భారత్ జెండా.......
రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, అలాగే రెడ్ క్రాస్ వారి సహాయం కోసం చిన్ని చిన్ని జెండాలు గుండు సూదితో షర్టుకి పెట్టుకునేలా ఉండేవి గుర్తుందా?
స్కూల్ టీచర్స్ అవి కొనమని 10 పైసలు కానీ 25 పైసలు కానీ తేచ్చివ్వమని మన చేతికి ఇచ్చేస్తారు, మనం కొంచెం సేపు పుస్తకం లో పెట్టుకుని, తరవాత అవి షర్టుకి పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఊహించుకుని ఎంత ఆనందిన్చేమో గుర్తుందా?
తీరా చేసి ఇంటికెళ్ళి అమ్మా వాళ్లకి చెబితే ఏమీ మాట్లాడారు, డబ్బులివ్వరు? టీచర్కి చెప్పలేము, అమ్మా వాళ్ళని ఒప్పించలేము. స్కూల్కి వెళితే టీచర్ భయం, ఇంట్లో అమ్మ భయం. (పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటంలా ఉండేది) అయిన ఎలాగోలా అమ్మని ఒప్పించి (స్కూల్లో పేరు తీసేస్తారని భయ పెట్టి) మొత్తానికి సుఖాంతం.
ఇక ఇండిపెండెన్స్డేకి స్కూల్లో డాన్సులూ, పాటలూ అయ్యాక, రెండు లడ్డూలు ఇస్తారని ఆశతో ఎండలో మధ్యానం దాకా కూర్చుని లడ్డూ తింటూ వచ్చేవాళ్ళం.
నెమ్మదిగా పెద్దయ్యాం........ స్కూల్లో కూడా లడ్డూ స్థానాన్ని చాక్లెట్ ఆక్రమించింది. పర్యవసానం....... అబ్బా పొద్దున్నే లేచి ఎవరెళ్తారు? ఆ చాక్లెట్ ఏవో రెండూ ఇక్కడే కొనుక్కోవచ్చు అనే అలసత్వం.(నిజానికి మేము అంతక ముందు పొద్దున్నే లేచి తలంటుకుని, ఇస్త్రీ చేసిన స్కూల్ డ్రెస్ వేసుకుని వెళ్ళిన వారమే)
మీరేదో మాకేదో దేశభక్తి లేదనుక్కునేరు, తప్పు తప్పు, మేము అసలు సిసలైన భారతీయులం. కాకపొతే కాస్త బద్ధకం అంతే. (అన్నట్లు వెళ్దామనుకున్న స్నేహితులని కూడా ఆపేయగలిగిన ప్రబుద్దులం) మేము అసలు సిసలైన భారతీయులం...
నమో హిందూ మాతా సుజాత నమో జగన్ మాతా.......జైహింద్ జైహింద్ జైహింద్