తడబాటా? / తొందరపాటా?
ఇది 1975 జనవరి లో జరిగింది. ఏమిటా అని ఆలోచిస్తున్నారా? ఆలోచించకండి. చెబుతాను...... యదార్ధ సంఘటన యధాతధంగా ......
చిన్నప్పుడంతా సెలవలకి అమ్మమ్మా వాళ్ల ఇంటికో, పెద్దమ్మ గారింటికో, అత్తయ్యగారింటికో వెళ్ళడం అలవాటు. అప్పుడు హోటల్ లో దిగడం అవసరం లేదు, అలవాటు లేదు. ( మా చిన్నప్పుడు హోటల్ కి వెళ్లి తింటే కూడా వింతే జనాలకి. పెద్దగా పిల్లలూ, ఆడవారు వెళ్ళిన దాఖలాలు లేవు.)
అలాంటి వాతావరణం లో పెరిగిన నాకు, పెళ్లి అయ్యాక మొదటిసారి తిరువయ్యర్ వెళ్లి, (తమిళ్ నాడు గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో దిగేము.) అక్కడ నుండి మద్రాస్ వెళ్లి మైలాపూర్లో హోటల్ లో దిగేము. ఎందుకయినా మంచిదని ఒక తాళం కప్ప పట్టుకొమ్మన్నారు మావారు. ( అన్నట్లు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి ....... ఆయనకు అప్పటికే కచేరీల నిమిత్తం వేరే ఊర్లకి వెళ్ళడం , హోటల్ లో దిగడం అలవాటు ఉన్ది)
.
.
ఏమిటి ఈ సోది అసలు విషయం ఎప్పటికీ. చెప్పరేమిటి? అని చదవడం ఆపేయకండి, అసలయిన విషయమ మొదలవుతోంది. మరి సంఘటన కళ్ళకు కట్టినట్లుఉండద్దూ......సరే ముందుకు వెళ్దాం.....
స్నానపానాదులన్నీ అయి మధ్యాహ్నం భోజనం అయ్యాక, మేము బయటకి వెళ్లేము. వెళ్లేముందు మాఆయన గదికి హోటల్ వాళ్ళిచ్చిన తాళం కప్పవేసి, కౌంటర్ లో తాళం చెవి ఇవ్వడం చూసి , ఏమిటిది తాళం వాళ్లకిస్తే , వాళ్లు మన వస్తువులు అన్నీ కాజేస్తారు కదా అనుకుని (అమాయకత అక్కడేమున్నాయని, ప్రయాణంలో నలిగి పోయిన బట్టలు తప్ప.... వెధవ జాగ్రత్త) మావారికి చెప్పకుండా పరుగెత్తుకుంటూ వెనక్కి వచ్చి నా హాండ్బాగ్లో ఉన్న తాళం, మావారు వేసిన తాళం మీద డుబుల్ తాళం వేసేను.
అయ్యిందా ........రాత్రి 10 కి హోటల్ కి వచ్చాం. నేను లోపలి వచ్చేసి మళ్లీ మా వారికి తెలియకుండా గబగబా నేను వేసిన తాళం తీసేసి, ఎరగనట్లు నుంచున్నా. నా చేతిలో తాళం కప్ప ఇంకా లోపల దాచలేదు. ఇంతలో ఆయన నవ్వుకుంటూ వచ్చి, కౌంటర్ లో ఎవరో వాళ్ళ రూం లాక్ చేసేరని గొడవపెడుతున్నారంటూ, నా వైపు చూసి విషయం గ్రహించేరు. బహుసా మీరూ గ్రహించే ఉంటారు.....
ఎప్పుడూ హోటల్ సంస్కృతి తెలియక పోడంవల్ల, రూమ్ లన్నీ పెయింట్లు ఒకేలా ఉన్నా, నెంబర్లు వేరేగా ఉంటాయని తెలీని అమాయకత. వెనక్కి తాళం వెయ్యడానికి వెళ్లినప్పుడు, మా రూం కి తిన్నగా వెళ్లకుండా....... వాలుగా పక్క రూం కి వెళ్లి తాళం వేసేను. దానికి వచ్చిన తిప్పలిదంతా........
మాకు ఇప్పటికీ చాల నవ్వు వస్తుంది ఆ సంఘటన తలచుకుంటే , మరి మీకో? నవ్వ లేక నవ్వ లేక నవ్వతున్నారా? ఫరవాలేదులెండి...నవ్వి పెట్టండి కొంచెం. పాపం ఆనందిస్తాము....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి