తలపుల తలుపులు తెరుచుకున్నాయి
పిల్లల పసితనపు చేష్టలూ, ముద్దు మాటలూ, పాటలూ దాటి....
ఒకటి నుండీ పది లెఖ్ఖ పెట్టే సరికి లేవాలి. ఒకటీ... నాలుగూ... ఎనిమిదీ.. పదీ... ఇంకా లేవలేదా, ఏమిటీ లేటు... అంటున్నట్లే వుంది.
ఇల్లంతా బట్టలు పడేసి, పుస్తకాలు విరజిమ్మి, షూస్ సాక్స్ విసిరేసి, ఇల్లంతా చెత్త చెత్త చేసేవారు.
హోమ్ వర్క్ చేసారా, వీణ వాయించుకోండీ, అల్లరి చేయకండీ, కొట్టుకోకండీ, కోర్టు సీన్లు ఎందుకూ? ఇక్కడ పెట్టిన జీడి పప్పూ కిస్మిస్ ఏవీ. ఇదిగో ఈ కొబ్బరి పచ్చడి చేయాలి, తినేయకండి. మూతికి ఏమిటీ అంటుకుందీ హార్లిక్సేనా? ఆ దశా దాటింది.
కాలేజ్ కి జాగ్రత్తగా వెళ్ళి రండి, మంచి వాళ్లతో స్నేహం చేయండి, బాగా చదువుకుని పైకి రావాలి. వీణ బాగా వాయించి మన ఇంటి పేరు నిలపాలి....
హమ్మయ్యా బాగా స్థిర పడ్డారు. మంచి పిల్లలను చూసి పెళ్ళిళ్ళు.
అరే! వీళ్ళు మన దగ్గర నుండి దాటుకుని వారి వారి గువ్వలతో మన గూడు విడచి వారి వారి గూళ్ళకు చేరుకున్నారా?
ఇంకా అరుస్తున్నట్లే వుంది వారి మీద. కాలం వేగంగా కదిలి పోయింది. ఇప్పుడు ఇల్లంతా శుభ్రంగా, ప్రశాంతంగా ఎక్కడి వస్తువులక్కడే మనం కోరుకున్నట్లు.
కానీ ఆ సందడేదీ,ఆ సంతోషమేదీ. సారాంశం ఏమంటే పిల్లల బాల్యాన్ని ఆస్వాదించండి, ఆనందించండి. వారి బాల్యం "మనకు కూడా" తిరిగి రాదు.
ముందు ముందుకు వచ్చేసాం.
ఇప్పటి ఆనందం ఇప్పటిది. ఇప్పుడూ. అప్పుడూ....ఎప్పుడూ ఆనంద భరితమే జీవితం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి