30, అక్టోబర్ 2020, శుక్రవారం

ఇల్లు

 "ఇల్లు"


మీరందరూ మా ఇంటిని గూర్చి రాస్తాననుక్కుంటున్నారని బెట్. అవునా కాదా? చెప్పండీ... 


సర్లెండి నేనే చెప్పేస్తా.... తెల్లవారు ఝూమున 4 గంటలకు మెళుకువ వచ్చి, వెంఠనే యధావిధిగా యూట్యూబ్ తెరిచా.... 


వసంత వల్లరి (వసంత లక్ష్మీ అయ్యగారి ఛానల్)  లో  " ఇల్లు" అని కథ చదివారు, కాదు కాదు చెప్పేరు వసంతలక్ష్మీ అయ్యగారి. రాసిన వారెవరో తెలుసా?.తన కథలతో గుండె లోతులలోని భావాలను సృశించే బలభద్రప్రాత్రుని  రమణి గారు. ఎంత అద్భుతంగా రాసారో. బహుశః సినీమా స్క్రిప్ట్ రైటర్ గా విశేషానుభవం వల్లనేమో కథ కంటి ముందు కదలాడింది. వీరి ఇతర కథలు కూడా చాలా చదివాను ఎంత సజీవంగా మన అనుభూతులను మేల్కొలుపుతాయో. 

రమణిగారూ మీ పేరు కంటే మీ ఇంటి పేరే ఘనంగా వుంది సుమా! ఇంతకీ మీ ఇంటి పేరు సరిగ్గానే రాసానా అని అనుమానం. 


ఇక యూట్యూబ్లో "వసంత వల్లరి" ఇంతక ముందు వినని వారుంటే జరూర్ గా జాయినయిపోండి. కథ చదవఖర్లేదు. "మన చెవులకి కళ్ళు వస్తాయి" వసంత వల్లరి వింటుంటే. మన చెవులలో రకరకాల పాత్రలు సజీవంగా ఒకే వ్యక్తి గాత్రంలో వింటూకంటాము. వసంతలక్ష్మీ అయ్యగారి, కధను నాటకీకరణ చేసి వినిపిస్తున్నారు. అంటే అరటిపండు ఒలచి నోట్లో పెడుతున్నారు. కానీండి ఆ ఛానల్ సబ్ స్కైబ్ చేసి వినండి. 


నేను ఆస్వాదిస్తున్న విషయం మీరూ ఆనందించాలని తపన. 


ఇదిగో మీ కోసం " ఇల్లు" 👇

గుర్తుకొస్తున్నాయి

 గుర్తుకొస్తున్నాయి... 


చిన్నప్పుడు మాకు ముందు "సతీ/భక్త" చివర " మహత్యం/ కధ" వుంటేనే సినిమాకు తీసుకెళతారు. దానికి కూడా ఎన్ని కండిషన్లో. హోమ్ వర్క్ చేసేసు కోవాలి. వచ్చేసరికి పది అయిపోతుంది కాబట్టి ఒక మోస్తరుగా తినేయాలి. మధ్యాహ్నం మాట్లాడకుండా పడుక్కోవాలి. మధ్యలో పల్లీలు కొనేవారు. ఖర్మ అందులో కొన్ని చీకట్లో జారి కింద పడి పోడం. అంతకంటే కష్టమైనది చివరి పప్పు కుళ్లు పప్పు వచ్చి మన కంట నీరు పెట్టించడం. భలే జ్ఞాపకాలు. 


చెప్పినవన్నీ సినిమా చూడ్డం కోసం చేసేసినా, మూడునెలల పరీక్ష తరువాత ఒకటి, ఆరు నెలల పరీక్ష తరవాత ఒకటీ, ఏడాది పరీక్షలయ్యాక ఒకటి అంతే. 


పెద్ద పరీక్షల ముందు చిక్కడ పల్లీ బాలాజీ గుడిలో ప్రదక్షణాలు, దేముడి దగ్గర పెన్ను పెట్టించి తీసుకోడం. చదువు మీద ఎంత భక్తి శ్రధ్ధలో. 


సశేషం

27, అక్టోబర్ 2020, మంగళవారం

నరకచతుర్దశి, దీపావళి

 నరక చతుర్దశి, దీపావళి 


అబ్బా అప్పుడే నిద్ర లేవాలా అనుక్కుని బిగుసుకు పడుక్కున్నా అమ్మలు వూరుకుంటారా? చెవులో రొద పెట్టి ఛం....రూ? చిన్న పిల్లలని కనికరం వుండదు.


లేవగానే బ్రష్ చేయనిచ్చి, పాలు తాగడానికి ఇచ్చి, ఒంటి నిండా నూనె పట్టించి, నలుగు పెట్టి, కుంకుడుకాయ పులుసు వేసి తలంట్లు. నలుగురం కళ్ళల్లో పడిందని గీవురు బావుర్లు.అప్పుడు తినడానికి రస్కులు.


అది అవ్వగానే నాన్నగారు తలకు చిక్కుతీసి, రిబ్బన్లతో జడలు. కాళ్ళ మీద చిన్న టవల్ కప్పి కేపులు కొట్టించడం. వాటి రవ్వలు పడ్డాయని కేపులు చిన్న  గూటాంతో  కొట్టనని మారాం. 


తరువాత కల్పకం గాయత్రీ ఇంటికి పరుగు. 12.30 అయినా అక్కడే వేళ్ళాడిపోతూ ఊడిరాడం లేదని మా అమ్మ వెరైటీగా మా చెల్లికో కుంకంభరిణ ఇచ్చి "వంటలయ్యాయి మళ్ళు కట్టుకోండని" పిలిపించడం. అందరూ ఇప్పటికీ తలచుకునేలా చేసిన ఆ చర్య తలచుకుంటే పెదవిపై చిరునవ్వు.


సాయంత్రం కొద్దిగా టపాకాయలు కాల్చుకుని రేపటికి దాచుకోడం. కాటన్ బట్టలు కట్టుకోవాలండీ బాబూ, నైలెక్స్ చీర కట్టుకున్న మా పై ఆవిడ చీర అంటుకోడం. అరే! ఎన్ని గుర్తులు.


ఇక మర్నాడు పులిహోర, గారెలు, పరవాన్నం. తెగ మెక్కినా ఇప్పటిలా మధ్యహ్నం కునుకు లేదు. గెంతులే గెంతులు.


సాయంత్రం ఎప్పుడబ్బా ఇంకా? అని ఎదురు చూసి,దివిటీ కొట్టి ( బొప్పాయి కఱ్ఱకు ఆవదంలో ముంచిన గుడ్డలు) కాళ్ళూ చేతులూ కడుక్కుని,తీపి తిని ఇంక నేనూ మా చెల్లీ కాకరపువ్వొత్తులూ, మతాబులూ, చిచ్చుబుడ్లూ లాంటివీ, మా తమ్ముళ్ళు చిన్న సీమటపాకాయలూ కాల్చుకుని, టపాకాయలతో పాటూ మధ్య మధ్యలో అమ్మా వాళ్ళు ఇచ్చే మొట్టికాయలు, చీవాట్లూ తింటూ, టపాకాయల పర్వం ముగించుకుని భోజనాలూ, నిద్రలూ.


ఇదండీ చిన్నప్పటి మా దీపావళి విశేషాలు.

అరుణా వ్యాస్

 నా అంతరంగం..... 


అరుణావ్యాస్ గారంటే నాకు 

 ఇష్టం అనేకంటే, ఆరాధన. ఇది నిజం. 


అది 1982/83  సమయం. ప్రతీ రోజూ అరుణా వ్యాస్ గూర్చి ఎంతో గొప్పగా అందరూ చెప్పుతుంటే విని, 

ఎలా వుంటారని తెగ కుతూహల పడి

 పోయాను. పిల్లలు కూడా ఇంటికి వచ్చి ఈ రోజు మా స్కూలుకి అరుణా వ్యాస్ గారు వచ్చారని చెబుతుంటే ఎలా ఆవిడని చూడడం అని కుతూహలము ఎక్కువైపోయింది. , ప్రతీసారీ వారి ఎస్ పీ బంగ్లా ముందు నుండీ వెళుతూ, వారి బంగ్లా వైపు చూసేదాన్ని. ఆవిడేమైన మధ్య తరగతి గృహిణా? వీధి గుమ్మంలో నుంచుని కనిపించడానికి. 


ఒకరోజు మధ్యాహ్నం 12.30 వేళ వారి ఇంటి పక్కనుండీ వెళుతుంటే ఆవిడ వారి 2 ఏళ్ల శ్రీవత్సకు కారు మీద కూర్చోబెట్టి గోరుముద్దలు తినిపిస్తున్నారు. "ఎంత ఆశ్చర్యం, అరుణా వ్యాస్ వాళ్ళబ్బాయికి అన్నం తినిపిస్తున్నారు" ( ఆవిడ కూడా అమ్మే కదా అని, ఆలోచించనివ్వని నా ఆరాధనాభావం, అపరిపక్వ ఆలోచనా విధానం తలచుకుంటే నవ్వు వస్తోంది ఈ నాడు) 


అరుణ గారు ముదురాకుపచ్చ సిల్క్ చీరతో, చెవులకు జూకాలతో, ఎంత అందంగా వున్నారో. ఇదీ నా ఆలోచన ఆక్షణంలో. అర్ధం చేసుకోండి ఎంత ఎదురుచూసానో ఆవిడను చూడడం కోసం. . 


తరువాత మా సంగీత కళాశాలకు వస్తున్నారంటే, ముందు వరసలో కూర్చుని, ఒళ్ళంతా కళ్ళు చేసుకుని, చూస్తూ విన్నాను. మంద్ర స్వరంలో, చక్కటి మాడ్యులేషన్ తో, చక్కటి విరణాత్మకమైన, వివేక భరితమైన ప్రసంగం చేసేరు. మరచిపోలేదు ఆ రోజుని. 


నిజానికి ఆవిడ మా బంధువు. నేను ఆవిడని అలా అనుకుంటే, గొప్ప చెప్పుకునేదాన్ని, గొప్పగా  కాదు. ఎందు  కంటే వ్యాస్ గారు ఎస్ పీ  మా కృష్ణాజిల్లాకి అప్పట్లో. కానీ ఆవిడని ఆవిడగానే ఆరాధించాను. 


తరవాత వారు  మా ఇంటికి  భోజనానికి రాడం, అలా అలా పరిచయం చాలా వృధ్ధి అయింది. 


కొంత మందిని చూడగానే మనకి ఎంతో ఆరాధన కల్గుతుంది. కారణం చెప్పలేము. 


ఆవిడ గొప్ప పండితురాలు. మంచి వక్త. అనర్గళముగా అర్ధవంతముగా సంభాషిస్తారు. మధురభాషిణి, ఆవిడ మనస్సు సాగరమంత లోతు,నిండు కుండలా, తొణకరు. సహనశీలి. ఎంతటి ఆటుపోట్లనయినా సంమయమనంతో ఎదుర్కొని,  విద్యా వ్యాసాంగంపై దృష్టి మరల్చుకుని సంసృతంలో డాక్టరేట్, ఇంగ్లీష్ ఎమ్ ఏ సంపాయించారు. అనేక గ్రంధాలు రచించారు.  రామాయణంపైవారి భాషణ విని తీరవలసినదే. 


వెరసి నాకు అరుణా వ్యాస్ గారంటే ఇష్టం, ఇష్టం, ఇష్టం.

తలపుల తలుపులు తెరుచుకున్నాయ్

 తలపుల తలుపులు తెరుచుకున్నాయి


పిల్లల పసితనపు చేష్టలూ, ముద్దు మాటలూ, పాటలూ దాటి.... 


ఒకటి నుండీ పది లెఖ్ఖ పెట్టే సరికి లేవాలి.  ఒకటీ... నాలుగూ... ఎనిమిదీ.. పదీ... ఇంకా లేవలేదా, ఏమిటీ లేటు... అంటున్నట్లే వుంది. 


ఇల్లంతా బట్టలు పడేసి, పుస్తకాలు విరజిమ్మి, షూస్ సాక్స్ విసిరేసి, ఇల్లంతా చెత్త చెత్త చేసేవారు. 


హోమ్ వర్క్ చేసారా, వీణ వాయించుకోండీ, అల్లరి చేయకండీ, కొట్టుకోకండీ, కోర్టు సీన్లు ఎందుకూ? ఇక్కడ పెట్టిన జీడి పప్పూ కిస్మిస్ ఏవీ. ఇదిగో ఈ కొబ్బరి పచ్చడి చేయాలి, తినేయకండి. మూతికి ఏమిటీ అంటుకుందీ హార్లిక్సేనా? ఆ దశా దాటింది. 


 కాలేజ్ కి జాగ్రత్తగా వెళ్ళి రండి, మంచి వాళ్లతో స్నేహం చేయండి, బాగా చదువుకుని పైకి రావాలి. వీణ బాగా వాయించి మన ఇంటి పేరు నిలపాలి.... 


హమ్మయ్యా బాగా స్థిర పడ్డారు. మంచి పిల్లలను చూసి పెళ్ళిళ్ళు.


 అరే! వీళ్ళు మన దగ్గర నుండి దాటుకుని వారి వారి గువ్వలతో మన గూడు విడచి వారి వారి గూళ్ళకు చేరుకున్నారా? 


ఇంకా అరుస్తున్నట్లే వుంది వారి మీద. కాలం వేగంగా కదిలి పోయింది. ఇప్పుడు ఇల్లంతా శుభ్రంగా, ప్రశాంతంగా ఎక్కడి వస్తువులక్కడే మనం కోరుకున్నట్లు. 


కానీ ఆ సందడేదీ,ఆ సంతోషమేదీ. సారాంశం ఏమంటే పిల్లల బాల్యాన్ని ఆస్వాదించండి, ఆనందించండి. వారి బాల్యం "మనకు కూడా" తిరిగి రాదు. 

  ముందు ముందుకు వచ్చేసాం.

 ఇప్పటి ఆనందం ఇప్పటిది. ఇప్పుడూ. అప్పుడూ....ఎప్పుడూ ఆనంద భరితమే జీవితం.