27, అక్టోబర్ 2020, మంగళవారం

అరుణా వ్యాస్

 నా అంతరంగం..... 


అరుణావ్యాస్ గారంటే నాకు 

 ఇష్టం అనేకంటే, ఆరాధన. ఇది నిజం. 


అది 1982/83  సమయం. ప్రతీ రోజూ అరుణా వ్యాస్ గూర్చి ఎంతో గొప్పగా అందరూ చెప్పుతుంటే విని, 

ఎలా వుంటారని తెగ కుతూహల పడి

 పోయాను. పిల్లలు కూడా ఇంటికి వచ్చి ఈ రోజు మా స్కూలుకి అరుణా వ్యాస్ గారు వచ్చారని చెబుతుంటే ఎలా ఆవిడని చూడడం అని కుతూహలము ఎక్కువైపోయింది. , ప్రతీసారీ వారి ఎస్ పీ బంగ్లా ముందు నుండీ వెళుతూ, వారి బంగ్లా వైపు చూసేదాన్ని. ఆవిడేమైన మధ్య తరగతి గృహిణా? వీధి గుమ్మంలో నుంచుని కనిపించడానికి. 


ఒకరోజు మధ్యాహ్నం 12.30 వేళ వారి ఇంటి పక్కనుండీ వెళుతుంటే ఆవిడ వారి 2 ఏళ్ల శ్రీవత్సకు కారు మీద కూర్చోబెట్టి గోరుముద్దలు తినిపిస్తున్నారు. "ఎంత ఆశ్చర్యం, అరుణా వ్యాస్ వాళ్ళబ్బాయికి అన్నం తినిపిస్తున్నారు" ( ఆవిడ కూడా అమ్మే కదా అని, ఆలోచించనివ్వని నా ఆరాధనాభావం, అపరిపక్వ ఆలోచనా విధానం తలచుకుంటే నవ్వు వస్తోంది ఈ నాడు) 


అరుణ గారు ముదురాకుపచ్చ సిల్క్ చీరతో, చెవులకు జూకాలతో, ఎంత అందంగా వున్నారో. ఇదీ నా ఆలోచన ఆక్షణంలో. అర్ధం చేసుకోండి ఎంత ఎదురుచూసానో ఆవిడను చూడడం కోసం. . 


తరువాత మా సంగీత కళాశాలకు వస్తున్నారంటే, ముందు వరసలో కూర్చుని, ఒళ్ళంతా కళ్ళు చేసుకుని, చూస్తూ విన్నాను. మంద్ర స్వరంలో, చక్కటి మాడ్యులేషన్ తో, చక్కటి విరణాత్మకమైన, వివేక భరితమైన ప్రసంగం చేసేరు. మరచిపోలేదు ఆ రోజుని. 


నిజానికి ఆవిడ మా బంధువు. నేను ఆవిడని అలా అనుకుంటే, గొప్ప చెప్పుకునేదాన్ని, గొప్పగా  కాదు. ఎందు  కంటే వ్యాస్ గారు ఎస్ పీ  మా కృష్ణాజిల్లాకి అప్పట్లో. కానీ ఆవిడని ఆవిడగానే ఆరాధించాను. 


తరవాత వారు  మా ఇంటికి  భోజనానికి రాడం, అలా అలా పరిచయం చాలా వృధ్ధి అయింది. 


కొంత మందిని చూడగానే మనకి ఎంతో ఆరాధన కల్గుతుంది. కారణం చెప్పలేము. 


ఆవిడ గొప్ప పండితురాలు. మంచి వక్త. అనర్గళముగా అర్ధవంతముగా సంభాషిస్తారు. మధురభాషిణి, ఆవిడ మనస్సు సాగరమంత లోతు,నిండు కుండలా, తొణకరు. సహనశీలి. ఎంతటి ఆటుపోట్లనయినా సంమయమనంతో ఎదుర్కొని,  విద్యా వ్యాసాంగంపై దృష్టి మరల్చుకుని సంసృతంలో డాక్టరేట్, ఇంగ్లీష్ ఎమ్ ఏ సంపాయించారు. అనేక గ్రంధాలు రచించారు.  రామాయణంపైవారి భాషణ విని తీరవలసినదే. 


వెరసి నాకు అరుణా వ్యాస్ గారంటే ఇష్టం, ఇష్టం, ఇష్టం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి