20, ఆగస్టు 2016, శనివారం

టీచరు గారు

టీచరు గారూ 🙏🙏🙏
 
   మాధవపెద్ది సుబ్బలక్ష్మీ మూర్తిగారు.......

 ఆవిడ ఒకసారి పరిచయమౌతే గుర్తుండి పోయే వ్యక్తి. ఇక అలాటిది ఆవిడ నాకు గురువు, గైడ్, స్ఫూర్తిప్రదాయని, నాకు ఆదర్శం,ఇంకా చెప్పాలంటే తల్లి,తండ్రీ,గురువూ, దైవం, ఇంతకన్నా చెప్పడానికి నా భావానికి భాష లేదు.

  టీచర్ గారు మంచి ఝరితో ఎగిసి దూకే జలపాతం,  చల్లగా సాగే సెలయేరు,  చల్లటి మలయమారుతం, సుడులు తిరుగుతూ చుట్టబెట్టే సుడిగాలి, సన్నజాజీ-సంపెంగలు కలబోసిన సువాసన! వారి గూర్చి ఎంత చెప్పినా నాకు తృప్తి తీరదు.

మనకి ఏదైనా సమస్య వున్నప్పుడు సానుభూతి చెప్పేవారి వల్ల మనం మరింత డీలా పడి పోతాం, ఆవిడ సానుభూతి చెప్పరు ధైర్యం చెబుతారు (నయానా భయాన)

 వారి గూర్చి ఒక పుస్తకం రాయచ్చు, ఇంకా ఎంతో చెప్పాలని వుంది కానీ ఇంతటితో ముగిస్తున్నా!

   టీచరు గారూ! మీరు నా జీవితంలో తారస పడడం,  నా పూర్వ జన్మసుకృతం.............🙏🙏🙏

కాలం

కాలం

  ఆగదు, ఆపలేం. అందుకే అన్నారు జ్ఞాపకాలు పదిల పరచుకోమని. ఏమో బాబూ నా కైతే నా జీవితపు మంచి పుటలన్నీ కంఠోపాఠమే.

 మొన్న నేను పుట్టగానే శ్యామసుందరం నీకు భార్య పుట్టింది అని టార్చ్ వేసి చూపించారట తెలుసా!

 ఐదవ తరగతి శెలవలకు అమ్మ్మమగారి వూరు బాపట్ల, అక్కడ నుండి అత్తయ్యగారు, పెద్దమ్మగార్ల వూరు విజయ వాడ వెళ్ళాం.

 బస్ దిగగానే మా పెద్దమ్మగారి అమ్మాయి నన్ను మా బావను ఒకే రిక్షాలో కుదేసింది. రిక్షాలో ఈమూల ఒకరు, ఆ మూలకి ఒకరు తగలకుండా జాగ్రత్త పడ్డాం. మా మధ్య రిక్షాలో ఆమడ దూరం. నిజం నమ్మండి నవ్వకండి.

 ఆ సారి మా బావ మాకు విజయవాడ అంతా చూపించడం, సత్యహరిశ్చంద్ర సినిమా అన్నీ మొన్నేగా చూసాం, అరే అప్పుడే ముందుకొచ్చేసామా!

   సరే 1968 లో విజయవాడ స్టేషన్లో నేనూ మా నాన్నగారూ, తమ్ముడూ దిగే సరికి బ్రిడ్జ్ మీదనుండి దిగుతూ మా బావ నా వేపు చూసి నవ్వుతే మదిలో కోటి వీణలు మ్రోగాయి, ఇంకా ఆ నాదం చెవుల్లో రింగు రింగు మంటోందిగా.

 1969 మేము హైదరాబాదు నుండీ వస్తుంటే మా బావ సైకిల్పై  వస్తూ  మమ్మల్ని చూసి, ఆగి వెనుదిరిగి ఇంటికి వచ్చేసి (పని మానుకుని) నాకూ మాచెల్లికీ జామ తోటలు చూపించి మంచి సంపెంగ పువ్వు ఇస్తే, ఎన్ని రోజులు పుస్తకంలో దాచుకున్నానూ!

 ప్రేమ లేఖలు రాయమంటే ప్రోగ్రస్ రిపోర్ట్ పంపింస్తున్నానని కోపం తెచ్చుకున్నది మొన్ననే కదా! ( అప్పటి పదవ తరగతి పిల్లలంతకంటే ఏం రాస్తారండీ సోద్యం కాకపోతే)

 ఇంతలోనే చిటుక్కున బావతో పెళ్ళి, పిల్లలు ,వారి చదువులూ,వారి పెళ్ళిళ్ళూ, మనవలూ మనవరాళ్ళూ.........ఇలా విస్తరించుకుంటూ ఇంత దూరం వచ్చేసామా?

 నా మటుకూ గడిచిన కాలం, గడుస్తున్న కాలం అంతా ఆనందమయమే.

 నిన్న పుట్టినరోజు పెళ్ళి కొడుకేనండీ ఈ హీరో!
క్రిందటి  సంవత్సరం ఆగస్ట్ 15 మా పిల్లలు ఇద్దరూ కుటుంబ సమేతంగా వచ్చి నా
షష్టిపూర్తి వేడుకలు నిర్వహించిన తరువాత రాసిన పోస్ట్ మళ్ళీ నా కోసం.... చదవక పోయినా సరే ఏమీ అనుక్కోను.......

"గుండె  గొంతుకలో  కొట్లాడుతోంది"
                                                   ఏమని?

        మనస్సులో  కలిగిన  భావం  ఇక్కడ  రాయమని.

అందరూ  ఏమైనా  అనుక్కుంటారేమోనని  మొహమాటం,  కానీ ఇది  నా పేజీ! నా ఇష్టం  వచ్చినది  రాయచ్చు కదా?
ఏమంటారు?

    అవును  నిజమే!  ఎవరి  పిల్లలు వాళ్లకు ప్యారీ,  ఎవ్వరి  తల్లి తండ్రులు  అంటే  వాళ్ళ  పిల్లలకు  ఇష్టం, కృతజ్ఞతా  భావం.  కానీ  నా అనుభవం,  భావం  చెప్పుకునే్ుందుకు.... నాకు  అవకాశం  దక్కింది.  మరి   చెప్పద్దూ....

  ఈ  అవకాశం  నాకు  కల్పించిన   మా అబ్బాయి  కోడలికి  సంతోషాన్ని తెలియజేస్తున్నా..........

                ఇక  అసలు విషయానికి వద్దాం.....

ఒక పండితునింట  పుట్టి, ఒక పండితునింటిని మెట్టి , ఒక పండితుని  చేపట్టే  మహద్భాగ్యం  కలిగించిన  భగవంతునికి  ముందుగా కృతజ్ఞతలు  తెలియజేసుకుంటున్నాను.
   
  ఎంతో  బాగా  నిర్విహించి  ఈ   సన్నివేసాన్ని  రక్తి  కట్టించారు  మా  పిల్లలూ,  మావారూ. మా  కోడలి  నిర్వహణ లో  మనవలూ, పిల్లందరూ  నాపట్ల  వారి  ఇష్టాన్ని ప్రకటిస్తుంటే  ఆనందభాష్పాలు.

       మా అమ్మాయి అబ్బాయి  మాటలు  వింటుంటే  కన్నీరు   వరదలై  ప్రవహించింది.  (ఏడుపు కాదు  ఆనందం.)  పిల్లల్ని  పెంచినప్పుడు  మనకు తెలీదు  కర్తవ్యంగా  భావించి  పెంచుతం. వారు  వ్యక్తీకరించినప్పుడు   అవునా  అలా పెంచామా,  అంత  ప్రేమ  పంచామా?  అని  ఆశ్చర్యం  వేస్తుంది.  అయితే  నేను   బాగా పెంచానన్నమాట.  అందుకే  అంత మంచి  మాటలు విన్నాను. అని  సంతృప్తి  కలిగింది. (వీడియో చూస్తే  మీకు  కూడా  నా స్పందన  తాలూకు భావం అర్ధమవుతుంది)

   ఇక మనవలు ముగ్గురూ అమ్మమ్మ/ నానమ్మ అంటే ఎందుకిష్టమో వారు వారి మనస్సులోనిది  మాటల్లో రాసుకుని చదువుతుంటే  జన్మ ధన్యమయిపోయింది  అనిపించింది.  

     కడుపున  పుట్టిన  పిల్లలూ ,.. వారి  పిల్లలూ  ఒకలా  భావ  ప్రకటన  చేస్తే ...మా  అల్లుడూ,   కోడలూ  నా  వ్యక్తిత్వం  గూర్చి,  నా   టాలెన్ట్స్   గూర్చి  నా  వాత్సల్యం   గూర్చి  చెబుతుంటే  అనిపించింది  " ఏ  నాటి  నోము ఫలమో  ఏ  దాన  బలమో"  అని.

  ఇంతటితో సరిపోలేదు..... మా మనవరాళ్ళు  ఇద్దరూ వీణలు,  మా  మనవడి  పియానో, మా పిల్లలిద్దరూ కలసి  వీణలతో  నాకు మంచి మరువలేని  బహుమతినిచ్చేరు.

   వీనుల విందు అయ్యింది  కదా ఆ తరువాత  బహు   పసందు (విందు).

   నా  జీవితం  పరిపూర్ణం  అని   చెప్పుకోడానికిాిి  కొన్ని  విషయాలను   మీతో పంచుకుంటున్నాను.....

1)  మా నాన్నగారు   ఒకసారి   చెప్పారు "మళ్ళీ  జన్మ  అంటూ ఉంటే  జయలక్ష్మే  నాకు కూతురుగా పుట్టాలి"  అని.

2)  మా అమ్మ  గారు మా పిల్లలకి చెప్పారు" పిల్లలంటే  ఎవరికైనా అభిమానం ఉంటుంది,  కానీ  జయలక్ష్మి  అంటే  మాకు  గౌరవంతో కూడిన అభిమానం....అబిమానం  తన  హక్కు!  గౌరవం  తను సంపాయిన్చుకున్నది"  అని.

3)  అలానే మా అత్తగారు  చెప్పేరు "  జయలక్ష్మి నువ్వు  జంటిల్మాన్ (పాపం తనకు తెలిసిన పదం)  నువ్వు మా కోడలివి  అయ్యావు  కనుక  మా ఇంటికి   ఉపయోగ  పడ్డావు,  ఇదే అబ్బాయి  అయి  ఉంటె  మా  తమ్ముడుకి  ఉపయోగ పేడేదానివి"  "నువ్వు  లేకపోతే  నేను  చెరువులోంచి  బయట పడేసిన  చేపలా అయి పోతాను.   నన్ను కడవరకు  చూసి సాగనంపు"  అని. (ఆవిడ ఆజ్ఞ శిరసావహించాను.)

  ఇక మా  వారి గూర్చి  వేరే  చెప్పఖర్లేదు.  పిల్లలు  సరే  సరి.

       మా  శిష్యులు   తమకి  ఛాన్స్  ఇస్తే  వాళ్ళ టీచర్  గారు గూర్చి  బోలెడన్ని  చెప్పుకునే వారం  అనుక్కున్నారు.   మళ్ళీ  మా   ఏభైవ పెళ్లి  రోజుకు  కలసి  బోలెడన్ని  కబుర్లు చెప్పుకుందాం.......  అప్పుడు  ఛాన్స్  మీదే...సరేనా?

ఆనందంతో  కన్నీటి తెర  అడ్డు  వస్తోంది  రాయలేకపోతున్నా....... ఉంటాను మరి........

6, జులై 2016, బుధవారం

తులసీదళం

మీకు తెలుసా  తులసీదళం కుళ్ళింది. ఏమిటీ అప్రాచ్యపు మాటలూ!  అంటున్నారా?  అయితే మీరు ఇది చదివి తప్పక తెలుసుకోవాల్సిందేె.

అనగనగా ఒక 1978. ఉన్నట్టుండి పొద్దున్న 10.30 అయ్యింది. ఒక బుజ్జి గయ్యాళిగంప టీచర్ ఒక చేతిలో స్కేల్, ఒక చేతిలో ఒక తెల్లటి ప్లాస్టిక్ బేగ్ పట్టుకుని ........అరుచుకుంటూ,  శిష్యులను చివాట్లు పెడుతూ, గాలిలో స్కేల్ పెట్టి పిల్లల్ని చావబాదుతూ వీర విహారం చేస్తోంది. ఆ గయ్యాళిగంప ఒక్క ముక్క పిల్లలకి చెప్పిన పాపాన పోట్లేదు, కానీ అరుపులూ కేకలూ, హడావిడీ హంగామా.

ఇక కట్ చేస్తే   ....... ఒక ఇల్లాలు "ఇక్కడే తులసీదళం పెట్టాను" ఎక్కడుంది ? అని    వెతికేసుకుంటోంది. అదే సమయంలో ఆమె భర్త రంగ ప్రవేశం. అదీ అక్కడి సీను.

మీరు నిజమైన తులసీదళం అనుకున్నారు కదా ఒప్పుకోండి.......

కాదండీ బాబూ......అది యండమూరి వారి తులసిదళం.

ఈ పాటికి మీరు ఎవరెవరో ఊహించే ఉంటారు...... తెలుసులేండి. ఇంకెందుకూ  రహస్యం? నేనూ, మా అమ్మాయి కళ్యాణి , మావారు ముగ్గురం ఈ సీనులో ఉన్నది.

నేను మా స్టూడెంటును అడిగి తులసిదళం పుస్తకం కొత్తది తీసుకున్నా, చదివిస్తానని. ఆవిడ ఇస్తూ జయలక్ష్మి గారూ మా వారికి పుస్తకాలు ప్రాణం జాగ్రత్తగా ఇవ్వరూ? అంటూ ఇచ్ఛేరు. నేను సగం చదివి పుస్తకం  అక్కడే టేబుల్ మీద బోర్లించా. ఇంతలో మా అమ్మాయి టీచర్ ఆట కోసం ఫ్రిడ్జ్ లోంచి కొత్తిమీర పెట్టిన ప్లాస్టిక్ సంచీ తీసి అందులో ఈ పుస్తకం పెట్టింది. అందులో కొత్త్తిమీర కుళ్లింది.

వెతగ్గా వెతగ్గా ఈ ప్లాస్టిక్ సంచిలో ఉందేమోనని తీసి చూస్తే ఏముంది పుస్తకం చివర్లంతా ఆకుపచ్చగా కుళ్లు అంటుకుని కనిపించింది.
 నేను వెక్కి వెక్కి ఏడుపు . ఎలా ఇవ్వడం ఆవిడ ఏమైనా అనుకుంటారు, ఆవిడని వాళ్ళాయన కోప్పడతారు అని.

 ఇక మరి మా ఆయన రంగప్రవేశం చేసేరు కదా.. ఆయన మహా ఉపాయమంతుడు, గ్రేట్ రిపేరర్.

.ఛీ ఛీ ఇంత చిన్న దానికి ఏడుపేమిటి అని నన్ను ఊరడించి.. ఏదీ ఆ బుక్  తీసుకురా అని, దాని చివర్లు సున్నితంగా షేవ్ చేసి, ఇంకా కొంచెం మరక ఉంటే దానికి పౌడర్ అద్ది జాగ్రత్తగా మా శిష్యురాలికి అప్పజెప్పమన్నారు.వాళ్ళకి తెలీదు అని భ్రమ పడ్డాను గానీ,వాళ్ళు గ్రహించివుంటారు కదండీ.......

ఇంత కష్టపడి వాళ్ళని మభ్య పెట్టే బదులు, ఇప్పుడైతే కొత్త బుక్ కొనేవాళ్ళం,  తెలీని తనం. తలుచుకుంటే ఆ సన్నివేశం చాలా నవ్వు తెప్పిస్తుంది.... మీ సంగతి నాకు తెలీదు బాబూ. నవ్వుతే నవ్వండి లేకపోతే లేదు మీ ఇష్టం.....నేను మటుకూ నవ్వుతాను, నవ్వుతుంటాను, నవ్వుతూనే వుంటాను.......

8, మే 2016, ఆదివారం

మా అత్తగారు............
మహా దొడ్డ ఇల్లాలు. సరిగ్గా చెప్పాలంటే మా నాన్నగారికి తల్లి, మా వారికి తల్లి, నాకూ తల్లి, నా పిల్లలకూ తల్లి లాగే వ్యవహరించేరు. నా సంగీతాభివృద్ధికి అమితంగా సహకరించిన మా అత్తయ్యను ఎలా మర్చి పోగలను.
స్వయంగా వైణికురాలవ్వడం, వైణిక విద్వాంసుడు భార్య అవ్వడం వల్ల,, సంగీతం ప్రపంచం లోని సాధక బాధకాలు అన్నీ తెలుసు, అర్ధం చేసుకోగలరు కూడా. అందువల్ల నా ప్రగతిలో ఆవిడ పాత్ర ఎంతో ఉంది.
మా పిల్లలకు ఆవిడ వద్ద ఎంతో చేరిక . ఆవిడ ఎవ్వరినీ నొప్పించరు. మా మావయ్యగారు పోయాక మాతో 35 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఒకే మాట, ఒకే బాటగా కలసి మెలసి ఉన్నాము అందరం (ముఖ్యంగా కోడళ్ళం.) ఈ విధంగా అందరి దగ్గరా మెసలడంమంటే చాలా చాలా గొప్ప విషయం, ఆవిడ గొప్ప వ్యక్తిత్వానికి దర్పణం. తన భావాలను నియంత్రించుకుని ఎదుటి వారి భావాలను గౌరవిస్తూ, అవసరమయితే సున్నితంగా తెలియజేస్తూ ................వాః పెద్దత్తయ్య నీకు నీవే సాటి.! అందుకే నీకు అలనాడు చెప్పేను “ అజ్ఞానంతో మేము ఎవరమైనా నీ పట్ల తప్పు చేసి ఉంటే క్షమించు, నీ వల్ల మటుకూ మేమెన్నడూ, ఎవ్వరం కూడా నొచ్చుకోలేదు” మమ్మల్ని సదా ఆశీర్వదించు.

మేమే కాదు ఆవిడ పరిచయం ఉన్న ప్రతీ వారూ ఆవిడ గూర్చి గొప్పగా చెబుతారు.

ఒక విశేషం నేను గమనించింది ఏమంటే........35 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ, ఎవ్వరినీ దుర్భాషలాడినట్లు చూడలేదు. ఎవ్వరికైనా ఎదైనా ఇష్టమంటే, వారికి అది ఎలా ఇవ్వాలా అనే ఆవిడ తపన చాలా చాలా గొప్ప లక్షణం. మేమందరమూ ఈ విధంగా ఉండగలుగుతే దిగ్విజయం సాధించినట్లే
.
అయ్యగారి సోమేశ్వర రావు గారింట పిల్లలందరూ శుశిక్షితులయ్యరంటే కారణం ఆవిడేననేది నిర్వివాదాంశం. జయహో జయకుమారి గారు.........

మా అందరికీ ఆవిడ అంటే చాలా చాలా ఇష్టం.. ఇష్టం... ఇష్టం...... (ఆవిడ పేరే నాకు పెట్టేరు. )
“పెద్దత్తయ్య! ఎక్కడున్నా మా పై నీ ఆశీస్సులు నిరంతరం కురిపించు”.....
ఏనాటి  నోము  ఫలమో  ఏదాన  బలమో............

              అరెరే!   మీతో  నా  స్వగతం  పంచుకున్టుండగా   రెండవ   సారి  నా  జీవితంలోకి   “మన్మధ  నామ  సంవత్సర  జ్యేష్ట  శుద్ధ  త్రయోదశి “    ప్రవేశించిందే.

               అమ్మో!  ఇంకొంచెంసేపట్లో   లక్షకుంకుమార్చన,  భోజనాలు  హడావిడీ......


                 ఒక  పండితుని  ఇంట పుట్టి,  ఒక  పండితుని  ఇంటిని  మెట్టి,  ఒక  పండితుని  చేపట్టే  మహాద్భాగ్యాన్ని  ప్రసాదించిన  భగవంతుడికి  కృతజ్ఞతలు.  ఇంటి  నిండా  వైణిక  విద్వాంసులే,  ఇన్ని   సంగీత  సుమాలను  బంధించడానికి  ఉపయోగపడ్డ  నాకు  కూడా  అంతో  ఇంతో  ఆ సంగీత  సుమ  సుగంధమబ్బడం  నా  అదృష్టం.

                   మా  ముగ్గురు  ఆడపడచులకూ,  ఇద్దరు  మరదులకు  మేమంటే  ఎంతో  అభిమానం.  అది  మేము సంపాయించుకున్న  ఆస్తి.   నాకు  వాళ్ళు  అత్తవారని  తెలీదు,  నా  వాళ్ళు  అని  మాత్రమే తెలుసు.

        చక్కటి కుటుంబం, పిల్లలు, కోడలూ, అల్లుడూ, మనవలు.

                ఒక  బంగారు  తల్లి  అత్తగారి  రూపంలో,  మరో  బంగారు  తల్లి  కోడలి  రూపంలో  ప్రవేశించారు నా  జీవితంలోకి.  ఇక  ఒక  బంగారు  తల్లి  కూతురిగా,  ఒక  బంగారు తండ్రి  కొడుకుగా,   అల్లుడిగా  పుట్టారు  (  అవును  కానీ,  కొంపతీసి  నేను  కూడా  బంగారు  తల్లినేనా  ఏమిటి?  ఏమో మరి  నాకు  ప్రపంచమంతా  సన్మార్గులతోనే  నిండి  పోయినట్లు ఉంటుంది)

              ఇక్కడ  ముఖ్యం  గా చెప్పుకోవాల్సింది  మా శిష్యులను  గూర్చి,  వారి  గొప్ప తనమో, మా గొప్పతనమో  కానీ,  మా  శిష్యులందరూ  మమ్మల్ని  అమితంగా  ప్రేమిస్తారు.  మేమంటే  ప్రాణమిస్తారు.

        ఇక  స్నేహితులు ఎంత మంది  ఉన్నారో లెఖ్ఖ  లేదు.  నా ప్రాణాతి  ప్రాణమైన  స్నేహితులకి  ఎప్పుడూ  నా స్నేహ  హస్తం  సిద్ధమే.

         ఇక  మీ వంటి  హితులూ,  సన్నిహితులూ,  స్నేహితుల  గూర్చి  ప్రత్యేకంగా  చెప్పుకోవాలి. మీ అందరి  ఆదరాభిమానాలే  మాకు  శ్రీరామరక్ష.

       

       మా  బ్యాంకు  ఖాతాలన్నీ  ధనంతో  కాక  మీలాంటి  వారందరి  ఆదరాభిమానాలతో   పొంగి, పొరలి, పోతున్నాయి.   చాలు  ఇంతటి  అదృష్టం....... అందుకే  అంటున్నాను  “ఏనాటి  నోము  ఫలమో...ఏ దాన  బలమో”  అని.........

      ఆనందభాష్పాలతో  కన్నీటి   తెర  అడ్డం  వచ్చి,  కళ్ళకు   ఏమీ  కనిపించడం  లేదు,

         చాలా   హడావిడి  ఉంది  ఇంట్లో,  ఉంటా మరి . మరల  కలుస్తా త్వరలో.............

1, మే 2016, ఆదివారం

టివి తో మొదటి పరిచయం..
వ్యక్తులతోనే కాదు, వస్తువులతో మొదటి పరిచయాలు గుర్తు చేసుకున్దామనిపించి మొదలెడుతున్నాను, టివి తో మొదటి పరిచయం గూర్చి.
మా స్కూల్లో 8వ తరగతి లో నుండగా మొదటి సారి టివి చూసాము. ప్రేయర్ హాల్ లో టివిని, ఒక కెమెరా పెట్టారు. మేము దాని ముందు నుండి వెళుతూ మా బొమ్మ మేము టివి స్క్రీన్ మీద చూసుకుని సినిమా హిరొయిన్స్, అయిపోయినట్లు, మళ్ళీ అందులో అందులోనే మా లోని లోపాలు (పెద్ద ముక్కు) చూసుకుని బాధ పడిపోతూ, అంతలోనే ఎంత తెల్లగా ఉన్నానో అని సర్ది చెప్పుకుంటూ పిచ్చి పిచ్చిగా ఆనందిన్చాము నేను మా స్నేహితులూ.
83 లో విజయవాడ లో టివి రిలే స్టేషన్ పెట్టేరు. టెస్ట్ సిగ్నల్స్ జరుగుతున్నాయి.
సాయంత్రం అయ్యింది పిల్లల ఆటలయ్యాయి. 7 అయ్యింది ఇంకా పిల్లలింటికి రాలేదు. రోడ్ మీద పిల్లలెోవరూ లేరు. "ఆదిత్యా,కళ్యాణి" అంటూ వెతుక్కుంటుంటే, మా చివరి క్వార్టర్స్ దగ్గర హాల్ అంత నిండి పోయి ఉంది, టివి లో ఎం.ఎస్. గారి "మీరా" వస్తోంది బ్లాకు అండ్ వైట్ టివిలో. నా పిల్లలిద్దరూ టివి స్టాండ్ కాళ్ల దగ్గరా?..... కడుపు తరుక్కు పోయింది. నా పిల్లలు వేరే వాళ్ళింట్లో, అదీనూ టివి స్టాండ్ కాళ్ళ దగ్గరా? వాళ్ళను తిడుతూ తీసుకువచ్చి, మా ఆయనతో టివి కొనల్సిన్దేనని పట్టు బట్టేను. సరే అన్నారు.
ఇక రోజూ కాలేజీ నుండి వస్తూనే "జయా! ఇవాళ "కృషి దర్శన్" చూసాను, చెట్టు మీంచి మావిడి కాయలు ఆకుపచ్చగా గుత్తులు గుత్తులు వేల్లాడుతున్నాయని , ఏనుగులు గుంపులు గుంపులు వేడుతున్నాయని చెప్పి కళ్ళూరిస్థున్నారు.
ఈ లోగా ఒంగోలు నుండి ఒక స్టూడెంట్ వ్చేచ్చిన్ది, ఆ అమ్మాయితో గురువుగారు కలర్ టివి కొంటారట, అనగానే అనవసరంగా, ఎంతో బాగుంటుందండి, మా పక్క వాళ్ళింట్లో ఉంది అంది అంతే! ఇక చూసుకోండి, ఆ అమ్మాయిని "అంటే ఈ చీర ఇదే కలోర్లో,ఒంటి రంగు ఇదే కలోర్లో ఉంటుందా?ఏనుగు ఏనుగు రంగేనా?" అంటూ చంపుకు తినేసాను"
రోజూ నన్ను కూడా సాయంత్రం టివిల షాపల చుట్టూ తిప్పేరు. సరదాగానే చూసాను కానీ ఏమైనా కనిపిస్తే కదా? ప్రసారం టైం కాదాఎను!
.నాలుగు రోజులయ్యాక.. ఈన కొనే బేరం కాదని గట్టి నిర్ణయానికి వచ్చేసాను.
ఇక ఒకరోజు ఉదయం ఇవాళ టివి కొనుక్కోస్తాను 11 గంటలకి" అని చెప్పేరు. తెచ్చినప్పుడు చూడచ్చులే అనుకున్నా. కానీ 11 గంటలకి టివి రెడీ. "కోణార్క్ పుష్పాంజలి కలర్ టివి." ఆ టైములో ఏమీా రాడం లేదు. మధ్యానం 2 గంటలకి కాలేజీ కెడుతూ, "నేను 5 గంటలకి వచ్చి ఆన్ చేస్తాను, నువ్వు పెట్టకని" వెళ్లి పోయారు. వెళ్తూ వెళ్తూ దాని నెత్తిన నాగభూషణం లాగ చాలీ చాలని ఉత్తరీయం కప్పి వెళ్ళేరు దానికి.
కట్ చేస్త ......సాయంత్రం 5. నా క్లాసు అయిపొయింది. చూడాలని మహా ఉబలాటంగా ఉంది. ఆపుకోలేక మాట జవదాటేను. టివి పెట్టగానే " ఆ రోజు శనివారం అవ్వడం వాళ్ళ "రీజినల్ ఫిలిం..అస్సామి ఫిలిం" ఒక తల్లీ కొడుకు తెల్లటి బట్టలు ధరించి, తెల్లటి బంతితో, ఆకుపచ్చటి పచ్చిక బయలుపై, ఆడుకుంటున్నారు. ఇంతలో మా వారు. గబా గబా ఆపేసి, మళ్ళీ ఉత్తరీయం నెత్తిన కప్పేసి ఎరగనట్లు కూర్చున్నా. పైకి వస్తూనే చక్కగా టివి పెట్టి చూద్దామనే ధ్యాస కంటే "పెట్టేవ? పెట్టేవా?" అంటూ అడగడం మొదలెట్టేరు. మహా బుద్ది మంతురాలిలా "నో" అన్నా! మా ఆయనా మజాకా? వెంటనే దాని నెత్తిన చెయ్యి బెట్టి చూసారు! ఇంకేముంది? దొంగ పట్టుబడి పోయింది......
ఇంతకీ చెప్పొచ్చేదేమంటే "ఆ రోజు నాకు ఆ సీన్ కళ్ళల్లో ముద్రించుకు పోయి ఇక వేటిని కళ్ళల్లోకి రానీడం లేదు! ఎలా? ఎం చెయ్యాలబ్బా?" అదీ నా మొదటి టివి పరిచయం.
"నాలుగు రోజుల షార్ట్ నోటీసు లో రేడియో రికార్డింగ్ 5 న అని డేట్ వస్తే వాయిన్చుకోకుండా ఏమిటి యీరాతలు? వెళ్తావా లేదా" అంటున్నారా? వెళ్లి పోతున్నా? మళ్ళీ వస్తాలెండి . ఖంగారు పడకండి.........

29, ఏప్రిల్ 2016, శుక్రవారం

కల.........
"అమ్మా అమ్మా" అని వెక్కి వెక్కి ఏడుపు వినిపించింది పక్క గదిలో ఉన్న అమ్మకి. అయ్యో అని అర్ధ రాత్రి పరుగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి, బుజ్జి పాప ఏడుస్తోంది!
ఎందుకుట? ఆ బుజ్జి పాప వీధి అరుగు మీద నుంచుని జంతిక తినబోతుండగా , ఒక కుక్క పరిగెత్తుకుని వచ్చి చేతిలోంచి లాక్కుని వెళ్లి పోయింది. అసలే జంతిక అంటే చాలా ఇష్టం, పైగా కుక్కంటే చచ్చే భయం. ఇక చెప్పాలా? రెండూ కలిపి ఏడుపే ఏడుపు.
ఇది ఆ చిన్ని పాపకు గుర్తున్న మొదటి కల. జంతిక తింటున్నట్లు కల వచ్చిందని తిండిపోతు కాదండీ బాబూ!
ఇప్పుడు చెప్పండి ఎవరా పాప?
ఇలాగే మీ మొదటి కల గుర్తుంటే చెప్పండి మీరు కూడా! టైం వేస్ట్ అనుక్కోకండి, ఇవన్నీ మన జ్ఞాపక శక్తిని పెంచుతాయి. లైక్ కొట్టేసి కూర్చోడం కాదు, మీ అనుభవాన్ని గుర్తు చేసుకుని చెప్పండి చూద్దాం.........

25, ఏప్రిల్ 2016, సోమవారం

జోజీ.......జోయ్

  అల్లరి జోజి గాడు, ఉడుకుమోతు జోయమ్మ  పుట్టి ఇప్పటికి 11 సంవత్సరాలు అయ్యింది.
అది 2004 సెప్టెంబర్ 23 అర్ధరాత్రి 12 గంటలు. ఒక్క సెకండ్లో  రెండు కారక్టర్స్  రూపు దిద్దుకుని, జన్మించాయి నా ఊహ  నుండి.

ఎందుకు?
మా చిన్ని మనవరాలు పుట్టే ప్రయత్నం కోసం మా అమ్మాయి అల్లుడూ అర్జెంటుగా హాస్పిటల్ వెళ్తూ, మూడు ఏళ్ల మా పెద్ద మనవరాలు నిద్ర పోతుండగా నాకప్ప చెప్పి వెళ్లి పోయారు. అరగంట అవ్వగానే పాప ఏడ్చింది.  కానీ ఇంట్లో వుడ్ వర్డ్స్ గ్రేప్ వాటర్ లేదు కదా మరి ఎలా? ఇంతలో మా బుజ్జి జోజి జోయ్ పుట్టేసారు.

వాళ్ళిద్దరూ ఎంత అల్లరి వెధవాయలో, ఎన్ని tఅల్లర్లు చేసేరో, మా మనవల్ని ఎలా నిద్ర పుచ్చారో, ఎలా భోజనం చేయించారో. ఎలా మైమరపించారో  ఆశ్చర్యం వేస్తోంది.అన్నట్లు మా మనవల్నే కాదు ఆ వయస్సు వాళ్ళని ఎందరినో నా చుట్టూ  చేర్చి, అవి వింటూ అమ్మల కాళ్ళల్లో పడి పోకుండా ముద్దుగా నా దగ్గరే కూర్చునేట్లు  చేసేరు.

ఒకటి గుర్తుంచుకోవాలి.. ఇవి అమెరికా బుజ్జి కూనలు. అవి వాల్మార్ట్, మేసీస్ , అమెరికా విను వీధుల్లో , గొడుగు లేసుకుని, అల్లరి చేస్తూ తిరుగుతాయి. ఇంతే కాదు అల్లరి బాచ్ గా కొంత మంది కలిసి అమెరికా నుండి ఇండియా ప్రయాణం చేసేరు.
ఈ ఎపిసోడ్స్ కావాలంటే మీరు కూడా చిన్న పిల్లలై పోయి నా చుట్టూ చేరి నేను చెప్పే కధలు వింటారా? వచ్చానండొయ్ కధల అమ్మమ్మ!

కావాలా/ వద్దా? మీ రెస్పాన్స్ బట్టే ఉంటుంది ఎపిసోడ్స్.

17, ఏప్రిల్ 2016, ఆదివారం

స్వామి  సన్నిధి .......

గుమ్మం లోపల "అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు" గుమ్మం బయట గుమ్మానికి ఆనుకుని భక్తుడు, ఆయన సతీమణి... ఇది నా స్వానుభవమ్.  మర్చి పోలేక పోతున్నా .  జన్మ ధన్యమయ్యింది.

 నిజం ఈ బొమ్మలో  చూసిన దేవ దేవుడినే చూసింది .  నిజ రూపం, నేత్ర దర్శనం.
అలంకరణ  రహితంగా  "నల్లని మేని నగవు చూపుల వాడు, తెల్లని కన్నుల దేముడు" "బ్రహ్మ కడిగిన పాదములతో "  "అందరికీ  అభయంబులిచ్చు చేతులతో", ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, అర్ధనిమీలిత నేత్రుడు, ప్రత్యక్షమవుతే కదలకుండా ఉండిపోయాము . జీవితంలో అత్యంత ఆనందానుభూతిని చెంది శటగోపం, తీర్థం,హారతి (తిరుపతి లో ఇటువంటివి దొరకడం కష్టం) తీసుకుని, "వెళ్ళండి" అని  ఎవ్వరితో తోయిన్చుకోకుండా 4 నిమిషాలు అక్కడ నుంచుని మరీ వచ్చామ్.

ఇంత కంటే ఇంకేమి కావాలండి!

అన్నట్లు గురువారం దర్శనం కి ఒక విశేష ముందట ........ ప్రతీ రోజూ  సకల ఆభరణాలతో ఉన్న భగవంతుడిని చూడ్డానికి మనం  వెళ్తామట,  గురువారం మటుకూ  స్వామి తను చూడ దలచుకున్న వారిని రప్పించుకుంటారట . ఎందుకంటే ఆయన నేత్రాలు విప్పారి ఉంటాయట .

మేమంత అదృష్టవంతులమో కదా! అదే మా నాదనీరాజనం అవ్వగానే మాకు దర్శనం మయ్యుంటే మేము అలంకార సహితుడైన దేవ దేవుడుని చూసే వాళ్ళం , అలా కాకుండా వెంకన్న బాబు మమ్ము తన నేత్రాలతో చూసి ఆశీస్సులు అందించడానికి గురువారం దర్శనం ఏర్పాటు చేసేరు. భగవంతుడి చల్లని చూపు మనపై  ప్రసరిస్తే  అంతకంటే ఇంకేమి కావాలి?

"ఓం నమో వేంకటేశాయ"

30, మార్చి 2016, బుధవారం

విమానంలోంచి మేము చూసింది ఇదే....
సరిగ్గా విమానం రెక్క మీద కూర్చున్నాం. మీకు తెలుసుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో అటూ ఇటూ మూడు మూడు సీట్స్ సెంటర్లో  నాలుగు సీట్స్ ఉంటాయని. మేము సెంటర్ లో కూర్హున్నం. పైలెట్  చెప్పగానే, మరీ మూడు సీట్స్ మీద నుండి వంగి చూస్తే బాగుండదని, తొంగి చూసాం. ఇక అర్ధం చేసుకోండి,రెండు సార్లు ఏమి చూసి అంత కధ అల్లుకున్నమో .

ఇప్పుడు చెప్పండి మేము "తెలివి తక్కువ వాళ్ళమా/ తొందరపాటు వాళ్ళమా/ చాలా క్రియేటివ్ వ్యక్తులమా?"

కొంప దీసి ముందు రెండూ అనేరు, కోపం తెచ్చుకుని అలిగి కూర్చుంటాం తెలుసా? జాగ్రత్త.......

అన్నట్లు మన స్నేహితుల్లో కొందరు "ఆవులిస్త్సే పెగులేక్క పెట్టె" వాళ్ళున్నారు. వాళ్ళు కనిపెట్టేసారోచ్. నేను పేర్లు చెప్ప్పను. ఎందుకంటే ?......... అర్ధం చేసుకోరూ..........
కాషాయ వస్త్రాలు....

ఏమిటండీ! అట్లాంటిక్  ఓషన్ ఒడ్డంతా  సన్యాసుల  మయమైపోయింది? నేనూ మా  వారూ  స్వయంగా  చూసాం.

నవ్వకుండా   ఉంటేనే  విషయం  చెబుతా! ముందు ప్రామిస్  చెయ్యండి,  చెయ్యాలి

అది 2001 వేసవి.  మొదటి సారి  అమెరికా  వెళ్తున్నామ్. అమ్మాయిని, అబ్బాయిని  కలవ బోతున్నాం  అని  చెప్పలేని  ఉత్సాహం, ఆనందం. మనం మేనేజ్  చెయ్యగలమా పోర్ట్ అఫ్ ఎంట్రీ దగ్గర? మనకి ఇంగ్లీష్ వచ్చా? వాళ్ళు మాట్లాడింది  అర్ధమవుతుందా? ఎన్నెన్ని అనుమానాలు, తద్వారా వచ్చే భయాలు. బయటకి వచ్చి పిల్లల్ని కలిసే దాకా భయం, తరవాత.  ఆనందం.. చాలా త్రిల్లింగ్ టైం.  బహుసా మీ అందరికీ  అనుభవైక వెద్యమే.  

దారిలో  పారిస్ కూడా ఆగుతుంది అని పిల్లలు చెబితే,  అహహా సుందర పారిస్   నగరం కూడా  చూస్తాం కదా అని చాలా ఆశ పడ్డాం.  అక్కడ  ఎయిర్పోర్ట్ లో  దిగి హాయిగా ఆనందించి , కొన్ని సువాసన లీనే సెంట్లు కూడా కొనుక్కున్దామనుకున్నారు మా వారు.

తీరా చేసి ఎయిర్పోర్ట్ లో దూరంగా  ఆపి, మమ్మల్ని  కళ్ళెర్ర  చేసి చూసి, బెల్ట్లతో మమ్మల్ని మేమే  కట్టుకోమని ఆదేశించి, జామా జెట్టి లాంటి ఆరడుగుల తెల్ల  వాళ్ళు ఫ్లైట్ ఎక్కేసి క్లీనింగ్ చేసేసి చకా చకా దిగి పొయారు. ఇంతలో బిల బిల మంటూ మరింత మంది పాసంజేర్స్ ఎక్కి పోయేరు. ఆశ అడియాశ అయ్యిందని బిక్క చచ్చి కూర్చుని ఉన్నాం, ఇంతలో ........

సరే! అసలు కధ  ఇక్కడ  ఆరంభమయ్యింది .......

కొంచెం సేపయ్యాక మమ్మల్ని ఊరడించాలని అనుక్కుంట పైలెట్ ఒక సారి కిటికీలోంచి  చూడండి మీకు అట్లాంటిక్ ఓషన్ కనిపిస్తుంది అన్నారు. సరేనని అందరం తొంగి చూసాం . అంతా నీటి మయం  కాకపొతే ఎందుకో కాషాయ వస్త్రాలు ఆరేసి కనిపించాయి. ఓహో! ఇక్కడ కూడా సన్యాసులు స్నానాలు చేసి బట్టలు ఆరేసుకు్న్నారులె అనుకున్నాను.  ఇంకా 3 గంటలయ్యాక మళ్ళీ చూడండి అట్లాంటిక్ ఓషన్ ఉంది కింద, ఎంత పెద్దదో అమెరికా దాకా ఇది మనతో వస్తుందన్నారు.

తొంగి   చూస్తె  ఏముందీ, మళ్ళీ నిండా కాషాయ వస్త్రాలు ఆరేసి ఉన్నాయి. అయ్యో! అట్లాంటిక్ ఓషన్ ఒడ్డంతా కాషాయ మయం అయిపోయిందని మా వారు నేనూ, చెప్పుకుని  ఆశ్చర్యంతో  తల మునకలయ్యాము.

అసలు విషయం వేరే్ి  ఉంది. . మీలో ఎవరైనా గ్రహించి చెప్పగలరేమో  చూద్దాం.

మీకు తెలిసీ  చెప్పక  పొతే  భేతాళుడు  మళ్ళీ  చేట్టేక్కేసి దిగనంటాడు.

 చూద్దాం! మీరు చెప్పలేక  పొతే రేపు నేనే చెబుతా లెండి. చెప్పక ......... ?

27, మార్చి 2016, ఆదివారం

విజ్ఞాన ఖని.......

అదొక అందమైన పూదోట .  అందు అత్యంత ఆధునిక సౌకర్యాలతో  కూడిన పొదరిల్లు.  ఆ ఇంట సంగీతం, సారస్వతం, విజ్ఞానం కలబోసుకుని  చిరునవ్వుతో  మనని ఎంతో ఆప్యాయంగా  స్వాగతిస్తాయి. అంతెందు కండీ ఆ నట్టింట లక్ష్మీ సరస్వతులు నాట్య  మాడుతూ  ఉంటాయి.

 ఆప్యాయతకి మారు పేరైన " మా  అత్తగారి" ప్రతి రూపం మా వారి చిట్టి చెల్లెలు శ్రీమతి  బండి శ్రీలక్ష్మి గారు. ఎంతో్  ప్రేమాస్పదురాలు. అడుగడుగునా ఎదుటి వారికి ఏమి కావాలి? ఏమి ఇష్టం అనే తపనే ఆవిడకి. మమ్మల్ని తల్లిలా చూసుకున్నారు విశాఖపట్నం వెళ్ళిన రెండు రోజులూ .

ఇక మా అన్నయ్య గారు డాక్టర్  శ్రీ బి.ల్ .నరసయ్య  గారు  . వారొక కదిలే విజ్ఞాన గ్రంధాలయం .  ఏ  విషయన్ని  గూర్చైనా  అనర్గళంగా విపులీకరించగలరు.  ఆయనతో గడిపే ప్రతీ క్షణం అంతో ఇంతో విజ్ఞానం సంపాయించుకోకుండా బయట పడం.

నాకు స్ఫూర్తి ప్రదాయిని,ధైర్యం ఇచ్చి వెన్ను తట్టి నన్ను నడిపే సద్గురువు శ్రీమతి మాధవపెద్ది సుబ్బలక్ష్మి మూర్తి గారు.....

నా సర్వస్వం,సంగీతంలో నేను మీటే ప్రతీ మీటు, జీవితంలో  నా ప్రతీ అడుగుకీ మార్గదర్శకులు నా గురువు, భర్త అయిన శ్రీ శ్యామసుందర్ గారైతే........

నాకు  జ్ఞానాన్ని  ప్రసాదించే  గురువు శ్రీ నరసయ్య గారు......

వీరందరూ  నాకు  తల్లీ  తండ్రీ  గురువు దైవంతో  సమానమ్.  ఇంతకంటే  వ్యక్తీకరించడానికి  నా భావానికి  తగ్గ భాష లేదు.

 గురువులకు నా  నమో వాక్కాలు.

ఇంతకీ చెప్పొచ్చేదేమంటే విశాఖపట్నం వెళ్లి సింహాచలం,  రామనారాయణం,

"అలుపెరుగని అలలు, అంబరాన్ని చుంబించే ప్రయత్నాన్ని" తనివి తీరా చూసి, ఆనన్దించి......

మళ్ళీ  కొండంతబలం తో తిరిగి వచ్చామ్......

26, జనవరి 2016, మంగళవారం

భారత్ జెండా.......

  రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, అలాగే రెడ్ క్రాస్ వారి సహాయం కోసం చిన్ని చిన్ని జెండాలు  గుండు సూదితో షర్టుకి పెట్టుకునేలా ఉండేవి గుర్తుందా? 
స్కూల్ టీచర్స్ అవి కొనమని 10 పైసలు కానీ 25 పైసలు కానీ తేచ్చివ్వమని మన చేతికి ఇచ్చేస్తారు, మనం కొంచెం సేపు పుస్తకం లో పెట్టుకుని, తరవాత అవి షర్టుకి పెట్టుకుంటే  ఎలా ఉంటుందో ఊహించుకుని ఎంత ఆనందిన్చేమో గుర్తుందా? 

 తీరా చేసి ఇంటికెళ్ళి అమ్మా వాళ్లకి చెబితే ఏమీ మాట్లాడారు, డబ్బులివ్వరు? టీచర్కి చెప్పలేము, అమ్మా వాళ్ళని ఒప్పించలేము. స్కూల్కి వెళితే టీచర్ భయం, ఇంట్లో అమ్మ భయం. (పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటంలా ఉండేది) అయిన ఎలాగోలా అమ్మని ఒప్పించి (స్కూల్లో పేరు తీసేస్తారని భయ పెట్టి) మొత్తానికి సుఖాంతం.

  ఇక ఇండిపెండెన్స్డేకి స్కూల్లో  డాన్సులూ, పాటలూ అయ్యాక, రెండు లడ్డూలు ఇస్తారని ఆశతో ఎండలో మధ్యానం దాకా కూర్చుని లడ్డూ తింటూ వచ్చేవాళ్ళం.
నెమ్మదిగా పెద్దయ్యాం........ స్కూల్లో కూడా లడ్డూ స్థానాన్ని చాక్లెట్ ఆక్రమించింది. పర్యవసానం....... అబ్బా పొద్దున్నే లేచి ఎవరెళ్తారు? ఆ చాక్లెట్ ఏవో రెండూ ఇక్కడే కొనుక్కోవచ్చు అనే అలసత్వం.(నిజానికి మేము అంతక ముందు పొద్దున్నే లేచి తలంటుకుని, ఇస్త్రీ చేసిన స్కూల్ డ్రెస్ వేసుకుని వెళ్ళిన వారమే) 

    మీరేదో మాకేదో దేశభక్తి లేదనుక్కునేరు, తప్పు తప్పు, మేము అసలు సిసలైన భారతీయులం. కాకపొతే కాస్త బద్ధకం అంతే. (అన్నట్లు వెళ్దామనుకున్న స్నేహితులని కూడా ఆపేయగలిగిన ప్రబుద్దులం) మేము అసలు సిసలైన భారతీయులం...

   నమో హిందూ మాతా సుజాత నమో జగన్ మాతా.......జైహింద్ జైహింద్  జైహింద్ 

25, జనవరి 2016, సోమవారం

ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జెల సంగీతం........

      చిన్నప్పుడు........   (అమ్మో, నాయనోయ్, బాబోయ్, వామ్మో! మళ్ళీ మొదలెట్టిందిరా చిన్నప్పుడూ అంటూ  అనుక్కుంటున్నారు కదా! మనస్సులొ. ఏం చెయ్యనండి 365 x  60 పుటలున్నఈ  పుస్తకం నిండా వింతలూ, విడ్డూరాలు, అనుభవాలు, అనుభూతులే, కాబట్టి  మీకు తప్పదు వినక, చదవక, చూడక, పొగడక! ఏమంటారు)

 సరే చిన్నప్పుడు సినిమాకి రిక్షా లో వెళ్ళాం.  మా అమ్మ,నాన్నగారూ, సీట్ మీద కూర్చుంటే, మా తమ్ముళ్ళిద్దరూ  వాళ్ళ ఒళ్ళో కూర్చున్నారు, నేనూ మా చెల్లీ కింద అటూ ఇటూ కూర్చున్నాం, (అన్నట్లు పైన రిక్షా  బొమ్మ మీరు చూసి తీరాల్సిందే అంత చిన్న దానిలో మేము ఎంత చిన్నగా ఉంటే కోర్చోగలమో ఊహించండి)

  సరే ఆ రిక్షా అతను ఎప్పటికైనా తన రిక్షా లో ఒక పెద్ద వీణా విద్వాంసుడు ఎక్కబోతడా అనే ఆశతో అనుక్కుంట చక్రాలకి గజ్జెలు కట్టేడు. (బహుసా మీరు ఇలాటిది చూసే ఉంటారు, లేదా బయటకి చెప్పక పోయినా ఎక్కే ఉంటారు)

 ఆ రోజు నేనూ మా చెల్లీ   సిగ్గు, అవమానంతో సతమత మయ్యాం. ఊహించండి ఎందుకో, సరే నేనే చెబుతాను...... చిన్నప్పుడు అన్నిటికీ అవమానమే! గుడ్డ సంచీ పట్టుకుంటే అవమానం, చేతికి వాచ్ లేదని అవమానం, ఎవరైనా మనని పరికించి చూస్తే అవమానం, మనని చూసి నవ్వితే ఇక సరే సరి.

   ఇక  ఈ పరిస్థితిలో 11 ఏళ్ల  వయస్సులో నేనూ మా చెల్లీ  అలాంటి రిక్షాలో  కింద కూర్చుని, అందరిని ఆకర్షించేలా, అందరూ మనవేపు చూసేలా, గజ్జల గుర్రం లాంటి రిక్షా ఎక్కితే.....  

   వారేవాః ! నాదీ మా చెల్లిదీ అవమానం ఫేసులు చూసి తీరాల్సిందే...... పాపం వెర్రి నాగన్నలు మా తమ్ముళ్ళు సినిమాకి వెడుతున్నాం అని సంతోషమే వాళ్ళకి . మా పేరెంట్స్కి పిల్లల్ని సినిమాకి తీసుకెళ్తున్నాం అని తృప్తి.

    ప్రాక్టికల్ జీవితం మీద అవగాహన లేని ఆ రోజులే వేరు.........

24, జనవరి 2016, ఆదివారం

గుర్తుకొచ్చింది ఇప్పుడే!

    జీవితం లోని మధుర క్షణాలను జ్ఞాపకం చేసుకుంటే, ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో కదా. ప్రతీ వారి జీవితంలో కొన్ని చేదు సంఘటనలుఉండొచ్చు . ఆ పుటలను గట్టిగా అంటించేసి, మంచినే  తలచుకుంటే ఆనందంగా  జీవించగలం.

  జీవితం చిన్నది. జ్ఞాపకాలు,అభిరుచులూ, అనుభూతులూ,భావుకత, భావ ప్రకటన లేని జీవితం నిస్సారంగా, నిర్జీవంగా ఉంటుంది.అందువల్లనే  నేను నా ఆనందపు అనుభూతులని   మీతో  పంచుకోవాలని ప్రయత్నిస్తుంటాను.

అనగనగా ఒక హైదరాబాద్ లో  చిన్న పిల్లలు నలుగురు కేరం బోర్డ్ కొనిపించుకోవాలనుక్కున్నారు వాళ్ళ  నాన్నగారి చేత. కానీ వద్దని వాళ్ళమ్మ అడ్డుకొట్టింది! ఎందుకో తెలుసా? ఉన్న చిన్న మూడు గదుల్లో ఒక గదిలో వాళ్ళు నలుగురూ కేరం బోర్డ్ వేసుకుని కూర్చుని, పెద్ద పెద్ద చప్పుళ్ళతో,నవ్వులతో మొదలెట్టి చివరికి  కొట్టుకుంటూ, వాదులాడుకుంటూ  నానా భీభత్సం  సృష్టిస్తారని  భావించి వద్దన్నారు  బహుశా .

  కానీ  ఆ నలుగురూ ఉద్దండ పిండాలు , వాళ్ళ నాన్నగారు  బయటి నుండి వచ్చేసరికి ఆయన హృదయం కరిగి పోయేలా..... చక్కగా నేల మీద  కేరం బోర్డ్ బొమ్మ గీసుకుని  బాటిల్ డంకాలతో కేరం బోర్డ్  ఆడేస్తున్నారు. ఆ తండ్రి హృదయం కరిగి నీరై వెన్వెంటనే కేరం బోర్డ్ కొనుక్కోచ్చేసారు. కధ  సుఖాంతం.

     కధ  కంచికీ  మనమింటికీ!

ఇంతకీ  ఆ నలుగురులో ఏ ఒక్కరి పేరైనా చెప్పగలరా? తెలిసీ చెప్పక పొతే మళ్ళీ భేతాళుడు చేట్టేక్కేసి దిగనంటాడు  జాగ్రత్త.

19, జనవరి 2016, మంగళవారం

చెప్పుకోండి చూద్దాం ..........

మేము  1983 లో వేసవి  సెలవలివ్వగానే ముందు తిరుపతి వెళ్లి వచ్చి, మళ్ళీ 10 రోజులాగి  ఢిల్లీ, వారణాసి  ట్రిప్కి వెళ్ళాం నలుగురం.

ఎంత బాగా సరదాగా  గడిచిందో  సమయం అంతా. వారణాసి లో  బెనారస్ హిందూ యూనివర్సిటీ చూడ్డానికి  వెళ్ళాం.

రిక్షా అయితే  నెమ్మదిగా  వెళ్తుంది కాబట్టి  హాయిగా  చూడచ్చు,అంత మంచి యూనివర్సిటీని, అనుకున్నామ్. నా ఒళ్ళో  మా  అమ్మాయి,  మా వారి  ఒళ్ళో  మా  అబ్బాయి ....

అంతా తిరగడం  అయ్యింది, రిక్షా దిగగానే  మా వారు  మా అబ్బాయితో "ఆదిత్యా!  బెనారస్ హిందూ యూనివర్సిటీ  "నల్లగా..గుండ్రంగా.. గుచ్చుకుంటూ" ఉంటుంది  తెలుసా"  అన్నారు.

ఎందుకలా అని ఉంటారబ్బా?  మీరెవరైనా  చెప్పగలరా?  చెప్పుకోండి  చూద్దాం?

చెల్లి కల్ల లాడింది

మా చెల్లి  కల్లలాడింది.........

    ఒట్టు  మా చెల్లి కల్లలాడింది, నిజమ్.... ఏమనో  తెలుసా మీకు? తన చిటికెన వేలుని కుక్క కరిచి పారిపోయిందని ......

దాని పర్యవసానం బొడ్డు  చుట్టూ పధ్నాలుగు ఇంజక్షన్లు పొడిపించారు మా అమ్మ  వాళ్ళూ.  ఇదంతా తనకి ఎనిమిది సంవత్సరాల వయస్సులొ. రోజూ ఖొరంటీ దవాఖానా కి తీసుకెళ్ళి ఇంజక్షన్ళూ. ఇప్పించడం వాళ్ళ డ్యుటీ.

ఇది ఇంతటితో  అయిపోయి ఉంటే సరి పొయ్యేదా! అలా అయితే నేను ఇప్పుడు రాయడమెందుకూ ?  అసలు విషయం వినండి మరి......

పది సంవత్సరాల  క్రితం తీరిగ్గా మా చెల్లి ఒక కొత్త విషయాన్ని  ఆవిష్కరించింది ...తన వేలు కుక్క కరవలేదనీ, నాన్నగారి కొత్త షేవింగ్ బ్లేడ్ తీసి పెన్సిల్ చెక్కు కుంటుంటే  వేలు మీదా గాటు పడిందనీ (అది కుక్క కరిచిన విధంగానే కనిపించి ఉంటుంది వాళ్లకి ) నాన్నగారు తిడతారని అబద్ధం చెప్పి తప్పించుకున్నాను తిట్లు అంది!
 కానీ పాపం పసిది, దాని వల్ల  తనకి ఇచ్చిన ఇంజక్షన్ నొప్పో?

కాగా  పోగా  దీని వల్ల  మనం తెలుసు కోవాల్సిన నీతి ఏమంటే......   అలా  కల్లలాడకూడదు!

అవునా/కాదా?