28, ఏప్రిల్ 2015, మంగళవారం

గ్రేట్ వారియర్ మా అమ్మ..............


 అమ్మో  తప్పు  చేస్తే  అమ్మ  చంపేస్తుంది  అని  మేము,  భాను  ( అక్కయ్య/పిన్ని/ అమ్మమ్మ/ అత్తయ్య)  కోప్పడుతుందని  బంధువులు  అందరికీ  తన  ముందు,  కానీ  వెనక  కానీ  తప్పు  చెయ్యాలన్నా, అబద్ధం  చెప్పాలన్న  భయం.   ఎందుకంటే ఒప్పుకోదు.  తప్పు  చెయ్యనివ్వదు,  ఛస్తే   తప్పు  చేయదు. “That is Bhanumathi.”

మమ్మల్ని  చాలా చాలా  క్రమశిక్షణతో,  అవసరమయితే  శిక్షతో  సరి చేసింది. లెఖల్లో దిట్ట.  చదువులో  విపరీతమయిన  చురుకు.  తను స్కూల్  ఫైనల్  ఎగ్జామ్స్  ముందు రోజు  గాజులు  పెట్టిన్చుకుంది, రిజల్ట్స్  వచ్చిన మర్నాడు  నేను  పుట్టేనట.  ఊరంతటికీ  ఫస్ట్  వచ్చింది.  స్కూల్  పీపుల్  లీడర్. జీవితం  పట్ల  విపరీతమయిన  ఆశక్తి, అన్నీ  తెలుసు  కోవాలనే  జిజ్ఞాస. మల్టీ  టాలెంటెడ్  పర్సన్.  వీణ  వాయించేది,  బాగా  చదువుకునేది, రచనలు  చేసేది.
  మా అత్తగారి శిష్యురాలు  వీణలో.  వాళ్ళిద్దరి  అనుబంధం  ఒదినా- మరదల్లకీ, గురు శుష్యులకీ ఆదర్శ  ప్రాయం. క్రితం  పగడాల  ఉంగరం  చేయించేరు  గురువుగారికి.  ముఖ్యంగా  నా మొదటి  వీణ  గురువు మా అమ్మ.  గురువుగారంటే  ఎన లేని అభిమానం. చిన్నప్పుడు  గురు దక్షిణ  సమంగా  ఇచ్చేమో  లేదోనని  10 సంవత్సరాల 
  అన్తేన్డుకండీ!  మా అమ్మ  నాన్నగారు వాళ్ళ  గురువులకు  (అయ్యగారి సోమేశ్వర రావు గారు, అయ్యగారి జయకుమారి  గార్లకు)  నన్ను  గురుదక్షిణగా  సమర్పించి...” నన్ను  వాళ్ళతో  సవ్యంగా  నడచుకుని,  చక్కగా వ్యవహరించి,  కుటుంబాన్ని చక్కగా చూసుకుని   మంచి  పేరు  తెచ్చుకోమని  ఆదేశించారు.”.  నేను  అలాగే  నడచుకున్నాను, నడచుకుంటున్నాను, నడచుకుంటాను.
 నేను  గర్వ పడే విషయం  ఏమంటే మా నాన్నగారు “ నాకు జన్మ అంటూ మళ్ళీ ఉంటే జయలక్ష్మే  నాకు  మళ్ళీ కూతురుగా పుట్టాలి” అన్నారు.    మా అమ్మ “ పిల్లలంటే ఎవరికైనా  అభిమానం  ఉంటుంది, కానీ జయలక్ష్మి అంటే  మాకు  గౌరవంతో    కూడిన  అభిమానం.” అని చెప్పారు.  అభిమానం  నా హక్కు,  గౌరవం  నేను సంపాయిన్చుకున్నది.  నా జన్మ  ధన్యం. 
కాకపోతే  చివర్లో  పులిలాంటి  మా అమ్మ  పిల్లిలా  అయిపోయి, కొన్ని  మర్చిపోయి,  యోగినిలా  నవ్వుతూ చూస్తూ ఉండి  పోయింది  మాట్లాడకుండా....... అటు వంటి  స్థితిలో  కూడా  చదువుకి  సంబందిన్చనవి మటుకూ  ఫుల్  పర్ఫెక్ట్. లేక్ఖలు  ఎంత క్లిష్టమైనవైన  క్షణాల్లో  చెప్పేది,  ఇంగ్లీష్ లో అమ్మ  సైట్  అర్ధం ఏమిటి అంటే ....సైట్ మూడు రకాలవి...అని.. Sight, site, cite అని చెప్పింది, పద్యాలు చెప్పింది, అలానే  ప్రైజ్  అంటే..రెండున్నాయి  praise, prize..అని  మొదటిది మనం  చేసిన ప్రయత్నానికి ఎదురు  వాళ్ళు ఇచ్చేది, రెండోది మనం  హక్కుగా సంపాయించు కునేదట.  బాగుందా?  అలానే  Pedestrians,  Trespassers  లాంటి  క్లిష్టమైన  పదాలకి అర్ధాలు చెప్పేరు,  పోయే ముందు మూడు  నెలల ముందు ఇదంతా... తెలుగు పద్యాలు  ఎన్నో చెప్పి  రాసుకోమంది,  కానీ అజ్ఞానం  వల్ల రాసుకోవచ్చులే అనుకున్నా,  ఫలితం అర్ధంయ్యిందనుక్కుంట..

   పాపం మా అమ్మ మొదటి  నుండి  ధైర్యంగా   పరిస్థితులతో  పోరాడింది,  చివరికి మృత్యువుతో  కూడా  పోరాడి   .అలసి  సొలసి  ఓడిపోయింది  తప్పని  పరిస్థితులలో.

నాన్నగారు.......

.
నాన్నగారు అనగానే... జీడిపప్పు, సీతాఫలాలు, ఎండాకాలంలో కిటికీలకి తడి పరదాలు కట్టి, వాటికి వట్టివేళ్ళ తడకలు కట్టి...పళ్ళాల్లో నీళ్ళు పోసి, పైనుండి ఫ్యాన్ వేసి, మమ్మల్నదరినీ చుట్టూ పడుక్కోబెట్టి ఎండా కాలం ఏసీ కింద పడుక్కున్న ఎఫెక్ట్ తెప్పించడం, రాత్రి పూట చక్కగా వీణ వాయించి నిద్ర పోగాట్టడం. ( తనకిష్టమయిన జనని నినువిన రీతిగౌళ, కేదారగౌళ లో కృతులు, శహన లో కృతులు, ఇంకా ఎన్నెన్నో). నా చేత రన్ & మార్టిన్ గ్రామర్ బుక్ BA Bed., ఇంగ్లీష్ & సోషల్ టీచర్గా వర్క్ చేసేరు చాలా కాలం), వాళ్ళ స్కూల్ గ్రంధాలయం నుండి మంచి మంచి బొమ్మలతో ఉన్న సింద్బాద్ కధలు, అరేబియన్ నైట్స్ తెచ్చి చదివి వినిపించడం.... డాక్టర్ గారి అమ్మాయిలతో కలపి సంగీతం వోకల్ నేర్చుకోడం ఎన్ని జ్ఞాపకాలో.
పొద్దున్న వాతావరణ సూచన రేడియోలో విని మా అమ్మగారు గాలిలో తేమను బట్టి వాన పడుతుందో లేదో చెబుతారు. మా నాన్నగారి అమితమైన ప్రేమ వల్ల వాన మొదలవ్వక పోయినా సరే ముందు జాగ్రత్త చర్యగా మాకు రైన్ కోట్స్ వేస్తారు. రైన్ కోట్స్ వేసుకుని చిక్కడపల్లి తోట దగ్గర మా ఇంటి నుండి ,మాడపాటి స్కూల్ దాక రోడ్ మీద వ్యోమగాముల్లాగా నేను మా చెల్లి ఇద్దరమే వింతగా వెళ్ళడం. వద్దంటే కోప్పడతారు, మాకేమో అవమానం. ఏంచేస్తాం కొన్ని సార్లు మాట వినక తప్పదుగా.
పాపం జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కున్టూ కూడా మమ్మల్ని మా అమ్మ నాన్నగారు ఎంతో ప్రేమగా క్రమశిక్షణతో పెంచేరు. అమ్మ నాన్నగారు మీకు మా నమస్సులు..........మీ ఋణం తీర్చుకోలేం.............

బాల్యం...మరి కొన్ని గుర్తులు......

"కాలాన్ని తిరిగి ఇవ్వలేని దేముడు, అద్భుతమయిన జ్ఞాపకాలను వరంగా ఇచ్చేడు"
       




అమ్మమ్మా వాళ్ళింట్లో ఉండగా వచ్చిన నాన్నగారికి, పొద్దున్నే లేచి "నాన్నగారూ! అమ్మకు తమ్ముడు పుట్టాడు" అని చెప్పడం గుర్తుంది. ( 'వైణిక సార్వభౌమ" పప్పు చంద్ర శేఖర్ పుట్టినప్పుడు) సెలవలకి అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళే ఆనందం కన్నా, మనం వెళ్లి పోతే నాన్నగారికెలా? అని రైలు కదిలి వెళ్లి పోతుండగా మేమందరం కలిపి బృంద గానంలా బృంద..... ఇంకా చెవుల్లో మార్మ్రోగుతోంది 

 చెవుల్లో మార్మ్రోగుతోంది
' ఏమిటీ ఈ టెక్స్ట్ బుక్ లో పేజెస్ ముందువి అన్నీ ఏమయ్యాయి? ' అని మా నాన్నగారు అడిగినప్పుడు "నాకు అందులో ఉన్నది వచ్చేసింది కదా అని చింపేసాను అన్నానుట" మా నాన్నగారు చెప్పేరు. వుల్డు, షుల్డు, కుల్డు, బుర్మా, బుట్టు అని చదివితే, కాదమ్మా "would, should, could, Burma, But " "L" sailent అని చెప్పడం గుర్తుంది.
పెద్దలున్నంతవరకే మనం చిన్న వాళ్ళం. మన చిన్నతనం గుర్తు చేసేది వాళ్లున్నన్తవరకే. కాబట్టి నేనిప్పుడు పెద్దద్దాన్ని. ఈ ఊహే ఎదో ఇబ్బందిగా ఉంది. సజల నేత్రాలతో... మళ్ళీ రేపు కలుస్తా........

బాల్యం.........




 ఎంత  అందమైంది ! ఎంతటి  ఆనందాన్నిచ్చింది...... ఆ అమాయకత్వం,   జీవితంపట్ల  మక్కువ,  అనురక్తి,  ఆశయాలు, ఆటలూ,  పాటలూ,  కధలూ  ఎన్నో  ఎన్నెన్నో.  రోడ్  మీద  పడి ఆడుకోడం, (అది ఇప్పటి  తల్లులకు  తప్పేమో  కానీ అక్కడే  ఎన్నో  ఎన్నెన్నో  నేర్చుకున్నాం.)  అద్భుతమయిన  స్నేహాన్ని, స్నేహితులని  ప్రోవు  చేసుకున్నాం
  నా బాల్యం గూర్చి గుర్తుకొచ్చినవి  మీతో  పంచుకోవాలని ఉంది..........

 మా  నాన్నగారు “వైణిక శిరోమణి”  శ్రీ  పప్పు  సోమేశ్వర రావు  గారు,  భానుమతి గార్ల  మొదటి సంతానం నేను. మా  నాన్నగారికి నేనంటే  ఎంత ఇష్టమో. మా అమ్మకి పదహారూ,  మా  నాన్నగారికి  ఇరవై  ఒకటి  నేను పుట్టే సరికి.  అంత  చిన్న  వయస్సులో  కూడా  నాకు  ఎంత స్టైలిష్  డ్రెస్లు  కొన్నారు  60  సంవత్సరాల  క్రితం. అదే  హైదరాబాద్  మహత్యం. మంచి  స్టైలిష్  డ్రెస్లు  దొరికేవిట  కోటీలో.  కొనడమే  కాక  నాకు  గుర్తులు  మిగిలేలా  ఫోటోలు  కూడా  తీయించారు...... ఈ రోజుకి  అవి  మీతో  పంచుకుంటాను....... మళ్ళీ  కలుద్దాం......

9, మే 2014, శుక్రవారం

తడబాటా? / తొందరపాటా?

                                  తడబాటా? /  తొందరపాటా? 
 ఇది 1975 జనవరి  లో జరిగింది.  ఏమిటా  అని ఆలోచిస్తున్నారా?  ఆలోచించకండి. చెబుతాను...... యదార్ధ  సంఘటన  యధాతధంగా ......

         చిన్నప్పుడంతా  సెలవలకి  అమ్మమ్మా  వాళ్ల  ఇంటికో,  పెద్దమ్మ  గారింటికో,  అత్తయ్యగారింటికో  వెళ్ళడం  అలవాటు.  అప్పుడు  హోటల్ లో దిగడం  అవసరం లేదు,  అలవాటు లేదు.  ( మా  చిన్నప్పుడు  హోటల్ కి  వెళ్లి  తింటే  కూడా  వింతే  జనాలకి.  పెద్దగా పిల్లలూ,  ఆడవారు  వెళ్ళిన దాఖలాలు  లేవు.)  
    అలాంటి  వాతావరణం లో  పెరిగిన  నాకు, పెళ్లి అయ్యాక  మొదటిసారి  తిరువయ్యర్  వెళ్లి,  (తమిళ్ నాడు గవర్నమెంట్  గెస్ట్  హౌస్ లో దిగేము.)  అక్కడ నుండి  మద్రాస్  వెళ్లి   మైలాపూర్లో  హోటల్ లో దిగేము.  ఎందుకయినా  మంచిదని  ఒక తాళం  కప్ప  పట్టుకొమ్మన్నారు  మావారు. ( అన్నట్లు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి ....... ఆయనకు అప్పటికే  కచేరీల  నిమిత్తం  వేరే ఊర్లకి  వెళ్ళడం , హోటల్ లో దిగడం  అలవాటు ఉన్ది)
 

.  

      ఏమిటి  ఈ సోది  అసలు విషయం ఎప్పటికీ. చెప్పరేమిటి? అని చదవడం  ఆపేయకండి,  అసలయిన విషయమ మొదలవుతోంది. మరి సంఘటన  కళ్ళకు కట్టినట్లుఉండద్దూ......సరే  ముందుకు వెళ్దాం.....

    స్నానపానాదులన్నీ  అయి  మధ్యాహ్నం  భోజనం అయ్యాక, మేము బయటకి వెళ్లేము.  వెళ్లేముందు  మాఆయన  గదికి  హోటల్ వాళ్ళిచ్చిన  తాళం కప్పవేసి, కౌంటర్ లో  తాళం  చెవి ఇవ్వడం చూసి , ఏమిటిది తాళం  వాళ్లకిస్తే , వాళ్లు  మన  వస్తువులు అన్నీ  కాజేస్తారు కదా  అనుకుని (అమాయకత అక్కడేమున్నాయని, ప్రయాణంలో నలిగి పోయిన  బట్టలు తప్ప.... వెధవ జాగ్రత్త) మావారికి చెప్పకుండా  పరుగెత్తుకుంటూ  వెనక్కి  వచ్చి  నా హాండ్బాగ్లో ఉన్న తాళం, మావారు వేసిన తాళం  మీద  డుబుల్ తాళం  వేసేను. 

   అయ్యిందా ........రాత్రి 10 కి  హోటల్ కి వచ్చాం. నేను లోపలి  వచ్చేసి మళ్లీ  మా వారికి తెలియకుండా  గబగబా నేను వేసిన తాళం తీసేసి, ఎరగనట్లు నుంచున్నా.  నా చేతిలో  తాళం  కప్ప ఇంకా లోపల దాచలేదు.  ఇంతలో ఆయన నవ్వుకుంటూ  వచ్చి, కౌంటర్ లో ఎవరో వాళ్ళ రూం  లాక్  చేసేరని  గొడవపెడుతున్నారంటూ, నా వైపు చూసి  విషయం గ్రహించేరు. బహుసా మీరూ గ్రహించే ఉంటారు.....

       ఎప్పుడూ హోటల్ సంస్కృతి  తెలియక పోడంవల్ల, రూమ్ లన్నీ  పెయింట్లు  ఒకేలా ఉన్నా, నెంబర్లు  వేరేగా  ఉంటాయని తెలీని  అమాయకత. వెనక్కి  తాళం  వెయ్యడానికి వెళ్లినప్పుడు, మా రూం కి తిన్నగా వెళ్లకుండా....... వాలుగా పక్క రూం కి  వెళ్లి తాళం  వేసేను.  దానికి వచ్చిన  తిప్పలిదంతా........

  మాకు ఇప్పటికీ చాల నవ్వు వస్తుంది  ఆ సంఘటన  తలచుకుంటే ,  మరి మీకో?   నవ్వ లేక  నవ్వ  లేక  నవ్వతున్నారా?  ఫరవాలేదులెండి...నవ్వి పెట్టండి కొంచెం. పాపం  ఆనందిస్తాము....




9, జనవరి 2011, ఆదివారం

సాహిత్యం:- వినరాద నా మనవి (దేవగాంధారి లో కోవూరి పంచరత్నం)

పల్లవి..... వినరాద నా మనవి


చరణం  1:- కనకాంగ  కావేటి రంగ పతే
                కాంత కాంత లెల్ల కామించి పిలచితే ...వినరాద  నా మనవి


చరణం ౨:- భాగదేయ వైభోగ రంగపతే
               త్యాగరాజ నుత తరుణులు పిలచితే.......వినరాద నా మనవి

8, జనవరి 2011, శనివారం

వినరాద నా మనవి (దేవగాంధారి లో కోవూరి పంచరత్నం)

        ఒక సారి త్యాగరాజ స్వామి చైత్రోత్సవము చూడడానికి శ్రీరంగం వెళ్ళి,ఆ సమయం లో బంగారపు రధం  మీద ఊరేగింపుగా వస్తున్న దేముడిని చూచి ఆనంద పారవశ్యం తో "రాజు వెడలె చూతము రారే ' అను కృతి తోడి రాగం లో పాడేరట. 
    పదహారు మంది బోయీలతో ఊరేగుతున్న ఆ రధం త్యాగరాజ స్వామి  ఉన్న ఇంటి ముందుకు వచ్చింది, కుతూహలముతో త్యాగరాజ స్వామి ఆ వైభోగ రంగని దర్శించు కున్దామనుక్కున్నారు    . కానీ ఆ జన సమూహం లో దర్శించుకునే అవకాశం దొరకక, నిరుత్సాహ  పడి అక్కడే నిల్చుండి  పోయి చూస్తున్నారట. ఇంతలో ముందుకు సాగిన రధం కదల కుండా ఉంది పోయిందట, బోయీల కాళ్ళు బరువులేక్కి   ఒక్క అడుగు కూడా వెయ్యలేని పరిస్థితి, ద్రుష్టి దోషం తగిలిందని భావించి తరుణోపాయలు వెతుకుతున్నారట.ఇంతలో దేవాలయం అర్చకులలో ఒకరు దేవప్రేరితులై త్యాగరాజ స్వామిని చూపి" ఆ మహా భక్తుని రధం వద్దకు తీసుకు రమ్మని" చెప్పినారట. అంతట త్యాగరాజ స్వామి సంభ్రమ ఆశ్చర్యాలతో దేవుని రధం వద్దకు పోయి ప్రఖ్యాత కృతి "వినరాద నా మనవి" అను కృతి ఆలపించారట.


అనుపల్లవి లో "కాంత కాంత లెల్ల కామించి పిలచితే" అనినారు, అంటే  దేవ దాసీలు నృత్యము చేసి పిలచితే పొరాదా అని రంగానాధుని  ప్రస్నించినారు. ఈ కృతి పాడుట పూర్తి చేసి దీపారాధన పూర్తి అయ్యేసరికి, ఆశ్చర్య దాయకముగా రధము కదలినదట.


తరువాత ఒక రోజు త్యాగరాజ స్వామి దేవాలయమునకు ఆహ్వానింప బడ్డారట. ఆ రోజు మూల విరాట్టు అద్భుతం గా అలంకరింప బడి ఉన్నదట .భగవంతుని జూచి భక్తి తో  ఈశ్వర ప్రేరితులై "ఓ రంగశాయి " అను కాంభోజి కృతి రచించినారట. 


 చిరంజీవి సౌభాగ్యవతి  కల్యాణి  కోరిక మేరకు ఈ కృతి ఏ సందర్భం లో త్యాగరాజ స్వామి రచించారనేది నాకు తెలిసిన విధం గా రాస్తున్నాను.