30, ఏప్రిల్ 2015, గురువారం

పాలకోవా ఇల్లు

అవును నిజం!  మేము  ఐదు  ఏళ్ల  వయస్సులో  మా ఫ్రెండ్స్  కల్పకం,  గాయత్రీ  తో  కలసి  హైదరాబాద్  నుండి  విజయవాడ  పెళ్ళికి  వెళ్తూ  ఉండగా  ఒక  ఇల్లు  చూసాం....... ఇది  చదివి  మీరు  కూడా  చూసారా  చెప్పండి...
   మంచి  అడవిలో  ఉండగా  రైల్  ఆగిపోయింది.  అంతా నిశబ్దం .  నేను  మా చెల్లీ,  ఇద్దరు  ఫ్రండ్స్  దూరంగా  మిణుకు  మిణుకు  కనిపిస్తోంది  ఏమిటా అని  నెమ్మదిగా  నడుచుకుంటూ   వెళ్లాం.   వెళ్లి చూద్దుం  కదా  అక్కడ  అంత  తెల్లగా  పండు  వెన్నెల.  ఆ  వెన్నెలలో  ఒక  ఇల్లు.   ఆ ఇల్లు  చూస్తే  నూరూరిపోతుంది  ఎవరికైనా....  ఏమిటో  తెలుసా? 
    ఆ ఇంటి   గోడలన్నీ  పాలకోవా.  తలుపులన్నీ  కాడ్బరీ  చాక్లెట్లు .  రూఫ్  జున్ను,  కిటికీల  గ్రిల్ల్స్ అన్నీ  జిలేబీలు,  అన్నట్లు  నేల  కాజూ  బర్ఫీ,  వాటర్  పైప్స్  ఏమో  జంతికలు/మురుకులు,  డైనింగ్  టేబుల్  ఏమో  నేను  చేసేలాంటి  (గట్టి) మైసూర్పాక్ ,,  దాని  మీద  ఐస్  క్రీం,  రక  రకాల పళ్ళూ,  జీడి పప్పు  అన్నీ  పెద్ద  పెద్ద  గిన్నెల్లో  పెట్టి  ఉన్నాయి.  ఒక  వాటర్  పైప్ (జంతిక)  తిప్పితే  చెరుకు  రసం,  ఒక  దాన్లోంచి  మాజా,  ఇంకో  దాన్లో  స్ప్రైట్.   వెంటనే  నేను  ఒక  నిచ్చెన  వేసుకుని రూఫ్ కి కొంచెం  చిల్లు  పెట్టి  రూఫ్  తినేసి,  జంతిక  చివర  ఉన్న  చాక్లెట్  నల్లా   తిప్పి  మాజా  తాగేను.  అలాగే  మా స్నేహితులు,  మా చెల్లీ  కూడా.  ఇంతలో  రైల్  కూత  విని  పరుగెట్టుకుంటూ  ఆయాస  పడుతూ  రైల్  ఎక్కి  పైబెర్త్  ఎక్కేశాం.........
   బాగుందా కధ!.   ఇదంతా  పై బెర్త్  మహిమ.  మా  పిల్లలకి  ఒక  లోకాన్నిచ్చింది, . అలాగే   మాకు  ఒక  ఊహా జనిత  ప్రపంచాన్నిచ్చింది.  మాలో  సృజనాత్మకతకు తెర  తీసింది.
  మరి  ఇప్పుడు?  పైబెర్త్  వస్తే  ప్రయాణం  కాన్సిల్,  అదీ  పరిస్థితి.  పెద్ద  వాళ్ళమైపోయి  బాల్యాన్ని  ఎంత/ ఎలా  కోల్పోయాం?  ప్చ్  ప్చ్  ప్చ్.............మళ్ళీ  కలుద్దాం.....



28, ఏప్రిల్ 2015, మంగళవారం

ఇది మా అమ్మ నాన్నగారి పెళ్లి ఫోటో”.

  మా అమ్మా  నాన్నగారి పెళ్లి  ఫోటోలో  వారి  గురువుగార్లు,  తల్లి  తండ్రులతో  పాటూ వారి  ఇద్దరి మధ్య   రాయబారం  నడిపిన  రాజహంస   క్రింద  చేతులు  కట్టుకుని బుద్దిగా  కూర్చుంది  చూసారా?  పెద్దయ్యాక  వారు  ఆ  గడుగ్గాయకి  జీవితమంతా  కలసి  ఉండే  ఒక  మంచి  బహుమతిని  ఇచ్చేరు.  ఈ పాటికే  మీకు  నేను  చెప్పేది  అర్ధం అయ్యిన్దంకుంటున్నాను.
ఇక  గంగా భవాని  టీచర్..........
పక్క  వీధిలో  స్కూల్ ...... అంటే  పెద్ద  పెద్ద  భవంతులు కాదు. ఒక్కటే  గది.   25 మంది  విద్యార్ధులు. అక్కడ  నేను ఒకటి, రెండు తరగతులు చదివేను.
మీకు ఇవి గుర్తున్నాయా?...........బుర్రు పిట్ట  బుర్రు పిట్ట  తుర్రు  మన్నది   ఆది  వారమునాడు  అరటి  మొలచినది,  సోమవారము  నాడు  సుడి  వేసి  పెరిగినది.........” “కలవారి  కోడలు  కలికి  కామాక్షి  (గుర్తున్న  వారు  వీలైతే  కామెంట్స్లో   ఇవి  పూర్తిగా రాయండి  ప్లీజ్) 
ఇక  అసలయ్యింది  ఇక్కడుంది..........
      బావా  బావా పన్నీరు......”  గుర్తుందా..  అందులో  బావని  ఎంతో  అమానుషంగా   అగౌరవ  పరుస్తారు  కదా!  టీచర్గారు   ఆ లెస్సన్  ముందు  రోజు  చెప్పి  మర్నాడు  అప్పచెప్పమన్నారు. నేను ఒక రోజు టైం ఇచ్చినా  చెప్పలేక పోయాను. అందరూ లంచ్ కి ఇంటికి వెళ్లి  పొయ్యాక,  టీచర్గారు  వాళ్ళూ  వంటిట్లో  కూర్చుని  భోజనం చేస్తుండగా,  వెక్కి  వెక్కి  ఏడుస్తూ  వాళ్ళ  తలుపు దగ్గర చేతులు  కట్టుకుని  నుంచుని  అప్ప  చెప్పి  ఇంటికి  వెళ్ళా.  నాకు  ఏదైనా  అప్ప చెప్పమంటే  మహా అయితే  అరగంట  చాలు,  (ఇది  ఆత్మ విస్వాశం,  అతిశయం  కాదు)  కానీ  ఇది ఒక రోజైనా  రాలేదంటే  ఒక్కటే  కారణం , అది  మా  బావకి  అన్వయించుకుని ,  కనీసం  చదవడానికి  కూడా  ఇష్టపడలేదు. అంటే  ఎంత  చిన్నప్పటి నుండి ఇష్టమో  చూడండి.  ( అందుకనే  పుట్టగానే  ఇదుగో  నీ మొగుడూ...ఇదిగో నీ పెళ్ళాం  అని  చెప్పకూడదనుక్కుంట)
       బాపట్ల  మా  అమ్మమ్మ  వాళ్ళింటికి  సెలవలకి  4  ఏళ్ల వయసులో వెళితే  పూల జడ వేయించుకోడానికి  వెనక  వాళ్ళింటికి  వెళ్లి,  ఆవిడ సోమేశ్వర రావు వచ్చేడా?  అన్నారని  ఏడ్చుకుంటూ పూల జడ వేయించుకోకుండా వచ్చేసానట. వర్ధనమ్మ గారు మా  నాన్నగారిని వచ్చేడా?  అంటారా అని. అంత రోషం.
     సరే ఇక  ఆగష్టు 15 టీచర్గారు, మాస్టర్ గారు  ఇచ్చే  మరమరాలూ, బెల్లం,. పుట్నాలపప్పు  కలిపిన  పెద్ద  పోట్లాము ఎంత  బాగుండేది.  బోలెడన్ని  జాతీయ  గీతాలు  పాడేవారు  పెద్దలు.  ప్రతీ  శుక్రవారం  టీచర్ గారి  అక్క  టాకుఅనే   (బహుశా పాలగుమ్మి విశ్వనాధం గారి  భార్య అనుక్కుంట, సరిగ్గా  తెలీదు)  ఆవిడ  వచ్చి  ఎంత  బాగా  కధలు  చెప్పేవారో.  ఆవిడా  రాకకి  ఎదురు  చూసే  వాళ్ళం.  ఇలా  సాగింది  గంగా  భవానీ  టీచర్  స్కూల్లో  నా  విద్యాభ్యాసం.  మళ్ళీ  కలుద్దాం..........మీకు  బోర్  కొట్టడం  లేదు కదా?..........



గ్రేట్ వారియర్ మా అమ్మ..............


 అమ్మో  తప్పు  చేస్తే  అమ్మ  చంపేస్తుంది  అని  మేము,  భాను  ( అక్కయ్య/పిన్ని/ అమ్మమ్మ/ అత్తయ్య)  కోప్పడుతుందని  బంధువులు  అందరికీ  తన  ముందు,  కానీ  వెనక  కానీ  తప్పు  చెయ్యాలన్నా, అబద్ధం  చెప్పాలన్న  భయం.   ఎందుకంటే ఒప్పుకోదు.  తప్పు  చెయ్యనివ్వదు,  ఛస్తే   తప్పు  చేయదు. “That is Bhanumathi.”

మమ్మల్ని  చాలా చాలా  క్రమశిక్షణతో,  అవసరమయితే  శిక్షతో  సరి చేసింది. లెఖల్లో దిట్ట.  చదువులో  విపరీతమయిన  చురుకు.  తను స్కూల్  ఫైనల్  ఎగ్జామ్స్  ముందు రోజు  గాజులు  పెట్టిన్చుకుంది, రిజల్ట్స్  వచ్చిన మర్నాడు  నేను  పుట్టేనట.  ఊరంతటికీ  ఫస్ట్  వచ్చింది.  స్కూల్  పీపుల్  లీడర్. జీవితం  పట్ల  విపరీతమయిన  ఆశక్తి, అన్నీ  తెలుసు  కోవాలనే  జిజ్ఞాస. మల్టీ  టాలెంటెడ్  పర్సన్.  వీణ  వాయించేది,  బాగా  చదువుకునేది, రచనలు  చేసేది.
  మా అత్తగారి శిష్యురాలు  వీణలో.  వాళ్ళిద్దరి  అనుబంధం  ఒదినా- మరదల్లకీ, గురు శుష్యులకీ ఆదర్శ  ప్రాయం. క్రితం  పగడాల  ఉంగరం  చేయించేరు  గురువుగారికి.  ముఖ్యంగా  నా మొదటి  వీణ  గురువు మా అమ్మ.  గురువుగారంటే  ఎన లేని అభిమానం. చిన్నప్పుడు  గురు దక్షిణ  సమంగా  ఇచ్చేమో  లేదోనని  10 సంవత్సరాల 
  అన్తేన్డుకండీ!  మా అమ్మ  నాన్నగారు వాళ్ళ  గురువులకు  (అయ్యగారి సోమేశ్వర రావు గారు, అయ్యగారి జయకుమారి  గార్లకు)  నన్ను  గురుదక్షిణగా  సమర్పించి... నన్ను  వాళ్ళతో  సవ్యంగా  నడచుకుని,  చక్కగా వ్యవహరించి,  కుటుంబాన్ని చక్కగా చూసుకుని   మంచి  పేరు  తెచ్చుకోమని  ఆదేశించారు..  నేను  అలాగే  నడచుకున్నాను, నడచుకుంటున్నాను, నడచుకుంటాను.
 నేను  గర్వ పడే విషయం  ఏమంటే మా నాన్నగారు నాకు జన్మ అంటూ మళ్ళీ ఉంటే జయలక్ష్మే  నాకు  మళ్ళీ కూతురుగా పుట్టాలి అన్నారు.    మా అమ్మ పిల్లలంటే ఎవరికైనా  అభిమానం  ఉంటుంది, కానీ జయలక్ష్మి అంటే  మాకు  గౌరవంతో    కూడిన  అభిమానం. అని చెప్పారు.  అభిమానం  నా హక్కు,  గౌరవం  నేను సంపాయిన్చుకున్నది.  నా జన్మ  ధన్యం. 
కాకపోతే  చివర్లో  పులిలాంటి  మా అమ్మ  పిల్లిలా  అయిపోయి, కొన్ని  మర్చిపోయి,  యోగినిలా  నవ్వుతూ చూస్తూ ఉండి  పోయింది  మాట్లాడకుండా....... అటు వంటి  స్థితిలో  కూడా  చదువుకి  సంబందిన్చనవి మటుకూ  ఫుల్  పర్ఫెక్ట్. లేక్ఖలు  ఎంత క్లిష్టమైనవైన  క్షణాల్లో  చెప్పేది,  ఇంగ్లీష్ లో అమ్మ  సైట్  అర్ధం ఏమిటి అంటే ....సైట్ మూడు రకాలవి...అని.. Sight, site, cite అని చెప్పింది, పద్యాలు చెప్పింది, అలానే  ప్రైజ్  అంటే..రెండున్నాయి  praise, prize..అని  మొదటిది మనం  చేసిన ప్రయత్నానికి ఎదురు  వాళ్ళు ఇచ్చేది, రెండోది మనం  హక్కుగా సంపాయించు కునేదట.  బాగుందా?  అలానే  Pedestrians,  Trespassers  లాంటి  క్లిష్టమైన  పదాలకి అర్ధాలు చెప్పేరు,  పోయే ముందు మూడు  నెలల ముందు ఇదంతా... తెలుగు పద్యాలు  ఎన్నో చెప్పి  రాసుకోమంది,  కానీ అజ్ఞానం  వల్ల రాసుకోవచ్చులే అనుకున్నా,  ఫలితం అర్ధంయ్యిందనుక్కుంట..

   పాపం మా అమ్మ మొదటి  నుండి  ధైర్యంగా   పరిస్థితులతో  పోరాడింది,  చివరికి మృత్యువుతో  కూడా  పోరాడి   .అలసి  సొలసి  ఓడిపోయింది  తప్పని  పరిస్థితులలో.

నాన్నగారు.......

.
నాన్నగారు అనగానే... జీడిపప్పు, సీతాఫలాలు, ఎండాకాలంలో కిటికీలకి తడి పరదాలు కట్టి, వాటికి వట్టివేళ్ళ తడకలు కట్టి...పళ్ళాల్లో నీళ్ళు పోసి, పైనుండి ఫ్యాన్ వేసి, మమ్మల్నదరినీ చుట్టూ పడుక్కోబెట్టి ఎండా కాలం ఏసీ కింద పడుక్కున్న ఎఫెక్ట్ తెప్పించడం, రాత్రి పూట చక్కగా వీణ వాయించి నిద్ర పోగాట్టడం. ( తనకిష్టమయిన జనని నినువిన రీతిగౌళ, కేదారగౌళ లో కృతులు, శహన లో కృతులు, ఇంకా ఎన్నెన్నో). నా చేత రన్ & మార్టిన్ గ్రామర్ బుక్ BA Bed., ఇంగ్లీష్ & సోషల్ టీచర్గా వర్క్ చేసేరు చాలా కాలం), వాళ్ళ స్కూల్ గ్రంధాలయం నుండి మంచి మంచి బొమ్మలతో ఉన్న సింద్బాద్ కధలు, అరేబియన్ నైట్స్ తెచ్చి చదివి వినిపించడం.... డాక్టర్ గారి అమ్మాయిలతో కలపి సంగీతం వోకల్ నేర్చుకోడం ఎన్ని జ్ఞాపకాలో.
పొద్దున్న వాతావరణ సూచన రేడియోలో విని మా అమ్మగారు గాలిలో తేమను బట్టి వాన పడుతుందో లేదో చెబుతారు. మా నాన్నగారి అమితమైన ప్రేమ వల్ల వాన మొదలవ్వక పోయినా సరే ముందు జాగ్రత్త చర్యగా మాకు రైన్ కోట్స్ వేస్తారు. రైన్ కోట్స్ వేసుకుని చిక్కడపల్లి తోట దగ్గర మా ఇంటి నుండి ,మాడపాటి స్కూల్ దాక రోడ్ మీద వ్యోమగాముల్లాగా నేను మా చెల్లి ఇద్దరమే వింతగా వెళ్ళడం. వద్దంటే కోప్పడతారు, మాకేమో అవమానం. ఏంచేస్తాం కొన్ని సార్లు మాట వినక తప్పదుగా.
పాపం జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కున్టూ కూడా మమ్మల్ని మా అమ్మ నాన్నగారు ఎంతో ప్రేమగా క్రమశిక్షణతో పెంచేరు. అమ్మ నాన్నగారు మీకు మా నమస్సులు..........మీ ఋణం తీర్చుకోలేం.............

బాల్యం...మరి కొన్ని గుర్తులు......

"కాలాన్ని తిరిగి ఇవ్వలేని దేముడు, అద్భుతమయిన జ్ఞాపకాలను వరంగా ఇచ్చేడు"
       




అమ్మమ్మా వాళ్ళింట్లో ఉండగా వచ్చిన నాన్నగారికి, పొద్దున్నే లేచి "నాన్నగారూ! అమ్మకు తమ్ముడు పుట్టాడు" అని చెప్పడం గుర్తుంది. ( 'వైణిక సార్వభౌమ" పప్పు చంద్ర శేఖర్ పుట్టినప్పుడు) సెలవలకి అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళే ఆనందం కన్నా, మనం వెళ్లి పోతే నాన్నగారికెలా? అని రైలు కదిలి వెళ్లి పోతుండగా మేమందరం కలిపి బృంద గానంలా బృంద..... ఇంకా చెవుల్లో మార్మ్రోగుతోంది 

 చెవుల్లో మార్మ్రోగుతోంది
' ఏమిటీ ఈ టెక్స్ట్ బుక్ లో పేజెస్ ముందువి అన్నీ ఏమయ్యాయి? ' అని మా నాన్నగారు అడిగినప్పుడు "నాకు అందులో ఉన్నది వచ్చేసింది కదా అని చింపేసాను అన్నానుట" మా నాన్నగారు చెప్పేరు. వుల్డు, షుల్డు, కుల్డు, బుర్మా, బుట్టు అని చదివితే, కాదమ్మా "would, should, could, Burma, But " "L" sailent అని చెప్పడం గుర్తుంది.
పెద్దలున్నంతవరకే మనం చిన్న వాళ్ళం. మన చిన్నతనం గుర్తు చేసేది వాళ్లున్నన్తవరకే. కాబట్టి నేనిప్పుడు పెద్దద్దాన్ని. ఈ ఊహే ఎదో ఇబ్బందిగా ఉంది. సజల నేత్రాలతో... మళ్ళీ రేపు కలుస్తా........

బాల్యం.........




 ఎంత  అందమైంది ! ఎంతటి  ఆనందాన్నిచ్చింది...... ఆ అమాయకత్వం,   జీవితంపట్ల  మక్కువ,  అనురక్తి,  ఆశయాలు, ఆటలూ,  పాటలూ,  కధలూ  ఎన్నో  ఎన్నెన్నో.  రోడ్  మీద  పడి ఆడుకోడం, (అది ఇప్పటి  తల్లులకు  తప్పేమో  కానీ అక్కడే  ఎన్నో  ఎన్నెన్నో  నేర్చుకున్నాం.)  అద్భుతమయిన  స్నేహాన్ని, స్నేహితులని  ప్రోవు  చేసుకున్నాం
  నా బాల్యం గూర్చి గుర్తుకొచ్చినవి  మీతో  పంచుకోవాలని ఉంది..........

 మా  నాన్నగారు వైణిక శిరోమణి  శ్రీ  పప్పు  సోమేశ్వర రావు  గారు,  భానుమతి గార్ల  మొదటి సంతానం నేను. మా  నాన్నగారికి నేనంటే  ఎంత ఇష్టమో. మా అమ్మకి పదహారూ,  మా  నాన్నగారికి  ఇరవై  ఒకటి  నేను పుట్టే సరికి.  అంత  చిన్న  వయస్సులో  కూడా  నాకు  ఎంత స్టైలిష్  డ్రెస్లు  కొన్నారు  60  సంవత్సరాల  క్రితం. అదే  హైదరాబాద్  మహత్యం. మంచి  స్టైలిష్  డ్రెస్లు  దొరికేవిట  కోటీలో.  కొనడమే  కాక  నాకు  గుర్తులు  మిగిలేలా  ఫోటోలు  కూడా  తీయించారు...... ఈ రోజుకి  అవి  మీతో  పంచుకుంటాను....... మళ్ళీ  కలుద్దాం......