30, ఏప్రిల్ 2023, ఆదివారం

వేదుల సుభద్ర

 మధుర జ్ఞాపకం......2018 లో వేదుల సుభద్ర‌ గారి పోస్ట్ నా వాల్ మీద...


మా గురుపత్ని శ్రీమతి జయలక్ష్మి గారికి నమస్కారం. మీరు అప్పుడెప్పుడో నాలాంటి కొందరిని సామెతలకి కధ రాయమన్నారు. విపరీతమైన పని ఒత్తిడి, వరస ప్రయాణాల మధ్య అది కుదరలేదు. ఈ మధ్యన మీకు గురువుగారి చేతుల మీదుగా సన్మానం జరిగిన విషయం తెలిసినప్పటినించీ మీరడిగిన దానికి ఇంతకన్నా మంచి సందర్భం ఉండదు కదాని ఈ చిన్న కథ రాశాను. మీరు స్వతహాగానే సంగీతంలో ఎంతో ప్రతిభ ఉన్నవారు, అద్భుతమైన సంగీత కుటుంబంలో జన్మిచారు, మరో ప్రముఖ విద్వాంసుణ్ణి చేపట్టారు.. మీకు గురువుగారి సాహచర్యం, శిక్షణ లభించడం అంటే బంగారానికి తావి అబ్బినట్టే కదా! ఆ విషయాన్నే దృష్టిలో పెట్టుకుని రాసినదే ఈ చిన్నకధ. మీకు మరో సారి అభినందనలు, గురువుగారికి నమస్కారములు.. కలకాలం మీరిద్దరూ శృతిలయల్లా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటూ.. 

_________________________________________________


ముదితల్ నేర్వగరాని విద్య- సామెత కథ: దాదాపు నలభై ఏళ్ళ క్రితం.. చిన్న పల్లెటూరిలో పుట్టి పెరిగిన  ఇందిర కి చిన్నప్పటినించీ బాగా చదువుకోవాలని కోరిక. ఎప్పుడూ క్లాస్ లో ఫస్ట్ గా ఉండే ఆమె చాలా ఎదుగుతుందనీ, బాగా చదువుకోవాలని ఆమె గురువుల కోరిక కూడా.

 కానీ  పెద్దల కట్టుదిట్టాల మధ్య, సాంప్రదాయపు పోకడల మధ్యనా ఆవిడ చదువు పెద్దగా సాగలేదు. 'చాకలి పద్దు వేసుకుంటే చాలు, మొగుడికి ఉత్తరం రాయడం వస్తే చాలు’ అన్న తాతా- నాయనమ్మల ధోరణి తో పదో క్లాస్ లోనే ఆగిపోయింది ఆమె చదువు.. 

కనీసం డిగ్రీ దాకా చదువుకోవాలని, ఇంకా అవకాశం వస్తే మరింత పైకెదగాలన్న ఆమె కోరిక మొగ్గలొనే ఉండిపోయింది. దాన్ని విరిసే కుసుమంగా మార్చుకోగలగడం తన పనే అని తెలిసినా, పాదు చేసి, అంటు కట్టి, నీరు పోసే మాలి అవసరం తెలిసినది కనక ఎదురుచూడడం తప్ప మరో మార్గం లేకపోయింది ఆమెకి.

పదిహేను నిండి పదహారో సంవత్సరం ప్రారంభం కాగానే  ఆమె వివాహం వనమాలి తో జరిగింది.. 

వనమాలి చాల మంచివాడు, అభ్యుదయ భావాలున్నవాడు. పెళ్ళి అయిన తొలినాళ్ళలోనె ఆమె ఆశను గుర్తించాడు. కేవలం ఆశ మాత్రమే కాదనీ, ఆలంబన ఇస్తే సాధించగల తెలివితేటలు, చురుకుతనమూ ఆమెకున్నాయని కూడా గుర్తించాడు. ప్రైవేట్ గా, దూరవిద్య ద్వారా డిగ్రీ చదవడానికి కావలసిన వన్నీ సమకూర్చడమే కాక, ఇంటి పనిలోనూ, వంట పనిలోనూ కూడా ఆమె కి సహాయం చేస్తూ ప్రోత్సహించాడు.

‘చక్కటి భర్త దొరికాడు, హాయిగా ఇంటిపట్టున ఉంటూ సంసారం చేసుకోక, ఇప్పుడు ఈవిడ చదువులు చదివి ఉద్యోగాలు చెయ్యాలా? ఊళ్ళేళాలా? ‘అన్న వారెవ్వరినీ పట్టించుకోవద్దని ఇందిరకి తరచూ చెప్పేవాడు. 

అంతే కాదు వారానికి నాలుగురోజులు ఆమెకి ప్రైవేటు చెప్పేవాడు, ఆ తర్వాత ఉద్యోగం లో చేరాకా జీతం ఇచ్చే షరతు మీద..

'ఊరికే వచ్హ్చేదానికి విలువ ఉండదు ఇందూ! పైగా పెరటి తోట సామెత కూడా ఉండనే ఉంది మరి". అంటూ నవ్వేవాడు. దూరవిద్య కావడం వల్ల అప్పుడప్పుడు మాత్రమే తరగతులు ఉండేవి, మిగతా సమయమతా వనమాలి శిక్షణే ఇందిరకి. 

" ఇప్పుడు నీ చదువు కోసం నేను పడుతున్న కష్టమంతా ఒకరోజు నీ ముక్కు పిండి మరీ వసూలు చేస్తా" అనే భర్త మాటలకి తనూ నవ్వేది.పరీక్షలప్పుడు తనే స్కూటర్ మీద పరీక్ష హాల్ దగ్గర దింపి తీసుకు వచ్చేవాడు. పరీక్షలో ప్రశ్నలెలా రాసిందో దగ్గరుండి విశ్లేషించేవాడు.. అలా అతని శిక్షణలో ఆమె డిగ్రీ మాత్రమే కాక బీ.యీ.డీ కూడా పాసయి గవర్నమేంట్ టీచర్ గా ఉద్యోగం సంపాదించింది. 

భర్తకి అతనికిష్టమైన పుస్తకాలను, తనకిష్టమిన కానుకలనూ ఇచ్చింది.. “ఇంకేం గురుదక్షిణ ఇవ్వమంటారు గురువుగారు?” అని తమషాగా అన్న ఆమె మాటలకి అతను మనసారా నవ్వాడు..

" నువ్వు శ్రద్ధగా చదవాలని అప్పుడలా అన్నాను కానీ ఎంచుకున్న వృత్తిలో నువ్వు రాణిస్తే చాలు, అంత కన్నా నాకు మరే దక్షిణ వద్దు" అన్నాడు..

ఇందిర చాల అంకిత భావం తో పాఠాలు చెప్పేది. గవర్నమెంట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకేమాత్రమూ తీసిపోవని అందరికీ తెలియ చెప్పాలని ఆమె ప్రయత్నించేది.. చాలావరకూ సఫలీకృతురాలైంది కూడా. పిల్ల్లని ఆట పాటలతోనూ, ఇంట్లో ఉచితంగా ప్రైవేట్లు చెప్పి ఎంతో ప్రోత్సహించేది. అలా దాదాపు గా ఆరేళ్ళపాటు ఆమె కనిపెట్టిన ఎన్నో వినూత్న విధానాలకి, పధకాలకి గుర్తింపుగా ప్రభుత్వం ఆమెకి ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డ్ ప్రకటించింది.. ఆ రోజు ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు.. 

అవార్డ్ తర్వాత జరిగిన సన్మాన సభలో ఆమె పట్టుదలను, కార్యదీక్షను అందరూ పొగుడుతూ ఉంటే వనమాలి సంబరంగా విన్నాడు. 

చివరగా ఇందిరను మాట్లాడమన్నప్పుడు ఆమె వినమ్రంగా అందరికీ కృతజ్ఞతలు సమర్పించి ' “ముదితల్ నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించిన" అంటారు కదా, అది నావిషయం లో నిజం.. 

ఎప్పటికైనా చదువుకోవాలన్న నా కలని సాకారం చేసినది నా భర్త శ్రీ వనమాలి గారు. ఆయన ప్రోత్సాహం, శిక్షణ లేకపోతే నేనీరోజు చూడగలిగేదాన్ని కాదు.. నా అభివృద్ధిని కాంక్షించడమే కాక సదా నా వెన్నంటి నడిచిన సహచరుడయన.. నాకందే ఏ అవార్డైనా,రివార్డైనా మొదట చెందేది ఆయనకే, ఆతర్వాత మాత్రం అంతా నాకే. ఎందుకంటే ఆయన చెప్పినట్టు వింటూ,   మంచి విద్యార్ధిలా చక్కగా చదువుకున్నాను కదా మరి! అంటూ నవ్వింది.. సభికుల హర్షధ్వానాల మధ్య..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి