8, జూన్ 2019, శనివారం

మా పెళ్ళి

1971 లో జరిగిన మా పెళ్ళి ఇంటిముందు తాటాకుల పందిరి వేసి, ఉప్మా, లడ్డూ, బూందీ,చక్కటి పప్పు, నెయ్యీ, కూరలూ పులుసూ, మజ్జిగ, ఒడియాలూ, అప్పడాలూ, లాంటి వాటితో 2 1/2 రోజుల జరిగింది.మంచి సుస్వరమైన సన్నాయి, పెళ్ళికి ముందూ వెనుకా కూడా కోటిపల్లి ప్రకాశరావు గారు, నూకల వారూ మొదలైన ఉద్దండులచే కచేరీలు, భావనా కళా సమితి వారితో సినిమా పాటల ప్రోగ్రాం ( అందులో మాధవపెద్ది సురేష్, రమేష్, చంద్రకాంతా మొదలైన లబ్ధ ప్రతిష్టులు పాల్గొన్నారు). అప్పట్లో చాలా తృప్తిగా ఆనందంగా జరిగింది మా పెళ్ళి.

వివాహం కన్నా ఆ తర్వాత గడిపే జీవితమే ముఖ్యమైనది. ఇద్దరూ కలసి మెలసి బాధ్యతలు పంచుకుని, సుఖాలనూ పంచుకుని జీవించాలి. అలకలు కూడా వారిద్దరి మధ్యా సఖ్యతను పెంచుతాయి. కానీ ఆలు మగల మధ్య పొరపొచ్చాలు అద్దం మీద ఆవగింజలా అరక్షణం వుండాలి కానీ పంతాలుగా మారి జీవితాలని పాడుచేసుకోకూడదు. ఇప్పటి పెళ్ళిళ్ళతో చూస్తే మా పెళ్ళి కి ఖర్చు అతి తక్కకవ, ఆడంబరం అసలు లేదు, కానీ అంతు లేని ఆనందం పెళ్ళి జరుగుతున్నప్పుడూ, పెళ్ళి జరిగాక ఈనాటి వరకూ.

అప్పట్లో అందరి పెళ్ళిళ్ళూ అదే స్ధాయిలో జరిగేవి, తరువాత కూడా కొన్ని దశాబ్దాల వరకూ అదే విధంగా కొనసాగింది.

ఇప్పుడు ఎన్ని లక్షలు ఖర్చండీ పెళ్ళంటే? తల్లితండ్రులు కూడా వారి స్థితి గతులు తెలియజేసుకోడానికీ, ఈ పోటీ ప్రపంచంలో నిలవడానికీ వారు సంపాయించింది అంతా ఖర్చు పెడుతున్నారు. పోనీ ఇది కూడా సరే, కొన్ని నెలలు తిరక్కుండానే విడాకులు. తల్లితండ్రులకు ఎంత ఖర్చు, ఎంత శ్రమ, ఎంతటి మన స్థాపం?

వీలయినంతవరకూ సర్దుకోడానికి ప్రయత్నించాలి. మరీ అలవికాని పరిస్థితి అయితే తప్పదు.

ఒక పక్కకొత్త పెళ్ళి కొడుకులూ/ కూతుళ్ళ క్యూ, ప్రక్కనే విడాకుల వారి క్యూ!

ఈ వ్యవస్థ మారి, పెళ్ళి ఖర్చులు, పెట్టుబళ్శూ తగ్గించి, పెళ్ళి తాలూకు అంతరార్ధం అర్ధం చేసుకుని,ఆనందంగా జీవించాలి కొత్త దంపతులందరూ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి