25, ఆగస్టు 2020, మంగళవారం

సర్వలక్ష్మి

మహా మనీషి- శ్రీమతి సర్వలక్ష్మి గారి శతజయంతి నివాళి.....

నిస్వార్ధంగా, అహర్నిశలు శ్రమించి, తండ్రి బాధ్యతలు తలకెత్తుకుని, అక్క చెల్లెళ్ళు వారి పిల్లలూ, అన్నదమ్ములూ వారి పిల్లలను తన వారిగా భావించి, తన పరా బేధం లేకుండా అవిశ్రాంతంగా జీవన పోరాటం సాగించిన కర్మయోగి.

మహా సౌందర్యవతి. బాహ్య, అంతః సౌందర్యానికి నిలువెత్తు దర్పణం.మంచి విద్యావేత్త. తన గౌరవం, హుందాతనం చివరి దాకా చెక్కు చెదరనిన్వని గొప్ప లక్షణం ఆవిడ సొంతం.

ఆవిడ ఒక్క క్షణం కూడా సహనం కోల్పోయి దుర్భాషలాడిన దాఖలాలు లేవు. ఎవరైనా అర్హులకు చివాట్లు పెట్టి వుండవచ్చు. (అమ్మలా కాపాడినప్పుడు, అమ్మలా చీవాట్లు పెట్టే అర్హత వుంటుందిగా).

అక్కయ్యా! మేమందరం నీ పిల్లలమే. మమ్మల్ని నీ శత జయంతి జరుపుకో నివ్వని ఈ కరోనా మహమ్మారిని తిట్టుకుంటూ... నీ ఆశీర్వాదము కోరుతున్న నీ పిల్లలు. 🙏🙏🙏🙏🙏

18, ఆగస్టు 2020, మంగళవారం

అయ్యగారి సోమేశ్వర రావుగారి విద్యాభ్యాసం

   శ్రీ అయ్యగారి సోమేశ్వర రావు గారి విద్యాభ్యాసం


ఎక్కడో పుల్లతో ఖాళీ డబ్బా మీద లయ బధ్ధంగా, సున్నితంగా, వినసొంపుగా వాయిస్తున్నారు ఎవరో. ఎవరా అని వెతకి చూస్తే చాటుగా కూర్చుని వాయిస్తున్నాడు మనవడు. 

అమ్మమ్మ తిరగలి విసిరి వెళ్ళాక ఆ బాలుడే అక్కడ కూర్చుని తిరగలి తిప్పుతూ చక్కగా పాడుతున్నాడు.( ఎందుకు అంటే అప్పట్లో రేడియో లేదు గ్రామ్ ఫోన్ రికార్డ్ ప్లేయర్ లో ప్లేట్ తిరగడం చూసి వుంటాడా చిన్ని బాలుడు. దానిని గ్రామ్ ఫోన్ ప్లేట్ గా భావించి దానిని చేతితో తిప్పుతూ తనే పాడుతున్నాడు)

ఇంట సంగీతపు ఛాయలు తక్కువే. తండ్రీ , పెద్ద అన్నగారూ వేద ఘనాపాటీలు. తల్లికి పెద్దగా సంగీతాభిరుచి వున్నట్టుగా తెలీదు. మరి ఈ చిన్నారికి సంగీతాభి రుచి ఎలా కల్గిందో? ముఖే ముఖే సరస్వతి. బహుశః చతుర్వేదాలలోని సామ వేదం నుండి పుట్టింది కదా సంగీతం, తండ్రి గారి అంశ అయ్యుంటుంది. 

 ఇక అసలు విషయానికి వద్దాం........
ఇక ఆ బాలుని తీసుకుని బాలుని అమ్మమ్మ శ్రీలక్ష్మమ్మగారు "విజయ రామ గాన పాఠశాల" ప్రిన్సిపాల్ శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారి వద్దకు తీసుకెళ్ళి ఈ విషయం అంతా చెప్పేరు. (నారయణదాసు గారు వారి అమ్మమ్మగారికి పిన మామగారు) నారాయణ దాసు గారు ఆ బాలుని కళాశాలలో గాత్రం లో పేరి బాబు గారి వద్ద చేర్చమని, వీణ వాసా వెంకట రావు గారి వద్ద చేర్పించారట. అప్పట్లో డిప్లమో 10 సంవత్సరాలు. 

ఇంకా సందేహ మెందుకు ఆ బాలుడే వర్తమానంలో "వీణా కోవిద" "వైణిక శిరోమణి" శ్రీ అయ్యగారి సోమేశ్వర రావు గారు. 

శ్రీ సోమేశ్వర రావు గారు కళాశాలలో చేరేటప్పుడు ప్రిన్సిపాల్ గా వున్న నారాయణదాసు గారు రిటైర్ అవ్వడం, ద్వారం వెంకట స్వామి గారు ఆ స్థానం లోకి రావడం అన్నీ ఆ 10 సం।। కాలంలో జరిగింది. ద్వారం వెంకట స్వామి నాయుడు గారు తనతో కూడా వాయించమని సాధన చేయించేవారట.

మహరాజా సత్రంలో 10 సం।। భోజనం, కళాశాలలో బయట దూరంగా వున్న పెద్ద గదిలో (హస్తబల్) స్నేహితులతో కలపి బస. 

మేము ఆ మధ్య విజయనగరం వెళ్ళినప్పుడు ఆ గదిని దర్శించి మనస్సులో నమస్కరించుకున్నాం. మహా మహులు నివశించిన చోటు.  ఘంటశాల మా మామగారికి జూనియర్. మా మామగారు డిప్లమా అవుతుండగా వారు చిన్న తరగతులలో వుండేవారట. ఇలాగే సత్రం భోజనం, ఆగదిలో వసతి.

అప్పట్లో విజయనగరం సంగీత కళాశాల ఒక్కటే వుండడం వల్ల అన్ని చోట్ల నుండీ విద్యార్ధులు వచ్చి సత్రం భోజనం ఆ గదిలో మకాం. 

అన్నట్లు విజయ రామ గాన పాఠశాల చాగంటి గంగ బాబు గారనే అంధ విద్యార్ధి వయోలిన్ నేర్చుకోడం కోసం మహరాజు గారు ఏర్పాటు చేసేరట. అది ఈ నాటి విజయనగరం సంగీత కళాశాలగా వేవేల మంది కళాకారులను తయారుచేసి, ఆంధ్ర దేశానికి అందించింది. మన ఆంధ్ర దేశ చరిత్రకే మకుటాయమానమై , ఆంధ్ర మాతకు కలికి తురాయిగా నిలిచింది.


ఆహా యూరప్ 1

ఆహా యూరప్ .1

ఇంతక ముందు అనేకులు యూరప్ వెళ్లి ఉండవచ్ఛు, కానీ ఇది మా అనుభవం.

యూరప్ ట్రిప్ కి వెళదామని క్రితం సంవత్సరం అక్టోబర్ లో మా అల్లుడు కృష్ణకుమార్ చెబితేనే  ఆలోచన కలిగింది. అప్పుడు మేము అమెరికా లోనే ఉన్నాము.

వెంఠనే మా బంధువులని వెళదామని అడిగితే, మా పెద్ద ఆడపడచు శారద గారు, మా అన్నయ్యగారు పి ,ఆర్,కె రావు గారు వస్తామన్నారు.

మా రెండవ ఆడపడచు రాజేశ్వరి గారు కూడా వస్తామన్నారు, కానీ అనివార్య కారణాల వల్ల రాలేక పోయారు.

ఇక ఆలోచన వఛ్చినదే తడవుగా మా కుటుంబ సన్నిహితులు, స్నేహితులు, హితులు అయిన శ్రీ దుర్భా శ్రీరామా చంద్ర మూర్తి  గారికి  మా టూర్ గూర్చి సలహా ఇఛ్చి, మాకు సరి అయిన దిశా నిర్దేశం చెయ్యమని కోరడమయ్యినది.
వారు శ్రమ కోర్చి అన్ని విధాలా SOTC ద్వారా 10 nights, 11 days package మాకు అనువుగా ఉంటుందని  తీసుకోమని చెప్పేరు , మద్రాస్ SOTC వారితో మాట్లాడి  మాకు  అన్ని విధాలా వీలుగా  ఉండేలా  ఏర్పాటు చేసేరు.

 "VANAKKAM EUROPE" ఇది మా టూర్ పేరు. మద్రాస్ ప్యాకేజీ అయినా హైదరాబాద్ నుండి హైదరాబాద్ వచ్చేలా   ఏర్పాటు అయింది.

ఇక ఇండియా రాగానే స్నేహితులని కూడా ఎవరైనా వస్తారా అని వాకబు చేస్తే,

మా మరిది గారు రమేష్, భార్య పద్మజ .....
 మా డాక్టర్ గార్లు కృష్ణ సుబ్రహ్మణ్యం గారు, పద్మ గారు
మా స్నేహితులు వి,సి,రావు గారు,సావిత్రి గారు
దూరదర్శన్ విజయదుర్గ గారు
Electronic and Printing Media Dr K.B.Lakshmi గారు
అరుణ పెద్దింటి గారూ
కస్తూరి అలివేణి గారూ  రచయిత, గాయని
ఇక నేనూ, మా వారు అయ్యగారి శ్యామసుందరం గారు

మొత్త్తం 14 మంది ఒకే నేపధ్యం, ఒకే భావాలు,  కలసిన వాళ్ళం.  అందరూ వేర్వేరు రంగాల్లో నిష్ణాతులు. అయినా అందరూ  సామాన్యులగా మారిపోయిన  అసామాన్యులు, మాన్యులు.

  భూతల స్వర్గమైన యూరప్, ముఖ్యం గా స్విట్జర్లాండ్ సందర్శించుకుని అందమైన అనుభూతులతో, ఆరోగ్యంగా ఆనందంగా తిరిగి  వచ్చాం.

తిరిగి త్వరలో   SOTC ఏర్పాట్ల గూర్చి సవివరం గా వివరిస్తా..

                                                సశేషం 





14, ఆగస్టు 2020, శుక్రవారం

రాధ

 మన రాధ...


సౌజన్యం, సౌశీల్యం, సహనం, అమాయకత్వం కలబోసిన నిశ్శబ్ద సైనికురాలు, సహజ సౌందర్యవతి  మా రాధ. తన గొప్ప వ్యక్తిత్వమే తన ఆభరణాలు. వాటి ముందు ఈ విద్యలూ, చీరలూ, నగలూ అన్నీ దిగదుడుపే. 


రాధ గూర్చి మంచి తప్పితే ఏమైనా అనుక్కో గలమా? ముందు గానీ వెనక గానీ. అత్తగారి/అత్తవారి మనస్సులను జయించిన ఉత్తమ కోడలు,ఉత్తమ ఇల్లాలు, ఇప్పుడు ఉత్తమ అత్తగారు. కోడళ్ళకు ఆదర్శప్రాయురాలు. సతీ ధర్మాన్ని చక్కగా నిర్వహించే సపత్ని. 


చక్కగా వీణ నేర్చుకుంది, చక్కగా పాడుతుంది. అవసరమైనప్పుడు, అవకాశం వున్నప్పుడు క్లాసులు కూడా చెపుతుంది. 


అయ్యగారి వారికి దొరికిన పులి కడిగిన ముత్యం. (మరీ మెరుపు) మా/మన రాధ..... కదా!

రాజ్యలక్ష్మి

 మా రాజ్యలక్ష్మి... 


మా చిలకమ్మ. రాజ్యలక్ష్మి అనగానే నగుమోముతో కళ కళ లాడుతూ  కనిపించే ఒక అందమయిన గృహిణి మనకు గోచరిస్తుంది. 


ఎంత మందిలో వున్నా గలగలా.  అందరితో కలుపుగోలుగా ఆత్మీయంగా మనః పూర్వకంగా పలకరించి మాట్లాడుతుంది.


 అలంకరణ చేయడం ఇష్టం. చక్కటి సలహాలు ఇచ్చి పూజలూ, పెళ్ళిళ్ళ కార్యక్రమాలు, ఏ కార్యక్రమమైనా 

నిర్వహించ గలదు.


వీణ చాలా బాగా వాయిస్తుంది. కాకపోతే తను తన భర్తతో పాటే వీణ  వాయించాలని నియమం పెట్టుకోడం వల్ల విడిగా స్టేజ్ మీద వాయించదు. ఎంతో మంది శిష్యులను నిష్ణాతులుగా తయారు చేస్తున్నది. పతి సేవా పరాయణురాలు. 


అతిథులను ఆదరించడంలో అన్నపూర్ణా దేవి. 


అయ్యగారి వారికి తగిన కోడలు. ముఖ్యంగా సత్యప్రసాద్ కు దొరికిన జాతి  వజ్రం.

12, ఆగస్టు 2020, బుధవారం

కాలం మార్పులు

చిన్నప్పటి విషయం గుర్తు చేసుకుంటూ, కాలంలో మార్పుల గూర్చి మాట్లాడుకుందామా!

మేడ మీద పడుక్కుని వుండగా చల్లగాలిలో దూరంగా ఎక్కడి నుండో చక్కటి పాటలు వినిపిస్తుండగా, చందమామను చూస్తూ, నక్షత్రాలు లెఖ్ఖపెట్టుకుంటూ ఆద మరచి పడుక్కున్నప్పుడు, చిన్న తుంపరగా వాన పడడం మొదలవగానే, ఎరగనట్లు పడుక్కుందామని ప్రయత్నించడం, వానదేముడు మన టక్కులు గ్రహించి పేధ్ధ పేధ్ధ చినుకుల రూపంలో ప్రవేశించడం, తప్పని సరిగా లేచి పక్క బట్టలన్నీ లుంగ చుట్టి కిందకి విసిరేసి, పరిగెట్టుకుంటూ కింద దిగగానే,ఠక్కున వాన ఆగి పోయి ఉడకపోత గుర్తుందా?

అలాగే పండు వెన్నెల అని పడుక్కున్న రోజు ఆ వెలుతురుకి ఎప్పటికీ నిద్ర పట్టకపోడం.

తరవాత నెమ్మదిగా pedastal fan, table fan, ceiling fan, room Ac నుండీ centrally air conditioned వరకూ అన్నీ చూసాం.

ఇందు మూలముగా తెలిసింది ఏమంటే నేను పాత తరం దాన్ని.

ఒప్పుకోను “అవును” అందామనుక్కుంటున్నారేమో?

Never say Never again! 😃

సత్యప్రసాద్

 అయ్యగారి వారి మరో ఆణి ముత్యం...

అయ్యగారి సత్యప్రసాద్....  


మొహమాటం, మంచితనం, ముక్కుసూటితనం, మర్యాద, మన్ననలకు ప్రతి రూపం మా సత్య ప్రసాద్.


అతని వాయిద్యం ఒక జలపాతం. ఎవ్వరి పొగడ్తలనూ ఆశించని ఒక మౌన తపస్వి. కీర్తనా రచనా వ్యాసాంగమునకు కూడా శ్రీకారం చుట్టారాయన. ముందు ముందు వారి నుండీ మరిన్ని రచనలు ఆశిస్తున్నాం.


సీనియర్ బిహై కళాకారుడిగా అనేక సన్మానాలు సత్కారాలు పొందిన నిగర్వి. తన గమ్యం తనే నిర్దేశించుకొని లక్ష్య సిధ్ధికై అను నిత్యం కృషి చేస్తారు. 


ఆశ్చర్యదాయకంగా ఈ ఇంట పుట్టిన ప్రతి వారికీ సంగీతమే ఉఛ్ఛ్వాస నిశ్వాసలు. 


సత్య ప్రసాద్ గారు అనేక వాద్య పరికరాలు అలవోకగా పలికిస్తారు. 

సంగీతామృతాన్ని ఆధ్యాత్మికతతో కలబోసి ఆస్వాదించే నిజమైన సంగీత తపస్వి. 


వారి వాయిద్యం మనలో ఉత్సాహాన్నీ, ఉత్సుకతనీ పెంపొందిస్తుంది. రాగం తానం పల్లవులు, కాన్సర్ట్స్,రాష్ట్ర మంతా అనేక మార్లు   ప్రసార మయ్యింది. శహభాష్ అనిపించుకుంటున్న కచేరీలు దేశ మంతటా ఎన్నో ఎన్నెన్నో. 


తన భార్యకూ, కొడకుకూ, కోడలుకూ, మనవడు అయ్యగారి సంజయ్ సిధ్ధార్ధకు, వారి మరో మనవడు రిషికీ  (మనవడూ-మనవాడు అయిన..కాబోయే మరో బుజ్జి మహా విద్వాంసుడు వీరింట "రిషి" అనే నామధేయంతో పెరుగుతున్నాడు)  వీణ నేర్పుతూ, భార్యను తన ప్రక్కన వీణ వాయింపించుతూ తండ్రి ఋణం తీర్చుకుంటున్నారు. ధన్యజీవి.



అంతేకాదు అనేక వందల మంది శిష్యులను తయారు చేస్తున్నారు గత 45 సంవత్సరాలుగా. సంగీత కళాశాలలో వీణా, థియరీ బోధకుడిగా 30 సంవత్సరముల అనుభవములో అనేక శిష్యులను డిప్లమోలుగా తీర్చిదిద్దారు. 


వీరి వీణా ప్రయాణం గూర్చి రాయడానికి ఎంతో వుంది కానీ  నాకు లభ్యమవ లేదు. నాకు తెలిసిన వివరాలు ఇక్కడ పొందుపరచ గలిగాను.


వెరసి సర్వకాల సర్వావస్థల యందూ సంగీతమే వారి జీవితం, జీవనం.

శారదాదేవి

 అయ్యగారి వారి మరో ఆణిముత్యం.... 


శారదా పర దేవతా

వర నారదాది వందిత చరణా


శ్రీమతి శారదా దేవి... తండ్రికి ముద్దుల తనయ. ఎంత ముద్దంటే బాపట్లలో వారింటికి " శారదా నిలయం" అని పేరు పెట్టకునేంత. 

తన కుమార్తె పుట్టిన రోజు కానుకగా " అమ్మలు గాడి పుట్టిన రోజు నేడు- మా బాగా జరిగినదే " అని కళ్యాణి రాగంలో ఆ రోజు వాయించిన కచేరీలో వాయించేంత. " లయ బ్రహ్మ" అని పిలుచుకునేంత. 


శ్రీ అయ్యగారి సోమేశ్వర రావు గారి కూతురు శారదా, కొడుకు శ్యామసుందరం కలిసి 3 కాలాలూ వచ్చిన కోర్స్ అంతా తాళం వేసి పాడ వలసినదే ప్రతీ రోజూ. ఆయన నిద్ర పోతున్నా ఆపుదామనుకుందుకు లేదు, వెంఠనే మెలుకువ వచ్చి మృదంగం వాయించేస్తారు ఇద్దరి వీపుల మీదా. అంతకఠోర సాధన, ఆ వెన్వెంఠనే కచేరీలలో తనతో వాయింపించడం. మంచి  గాత్ర, వాద్య శిక్షణ గరిపి, చక్కని విద్యతో తీర్చి దిద్దారు. . 14 సంవత్సరాల వయస్సులో విజయవాడ వచ్చిన తరువాత సంగీత కళాశాలలో మొదటి బాచ్ విద్యార్ధినిగా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలయ్యారు. రేడియో కాంపిటీషన్ లో లోకల్ లో ఉత్తీర్ణత పొంది ఫైనల్ కాంపిటీషన్ మద్రాసులో జరుగగా రంగనాయకీ రాజగోపాలన్ వంటి వారితో పోటీపడి మంచి పొగడ్తలను పొందారట. బహుమతులు రావాలంటే అనేక అగడ్తలు దాటాలి కానీ, బహుమతికీ పొగడ్తకూ పొంతన కుదరదు. అందరితో శహభాష్ అనిపించుకున్నారు అదే వెయ్యి బహుమతులకు సమానం. అనేక కచేరీలు గాత్రం వీణలలో చేసేకు. 


తరువాత పెళ్ళి జరిగి,ఉత్తర భారత దేశం వెళ్లి పోడంలో, అప్పట్లో అక్కడి వాతావరణం సంగీతానికి అంత అనుకూలంగా లేక, భౌతికంగా వీణ దూరం పెట్టారు కానీ వచ్చిన విద్య ఎల్లప్పుడూ మరువ లేరు, మరవరు, మరువ లేదు. అద్భుతంగా పాడతారు. చక్కటి స్వర కల్పనా చాతుర్యం నేడు కూడా.

 సంగీతాన్ని చక్కగా ఆస్వాదిస్తారు. బేరీజు వేయగలరు. ఈ ఇంట ఎవరితోనూ తీసిపోని స్థాయిలో వుండ వలసిన కళాకారిణి. వీరిని అధిగమించాలనే ప్రయత్నంలోనే  శ్రీ శ్యామసుందరం గారి నేటి ఈ  విద్వత్ రూపం. అక్కయ్య సమం స్వరకల్పన వేస్తుంటే తమ్ముడు విన్యాసం వేయడంట. ఇద్దరూ రేడియోలో అనేక బాలానంద కార్యక్రమాలలో, సంగీత రూపకాలలో పాల్గొన్నారు. 


ప్రేమా, ఆత్మీయత, అనురాగం, కలబోస్తే శారదా దేవి గారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ నాన్నగారి ప్రతిరూపం. వండడంలో, వడ్డనలో సాక్షాత్తు అన్నపూర్ణా దేవి. 


వెరసి మా అందరకూ బహు ప్రీతి పాత్రమైన మా ఇంటి పెద్ద మా పెద్ద ఆడపడచు. 🙏🙏🙏


రేపు మేము అందరం అమితంగా గౌరవించే వ్యక్తి గూర్చి........

దేముడు

 దేముడు


దేముడిని చూస్తారా? నల్లగుంట కూరగాయల మార్కెట్ పక్క సందులో  పిబిఆర్ ఎస్టేట్స్ లో వుంటారు. 


సహనానికి మారు పేరు. సంస్కారానికి మరో రూపం. 


ఎంతో పెద్ద పదవి నిర్వహించినా, ఆకాశంపై విహరించరు. భూమిపైనే నడుస్తారు. చక్కని వాచకం. సభ్య సమాజంలో ఎలా అందరితో కలసి మెలసి వుండాలి ఆయనని చూసి నేర్చుకో వలసిన వ్యక్తి. భేషజం లేదు, తెలీదు. 


నొప్పింపక తానొవ్వక చక్కని వ్యవహార శైలి నడిపే ధన్యలు. 


మరి వారు అయ్యగారి వారికి దొరికిన ప్లాటినమ్ గొలుసులో వేసిన "అన్మోల్ మోతీ" కాదంటారా? 


ఆయన ఎవరో మీ అందరూ ఈపాటికి గ్రహించే వుంటారు. 


చెప్పుకోండి చూద్దాం ఎవరో వారు.....

7, ఆగస్టు 2020, శుక్రవారం

ఆదిత్య

 పుట్టిన రోజు జేజేలు ఆదిత్యా


అది 1974 . రాత్రి 10 గంటలు. చిమ్మ చీకటి.


నేనూ మా వారూ, మా అబ్బాయి బుజ్జి "ఆదిత్యా" ఫస్ట్ షో సినిమా చూసి ఇంటికి వచ్చాము. అసలయిన కధ ఇక్కడ మొదలవుతోంది.


జాగ్రత్తగా భయపడకుండా చదవండి. ఏమీ భయంలేదు, సరేనా? ఇక ముందుకెళ్దాము…………….


విజయవాడ లో మా ఇల్లు గవర్నమెంట్ క్వార్టర్స్. మేడ మీద ఇల్లు మాది. కింద రెండు , పైన రెండు ఇళ్ళు. పైకి వెళ్ళడానికి మధ్య నుండీ మెట్లు. మెట్ల గదికి కింద చక్కటి తలుపు.


అన్నట్లు ఇక్కడ ఒక విషయంచెప్పలి:- మా మేడ మీద ఎదురు పోర్షను వాళ్ళింట్లోకి, కింద మెట్ల తాలూకు కామను బల్బు కనక్షను ఉంది. పైన ఉన్న కనక్షను మాకు. దాని వల్ల మా ఎదురు ఇంటి ఆయన మెట్ల మీద బల్బ్ పెట్టనిచ్చే వారు కాదు. బిల్లు వాళ్ళు కట్టాల్సి వస్తుందని. మేము సొంతం గా ఏర్పాటు చేసుకోవచ్చని తెలీని అమాయకత. దాంతో మెట్ల తలుపు వేసెయ్యంగానే చిమ్మ చీకటి.

ఎప్పటి లాగానే కింద తలుపు గొళ్ళెం పెట్టి పైకి ఎక్కుతున్నాము, సగం మెట్లు ఎక్కగానే నా కాలు ఎవరో గట్టిగా పట్టుకున్నారు. నేను భయంతో దొంగా. దొంగా……..అని గట్టిగా కేకలు మొదలెట్టేను ఆ దొంగ నా రెండు కాళ్ళూ ఇంకా గట్టిగా పట్టు కున్నాడు.


నా అరుపుకి మా వారు కూడా చాలా………భయ పడి పోతూ ఏమయ్యిందని అరుస్తున్నారు. దొంగ నా కాళ్ళు వదడంలేదు. నేను భయంతో కాళ్ళు విదిలించుకుంటున్నాను.


ఇంతలొ ఈ హడావిడికి మా అత్తగారు ఖంగారు పడిపోతూ, తలుపు తీసేరు……………


దొంగ దొరికేడు.


దొంగ ముద్దుగా, బిత్తర చూపులతో, చిన్నిచిన్ని అరచేతుల తో , చిట్టి చిట్టి పాదాల తో, "అమ్మానన్నంటావా…………..దొంగననీ అంటావా? '' అని ప్రశ్నిస్తూ నుంచుని ఉన్నాడు.


అర్ధమయ్యిందనుక్కుంటాను. దొంగ ఎవరో.


ఎవరో కాదండీ మా అబ్బాయి "బుజ్జి ఆదిత్యే" ఆ ఇంటి దొంగ.


ఆదిత్య మొదటిసారిగా మమ్మల్ని అమ్మా నాన్నగారూ అని పిలిచి ఎనలేని ఆనందం కల్గ చేసాడు.అన్ని ఏళ్ళ క్రితం విషయాలూ కబుర్లూ నిన్నా మొన్నలా జ్ఞాపకాల మంజూషలో పదిలంగా పచ్చగా వున్నాయి.


వస పిట్టలా తను చెప్పిన కబుర్లు ఎన్నో ఎన్నెన్నో. “ చికల” ఎకల”., ఏంతి బంతి, “ లక్ష్మడికి ఆగాయిత్యం సీతా దేవికి  ఊ అంటే తప్పు, ఆ అంటే తప్పు” అంటూ రామాయణ ఘట్టం ఒకటి చెప్పడం నుంచీ రోజు రోజూ వేవేల జ్ఞాపకాలు.


చదువుకుంటున్న రోజుల్లో, నాతో అన్ని విషయాలూ వెనక వెనకే తిరుగుతూ చెప్పుతుంటే నేను కూడా కాలేజీకి వెళ్ళి చదువు కుంటున్న భావనలో వుండేదాన్ని (కాలేజీ గుమ్మం ఎక్కని దాన్ని).


తను MTech కి Calicut  వెళిపోతే, నాకు నిత్యం విజ్ఞానం ప్రసాదించే నా స్నేహితుడు  వెళ్ళి పోయాడని మనస్సు ఎంత దుఃఖించిందో. కానీ చక్కటి నడవడికతో, అక్కడ చాలా బాగా చదువుకొని, అక్కడ నుండి బెంగళూరులో CAIR లో Sr. Research fellowship తీసుకుని, తరవాత అక్కడే  scientist గా appoint అయి

, వివాహం చేసుకుని,ఇక అక్కడ నుండి అమెరికా వెళ్ళి భార్యా, కొడుకుతో కలపి సుఖజీవనం సాగిస్తున్నాడు.


నేను కోరుకున్న విధంగా సత్సాంగత్యంతో,సత్ప్రవర్తనతో, సన్మార్గంలో వెళ్ళే ఆదిత్య నా ప్రాణం. సుఖీభవా ఆదిత్యా.


వీణ, కీబోర్డ్ చాలా బాగా వాయించి, ఇంటి వారసత్వ సంపద అంది పుచ్చుకుని కొనసాగిస్తున్నాడ.


ఈ రోజు మా అబ్బాయి ఆదిత్య పుట్టిన రోజు. 

ఆదిత్యా! వంద సంవత్సరాలు నీ భార్యా టీనా, పిల్లవాడు తేజస్ తో , మనవలూ మునిమనవలతో కలపి చల్లగుండు బేటా.

దీర్ఘాయుష్మాన్ భవ, శతాయుష్మాన్ భవ, ఆయురారోగ్య ఐశ్వర్య , దిగ్విజయ ప్రాప్తిరస్తు. తథాస్తు తథాస్తు తథాస్తు

4, ఆగస్టు 2020, మంగళవారం

రాజేశ్వరి పరిటి

అయ్యగారి వారి మరో ఆణిముత్యం...
“శ్రీ కళా పూర్ణ” శ్రీమతి రాజేశ్వరీ పరిటి...

శారదా!శారదా “అంబోదర” పాడు గాంకాయ ఇత్తా, అంటూ వాళ్ళక్క వెంటపడుతోంది ఒక పసిపిల్ల. ఆశ్చర్యం ఎవరైనా చిన్నపిల్లలు వారి చేతికి చిక్కిన ఆహారం కానీ, బొమ్మ కానీ ఎవరికైనా ఇస్తారా? అరచి గోల చేస్తారు. జాగ్రత్తగా గమనించండి దేని కోసం వెంపర్లాడుతోంది ఆ పసిపాప? సంగీతం కోసం కదా! అక్కడ ఒక పువ్వు పుట్టగానే పరిమళిస్తోంది. ఇంత కంటే గొప్ప పరిచయం కావాలా రాజేశ్వరి గారికి?

స్నేహశీలి, మధురభాషిణి, జనసమన్వయకర్త, కార్యదీక్షాదక్షురాలు. కార్యనిర్వహణలో ముందుకు దూసుకుపోడమూ, విజయవంతంగా ముగించడం ఆవిడ నైజం.

చక్కని వాయిద్యం, జనరంజకంగా వాయిస్తారు. 50 సంవత్సరాలుగా ఆకాశవాణి, దూరదర్శన్, సంగీత సభా కార్యక్రమాల్లో దేశ విదేశాల్లో విజయపతాకం ఎగుర వేసారు, వేస్తున్నారు, వేస్తునే వుంటారు.

16 సంవత్సరాల చిరు ప్రాయానికే వీణలో ఆంధ్రా యూనివర్సిటీ డిప్లొమా డిస్టింక్షన్లో పాస్ అయి, రేడియో ఆడిషన్ పూర్తి చేసుకుని, రేడియో కళాకారిణిగా మారారు.

వెన్వెంటనే ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ లెక్చరర్ శ్రీ పరిటి జగన్నాధరావు గారి సతీమణిగా మారేరు. కాలక్రమేణా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. గృహిణిగా గృహస్తు ధర్మం చక్కగా నిర్వహిస్తూ, తను విద్యాపరంగా ఎదుగుతూ, తన పిల్లలను సంగీత సారస్వతాలలో నిష్ణాతులను చేస్తూ, శిష్యులకు విద్య బోధిస్తూ గురుతరమైన బాధ్యత నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ జగన్నాధ రావు గారి పాత్ర మిక్కిలి అభినందనీయం.
వారి ప్రోత్సాహం అద్వితీయమైనది. ఒక స్త్రీ వివాహానంతరం, ఏదైనా సాధిస్తే దానికి కారణం ఆమె భర్త.

రాజేశ్వరి గారిని సంగీత పరంగా ప్రోత్సహించడమే కాదు, పియుసీ అయిన వెంటనే వివాహం జరిగిన ఆమెను, MA socialogy. MA music చేయించారు. పిల్లలందరనూ వృధ్ధిలోకి తెచ్చి, వారి ప్రగతినీ, తను నాటిన పంట కాపునూ, భూమికి సమాంతర స్థాయిలో చూస్తే సరిగ్గా కనపడదనుకున్నట్లున్నారు, పైనుండి చూద్దామనే ప్రయత్నంలో దివికేగి, ఆశీస్సుల వర్షం అక్కడ నుండీ భార్యా పిల్లలపై, మనవలపై సదా ఎడతెగకుండా కురిపిస్తున్నారు, కురిపిస్తునే వుంటారు. 🙏🙏🙏

వారు వుండగానే రాజేశ్వరి గారు తెలుగు యూనివర్సిటీ ఫాకల్టీ మెంబరుగా చేరి, చక్కని శిష్యులను MA Veena లో తయారు చేసేరు. రేడియో కోఆర్డినేషన్ ప్రోగ్రాంలూ, దూరదర్శనలో అనేక కార్యక్రమల్లో, అనేక సభా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

1997 లో ముగ్గురు పిల్లల వివాహానంతరం, వారు ముగ్గురూ అమెరికా వాసులవ్వడం వలన, ఆవిడ అమెరికాకు వెళ్ళి, అక్కడ స్థిరపడి, అమెరికా పౌరురాలుగా వారు చేస్తున్న సంగీత సేవలు, వారి సంగీత కచేరీలు, సాధించిన ఘనతలు అమోఘం. అవి మరొక సారి ముచ్చటిస్తాను.


సంగీత ప్రయాణం...

చిన్నతనంలో బాపట్లలో అక్కా, అన్నా విద్యాభ్యాసం వింటూ,ఆకళింపు చేసుకుంటూ, విజయవాడ వచ్చిన దగ్గర నుండీ తండ్రిగారి వద్ద నిత్యం విద్యాభ్యాసం, సంగీత కళాశాలలో డిప్లమో చేరి విద్యనభ్యసిస్తూ డిస్టింక్షన్ లో ఉత్తీర్ణత సాధించి, వెన్వెంటనే రేడియో ఆడిషన్ లో ఉత్తీర్ణులై, క్రమంగా ఉన్నత శిఖరాలనధిరోహించారు.

గృహిణిగా ధర్మం నెరవేరుస్తూ, పిల్లలను విద్యా పరంగా పెంచుతూ, క్రమ క్రమంగా తాను ఎదుగుతూ వున్న క్రమంలో, తెలుగు యూనివర్సిటీలో  బోధనావకాశం రావడంతో, తనని తను మరింత పెంచుకున్నారు.

తరువాతి మజిలీ అమెరికా. అక్కడ నిజంగా ప్రతిభకి పని,వుంది, మెరుగు దిద్దబడతాం. శిష్యులను తయారు చేయడం ఒక ఎత్తయితే, కొత్త కొత్త కృతులు నేర్చుకోవడం, నేర్పించడం.గాత్రం బోధన, గాత్రంలో సముదాయ కృతులు సామూహికంగా పాడించడం, దీనితో పాటూ కచేరీలు. శిష్యులను కచేరీ స్థాయికి తీసుకు రావడం మొదలగు సంగీత సేవలో మునిగి పోయారు. తన పిల్లలనూ, మనవలనే గాక తన చెల్లెలి పిల్లలకూ మనవలకూ కూడా గురువై నిలచి వారిని చక్కని విద్వాంసులుగా రూపుదిద్దుతున్నారు.

చికాగో నగరంలో కర్ణాటక సంగీత ప్రాచుర్యానికి లాభాపేక్ష లేకుండా రాజవీణ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ స్థాపించారు
వీరి సంగీత సేవలను అభినందిస్తూ అమెరికా ఇలినాయి రాష్ట్రం వారు సత్కరించారు.

వెరసి చికాగో వాసులకు ఆవిడ ఒక వరం. అద్వితీయమైన గురువు.
ఆనందభరితులైన చికాగో సప్నా సంస్థవారు, ప్రతిష్టాత్మకమైన " శ్రీ కళాపూర్ణ" బిరుదుతో సత్కరించుకున్నారు.

వారు క్లీవ్లాండ్ ఉత్సవాలలో, సప్నా చికాగో, సిమానా అట్లాంటా, సీఫా కేలిఫోర్నియా సభలలో అనేక మార్లు వీణాకచేరీలనూ, .........., శిష్యులచే   " ప్రహ్లాద భక్త విజయం" "నౌకా చరితం" వంటి సంగీత రూపకాలనూ ప్రదర్శించారు.

తానా, ఆటా వంటి ప్రతిష్టాత్మక సభలు వారి సంగీత సేవలకు సముచిత గౌరవాన్ని అందించారు.అనేకమార్లు అమెరికాలోని టివీ స్చేషన్స్ లో కచేరీలను అందించారు.

రాజేశ్వరి గారు అనేక దూరదర్శన్ కార్యక్రమాల్లో సోలోగా, అనేక కార్యక్రమాలకు తన వంతు సహకారం,వీణతో ఇచ్చేరు.

ఆకాశవాణి A Grade  కళాకారిణిగా రేడియో అనేక వీణ కార్యక్రమాలు, రాగం తానం పల్లవులూ, కాన్సర్ట్స్. కోఆర్డినేషన్ కాన్సర్ట్స్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుల్లో రాష్ట్రాలలో ఆల్ ఇండియా రేడియో తరఫున వాయించారు. భారతదేశంలో అనేక సభలలో కచేరీలు చేసేరు.

ఒక గృహిణీ ఏ రంగంలోనైనా స్థిర పడ్డానికి, కొనసాగడానికీ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ, త్యాగాలను చేయవలసి వుంటుంది. ఆ విధంగా రాజేశ్వరిగారు కూడా తన సంగీత ప్రయాణంలో ముఖ్యావకాశాలను త్యాగాలు చేయవలసి వచ్చింది, చేసేరు.
ఇతర దేశంలో కాళ్ళూనుకుని ఈ విధంగా స్థిరపడ్డరంటే ఆవిడ కృషిని, పిల్లల సహకారం చెప్పుకోవలసినదే.

ఈ విధంగా తండ్రిగారు నేర్పిన విద్యకు
 సార్ధకత చేకూరూస్తూ, తండ్రి గారి వాంఛ అయిన " అయ్యగారి వీణా బాణీ" ఖండాంతర వ్యాప్తికి సాయశక్తులా కృషి చేస్తూ "పితృ ఋణం"తీర్చుకుంటున్న ధన్యజీవి మన రాజేశ్వరీ పరిటి గారు.

ఉమాచంద్ర శేఖర్

శ్రీ ఉమాచంద్రశేఖర్ - శ్రీ అయ్యగారి సోమేశ్వర రావు  గారి కనిష్ట పుత్రుడు:

శ్రీ ఉమాచంద్రశేఖర్ గారు వీణ , గాత్ర సంగీతము లలో అత్యున్నత శ్రేణి డిప్లమో పత్రం పొందిన విద్వాంసులు .సంగీతమే శ్వాస, ధ్యాస. తండ్రిగారి, అన్నల, అడుగు జాడలలో స్వయంకృషితో సంగీతజ్ఞుడుగా ఎదిగిన కృషీవలుడు.
కేంద్ర ప్రభుత్వము వారి నవోదయ పాఠశాలలో సంగీతోపాధ్యాయుడిగా పని చేసినారు.

వీరు వీణ మాత్రమే గాక కీబోర్డు , హార్మోనియం, తబలా, ఢోలక్ , జాజ్ డ్రమ్ , బేస్ డ్రమ్ మొ॥ అనేక సంగీత వాద్య బృంద వాయిద్యము లన్నింటిలోను ప్రతిభ గలవారు.

6వ తరగతి  మెుదలు పిల్లలను శిష్యులు గా తీసుకుని వారందరకూ జాజ్ , కాంగో మరియు చిన్న చిన్న నృత్యముల లోనూ శిక్షణ ను ప్రారంభం చేస్తారు . యీ శిష్యులందరూ క్రమంగా   అన్ని సంగీత వాయిద్యముల లోనూ , జానపద సంగీతం, కూచిపూడి నృత్యములలోనూ  ఆసక్తి  గలవారై మంచి ప్రతిభావంతులుగా తయారగుచున్నారు .

శిష్యులందరూ భక్తి గీతాలు , జాతీయ గీతాలు మొ॥  అన్ని పాటలూ పాడగలరు. చాలా మంది శిష్యులు కీబోర్డు మీద పాటలన్నీ వాయించగలరు .

శిష్యబృందములు వంతుల వారీగా ప్రతిదినము ఉదయము ,  విద్యాలయమునందు కలసి అన్ని సంగీత వాయిద్యముల తో ప్రదర్శన జరుపుదురు .

చాలామంది శిష్యులు పాఠశాలలో  అన్ని సాంస్కృతిక కార్యక్రమముల లోనూ మరియు  యితరత్రా ప్రత్యేక వేడుక కార్యక్రమముల లోనూ పాల్గొనుచుందురు . వీరందరూ స్వతంత్రం గా ప్రదర్శన నీయగలిగిన సమర్ధులు.

గత 13 సం॥లు గా శిష్యబృందములు జాతీయ ప్రాంతీయ సమ్మేళన కార్యక్రమములలో పాల్గొనుచు  కూచిపూడి , డప్పు డాన్సు ప్రదర్శనలిస్తూ పెద్దలందరి మన్ననలను పొందుచున్నారు .

ట్రాన్సిస్టర్

నా జ్ఞాపకపు మంజూష నుండి మరొక జ్ఞాపిక..

1971 మే 15 అర్ధరాత్రి పెళ్ళి అయ్యింది. 16 న  అలక పాన్పు ఎక్కి పెళ్ళికొడుకు పగటి భోజనానికి రానని భీష్మించుకు కూర్చున్నాడు. ఆడ పెళ్ళి వారు ఉంగరం ఇస్తామంటారు. పెళ్ళికొడుకులుంగారు ట్రాన్సిస్టరు కావాలని అలక. ఉంగరం 80 రూ అరకాసు (4 గ్రాములది), మరి ట్రాన్సిస్టరో 200 రూపాయలు. ఆడపెళ్ళి వారు బయటకి నవ్వు మొహాలతో మాడ్లాడుతున్నా, 120 రూపాయలు ఎక్కువ పెట్టాల్సి వస్తుందని బాధ. బయట పడలేదులెండి.


ఇంతలో పెళ్ళి కూతురి మేనమామ
 నీకు ముగ్గురు సిస్టర్స్ వున్నారు కదా ఇంకా ఈ ట్రాన్సిస్టర్ ఎందుకూ అని జోకులు. పెళ్ళికూతురికి రాత్రే పెళ్ళయి పోయింది కాబట్టి లైసెన్స్ వచ్చేసిందనే ధైర్యంతో, గొడవయిపోతుందేమోనని భయంతో రారమ్మని చేయి పట్టి లాగడాలు. భలేగా వుంది సన్నివేశం.

సరే మింగ లేక కక్క లేక పెళ్ళి కొడకు కోరిక తీరుస్తామని మాట ఇవ్వడమైంది. కధ సమాప్తము.

కానీ ఈనాడు చూడండి ట్రాన్సిస్టర్ ధర 100 నుండీ వుంది కానీ, ఉంగరం ధర 20 వేలు వుంది.

ఏది ఏమైనా ఆ కాబోయే మహా విద్వాంసునకు ఉంగరం కన్నా ట్రాన్సిస్టర్ విలువే ఎక్కువ.

ఎన్ని కచేరీలు, నాటకాలు, సినిమా పాటలు, సంక్షిప్త శబ్ద చిత్రాలు విన్నామో. ఎన్ని రోజులు మమ్మల్ని ఒదలకుండా సేవ చేసిందో. మా " మర్ఫీ మినీ బాయ్"

లోకో భిన్న రుచిః.

మిరపకాయ బజ్జీలు

ఆహా పకోడీలు, అబ్బబ్బా మిరపకాయ బజ్జీలు, స్....సమోసాలు, ........................... పాలక్ పనీర్........షేజవాన్ నూడిల్స్, పాస్తా, ఆహా ఓహో ఇవన్నీ మనకిష్టమైనవే, మనకి తెలీని కొత్త కొత్త పేర్లు కూడానూ,( మనం తరవాణీ అన్నం బాచ్ కదా) అయినా భోజనాల, వంటలా, గ్రూపుల్లో వివరాలిస్తున్నప్పుడు, ఇంత మంది ఇన్ని రకాలు చేస్తుంటే మనమేమైనా తక్కువ తిన్నామా? ఈ రోజు వీటిలోంచి ఎలాగైనా ఒక్కటైనా చేయాల్సిందే అని భీషణ ప్రతిజ్ఞ చేసుకునీ..... చేసుకునీ.... చేసుకునీ...

😌 వాస్తవంలో పప్పు, కూరా, చారూ కానీ/ ఓ కూరా పచ్చడీ, పులుసు కానీ చేసి ముగించి, బాగుందా బాగుందా బాగుందా అని, ఎలాగైనా బాగుంది అనిపించుకుని భోజనం ముగించడం.

ఒకవేళ తప్పీ దారీ నేను చేస్తే, ఎందుకిలాంటివి నాకు? మా అమ్మ వండిన లాంటి సొరకాయ పప్పు, చారు కూరా చాలు, ఆకలి లేదు అనడం మా ఆయన వంతు. హమ్మయ్యా! నేను చేసిన వంటలే మంచివి. మంచి పనే చేసేనని తృప్తి పడిపోడం, ఇదీ వరస.

ఒకవేళ పెద్దవాళ్ళయి పోయిన లక్షణమా ఇది?

నో నో నో
 " ముసలి తనపు అడుగుల సడి వినపడితే, ఇంటలేడనీ చెప్పించు, ఇపుడు వీలు కాదనీ పంపించు" కదా మన సిధ్ధాంతం. ఎప్పటికీ కాము! ఏమిటీ ?....."పెద్ద" 🤫😀😃😃

ఉమాదేవి

(ఆ గతానికి స్వాగతం)....

నేనే ఉమాదేవిని. ఎందుకూ అంత ఆశ్చర్య చకితులవుతున్నారు. ఇంత మంది నా వాళ్ళు నాకిష్టమైన సంగీతం పాడుతుంటే నేను ఎక్కడకెళ్లగలను చెప్పండి, ఇక్కడే మీ మధ్యే తిరుగుతున్నా.  మా అక్క మీ అందరినీ పాడమంది కదా, నేను కూడా నా చిన్ని శిష్యుడు బబ్లూతో కలసి పాడుతాను, విని మీ
 అభిప్రాయాలు చెప్పాల్సిందే.

నా గురించి...

 నాకు ప్రకృతి ఇష్టం, అందమైనవి ఏమైనా ఇష్టం, వంటలిష్టం, పాటలు, మాటలు,చీరలు, నగలు, నవ్వులు, పువ్వులు, మనషులు, మమతలు, ఆటలూ, అందంగా తయారవ్వడం. వేయేల నాకు ఈ మానవ జన్మ ఇష్టం.

కానీ భగవంతుడు నన్ను ( 18 వ ఏటనుండి) కేవలం బాధల్ని భరించడానికే పుట్టించినట్లున్నాడు... అయినా చెదరని చిరునవ్వుతో జీవితపు challenges ని నా భర్త సహకారంతో  ఎదుర్కొంటూ.....నలుగురికీ నా సంగీత విద్యనే పంచి.... బాధలని..... భావోద్వేగాలనీ నాతోనే తీసికెళ్ళిపోయాను సెప్టెంబరు 2019 లో ...  అంత వరకూ, "మేమే బాధలు పడిపోతున్నాం అనుకునే ఎవ్వరైనా నా నుండి ఎంతైనా నేర్చుకోవాలి"  అనే విధంగానే బతికాను. .... అందరికీ ఆనందం  పంచి, అందులోంచి నా ఆనందాన్ని వెతుక్కున్నా.

మీ అందరికీ " పుత్తడి బొమ్మ పూర్ణమ్మ" పాట తెలుసుగా. అందులో పూర్ణమ్మలా అడుగుతున్నా " మీ అందరూ కలసి నప్పుడు ఒకసారి ఈ ఉమపిన్నిని తలచుకోండి"......

జ్ఞాపకాల పందిరి

"SUNDAY SPECIAL MORNING MANTRA"

జ్ఞాపకాల దొంతరలు 1

ఇదిగో మా జ్ఞాపకపు మంజూష నుండి కొన్ని జ్ఞాపకాలు.

ముందుగా చెప్పినట్లు ఇది మీ గురువులతో మీ  అనుభవాలు పంచుకునే వేదిక మీది అయితే మాకు, జీవశక్తిని ఇచ్చే జ్ఞాపకాల పత్రహరితము. జీవితేఛ్ఛను పంచే, పెంచే దివ్య ఔషధము.

నేను ఇందులోని శిష్యులకు దిశానిర్దేశం చేసేను కానీ, మీరు  ఇలా చెప్పమని నిర్దేశించలేదు. ఇవి మీ మనస్సు లోంచి వచ్చిన భావాలు.

మీ అందరూ పంపిన ఈ విషయాలు విడివిడిగా వుండడం కంటే, ఒకే చోట దండగా మార్చి దాచుకోవాలనే ఈ చిన్ని ఆలోచన... మాకు కలగగానే దీన్ని అందమైన పూమాలగా కూర్చడంలో నాకు సహకరించిన శైలు. నాకు నిరంతరం వెన్నంటి సలహా ఇచ్చిన అఖిల, కొన్ని ఆడియోలు అందించిన ఆదిత్యా, కళ్యాణులకు మనఃపూర్వక ఆశీస్సులు.

అయ్యో మాది ముందు రాలేదు అనుక్కోండి, ఇంకా రెండు పెట్టెలున్నాయి. సర్దుబాట్లలో ముందు వెనుక అయ్యుండచ్చు. ఖంగారు పడకండి, తప్పెట్టుకోకండి.

ప్రపంచంలో ఏదైనా డబ్బు పెట్టి కొనుక్కోగలము, ప్రేమా ఆపేక్ష, ఆత్మీయత తప్ప. కాదంటారా. అది మన వ్యక్తిత్వముతో  సంపాయించుకోవాలి. ఆ పరంగా మేము సంపూర్ణంగా కృతకృత్యులమయ్యామనే సంతృప్తితో, మా జ్ఞాపకపు మంజూష నుండి మొదటి భాగం  పంచుతున్నాను...ఆద్యంతం  చూడండి.. కాదు కాదు వినండి.... అంతెందుకు చూస్తూ వినండి...

సత్తుగిన్నె

"సత్తుగిన్నె"
                                   అవును  సత్తుగిన్నే.....ఇది  అటక సర్దుతుండగా  దొరకగానే, మనస్సు  పులకించింది.   ఎన్ని  స్మృతులు  దీనితో?...

  1971 లో  పెళ్లి  అయ్యి  హైదరాబాద్  కాపురానికి  పంపుతూ  మా పుట్టింటి  వాళ్ళు  పులుసులూ,  సాంబార్లూ,  చార్లూ  పెట్టుకోమని  మా  ఇద్దరికీ  ఇచ్చిన  సత్తుగిన్నె ఇది.(బుజ్జిది).

       ఇందులో  విశేషం ఏముంది పెద్ద,  అందరికీ  ఇస్తారుగా?  అదేనా  మీ  ఆలోచన...
కానీ మాకు  ఉందండోయ్!  మా  వారు  సికింద్రాబాద్  సంగీత  కళాశాలలో  కొలువు. డిసెంబర్లో  మద్రాస్  మ్యూజిక్ అకాడమీ  మాదిరిగా  రోజూ  రవీంద్రభారతిలో  త్రీ షోస్  సంగీత  ప్రోగ్రామ్స్  ఏర్పాటు  చేసేరు,  కల్చర్ డిపార్టుమెంటు  వారు.

   ఆ రోజు  ఫస్ట్ షో  M.S. Subbu Lakshmi  అమ్మ  ప్రోగ్రాం, సెకండ్ షో  బిర్జు  మహారాజ్  కథక్  డాన్స్ .  11.30 రాత్రి  దాకా  ప్రోగ్రాం  అయ్యింది,  అయ్యాక  బయలుదేరి  సీతాఫల్మండి  వచ్చాం.  ఇంటికి  రాగానే  మరి  భోజనం  చెయ్యాలిగా?

  చలి  కాలం  కాబట్టి  నేను  మధ్యానం  చేసి  వెళ్ళిన  సాంబార్ ఒక  ఒత్తుల  స్టవ్  మీదా,   రెండో స్టవ్  మీద  వండుకుని  వెళ్ళిన  అన్నం  వేడి  చేద్దామని  పెట్టి  నడుం  వాల్చి  మంచి  నిద్రలోకి  వెళ్లి  పోయాం.

   తెల్లవారుఝామున  4  వేళ   మెలుకువ  వచ్చి,  అబ్బ  ఎవరింట్లోనో  కండి పప్పు  మాడి పోతోంది,  ఇంత  పొద్దున్నే  మాడుస్తున్నారు  అనుక్కుంటూ  కళ్ళు  విప్పేసరికి  ఇల్లంతా  దీపావళి  లాగా  కాంతులీనుతూ ఉంది  లైట్లతో. వంటిట్లో  చూద్దుము  కదా ,  సాంబార్  నల్లగా తెట్టు కట్టేసింది  (ఈ సత్తుగిన్నే  అది,  తోమేసరికి  తాతలు  దిగోచ్చేరు) ఇప్పడి  వాళ్ళయితే  విసిరేస్తారు,  కానీ  అప్పుడు  దాచేను  కాబట్టే  ఈ  నాడు  ఈ  స్మృతి.

  ఇక కుక్కర్  లో  అన్నం  ఎర్ర   బియ్యం  అన్నంలాగా  ఎర్రగా  మారి  పోయి  స్టవ్  ఒంటి  కన్నుతో  వెలుగుతోంది.  సాంబార్  స్టవ్  కిరోసిన్   అయిపోయి  ఆరిపోయింది. 
 కాబట్టి  ఇంత  కధ  ఉంది  ఈ సత్తుగిన్నె  తో...

సరదాగా  మళ్ళీ ఇవాళ  దీనితో  మా ఇంట్లో  మంచి ఘుమ ఘుమ  లాడే  చారు....