9, జనవరి 2019, బుధవారం

మా స్నేహపు షష్టి పూర్తి

మా స్నేహపు షష్టి పూర్తి..............

(.అవును నిజం!  మేము  ఐదు  ఏళ్ల  వయస్సులో  మా ఫ్రెండ్స్  కల్పకం,  గాయత్రీ  తో  కలసి  హైదరాబాద్  నుండి  విజయవాడ  పెళ్ళికి  వెళ్తూ  ఉండగా  ఒక  ఇల్లు  చూసాం....... ఇది  చదివి  మీరు  కూడా  చూసారా  చెప్పండి......
  మంచి  అడవిలో  ఉండగా  రైల్  ఆగిపోయింది.  అంతా నిశబ్దం .  నేను  మా చెల్లి, మా స్నేహితులు బండి కల్పకం, బండి గాయత్రి కలసి   దూరంగా  మిణుకు  మిణుకు  కనిపిస్తోంది  ఏమిటా అని  నెమ్మదిగా  నడుచుకుంటూ   వెళ్లాం.   వెళ్లి చూద్దుం  కదా  అక్కడ  అంత  తెల్లగా  పండు  వెన్నెల.  ఆ  వెన్నెలలో  ఒక  ఇల్లు.   ఆ ఇల్లు  చూస్తే  నూరూరిపోతుంది  ఎవరికైనా....  ఏమిటో  తెలుసా? 
   ఆ ఇంటి   గోడలన్నీ  పాలకోవా.  తలుపులన్నీ  కాడ్బరీ  చాక్లెట్లు .  రూఫ్  జున్ను,  కిటికీల  గ్రిల్ల్స్ అన్నీ  జిలేబీలు,  అన్నట్లు  నేల  కాజూ  బర్ఫీ,  వాటర్  పైప్స్  ఏమో  జంతికలు/మురుకులు,  డైనింగ్  టేబుల్  ఏమో  నేను  చేసేలాంటి  (గట్టి) మైసూర్పాక్ ,,  దాని  మీద  ఐస్  క్రీం,  రక  రకాల పళ్ళూ,  జీడి పప్పు  అన్నీ  పెద్ద  పెద్ద  గిన్నెల్లో  పెట్టి  ఉన్నాయి.  ఒక  వాటర్  పైప్ (జంతిక)  తిప్పితే  చెరుకు  రసం,  ఒక  దాన్లోంచి  మాజా,  ఇంకో  దాన్లో  స్ప్రైట్.   వెంటనే  నేను  ఒక  నిచ్చెన  వేసుకుని రూఫ్ కి కొంచెం  చిల్లు  పెట్టి  రూఫ్  తినేసి,  జంతిక  చివర  ఉన్న  చాక్లెట్  నల్లా   తిప్పి  మాజా  తాగేను.  అలాగే  మా స్నేహితులు,  మా చెల్లీ  కూడా.  ఇంతలో  రైల్  కూత  విని  పరుగెట్టుకుంటూ  ఆయాస  పడుతూ  రైల్  ఎక్కి  పైబెర్త్  ఎక్కేశాం.........
  బాగుందా కధ!.   ఇదంతా  పై బెర్త్  మహిమ.  మా  పిల్లలకి  ఒక  లోకాన్నిచ్చింది, . అలాగే   మాకు  ఒక  ఊహా జనిత  ప్రపంచాన్నిచ్చింది.  మాలో  సృజనాత్మకతకు తెర  తీసింది.
 మరి  ఇప్పుడు?  పైబెర్త్  వస్తే  ప్రయాణం  కాన్సిల్,  అదీ  పరిస్థితి.  పెద్ద  వాళ్ళమైపోయి  బాల్యాన్ని  ఎంత/ ఎలా  కోల్పోయాం?  ప్చ్  ప్చ్  ప్చ్.............  ....)

ఇది ఇంతక ముందు చదివిందే కదా అని మీరు మనస్సులో ఏమనుక్కుంటున్నారో నాకు తెలుసుగా!

అసలు విషయం ఏమి చెప్పాలనుకున్నానబ్బా 🤔🤔🤔🤔🤔🤔

హమ్మయ్యా! గుర్తు వచ్చింది. ఇందులో హీరోయిన్స్ నలుగురు. జమా ఉయా, బాకా బాజా గూర్చి.......

మలినం లేని మా స్నేహానికి షష్టి పూర్తి ఈ రోజు.

మేము చాలా దగ్గర బంధువులం,కానీ మాకు ఏనాడూ ఆ విషయం తెలీదు, లెఖ్ఖ పెట్ట లేదు. ఏనాడూముందు గానీ వెనుక కానీ ఒకరిని ఒకరం విమర్శించు కోలేదు, మా ముందు ఎవరైనా మమ్మల్ని కానీ మా తత్సంబంధీకులను గానీ విమర్శించు కుంటున్నా, మాకు అవేమీ పట్టవు. మేము నల్గురం మటుకూ బంధుత్వాన్ని, అవతల పెట్టి నిర్మాలిన్యమైన, నిష్కల్మషమైన, నిష్కపటమైన, నిరుపమానమైన స్నేహాన్ని ఆవిష్కరించుకున్నాం.

ఎప్పుడు కలసినా బాల్యానికి పయనమవుతాము.
 పరేక్షలైనా సరే నేనూ మా కల్పకం నోట్ బుక్ లో పెట్టుకుని నవలలు, ముఖ్యంగా డిటెక్టివ్ నవలలు చదివే వాళ్ళం. వయస్సు 8/9. మద్రాస్ పెళ్ళయ్యాక వెళ్ళినా , డిటెక్టివ్ నవల పరిజ్ఞానం వల్ల గిండీ, పూనమల్లీ హైవే, రేస్కోర్స్ రోడ్ , కాత్య, రాజు,, యుగంధర్ వీళ్లందరూ పరిచయ మయ్యారు.

      ఇక బలిపీట్టం, శంకుతీర్ధం మొదలైన నవలలు ధారా వాహికంగా వస్తున్నప్పుడే క్యాచ్ పట్టి చదివేసాం (చిన్న వయస్సులోనే)..

నిజం చిన్నప్పుడు ఎంత, ఎంతెంత చదివే వాళ్ళం (క్లాసు బుక్స్ కాకుండా కాదు, క్లాసులో ఫస్ట్ లేక సెకండ్ వచ్చేదాన్నండోయ్ అపార్ధ చేసుకోకండి. పదవ క్లాసు ఊరంతటికీ ఫస్ట్, స్కూల్ లోనే కాదు)

       చిక్కడపల్లిలో చందనా ప్లేస్లో సిటీ సెంట్రల్ లైబ్రరీ ఉండేది. వేసవి సెలవలోస్తే చాలు పొద్దున్నే చద్దేన్నం (తరవాణీ అన్నం) తిని వెళ్లి మధ్యానం భోజనానికి ఇంటికి రావడం.
వింత లోకంలో విమల, బొమ్మల కొలువులో బొమ్మలు ఒకదానితో ఒకటి మాట్లాడుకోడం......చందమామ, బాలమిత్ర........ ఎన్నెన్నో! మళ్ళీ చిన్నగా అయిపోడం ఎలా? ఉండండి మళ్ళీ “వింతలోకంలో విమల” చదివితే చిన్నగా అయ్యే ఉపాయం తెలుస్తుంది.

గాయత్రిలో అమ్మ భావం మెండు. అంత చిన్న వయస్సులోనే ఏంతెస్తే అది నాకు సగం ఇచ్చేస్తంది, నేను గబగబాతినేసి గాయత్రీ నాకు కొంచెం ఇవ్వానే ప్లీజ్ అంటూ ఇంకా సగం తీసు కోడం. అంటే నేను 80% తను 20%. ఏమనుక్కునేది కాదు, ఏమనేదికూడా కాదు. అన్నట్లు కాకి ఎంగిలి కూడా. అన్నట్లు ఈ ఆటపేరు “మూగనోము”. పిచ్చి మొహాలం. నిజానికి నేను గాయత్రీ ఒకే క్లాసు. ఒకసారి section మార్చేరని నా హృదయం ఎంత ఏడ్చిందో చెప్పలేను.

ఇక మా చెల్లి మీద చాలానే దాష్టీకం చేసేను, అన్నీ చెయ్యనిచ్చి ఒకే ఒక పెట్టుపెట్టేది. ఉయా సారీనే. ఇప్పుడు అప్పుడూ కూడా ఉయ నా ప్రాణం.

అలా మా స్నేహానికి షష్టి పూర్తి నేడు. మీఅందరూ శతమానం భవతి అని దీవించండి....

మా ఫోటోస్ జత పరిచాను......





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి