4, ఆగస్టు 2020, మంగళవారం

రాజేశ్వరి పరిటి

అయ్యగారి వారి మరో ఆణిముత్యం...
“శ్రీ కళా పూర్ణ” శ్రీమతి రాజేశ్వరీ పరిటి...

శారదా!శారదా “అంబోదర” పాడు గాంకాయ ఇత్తా, అంటూ వాళ్ళక్క వెంటపడుతోంది ఒక పసిపిల్ల. ఆశ్చర్యం ఎవరైనా చిన్నపిల్లలు వారి చేతికి చిక్కిన ఆహారం కానీ, బొమ్మ కానీ ఎవరికైనా ఇస్తారా? అరచి గోల చేస్తారు. జాగ్రత్తగా గమనించండి దేని కోసం వెంపర్లాడుతోంది ఆ పసిపాప? సంగీతం కోసం కదా! అక్కడ ఒక పువ్వు పుట్టగానే పరిమళిస్తోంది. ఇంత కంటే గొప్ప పరిచయం కావాలా రాజేశ్వరి గారికి?

స్నేహశీలి, మధురభాషిణి, జనసమన్వయకర్త, కార్యదీక్షాదక్షురాలు. కార్యనిర్వహణలో ముందుకు దూసుకుపోడమూ, విజయవంతంగా ముగించడం ఆవిడ నైజం.

చక్కని వాయిద్యం, జనరంజకంగా వాయిస్తారు. 50 సంవత్సరాలుగా ఆకాశవాణి, దూరదర్శన్, సంగీత సభా కార్యక్రమాల్లో దేశ విదేశాల్లో విజయపతాకం ఎగుర వేసారు, వేస్తున్నారు, వేస్తునే వుంటారు.

16 సంవత్సరాల చిరు ప్రాయానికే వీణలో ఆంధ్రా యూనివర్సిటీ డిప్లొమా డిస్టింక్షన్లో పాస్ అయి, రేడియో ఆడిషన్ పూర్తి చేసుకుని, రేడియో కళాకారిణిగా మారారు.

వెన్వెంటనే ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ లెక్చరర్ శ్రీ పరిటి జగన్నాధరావు గారి సతీమణిగా మారేరు. కాలక్రమేణా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. గృహిణిగా గృహస్తు ధర్మం చక్కగా నిర్వహిస్తూ, తను విద్యాపరంగా ఎదుగుతూ, తన పిల్లలను సంగీత సారస్వతాలలో నిష్ణాతులను చేస్తూ, శిష్యులకు విద్య బోధిస్తూ గురుతరమైన బాధ్యత నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ జగన్నాధ రావు గారి పాత్ర మిక్కిలి అభినందనీయం.
వారి ప్రోత్సాహం అద్వితీయమైనది. ఒక స్త్రీ వివాహానంతరం, ఏదైనా సాధిస్తే దానికి కారణం ఆమె భర్త.

రాజేశ్వరి గారిని సంగీత పరంగా ప్రోత్సహించడమే కాదు, పియుసీ అయిన వెంటనే వివాహం జరిగిన ఆమెను, MA socialogy. MA music చేయించారు. పిల్లలందరనూ వృధ్ధిలోకి తెచ్చి, వారి ప్రగతినీ, తను నాటిన పంట కాపునూ, భూమికి సమాంతర స్థాయిలో చూస్తే సరిగ్గా కనపడదనుకున్నట్లున్నారు, పైనుండి చూద్దామనే ప్రయత్నంలో దివికేగి, ఆశీస్సుల వర్షం అక్కడ నుండీ భార్యా పిల్లలపై, మనవలపై సదా ఎడతెగకుండా కురిపిస్తున్నారు, కురిపిస్తునే వుంటారు. 🙏🙏🙏

వారు వుండగానే రాజేశ్వరి గారు తెలుగు యూనివర్సిటీ ఫాకల్టీ మెంబరుగా చేరి, చక్కని శిష్యులను MA Veena లో తయారు చేసేరు. రేడియో కోఆర్డినేషన్ ప్రోగ్రాంలూ, దూరదర్శనలో అనేక కార్యక్రమల్లో, అనేక సభా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

1997 లో ముగ్గురు పిల్లల వివాహానంతరం, వారు ముగ్గురూ అమెరికా వాసులవ్వడం వలన, ఆవిడ అమెరికాకు వెళ్ళి, అక్కడ స్థిరపడి, అమెరికా పౌరురాలుగా వారు చేస్తున్న సంగీత సేవలు, వారి సంగీత కచేరీలు, సాధించిన ఘనతలు అమోఘం. అవి మరొక సారి ముచ్చటిస్తాను.


సంగీత ప్రయాణం...

చిన్నతనంలో బాపట్లలో అక్కా, అన్నా విద్యాభ్యాసం వింటూ,ఆకళింపు చేసుకుంటూ, విజయవాడ వచ్చిన దగ్గర నుండీ తండ్రిగారి వద్ద నిత్యం విద్యాభ్యాసం, సంగీత కళాశాలలో డిప్లమో చేరి విద్యనభ్యసిస్తూ డిస్టింక్షన్ లో ఉత్తీర్ణత సాధించి, వెన్వెంటనే రేడియో ఆడిషన్ లో ఉత్తీర్ణులై, క్రమంగా ఉన్నత శిఖరాలనధిరోహించారు.

గృహిణిగా ధర్మం నెరవేరుస్తూ, పిల్లలను విద్యా పరంగా పెంచుతూ, క్రమ క్రమంగా తాను ఎదుగుతూ వున్న క్రమంలో, తెలుగు యూనివర్సిటీలో  బోధనావకాశం రావడంతో, తనని తను మరింత పెంచుకున్నారు.

తరువాతి మజిలీ అమెరికా. అక్కడ నిజంగా ప్రతిభకి పని,వుంది, మెరుగు దిద్దబడతాం. శిష్యులను తయారు చేయడం ఒక ఎత్తయితే, కొత్త కొత్త కృతులు నేర్చుకోవడం, నేర్పించడం.గాత్రం బోధన, గాత్రంలో సముదాయ కృతులు సామూహికంగా పాడించడం, దీనితో పాటూ కచేరీలు. శిష్యులను కచేరీ స్థాయికి తీసుకు రావడం మొదలగు సంగీత సేవలో మునిగి పోయారు. తన పిల్లలనూ, మనవలనే గాక తన చెల్లెలి పిల్లలకూ మనవలకూ కూడా గురువై నిలచి వారిని చక్కని విద్వాంసులుగా రూపుదిద్దుతున్నారు.

చికాగో నగరంలో కర్ణాటక సంగీత ప్రాచుర్యానికి లాభాపేక్ష లేకుండా రాజవీణ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ స్థాపించారు
వీరి సంగీత సేవలను అభినందిస్తూ అమెరికా ఇలినాయి రాష్ట్రం వారు సత్కరించారు.

వెరసి చికాగో వాసులకు ఆవిడ ఒక వరం. అద్వితీయమైన గురువు.
ఆనందభరితులైన చికాగో సప్నా సంస్థవారు, ప్రతిష్టాత్మకమైన " శ్రీ కళాపూర్ణ" బిరుదుతో సత్కరించుకున్నారు.

వారు క్లీవ్లాండ్ ఉత్సవాలలో, సప్నా చికాగో, సిమానా అట్లాంటా, సీఫా కేలిఫోర్నియా సభలలో అనేక మార్లు వీణాకచేరీలనూ, .........., శిష్యులచే   " ప్రహ్లాద భక్త విజయం" "నౌకా చరితం" వంటి సంగీత రూపకాలనూ ప్రదర్శించారు.

తానా, ఆటా వంటి ప్రతిష్టాత్మక సభలు వారి సంగీత సేవలకు సముచిత గౌరవాన్ని అందించారు.అనేకమార్లు అమెరికాలోని టివీ స్చేషన్స్ లో కచేరీలను అందించారు.

రాజేశ్వరి గారు అనేక దూరదర్శన్ కార్యక్రమాల్లో సోలోగా, అనేక కార్యక్రమాలకు తన వంతు సహకారం,వీణతో ఇచ్చేరు.

ఆకాశవాణి A Grade  కళాకారిణిగా రేడియో అనేక వీణ కార్యక్రమాలు, రాగం తానం పల్లవులూ, కాన్సర్ట్స్. కోఆర్డినేషన్ కాన్సర్ట్స్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుల్లో రాష్ట్రాలలో ఆల్ ఇండియా రేడియో తరఫున వాయించారు. భారతదేశంలో అనేక సభలలో కచేరీలు చేసేరు.

ఒక గృహిణీ ఏ రంగంలోనైనా స్థిర పడ్డానికి, కొనసాగడానికీ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ, త్యాగాలను చేయవలసి వుంటుంది. ఆ విధంగా రాజేశ్వరిగారు కూడా తన సంగీత ప్రయాణంలో ముఖ్యావకాశాలను త్యాగాలు చేయవలసి వచ్చింది, చేసేరు.
ఇతర దేశంలో కాళ్ళూనుకుని ఈ విధంగా స్థిరపడ్డరంటే ఆవిడ కృషిని, పిల్లల సహకారం చెప్పుకోవలసినదే.

ఈ విధంగా తండ్రిగారు నేర్పిన విద్యకు
 సార్ధకత చేకూరూస్తూ, తండ్రి గారి వాంఛ అయిన " అయ్యగారి వీణా బాణీ" ఖండాంతర వ్యాప్తికి సాయశక్తులా కృషి చేస్తూ "పితృ ఋణం"తీర్చుకుంటున్న ధన్యజీవి మన రాజేశ్వరీ పరిటి గారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి