8, మే 2016, ఆదివారం

మా అత్తగారు............
మహా దొడ్డ ఇల్లాలు. సరిగ్గా చెప్పాలంటే మా నాన్నగారికి తల్లి, మా వారికి తల్లి, నాకూ తల్లి, నా పిల్లలకూ తల్లి లాగే వ్యవహరించేరు. నా సంగీతాభివృద్ధికి అమితంగా సహకరించిన మా అత్తయ్యను ఎలా మర్చి పోగలను.
స్వయంగా వైణికురాలవ్వడం, వైణిక విద్వాంసుడు భార్య అవ్వడం వల్ల,, సంగీతం ప్రపంచం లోని సాధక బాధకాలు అన్నీ తెలుసు, అర్ధం చేసుకోగలరు కూడా. అందువల్ల నా ప్రగతిలో ఆవిడ పాత్ర ఎంతో ఉంది.
మా పిల్లలకు ఆవిడ వద్ద ఎంతో చేరిక . ఆవిడ ఎవ్వరినీ నొప్పించరు. మా మావయ్యగారు పోయాక మాతో 35 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఒకే మాట, ఒకే బాటగా కలసి మెలసి ఉన్నాము అందరం (ముఖ్యంగా కోడళ్ళం.) ఈ విధంగా అందరి దగ్గరా మెసలడంమంటే చాలా చాలా గొప్ప విషయం, ఆవిడ గొప్ప వ్యక్తిత్వానికి దర్పణం. తన భావాలను నియంత్రించుకుని ఎదుటి వారి భావాలను గౌరవిస్తూ, అవసరమయితే సున్నితంగా తెలియజేస్తూ ................వాః పెద్దత్తయ్య నీకు నీవే సాటి.! అందుకే నీకు అలనాడు చెప్పేను “ అజ్ఞానంతో మేము ఎవరమైనా నీ పట్ల తప్పు చేసి ఉంటే క్షమించు, నీ వల్ల మటుకూ మేమెన్నడూ, ఎవ్వరం కూడా నొచ్చుకోలేదు” మమ్మల్ని సదా ఆశీర్వదించు.

మేమే కాదు ఆవిడ పరిచయం ఉన్న ప్రతీ వారూ ఆవిడ గూర్చి గొప్పగా చెబుతారు.

ఒక విశేషం నేను గమనించింది ఏమంటే........35 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ, ఎవ్వరినీ దుర్భాషలాడినట్లు చూడలేదు. ఎవ్వరికైనా ఎదైనా ఇష్టమంటే, వారికి అది ఎలా ఇవ్వాలా అనే ఆవిడ తపన చాలా చాలా గొప్ప లక్షణం. మేమందరమూ ఈ విధంగా ఉండగలుగుతే దిగ్విజయం సాధించినట్లే
.
అయ్యగారి సోమేశ్వర రావు గారింట పిల్లలందరూ శుశిక్షితులయ్యరంటే కారణం ఆవిడేననేది నిర్వివాదాంశం. జయహో జయకుమారి గారు.........

మా అందరికీ ఆవిడ అంటే చాలా చాలా ఇష్టం.. ఇష్టం... ఇష్టం...... (ఆవిడ పేరే నాకు పెట్టేరు. )
“పెద్దత్తయ్య! ఎక్కడున్నా మా పై నీ ఆశీస్సులు నిరంతరం కురిపించు”.....
ఏనాటి  నోము  ఫలమో  ఏదాన  బలమో............

              అరెరే!   మీతో  నా  స్వగతం  పంచుకున్టుండగా   రెండవ   సారి  నా  జీవితంలోకి   “మన్మధ  నామ  సంవత్సర  జ్యేష్ట  శుద్ధ  త్రయోదశి “    ప్రవేశించిందే.

               అమ్మో!  ఇంకొంచెంసేపట్లో   లక్షకుంకుమార్చన,  భోజనాలు  హడావిడీ......


                 ఒక  పండితుని  ఇంట పుట్టి,  ఒక  పండితుని  ఇంటిని  మెట్టి,  ఒక  పండితుని  చేపట్టే  మహాద్భాగ్యాన్ని  ప్రసాదించిన  భగవంతుడికి  కృతజ్ఞతలు.  ఇంటి  నిండా  వైణిక  విద్వాంసులే,  ఇన్ని   సంగీత  సుమాలను  బంధించడానికి  ఉపయోగపడ్డ  నాకు  కూడా  అంతో  ఇంతో  ఆ సంగీత  సుమ  సుగంధమబ్బడం  నా  అదృష్టం.

                   మా  ముగ్గురు  ఆడపడచులకూ,  ఇద్దరు  మరదులకు  మేమంటే  ఎంతో  అభిమానం.  అది  మేము సంపాయించుకున్న  ఆస్తి.   నాకు  వాళ్ళు  అత్తవారని  తెలీదు,  నా  వాళ్ళు  అని  మాత్రమే తెలుసు.

        చక్కటి కుటుంబం, పిల్లలు, కోడలూ, అల్లుడూ, మనవలు.

                ఒక  బంగారు  తల్లి  అత్తగారి  రూపంలో,  మరో  బంగారు  తల్లి  కోడలి  రూపంలో  ప్రవేశించారు నా  జీవితంలోకి.  ఇక  ఒక  బంగారు  తల్లి  కూతురిగా,  ఒక  బంగారు తండ్రి  కొడుకుగా,   అల్లుడిగా  పుట్టారు  (  అవును  కానీ,  కొంపతీసి  నేను  కూడా  బంగారు  తల్లినేనా  ఏమిటి?  ఏమో మరి  నాకు  ప్రపంచమంతా  సన్మార్గులతోనే  నిండి  పోయినట్లు ఉంటుంది)

              ఇక్కడ  ముఖ్యం  గా చెప్పుకోవాల్సింది  మా శిష్యులను  గూర్చి,  వారి  గొప్ప తనమో, మా గొప్పతనమో  కానీ,  మా  శిష్యులందరూ  మమ్మల్ని  అమితంగా  ప్రేమిస్తారు.  మేమంటే  ప్రాణమిస్తారు.

        ఇక  స్నేహితులు ఎంత మంది  ఉన్నారో లెఖ్ఖ  లేదు.  నా ప్రాణాతి  ప్రాణమైన  స్నేహితులకి  ఎప్పుడూ  నా స్నేహ  హస్తం  సిద్ధమే.

         ఇక  మీ వంటి  హితులూ,  సన్నిహితులూ,  స్నేహితుల  గూర్చి  ప్రత్యేకంగా  చెప్పుకోవాలి. మీ అందరి  ఆదరాభిమానాలే  మాకు  శ్రీరామరక్ష.

       

       మా  బ్యాంకు  ఖాతాలన్నీ  ధనంతో  కాక  మీలాంటి  వారందరి  ఆదరాభిమానాలతో   పొంగి, పొరలి, పోతున్నాయి.   చాలు  ఇంతటి  అదృష్టం....... అందుకే  అంటున్నాను  “ఏనాటి  నోము  ఫలమో...ఏ దాన  బలమో”  అని.........

      ఆనందభాష్పాలతో  కన్నీటి   తెర  అడ్డం  వచ్చి,  కళ్ళకు   ఏమీ  కనిపించడం  లేదు,

         చాలా   హడావిడి  ఉంది  ఇంట్లో,  ఉంటా మరి . మరల  కలుస్తా త్వరలో.............

1, మే 2016, ఆదివారం

టివి తో మొదటి పరిచయం..
వ్యక్తులతోనే కాదు, వస్తువులతో మొదటి పరిచయాలు గుర్తు చేసుకున్దామనిపించి మొదలెడుతున్నాను, టివి తో మొదటి పరిచయం గూర్చి.
మా స్కూల్లో 8వ తరగతి లో నుండగా మొదటి సారి టివి చూసాము. ప్రేయర్ హాల్ లో టివిని, ఒక కెమెరా పెట్టారు. మేము దాని ముందు నుండి వెళుతూ మా బొమ్మ మేము టివి స్క్రీన్ మీద చూసుకుని సినిమా హిరొయిన్స్, అయిపోయినట్లు, మళ్ళీ అందులో అందులోనే మా లోని లోపాలు (పెద్ద ముక్కు) చూసుకుని బాధ పడిపోతూ, అంతలోనే ఎంత తెల్లగా ఉన్నానో అని సర్ది చెప్పుకుంటూ పిచ్చి పిచ్చిగా ఆనందిన్చాము నేను మా స్నేహితులూ.
83 లో విజయవాడ లో టివి రిలే స్టేషన్ పెట్టేరు. టెస్ట్ సిగ్నల్స్ జరుగుతున్నాయి.
సాయంత్రం అయ్యింది పిల్లల ఆటలయ్యాయి. 7 అయ్యింది ఇంకా పిల్లలింటికి రాలేదు. రోడ్ మీద పిల్లలెోవరూ లేరు. "ఆదిత్యా,కళ్యాణి" అంటూ వెతుక్కుంటుంటే, మా చివరి క్వార్టర్స్ దగ్గర హాల్ అంత నిండి పోయి ఉంది, టివి లో ఎం.ఎస్. గారి "మీరా" వస్తోంది బ్లాకు అండ్ వైట్ టివిలో. నా పిల్లలిద్దరూ టివి స్టాండ్ కాళ్ల దగ్గరా?..... కడుపు తరుక్కు పోయింది. నా పిల్లలు వేరే వాళ్ళింట్లో, అదీనూ టివి స్టాండ్ కాళ్ళ దగ్గరా? వాళ్ళను తిడుతూ తీసుకువచ్చి, మా ఆయనతో టివి కొనల్సిన్దేనని పట్టు బట్టేను. సరే అన్నారు.
ఇక రోజూ కాలేజీ నుండి వస్తూనే "జయా! ఇవాళ "కృషి దర్శన్" చూసాను, చెట్టు మీంచి మావిడి కాయలు ఆకుపచ్చగా గుత్తులు గుత్తులు వేల్లాడుతున్నాయని , ఏనుగులు గుంపులు గుంపులు వేడుతున్నాయని చెప్పి కళ్ళూరిస్థున్నారు.
ఈ లోగా ఒంగోలు నుండి ఒక స్టూడెంట్ వ్చేచ్చిన్ది, ఆ అమ్మాయితో గురువుగారు కలర్ టివి కొంటారట, అనగానే అనవసరంగా, ఎంతో బాగుంటుందండి, మా పక్క వాళ్ళింట్లో ఉంది అంది అంతే! ఇక చూసుకోండి, ఆ అమ్మాయిని "అంటే ఈ చీర ఇదే కలోర్లో,ఒంటి రంగు ఇదే కలోర్లో ఉంటుందా?ఏనుగు ఏనుగు రంగేనా?" అంటూ చంపుకు తినేసాను"
రోజూ నన్ను కూడా సాయంత్రం టివిల షాపల చుట్టూ తిప్పేరు. సరదాగానే చూసాను కానీ ఏమైనా కనిపిస్తే కదా? ప్రసారం టైం కాదాఎను!
.నాలుగు రోజులయ్యాక.. ఈన కొనే బేరం కాదని గట్టి నిర్ణయానికి వచ్చేసాను.
ఇక ఒకరోజు ఉదయం ఇవాళ టివి కొనుక్కోస్తాను 11 గంటలకి" అని చెప్పేరు. తెచ్చినప్పుడు చూడచ్చులే అనుకున్నా. కానీ 11 గంటలకి టివి రెడీ. "కోణార్క్ పుష్పాంజలి కలర్ టివి." ఆ టైములో ఏమీా రాడం లేదు. మధ్యానం 2 గంటలకి కాలేజీ కెడుతూ, "నేను 5 గంటలకి వచ్చి ఆన్ చేస్తాను, నువ్వు పెట్టకని" వెళ్లి పోయారు. వెళ్తూ వెళ్తూ దాని నెత్తిన నాగభూషణం లాగ చాలీ చాలని ఉత్తరీయం కప్పి వెళ్ళేరు దానికి.
కట్ చేస్త ......సాయంత్రం 5. నా క్లాసు అయిపొయింది. చూడాలని మహా ఉబలాటంగా ఉంది. ఆపుకోలేక మాట జవదాటేను. టివి పెట్టగానే " ఆ రోజు శనివారం అవ్వడం వాళ్ళ "రీజినల్ ఫిలిం..అస్సామి ఫిలిం" ఒక తల్లీ కొడుకు తెల్లటి బట్టలు ధరించి, తెల్లటి బంతితో, ఆకుపచ్చటి పచ్చిక బయలుపై, ఆడుకుంటున్నారు. ఇంతలో మా వారు. గబా గబా ఆపేసి, మళ్ళీ ఉత్తరీయం నెత్తిన కప్పేసి ఎరగనట్లు కూర్చున్నా. పైకి వస్తూనే చక్కగా టివి పెట్టి చూద్దామనే ధ్యాస కంటే "పెట్టేవ? పెట్టేవా?" అంటూ అడగడం మొదలెట్టేరు. మహా బుద్ది మంతురాలిలా "నో" అన్నా! మా ఆయనా మజాకా? వెంటనే దాని నెత్తిన చెయ్యి బెట్టి చూసారు! ఇంకేముంది? దొంగ పట్టుబడి పోయింది......
ఇంతకీ చెప్పొచ్చేదేమంటే "ఆ రోజు నాకు ఆ సీన్ కళ్ళల్లో ముద్రించుకు పోయి ఇక వేటిని కళ్ళల్లోకి రానీడం లేదు! ఎలా? ఎం చెయ్యాలబ్బా?" అదీ నా మొదటి టివి పరిచయం.
"నాలుగు రోజుల షార్ట్ నోటీసు లో రేడియో రికార్డింగ్ 5 న అని డేట్ వస్తే వాయిన్చుకోకుండా ఏమిటి యీరాతలు? వెళ్తావా లేదా" అంటున్నారా? వెళ్లి పోతున్నా? మళ్ళీ వస్తాలెండి . ఖంగారు పడకండి.........