతం భగవద్గీత అర్ధం, సౌందర్య లహరి వివరణ తెలుసుకోడంలో నిమగ్నమయి వున్నాను. ఓం శ్రీ పరమాత్మనేనమః. ఓం శ్రీ మాత్రేనమః

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి