13, సెప్టెంబర్ 2019, శుక్రవారం

స్మృతి సమీరం

స్మృతి సమీరం

"ఓ మునీ !మీ దంపతుల కు ముద్దుగా పుట్టిన తనయులం -కారణ జన్ములం - ఇద్దర్నీ కలిసి ఎత్తుకోనే శక్తి - నీకు ఇదే ఇస్తున్నాము - ప్రతిఫలం గా ఎవ్వరూ సంపాదించ లేనంత పుణ్యం - ఇదుగో." అని వీరి తనయులు దీవించారు.

తనయులు తల్లితండ్రులను దీవించడమేమిటని? విడ్డూర పడకండి. అవును! వారిరువురూ పసికూనలైన మునిపుంగవులు. వారిని గడ్డాలు మీసాలూ వచ్చినా అడ్డాలలోని పిల్లల్లా సాకారు, ముద్దుగా వారి ఇష్టాఇష్టాలని ఊహించుకుని వాటిని అమరుస్తూ, వారిని ఒక్క క్షణం కూడా ఏమరుపాటున వదలక,వెన్నంటి చూసుకున్న ఆ తల్లితండ్రులు పరమ పూజ్యులు. వారిలో పెద్ద మౌని భగవంతుని 9సంవత్సరాల క్రితం చేరుకుని జన్మ రాహిత్యం పొందాడు. చిన్న వాడు తపస్సులోనే వున్నాడు.

పిల్లల దీవెనల ఫలితంగా ఆ భార్యాభర్తలిరువురూ స్వార్ధ రహితులుగా మారిపోయినారు. ప్రపంచం అంతా వారికి పిల్లలే. నా మటుకు నేను, వారిని నాకూ, నా భర్తకూ, నా తల్లితండ్రులకూ, నా పిల్లలకు కూడా తల్లి తండ్రులుగా భావిస్తాను. అది నిజం కూడా. వారికి తెలిసిన యావన్మందీ ఉమా,మూర్తి దంపతుల గూర్చి ముక్తకంఠంతో ఇలాగే చెప్పితీరుతారు.

వారికి పరిచయస్తు లెవరైనా వారినుండీ కించిత్తైనా ప్రయోజనం పొందకుండా లేరు. (ఈ విషయం బయటకు అన్నా అనలేక పోయినా.)

మేమెవరమైనా వారి కుటుంబానికి ఏదైనా ఆత్మీయంగా వెన్నంటి వున్నామంటే కారణం, మేము కృతజ్ఞులం అనీ, కృతఘ్నులం కాదనీ, ఇంకా మానవత్వం మాలో మిగులున్నదని అర్ధం. ఇది మా గొప్పతనం కాదు. వారిరువురూ సంపాయించుకున్నది డబ్బూ కీర్తి ప్రతిష్టలు కానే కాదు, సర్వ జనాభిమాన ధనం. అనితర సాధ్యమైన ఈ ధనం వారు అప్పనంగా సంపాయించ లేదు, వారు నిస్వార్ధంగా పంచిన అభిమానమే ఈనాడు వారు సంపాయించిన ఈ అభిమానధనం. ఉమా మూర్తీ మీరిరువురూ అన్ని విధాలా ధన్యజీవులు.

ఆ మూర్తిని ఇక చూడలేక పోయినా, అందరి హృదయాలనూ జయించిన అజేయుడు. అతి సామాన్యుడుగా పుట్టి, అసమాన్యుడిగా ఎదిగి, మాన్యుడిగా మారిన స్వయంసిద్ధుడు.కడలిలా కష్టాలను కడుపులో దాచుకుని సముద్ర గాంభీర్యం హృదయంలో నింపుకొని,ఎల్లప్పుడూ చిరు మందహాసం తో అందరిని పలకరిస్తూ, ఎంతో శ్రమ కోర్చి పట్టుదలతో కంపెనీ సెక్రెటరీ, కాస్ట్ అకౌంటన్సీ పరీక్షలను అవలీలగా పాసై, జ్యోతిష్య శాస్త్రం లో అద్భుత ప్రతిభ కనబరిచే శ్రీ మూర్తిగారు సర్వదా అభినందనీయులు. వారు ఈ లోకం విడచి తిరిగిరాని లోకాలకు వెళ్ళి నిన్నటికి మూడు సంవత్సరాలు.

ఆ ఇద్దరి అన్యోన్యతా చెప్పనలవి కానిది. అన్యోన్యంగా భార్యాభర్తలు మంచి ఆలోచనా చెయ్యవచ్చు, అప్పుడప్పుడు ఇరువురూ కూడి చెడు ఆలోచనలు కూడా అమలు చెయ్సవచ్చు. కానీ ఈ భార్యాభర్తా కలసికట్టుగా ఇతరుల మంచే ఆలోచించారు, ఇతరులకు మంచే చేసారు.

మూర్తిగారు పరమపదించే ముందు రోజు " ఉమాదేవి చాలా మంచిది, నాకు మరు జన్మలో కూడా తనే భార్యగా రావాలని" చెప్పారట. అంత కన్నా ఒక స్త్రీకి కావల్సిన/రావల్సిన కితాబు ఏముంటుంది భర్త నుండీ?

పిల్లలు ఇరువురూ దీవెనల ఫలితంగా, మూర్తిగారు క్రితం 3 సంవత్సరాల క్రితం ఇదే రోజు,ఉమాదేవి చెయ్యి గట్టిగా పట్టుకుని వుండగానే క్షణంలో భగవంతుని సాన్నిత్యాన్ని చేరేరు.

గొప్పచెప్పుకోడం కాదు........ గొప్పగా చెపుతున్నాను వీరు మా చెల్లెలు ఓరుగంటి ఉమాదేవి, మరిది ఓరుగంటి వేంకట నరశింహ మూర్తి గారు. పవిత్రమైన జీవితం గడిపిన మూర్తిగారికి, ఉమా దేవులకు సద్గతులు ప్రాప్తించు గాక!

మా  చెల్లి  నేనూ  ఇప్పుడు  ఎంతో  మంచి  దోస్తులము,   కానీ   చిన్నప్పుడు  ప్రియమైన శత్రువులం.. 

 నా ప్రాణ స్నేహితురాలు, నా భర్తకూ, నా పిల్లలకూ, నాకూ తల్లి అయిన ఉమ, నిన్న మమ్మల్ని విడిచి వాళ్ళాయనిని వెదుక్కుంటూ వెళ్ళి పోయింది.

నా 64 సంవత్సరాల వయస్సులో జరిగిన ప్రతీ సెకండూ తెలిసిన నా ప్రాణమా, నా అంతరంగమా  ఏదీ? నిన్ను ఎక్కడని వెదకను.

సునాయస మరణం కోరుకున్న నీ మొర ఆలకించాడు దేముడు. భగవంతుడు నీకు జీవితంలో ఆనందం ఇవ్వక పోయినా,   నువ్వు ఇతరుల జీవితాల్లో ఆనందం  కల్గించి, అది చూసి ఆనందించే గొప్ప హృదయం ఇచ్చాడు. నీకు సంపూర్ణ సహకారాన్నిచ్చే భర్తనిచ్చాడు.

ఒద్దు ఉమా ఒద్దు, నీకు మరు జన్మ ఒద్దు. నీకు పుణ్య ఫలంగా " జన్మ రాహిత్యాన్ని" ప్రసాదించమ ని ఆ దేవ దేవుణ్ణి కోరుకుంటుంన్నా!

ఉమా!  చిన్నప్పుడు  చాలా  సార్లు  నీకు  నా మీద కోపం  వచ్చింది,  సారీనే.

నిన్ననే గుర్తు చేసేవు కదా " ఏ జయా, ఓ ఉమా" మనిద్దరం అని.😃😃😃

వుంటా మరి....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి