12, ఆగస్టు 2020, బుధవారం

శారదాదేవి

 అయ్యగారి వారి మరో ఆణిముత్యం.... 


శారదా పర దేవతా

వర నారదాది వందిత చరణా


శ్రీమతి శారదా దేవి... తండ్రికి ముద్దుల తనయ. ఎంత ముద్దంటే బాపట్లలో వారింటికి " శారదా నిలయం" అని పేరు పెట్టకునేంత. 

తన కుమార్తె పుట్టిన రోజు కానుకగా " అమ్మలు గాడి పుట్టిన రోజు నేడు- మా బాగా జరిగినదే " అని కళ్యాణి రాగంలో ఆ రోజు వాయించిన కచేరీలో వాయించేంత. " లయ బ్రహ్మ" అని పిలుచుకునేంత. 


శ్రీ అయ్యగారి సోమేశ్వర రావు గారి కూతురు శారదా, కొడుకు శ్యామసుందరం కలిసి 3 కాలాలూ వచ్చిన కోర్స్ అంతా తాళం వేసి పాడ వలసినదే ప్రతీ రోజూ. ఆయన నిద్ర పోతున్నా ఆపుదామనుకుందుకు లేదు, వెంఠనే మెలుకువ వచ్చి మృదంగం వాయించేస్తారు ఇద్దరి వీపుల మీదా. అంతకఠోర సాధన, ఆ వెన్వెంఠనే కచేరీలలో తనతో వాయింపించడం. మంచి  గాత్ర, వాద్య శిక్షణ గరిపి, చక్కని విద్యతో తీర్చి దిద్దారు. . 14 సంవత్సరాల వయస్సులో విజయవాడ వచ్చిన తరువాత సంగీత కళాశాలలో మొదటి బాచ్ విద్యార్ధినిగా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలయ్యారు. రేడియో కాంపిటీషన్ లో లోకల్ లో ఉత్తీర్ణత పొంది ఫైనల్ కాంపిటీషన్ మద్రాసులో జరుగగా రంగనాయకీ రాజగోపాలన్ వంటి వారితో పోటీపడి మంచి పొగడ్తలను పొందారట. బహుమతులు రావాలంటే అనేక అగడ్తలు దాటాలి కానీ, బహుమతికీ పొగడ్తకూ పొంతన కుదరదు. అందరితో శహభాష్ అనిపించుకున్నారు అదే వెయ్యి బహుమతులకు సమానం. అనేక కచేరీలు గాత్రం వీణలలో చేసేకు. 


తరువాత పెళ్ళి జరిగి,ఉత్తర భారత దేశం వెళ్లి పోడంలో, అప్పట్లో అక్కడి వాతావరణం సంగీతానికి అంత అనుకూలంగా లేక, భౌతికంగా వీణ దూరం పెట్టారు కానీ వచ్చిన విద్య ఎల్లప్పుడూ మరువ లేరు, మరవరు, మరువ లేదు. అద్భుతంగా పాడతారు. చక్కటి స్వర కల్పనా చాతుర్యం నేడు కూడా.

 సంగీతాన్ని చక్కగా ఆస్వాదిస్తారు. బేరీజు వేయగలరు. ఈ ఇంట ఎవరితోనూ తీసిపోని స్థాయిలో వుండ వలసిన కళాకారిణి. వీరిని అధిగమించాలనే ప్రయత్నంలోనే  శ్రీ శ్యామసుందరం గారి నేటి ఈ  విద్వత్ రూపం. అక్కయ్య సమం స్వరకల్పన వేస్తుంటే తమ్ముడు విన్యాసం వేయడంట. ఇద్దరూ రేడియోలో అనేక బాలానంద కార్యక్రమాలలో, సంగీత రూపకాలలో పాల్గొన్నారు. 


ప్రేమా, ఆత్మీయత, అనురాగం, కలబోస్తే శారదా దేవి గారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ నాన్నగారి ప్రతిరూపం. వండడంలో, వడ్డనలో సాక్షాత్తు అన్నపూర్ణా దేవి. 


వెరసి మా అందరకూ బహు ప్రీతి పాత్రమైన మా ఇంటి పెద్ద మా పెద్ద ఆడపడచు. 🙏🙏🙏


రేపు మేము అందరం అమితంగా గౌరవించే వ్యక్తి గూర్చి........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి