మా ఇంటి ఆణిముత్యాలు 2:-
నా తండ్రి గారు - శ్రీ పప్పు సోమేశ్వర రావు గారు...
ఆజాను బాహువు, బహుభాషా కోవిదులు, క్రమశిక్షణ, కార్యదీక్ష, నిజాయతీ, దృఢనిర్ణయం వెరసి "పప్పు సోమేశ్వర రావు గారు".
శ్రీ పప్పు సోమేశ్వర రావు గారు విజయనగరం జిల్లా లోని, "లోగీశ" అగ్రహారంలో 1934 లో సంస్కృత పండితులు శ్రీ చంద్రశేఖర్ శాస్త్రి గారు, పేరమ్మ దంపతులకు జన్మించారు.
విజయనగరంలో విద్యాభ్యాసం, BA Bed, వీణా వాద్యం తన బావగారైన "వైణిక రత్న" శ్రీ అయ్యగారి సోమేశ్వర రావు గారి వద్ద నేర్చుకున్నారు.
పేరుకు ఇద్దరూ సోమేశ్వర రావులే. ఇద్దరూ బావ మరుదులూ/ గురు శిష్యులూ/వియ్యంకులూ.
వీరిద్దరివీ ఇంటర్ లింక్ డ్ కుటుంబాలు.
మా మామగారు , తన పెళ్ళి అయినప్పటినుండీ,10 సంవత్సరాల భార్యకు వీణ నేర్పేవారట. అప్పుడు బాల్య వివాహాలు కదా! నిజానికి మా అత్తగారు 7 , మా మామగారు 17 సంవత్సరాల వయస్సులో వారి వివాహం జరిగిందట.
ఒక రోజు మిత్రులు వాసా వారూ, అయ్యగారి వారూ, ఇద్దరూ ఇంటికి వచ్చే సరికి మంచం కింద నుండీ బిలహరి స్వరపల్లవి వీణపై వినిపిస్తోందట. ఎవరా అని చూస్తే 7 సంవత్సరాల వయస్సు బాలుడు. అది చూసినప్పటి నుండీ అయ్యగారి వారు తన భార్యకూ, బావమరిదికీ అప్రతిహతంగా విద్య కొనసాగించేరు.
మా అత్తగారు జయకుమారి, తను నేర్చుకొన్న విద్య తన పిల్లలందరికీ మొదటి దశ చెప్పి మా మామగారుకి అందించే వారు. ఆ విధంగా తన విద్యకు సార్ధకత చేకూర్చుకున్నారు.
మా నాన్నగారు అద్భుతమైన విద్వాంసులుగా రూపొంది, గురువుగారికి గర్వ కారణమై నిలిచారు.
మా నాన్నగారు లౌక్యం తెలీని అమాయకులు. విద్య తప్పితే మరో దృష్టి లేదు. తన 14 వ ఏట బాపట్లలో వున్న మా మామగారితో కలసి విజయవాడ రేడియోకి వస్తే అక్కడ సంధ్యావందనం శ్రీనివాస రావుగారు మా నాన్నగారి వీణ విని ఆడిషన్ లేకుండా రేడియో ప్రోగ్రాం ఇచ్చేసారట.తన 14 వఏట నుండీ 21 ఏళ్ళ వరకూ Radio cheque minority తీరని కారణంగా విజయనగరంలో వున్న వారి నాన్నగారికి వెళ్ళి పోయేదట.
చాలా రోజులు up gradation వుంటుందని తెలియక రేడియో వారు ఇస్తున్నారని b class లో నుండే అనేక రాగం తానం పల్లవి ప్రోగ్రాం లు వాయించారట. తరవాత ఒక duty officer సలహాపై up gradation apply చేసి,A గ్రేడ్ తెచ్చుకొని సంగీత సమ్మేళనం.అఖిల భారత సంగీత కార్యక్రమాలు రేడియో లోనూ దూరదర్శన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు ప్రదర్శించి చాలా చాలా ముందుకు వెళ్ళారు. సంస్కృత ఆంధ్రాలలో అనేక సంగీత రచనలు రచించేరు.
నాన్నగారికి తన 19వ ఏట అత్తగారి శిష్యురాలు .పేరి భానుమతి తో వివాహం జరిగింది.
హైదరాబాదు కు 1955 లో వచ్చి,ముందులో BA Bed teacher గా పని చేసి, అనంతరం జంట నగరాల గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజీలలో వీణా లెక్చరర్ గా పని చేసి పదవీ విరమణ చేసేరు.
హైదరాబాద్ లో సంగీత సేవ చేసిన పాతతరం విద్వాంసులలో ఒకరు. అనేక మంది శిష్యులను తయారు చేసేరు. వారిలో ప్రప్రధమంగా చెప్పుకోవల్సింది మా జ్యేష్ఠ సోదరుడు "వైణిక సార్వభౌమ" చిరంజీవి పప్పు చంద్రశేఖర్ ను. చాలా మంది శిష్యులు రేడియోలలో దూరదర్శన్ లోనూ కళాకారులుగా వున్నారు. నేను వర్ణాల వరకూ వారి వద్ద శిక్షణ పొంది, వివాహానంతరం మా వారి వద్ద నేర్చుకోడం జరిగింది.
సంస్కృత, జ్యోతీష్య శాస్త్రా పండితులవ్వడం వల్ల మంచి సాహితీ సౌరభాలను వెదజల్లే సంగీత రచనలను చేసేరు. నవగ్రహాలనూ జ్యోతీష్య పరంగా అన్వయిస్తూ నవగ్రహ ఆరాధన, సర్వ దేవతా స్తుతి మొదలగు 30 కృతులు పుస్తక రూపం దాల్చాయి. మా వారు పూనుకొని వీటిని గాత్ర ధర్మానికి అనువుగా చిన్న మార్పులూ చేర్పులూ చేసి, మంచి విద్వాంసులతో పాడించి, అవన్నీ సిడి రూపంలో భద్ర పరిచారు.
మా నాన్నగారు తను స్వయాన పండితులే కాక, అల్లుడూ, కొడుకూ ఉద్దండ పండితులు. కూతుర్లు ఇద్దరూ, రెండవ కోడలు, అంతే కాక మనవలూ అందరూ విద్వాంసులే. ఒకరకంగా అయ్యగారి, పప్పూ అని రెండు ప్రత్యేకమైన కుటుంబాలుగా కన్పించినా, అందరూ ఒకే కుటుంబంగా పరిగణించాలి.
శ్రీ పప్పు సోమేశ్వర రావు గారికి అనేక సన్మానాలూ సత్కారాలు జరిగేయి. "వైణిక చక్రవర్తి", వైణిక శిరోమణి" ఇత్యాది బిరుదులు వరించాయి.హైదరాబాద్ లోని త్యాగరాజ గాన సభ వ్యవస్థాపక కార్యవర్గం లో ఒకరు.
వారు 2002 లో పరమపదించారు.