18, మే 2015, సోమవారం

జీవన యానం..........

జీవన  యానం............

                      వంట.......రాదు.,  పని..రాదు.

       చిన్న పిల్ల  పాపం పదహారు  సంవత్సరాలే  కదా!  అనుక్కుందుకు  లేదు.  ఆ  వయస్సుకు  చక్కగా  పని చేసేవారుంటారు.  మనకి  పని,  వంట  ఇష్టం లేదు,  అస్సలు  రాదు.  ఎంగిళ్ళు ఎత్తమంటే  ఒళ్ళు  మంట.  ఇదీ  పెళ్ళికి  నా  పరిస్థితి.

               సరే!   పెళ్లి  అవ్వగానే  హైదరాబాద్  కాపురం..........కొత్త  ఇంట్లోకి తూర్పు  లోంచి  దేముడిని  పట్టుకుని  ఎంటర్  అవ్వమని  పెద్దల  సూచన.  మరి  మనకి  తూర్పు  పడమరలు  తెలిస్తేగా,  వెంట  పెద్దలుంటేగా?  హడావిడిగా  దేముడిని  పట్టుకుని  పడమర  ఫేసింగ్ ఉన్న  మెయిన్  డోర్ లోంచి  ఇంట్లోకి  ఎంటర్ అయ్యా....... 

          అయ్యా  బాబోయ్ ! నస నస నస.  ఎవరు?  ఇంకెవరు?  మా  శ్రీవారు...... పోనీ  తూచ్!  మళ్ళీ  ఇంట్లోంచి  బయటకు  వెళ్లి  పోయి  తూర్పు  లోంచి  వస్తానంటే  కుదరదుట. అంత  వరకు  బావగా  కబుర్లు  చెబుతూ,  ప్రేమిస్తూ,  సినిమాలు  చూపిస్తుండే  శ్యామసుందరం  బావ  ఏమిటి  మొగుడయ్యేసరికి  ఇలా  నస? 

           ఇంతలో  వంట  స్టార్ట్.........పాపం  తనకు  కూడా  వండడం  రాదు...అయినా  నాకు  సూచనలిచ్చే  పేరుతో  మెయిన్  వంట  పనులు  తను  చేస్తూ  నన్ను  బీరకాయ  కొత్తిమీర  కారం  చేస్తానని,  బీరకాయలు  తరగమన్నారు. అంటే  అసిస్టంట్  పనులన్నమాట.  నేను ముద్ద పప్పూ, ఆలుగడ్డ  వేపుడూ,  కంది పొడి,  మజ్జిగా  అన్నం  తప్ప  తినను. ముఖ్యంగా మజ్జిగ  నా జీవన  ఆధారం. ఈ పరిస్థితిలో  బీరకాయ  ఎవరైనా  వేపుడు  చేస్తారు  కానీ, కొత్తిమీర, ఖారం  చేస్తారా?  కొత్తిమీర  ఖారంట  కొత్తిమీర  ఖారం అని మనస్సులో  గునుపు.  (వంటలన్నీ   తెలిసి  చచ్చినట్లు,  తినడం  రాని  వాళ్లకి  వివరాలేం  తెలుస్తాయి)

             సరే  ఇక   తప్పదు  కదా  తరగడం  మొదలెట్టాను... దానికి  తొక్క   తీయడం  రాక  పెద్ద  పెద్ద పెచ్చులు  పీకి,  బీరకాయ  పెన్సిల్స్  రెడీ.  అవి  కొంచెం  పొడుగ్గా  బెత్తాల్లా  ఉండి  ఉంటే  రెండు  తగిలించాలని పించేది  బహుసా.  కాకపోతే  మరీ  కొత్త పెళ్ళాం, కొత్త  కాపురం  బెదిరి  పోతానని   ఊరుకుని  ఉంటారు. అన్నట్లు  బాగ్రౌండ్  మ్యూజిక్ లాగా  నస, నస, నస.

       ఇంతటితో  సరి పోయిందా? ఇప్పుడు  పచ్చిమిరపకాయలూ, కొత్తిమీర ఉప్పు  కలిపి  దంచాలి.  లక్కీగా  అక్కడ  ఒక  బుజ్జి  రోలు  నేలలో  తాపడం  చేసి  ఉంది , పక్కనే  ఒక చిన్న  రోకలి  కూడా ఉంది.  దానిని  కడిగి,  దానిలో ఈ పదార్ధాలు  వేసి  దంచడం  మొదలెట్టా. కడిగాక  నీళ్ళు అన్నీ  గుడ్డ పెట్టి  తుడవాలనే ఇంగితజ్ఞానం  లేక పోడం  వల్ల దానిలోంచి  పచ్చిమిరపకాయలు  ఎగిరి  కంట్లో  పడ్డాయి,  అయ్యో  కళ్ళు మంట  అని  ఏడ్చుకుంటూ.....దంచుతూ  పచ్చిమిరపకాయను కదుపుతున్న  ఆ కుడి  చెయ్యితో  కన్నీళ్లు  తుడుచుకునే  ప్రయత్నం  చేశా................అమ్మో   నాయనో.......బాబోయ్.....మంట.....మంట....మంట..  పరాకాష్ట లో  ఉంది  మంట.  ఆ టైములో  మరి  మన  బాగ్రౌండ్  మ్యూజిక్  మాటేమిటి?  ఉండొద్దూ?  ఖంగారు  పడకండి. నిక్షేపంగా  ఉంది.  నస, నస, నస. 
  
          మరి  చేసినది  తప్పేను,  రాంగ్  ఫేసింగ్  లోంచి ఎంటర్  అయ్యాను  కదా..  కానీ  ఏమయ్యింది  సుఖంగా,  శుభ్రంగా  ఉన్నాం.....కుడి  ఎడమైతే  పొరబాటు  లేదోయ్!  ఓడి పోలేదోయ్!

         ఆప్పుడర్ధమయ్యింది   పెళ్ళంటే  ఊసులు,  గుసగుసలూ,  కోపాలూ,  తాపాలూ,  నసలూ,  నసుగుళ్ళూ,   గునుపులూ,  అప్పుడప్పుడు  గునపాలూ.........  ఏది  ఏమైనా  భార్యా  భర్తల మధ్య  కోప  తాపాలు  అద్దం  మీద  అవగింజలా  అరక్షణంలో  జారి పోవాలి.  మేము  అవలంబించిన  ఈ  చిన్న   సూక్తి  ఇది..........

                              రేపు  మళ్ళీ   కలుద్దాం...............(సశేషం)
       


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి