27, అక్టోబర్ 2020, మంగళవారం

నరకచతుర్దశి, దీపావళి

 నరక చతుర్దశి, దీపావళి 


అబ్బా అప్పుడే నిద్ర లేవాలా అనుక్కుని బిగుసుకు పడుక్కున్నా అమ్మలు వూరుకుంటారా? చెవులో రొద పెట్టి ఛం....రూ? చిన్న పిల్లలని కనికరం వుండదు.


లేవగానే బ్రష్ చేయనిచ్చి, పాలు తాగడానికి ఇచ్చి, ఒంటి నిండా నూనె పట్టించి, నలుగు పెట్టి, కుంకుడుకాయ పులుసు వేసి తలంట్లు. నలుగురం కళ్ళల్లో పడిందని గీవురు బావుర్లు.అప్పుడు తినడానికి రస్కులు.


అది అవ్వగానే నాన్నగారు తలకు చిక్కుతీసి, రిబ్బన్లతో జడలు. కాళ్ళ మీద చిన్న టవల్ కప్పి కేపులు కొట్టించడం. వాటి రవ్వలు పడ్డాయని కేపులు చిన్న  గూటాంతో  కొట్టనని మారాం. 


తరువాత కల్పకం గాయత్రీ ఇంటికి పరుగు. 12.30 అయినా అక్కడే వేళ్ళాడిపోతూ ఊడిరాడం లేదని మా అమ్మ వెరైటీగా మా చెల్లికో కుంకంభరిణ ఇచ్చి "వంటలయ్యాయి మళ్ళు కట్టుకోండని" పిలిపించడం. అందరూ ఇప్పటికీ తలచుకునేలా చేసిన ఆ చర్య తలచుకుంటే పెదవిపై చిరునవ్వు.


సాయంత్రం కొద్దిగా టపాకాయలు కాల్చుకుని రేపటికి దాచుకోడం. కాటన్ బట్టలు కట్టుకోవాలండీ బాబూ, నైలెక్స్ చీర కట్టుకున్న మా పై ఆవిడ చీర అంటుకోడం. అరే! ఎన్ని గుర్తులు.


ఇక మర్నాడు పులిహోర, గారెలు, పరవాన్నం. తెగ మెక్కినా ఇప్పటిలా మధ్యహ్నం కునుకు లేదు. గెంతులే గెంతులు.


సాయంత్రం ఎప్పుడబ్బా ఇంకా? అని ఎదురు చూసి,దివిటీ కొట్టి ( బొప్పాయి కఱ్ఱకు ఆవదంలో ముంచిన గుడ్డలు) కాళ్ళూ చేతులూ కడుక్కుని,తీపి తిని ఇంక నేనూ మా చెల్లీ కాకరపువ్వొత్తులూ, మతాబులూ, చిచ్చుబుడ్లూ లాంటివీ, మా తమ్ముళ్ళు చిన్న సీమటపాకాయలూ కాల్చుకుని, టపాకాయలతో పాటూ మధ్య మధ్యలో అమ్మా వాళ్ళు ఇచ్చే మొట్టికాయలు, చీవాట్లూ తింటూ, టపాకాయల పర్వం ముగించుకుని భోజనాలూ, నిద్రలూ.


ఇదండీ చిన్నప్పటి మా దీపావళి విశేషాలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి