18, మార్చి 2017, శనివారం

   శ్రీ అయ్యగారి సోమేశ్వర రావు గారి విద్యాభ్యాసం


ఎక్కడో పుల్లతో ఖాళీ డబ్బా మీద లయ బధ్ధంగా, సున్నితంగా, వినసొంపుగా వాయిస్తున్నారు ఎవరో. ఎవరా అని వెతకి చూస్తే చాటుగా కూర్చుని వాయిస్తున్నాడు మనవడు. 

అమ్మమ్మ తిరగలి విసిరి వెళ్ళాక ఆ బాలుడే అక్కడ కూర్చుని తిరగలి తిప్పుతూ చక్కగా పాడుతున్నాడు.( ఎందుకు అంటే అప్పట్లో రేడియో లేదు గ్రామ్ ఫోన్ రికార్డ్ ప్లేయర్ లో ప్లేట్ తిరగడం చూసి వుంటాడా చిన్ని బాలుడు. దానిని గ్రామ్ ఫోన్ ప్లేట్ గా భావించి దానిని చేతితో తిప్పుతూ తనే పాడుతున్నాడు)

ఇంట సంగీతపు ఛాయలు తక్కువే. తండ్రీ , పెద్ద అన్నగారూ వేద ఘనాపాటీలు. తల్లికి పెద్దగా సంగీతాభిరుచి వున్నట్టుగా తెలీదు. మరి ఈ చిన్నారికి సంగీతాభి రుచి ఎలా కల్గిందో? ముఖే ముఖే సరస్వతి. బహుశః చతుర్వేదాలలోని సామ వేదం నుండి పుట్టింది కదా సంగీతం, తండ్రి గారి అంశ అయ్యుంటుంది. 

 ఇక అసలు విషయానికి వద్దాం........
ఇక ఆ బాలుని తీసుకుని బాలుని అమ్మమ్మ శ్రీలక్ష్మమ్మగారు "విజయ రామ గాన పాఠశాల" ప్రిన్సిపాల్ శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారి వద్దకు తీసుకెళ్ళి ఈ విషయం అంతా చెప్పేరు. (నారయణదాసు గారు వారి అమ్మమ్మగారికి పిన మామగారు) నారాయణ దాసు గారు ఆ బాలుని కళాశాలలో గాత్రం లో పేరి బాబు గారి వద్ద చేర్చమని, వీణ వాసా వెంకట రావు గారి వద్ద చేర్పించారట. అప్పట్లో డిప్లమో 10 సంవత్సరాలు. 

ఇంకా సందేహ మెందుకు ఆ బాలుడే వర్తమానంలో "వీణా కోవిద" "వైణిక శిరోమణి" శ్రీ అయ్యగారి సోమేశ్వర రావు గారు. 

శ్రీ సోమేశ్వర రావు గారు కళాశాలలో చేరేటప్పుడు ప్రిన్సిపాల్ గా వున్న నారాయణదాసు గారు రిటైర్ అవ్వడం, ద్వారం వెంకట స్వామి గారు ఆ స్థానం లోకి రావడం అన్నీ ఆ 10 సం।। కాలంలో జరిగింది. ద్వారం వెంకట స్వామి నాయుడు గారు తనతో కూడా వాయించమని సాధన చేయించేవారట.

మహరాజా సత్రంలో 10 సం।। భోజనం, కళాశాలలో బయట దూరంగా వున్న పెద్ద గదిలో (హస్తబల్) స్నేహితులతో కలపి బస. 

మేము ఆ మధ్య విజయనగరం వెళ్ళినప్పుడు ఆ గదిని దర్శించి మనస్సులో నమస్కరించుకున్నాం. మహా మహులు నివశించిన చోటు.  ఘంటశాల మా మామగారికి జూనియర్. మా మామగారు డిప్లమా అవుతుండగా వారు చిన్న తరగతులలో వుండేవారట. ఇలాగే సత్రం భోజనం, ఆగదిలో వసతి.

అప్పట్లో విజయనగరం సంగీత కళాశాల ఒక్కటే వుండడం వల్ల అన్ని చోట్ల నుండీ విద్యార్ధులు వచ్చి సత్రం భోజనం ఆ గదిలో మకాం. 

అన్నట్లు విజయ రామ గాన పాఠశాల చాగంటి గంగ బాబు గారనే అంధ విద్యార్ధి వయోలిన్ నేర్చుకోడం కోసం మహరాజు గారు ఏర్పాటు చేసేరట. అది ఈ నాటి విజయనగరం సంగీత కళాశాలగా వేవేల మంది కళాకారులను తయారుచేసి, ఆంధ్ర దేశానికి అందించింది. మన ఆంధ్ర దేశ చరిత్రకే మకుటాయమానమై , ఆంధ్ర మాతకు కలికి తురాయిగా నిలిచింది.


మా ఇంటి ఆణిముత్యములు


విజయనగర సంప్రదాయం.....
వాసావారి సంప్రదాయం..........।విజయనగర సాంప్రదాయం లోని వీణే "ఆంధ్రా వీణ" గా ప్రసిధ్ధి గాంచింది.అసలు పెద్ద పెద్ద సంగీత విద్వాంసులు అందరూ విజయనగరంలో నేర్చుకుని వచ్చినవారే.

మా మామగారు శ్రీ అయ్యగారి సోమేశ్వర రావు గారూ, శ్రీ వాసా కృష్ణమూర్తి గారూ సహధ్యాయులు, శ్రీ వాసా వెంకట రావు గారి వద్ద 10 సంవత్సరములు విద్యాభ్యాసం గావించారు. 

ఇద్దరిదీ విడదీయరాని స్నేహం. ఎక్కడైనా, ఎప్పుడైనా ఇద్దరూ కలసే వుండేవారుట. కలసే వీణ ప్రాక్టీస్ చేసేవారట. 

ఎంత విడదీయరాని బంధం అంటే వాసా కృష్ణ మూర్తి గారు మా మామగారు పోయినప్పుడు మా ఇంటికి వచ్చి "సోమేశం లేకుండా నేను వుండలేనురా" అన్నారు. పాపం ఏడాది తిరగకుండా పరమపదించారు, కాదు కాదు స్నేహితుని కలవడానికి వెళ్ళారు. 

 అన్నట్లు వీరిరువురూ మొదట్లో వీణ నిలబెట్టి వాయించేవారట. 

ఇక 1948 లో మా వారు పుట్టినప్పుడు,  బాపట్ల వచ్చేసారు మా మామగారు, అక్కడ పురజనుల కోరికపై. 

 1960 లో మా మామగారి, శ్రీ మహదేవు రాధాకష్ణ రాజు గారి, శ్రీ కోటిపల్లి ప్రకాశ రావు గారి appointment తో విజయవాడ సంగీత కళాశాల ప్రారంభించ బడింది. మొదటి ప్రిన్సిపాల్గా శ్రీ బాలమురళీ గారు appoint అయ్యేదాకా 1 1/2 సంవత్సర కాలం మా మామగారే Incharge principal గా వ్యవహరించారట. వారి జీవితం సంగీతమయం ఇంటా బయట అనేక వేలమంది శిష్యులను తయారు చేసారు.

 మా ఇంటిలో వారి శిష్యులు మా నాన్నగారు శ్రీ పప్పు సోమేశ్వర రావు గారూ, శ్రీ శ్యామ సుందర్ గారూ, పరిటీ రాజేశ్వరిగారూ శ్రీ సత్యప్రసాద్ గారూ, మిగిలిన వారి ముగ్గురు పిల్లలూ, అన్నట్లు వారి భార్య శ్రీమతి జయకుమారి. నేనూ ఒక సంవత్సరం వారి వద్ద విద్యనభ్యసించే అదృష్టానికి నోచుకున్నాను. ఇక ప్రశిష్యులు తామరతూడులా పెరిగి పోతున్నారు. 

ఇక వారి సంగీత సేవ గూర్చి మరలా  వీలు చూసుకుని, వీలు చేసుకుని వ్రాస్తాను.

 ఇప్పటికి శలవా మరి





చెంచా
"చెంచా" అంటున్నానని కాకా పట్టడం అనుక్కోకండి.
బారిష్టర్ పార్వతీశం టోపీ లా తగలడింది ఈ చెంచా నా పాలిట. అంతే కాదు ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా నా మొహం మీద తాండవిస్తూ. విసిరేసినా మళ్ళీ మళ్ళీ కన్పించకుండా వచ్చి చెంచాల స్టాండ్ లో దూరి పోయి కూర్చునుండడమే కాక 🤧🤧🤧 "16 ఏళ్ళ వయస్సు" సినిమా లో చంద్రమోహన్ లాగా తగుదునమ్మా అని ముందుగా అన్నిటికీ తనే తయారు. విసుగు వచ్చేస్తోంది.
కానీ ఇప్పుడే దాని మీద ఎన లేని జాలీ, వ్యామోహం కలిగి చెంచాల స్టాండ్ నుండీ తీసి మాన్యుమెంట్ లాగా భద్రంగా దాచేసా. ఇంక కాళ్ళల్లో పడదు చక్కగా భద్రంగా వుంటుంది.
దాని పరోపకార బుధ్ధికి, నా యందు గల అవ్యాజమైన ప్రేమకు గుర్తుగా దాచుకున్నాను బుజ్జి మున్నను.

20, ఆగస్టు 2016, శనివారం

టీచరు గారు

టీచరు గారూ 🙏🙏🙏
 
   మాధవపెద్ది సుబ్బలక్ష్మీ మూర్తిగారు.......

 ఆవిడ ఒకసారి పరిచయమౌతే గుర్తుండి పోయే వ్యక్తి. ఇక అలాటిది ఆవిడ నాకు గురువు, గైడ్, స్ఫూర్తిప్రదాయని, నాకు ఆదర్శం,ఇంకా చెప్పాలంటే తల్లి,తండ్రీ,గురువూ, దైవం, ఇంతకన్నా చెప్పడానికి నా భావానికి భాష లేదు.

  టీచర్ గారు మంచి ఝరితో ఎగిసి దూకే జలపాతం,  చల్లగా సాగే సెలయేరు,  చల్లటి మలయమారుతం, సుడులు తిరుగుతూ చుట్టబెట్టే సుడిగాలి, సన్నజాజీ-సంపెంగలు కలబోసిన సువాసన! వారి గూర్చి ఎంత చెప్పినా నాకు తృప్తి తీరదు.

మనకి ఏదైనా సమస్య వున్నప్పుడు సానుభూతి చెప్పేవారి వల్ల మనం మరింత డీలా పడి పోతాం, ఆవిడ సానుభూతి చెప్పరు ధైర్యం చెబుతారు (నయానా భయాన)

 వారి గూర్చి ఒక పుస్తకం రాయచ్చు, ఇంకా ఎంతో చెప్పాలని వుంది కానీ ఇంతటితో ముగిస్తున్నా!

   టీచరు గారూ! మీరు నా జీవితంలో తారస పడడం,  నా పూర్వ జన్మసుకృతం.............🙏🙏🙏

కాలం

కాలం

  ఆగదు, ఆపలేం. అందుకే అన్నారు జ్ఞాపకాలు పదిల పరచుకోమని. ఏమో బాబూ నా కైతే నా జీవితపు మంచి పుటలన్నీ కంఠోపాఠమే.

 మొన్న నేను పుట్టగానే శ్యామసుందరం నీకు భార్య పుట్టింది అని టార్చ్ వేసి చూపించారట తెలుసా!

 ఐదవ తరగతి శెలవలకు అమ్మ్మమగారి వూరు బాపట్ల, అక్కడ నుండి అత్తయ్యగారు, పెద్దమ్మగార్ల వూరు విజయ వాడ వెళ్ళాం.

 బస్ దిగగానే మా పెద్దమ్మగారి అమ్మాయి నన్ను మా బావను ఒకే రిక్షాలో కుదేసింది. రిక్షాలో ఈమూల ఒకరు, ఆ మూలకి ఒకరు తగలకుండా జాగ్రత్త పడ్డాం. మా మధ్య రిక్షాలో ఆమడ దూరం. నిజం నమ్మండి నవ్వకండి.

 ఆ సారి మా బావ మాకు విజయవాడ అంతా చూపించడం, సత్యహరిశ్చంద్ర సినిమా అన్నీ మొన్నేగా చూసాం, అరే అప్పుడే ముందుకొచ్చేసామా!

   సరే 1968 లో విజయవాడ స్టేషన్లో నేనూ మా నాన్నగారూ, తమ్ముడూ దిగే సరికి బ్రిడ్జ్ మీదనుండి దిగుతూ మా బావ నా వేపు చూసి నవ్వుతే మదిలో కోటి వీణలు మ్రోగాయి, ఇంకా ఆ నాదం చెవుల్లో రింగు రింగు మంటోందిగా.

 1969 మేము హైదరాబాదు నుండీ వస్తుంటే మా బావ సైకిల్పై  వస్తూ  మమ్మల్ని చూసి, ఆగి వెనుదిరిగి ఇంటికి వచ్చేసి (పని మానుకుని) నాకూ మాచెల్లికీ జామ తోటలు చూపించి మంచి సంపెంగ పువ్వు ఇస్తే, ఎన్ని రోజులు పుస్తకంలో దాచుకున్నానూ!

 ప్రేమ లేఖలు రాయమంటే ప్రోగ్రస్ రిపోర్ట్ పంపింస్తున్నానని కోపం తెచ్చుకున్నది మొన్ననే కదా! ( అప్పటి పదవ తరగతి పిల్లలంతకంటే ఏం రాస్తారండీ సోద్యం కాకపోతే)

 ఇంతలోనే చిటుక్కున బావతో పెళ్ళి, పిల్లలు ,వారి చదువులూ,వారి పెళ్ళిళ్ళూ, మనవలూ మనవరాళ్ళూ.........ఇలా విస్తరించుకుంటూ ఇంత దూరం వచ్చేసామా?

 నా మటుకూ గడిచిన కాలం, గడుస్తున్న కాలం అంతా ఆనందమయమే.

 నిన్న పుట్టినరోజు పెళ్ళి కొడుకేనండీ ఈ హీరో!
క్రిందటి  సంవత్సరం ఆగస్ట్ 15 మా పిల్లలు ఇద్దరూ కుటుంబ సమేతంగా వచ్చి నా
షష్టిపూర్తి వేడుకలు నిర్వహించిన తరువాత రాసిన పోస్ట్ మళ్ళీ నా కోసం.... చదవక పోయినా సరే ఏమీ అనుక్కోను.......

"గుండె  గొంతుకలో  కొట్లాడుతోంది"
                                                   ఏమని?

        మనస్సులో  కలిగిన  భావం  ఇక్కడ  రాయమని.

అందరూ  ఏమైనా  అనుక్కుంటారేమోనని  మొహమాటం,  కానీ ఇది  నా పేజీ! నా ఇష్టం  వచ్చినది  రాయచ్చు కదా?
ఏమంటారు?

    అవును  నిజమే!  ఎవరి  పిల్లలు వాళ్లకు ప్యారీ,  ఎవ్వరి  తల్లి తండ్రులు  అంటే  వాళ్ళ  పిల్లలకు  ఇష్టం, కృతజ్ఞతా  భావం.  కానీ  నా అనుభవం,  భావం  చెప్పుకునే్ుందుకు.... నాకు  అవకాశం  దక్కింది.  మరి   చెప్పద్దూ....

  ఈ  అవకాశం  నాకు  కల్పించిన   మా అబ్బాయి  కోడలికి  సంతోషాన్ని తెలియజేస్తున్నా..........

                ఇక  అసలు విషయానికి వద్దాం.....

ఒక పండితునింట  పుట్టి, ఒక పండితునింటిని మెట్టి , ఒక పండితుని  చేపట్టే  మహద్భాగ్యం  కలిగించిన  భగవంతునికి  ముందుగా కృతజ్ఞతలు  తెలియజేసుకుంటున్నాను.
   
  ఎంతో  బాగా  నిర్విహించి  ఈ   సన్నివేసాన్ని  రక్తి  కట్టించారు  మా  పిల్లలూ,  మావారూ. మా  కోడలి  నిర్వహణ లో  మనవలూ, పిల్లందరూ  నాపట్ల  వారి  ఇష్టాన్ని ప్రకటిస్తుంటే  ఆనందభాష్పాలు.

       మా అమ్మాయి అబ్బాయి  మాటలు  వింటుంటే  కన్నీరు   వరదలై  ప్రవహించింది.  (ఏడుపు కాదు  ఆనందం.)  పిల్లల్ని  పెంచినప్పుడు  మనకు తెలీదు  కర్తవ్యంగా  భావించి  పెంచుతం. వారు  వ్యక్తీకరించినప్పుడు   అవునా  అలా పెంచామా,  అంత  ప్రేమ  పంచామా?  అని  ఆశ్చర్యం  వేస్తుంది.  అయితే  నేను   బాగా పెంచానన్నమాట.  అందుకే  అంత మంచి  మాటలు విన్నాను. అని  సంతృప్తి  కలిగింది. (వీడియో చూస్తే  మీకు  కూడా  నా స్పందన  తాలూకు భావం అర్ధమవుతుంది)

   ఇక మనవలు ముగ్గురూ అమ్మమ్మ/ నానమ్మ అంటే ఎందుకిష్టమో వారు వారి మనస్సులోనిది  మాటల్లో రాసుకుని చదువుతుంటే  జన్మ ధన్యమయిపోయింది  అనిపించింది.  

     కడుపున  పుట్టిన  పిల్లలూ ,.. వారి  పిల్లలూ  ఒకలా  భావ  ప్రకటన  చేస్తే ...మా  అల్లుడూ,   కోడలూ  నా  వ్యక్తిత్వం  గూర్చి,  నా   టాలెన్ట్స్   గూర్చి  నా  వాత్సల్యం   గూర్చి  చెబుతుంటే  అనిపించింది  " ఏ  నాటి  నోము ఫలమో  ఏ  దాన  బలమో"  అని.

  ఇంతటితో సరిపోలేదు..... మా మనవరాళ్ళు  ఇద్దరూ వీణలు,  మా  మనవడి  పియానో, మా పిల్లలిద్దరూ కలసి  వీణలతో  నాకు మంచి మరువలేని  బహుమతినిచ్చేరు.

   వీనుల విందు అయ్యింది  కదా ఆ తరువాత  బహు   పసందు (విందు).

   నా  జీవితం  పరిపూర్ణం  అని   చెప్పుకోడానికిాిి  కొన్ని  విషయాలను   మీతో పంచుకుంటున్నాను.....

1)  మా నాన్నగారు   ఒకసారి   చెప్పారు "మళ్ళీ  జన్మ  అంటూ ఉంటే  జయలక్ష్మే  నాకు కూతురుగా పుట్టాలి"  అని.

2)  మా అమ్మ  గారు మా పిల్లలకి చెప్పారు" పిల్లలంటే  ఎవరికైనా అభిమానం ఉంటుంది,  కానీ  జయలక్ష్మి  అంటే  మాకు  గౌరవంతో కూడిన అభిమానం....అబిమానం  తన  హక్కు!  గౌరవం  తను సంపాయిన్చుకున్నది"  అని.

3)  అలానే మా అత్తగారు  చెప్పేరు "  జయలక్ష్మి నువ్వు  జంటిల్మాన్ (పాపం తనకు తెలిసిన పదం)  నువ్వు మా కోడలివి  అయ్యావు  కనుక  మా ఇంటికి   ఉపయోగ  పడ్డావు,  ఇదే అబ్బాయి  అయి  ఉంటె  మా  తమ్ముడుకి  ఉపయోగ పేడేదానివి"  "నువ్వు  లేకపోతే  నేను  చెరువులోంచి  బయట పడేసిన  చేపలా అయి పోతాను.   నన్ను కడవరకు  చూసి సాగనంపు"  అని. (ఆవిడ ఆజ్ఞ శిరసావహించాను.)

  ఇక మా  వారి గూర్చి  వేరే  చెప్పఖర్లేదు.  పిల్లలు  సరే  సరి.

       మా  శిష్యులు   తమకి  ఛాన్స్  ఇస్తే  వాళ్ళ టీచర్  గారు గూర్చి  బోలెడన్ని  చెప్పుకునే వారం  అనుక్కున్నారు.   మళ్ళీ  మా   ఏభైవ పెళ్లి  రోజుకు  కలసి  బోలెడన్ని  కబుర్లు చెప్పుకుందాం.......  అప్పుడు  ఛాన్స్  మీదే...సరేనా?

ఆనందంతో  కన్నీటి తెర  అడ్డు  వస్తోంది  రాయలేకపోతున్నా....... ఉంటాను మరి........

6, జులై 2016, బుధవారం

తులసీదళం

మీకు తెలుసా  తులసీదళం కుళ్ళింది. ఏమిటీ అప్రాచ్యపు మాటలూ!  అంటున్నారా?  అయితే మీరు ఇది చదివి తప్పక తెలుసుకోవాల్సిందేె.

అనగనగా ఒక 1978. ఉన్నట్టుండి పొద్దున్న 10.30 అయ్యింది. ఒక బుజ్జి గయ్యాళిగంప టీచర్ ఒక చేతిలో స్కేల్, ఒక చేతిలో ఒక తెల్లటి ప్లాస్టిక్ బేగ్ పట్టుకుని ........అరుచుకుంటూ,  శిష్యులను చివాట్లు పెడుతూ, గాలిలో స్కేల్ పెట్టి పిల్లల్ని చావబాదుతూ వీర విహారం చేస్తోంది. ఆ గయ్యాళిగంప ఒక్క ముక్క పిల్లలకి చెప్పిన పాపాన పోట్లేదు, కానీ అరుపులూ కేకలూ, హడావిడీ హంగామా.

ఇక కట్ చేస్తే   ....... ఒక ఇల్లాలు "ఇక్కడే తులసీదళం పెట్టాను" ఎక్కడుంది ? అని    వెతికేసుకుంటోంది. అదే సమయంలో ఆమె భర్త రంగ ప్రవేశం. అదీ అక్కడి సీను.

మీరు నిజమైన తులసీదళం అనుకున్నారు కదా ఒప్పుకోండి.......

కాదండీ బాబూ......అది యండమూరి వారి తులసిదళం.

ఈ పాటికి మీరు ఎవరెవరో ఊహించే ఉంటారు...... తెలుసులేండి. ఇంకెందుకూ  రహస్యం? నేనూ, మా అమ్మాయి కళ్యాణి , మావారు ముగ్గురం ఈ సీనులో ఉన్నది.

నేను మా స్టూడెంటును అడిగి తులసిదళం పుస్తకం కొత్తది తీసుకున్నా, చదివిస్తానని. ఆవిడ ఇస్తూ జయలక్ష్మి గారూ మా వారికి పుస్తకాలు ప్రాణం జాగ్రత్తగా ఇవ్వరూ? అంటూ ఇచ్ఛేరు. నేను సగం చదివి పుస్తకం  అక్కడే టేబుల్ మీద బోర్లించా. ఇంతలో మా అమ్మాయి టీచర్ ఆట కోసం ఫ్రిడ్జ్ లోంచి కొత్తిమీర పెట్టిన ప్లాస్టిక్ సంచీ తీసి అందులో ఈ పుస్తకం పెట్టింది. అందులో కొత్త్తిమీర కుళ్లింది.

వెతగ్గా వెతగ్గా ఈ ప్లాస్టిక్ సంచిలో ఉందేమోనని తీసి చూస్తే ఏముంది పుస్తకం చివర్లంతా ఆకుపచ్చగా కుళ్లు అంటుకుని కనిపించింది.
 నేను వెక్కి వెక్కి ఏడుపు . ఎలా ఇవ్వడం ఆవిడ ఏమైనా అనుకుంటారు, ఆవిడని వాళ్ళాయన కోప్పడతారు అని.

 ఇక మరి మా ఆయన రంగప్రవేశం చేసేరు కదా.. ఆయన మహా ఉపాయమంతుడు, గ్రేట్ రిపేరర్.

.ఛీ ఛీ ఇంత చిన్న దానికి ఏడుపేమిటి అని నన్ను ఊరడించి.. ఏదీ ఆ బుక్  తీసుకురా అని, దాని చివర్లు సున్నితంగా షేవ్ చేసి, ఇంకా కొంచెం మరక ఉంటే దానికి పౌడర్ అద్ది జాగ్రత్తగా మా శిష్యురాలికి అప్పజెప్పమన్నారు.వాళ్ళకి తెలీదు అని భ్రమ పడ్డాను గానీ,వాళ్ళు గ్రహించివుంటారు కదండీ.......

ఇంత కష్టపడి వాళ్ళని మభ్య పెట్టే బదులు, ఇప్పుడైతే కొత్త బుక్ కొనేవాళ్ళం,  తెలీని తనం. తలుచుకుంటే ఆ సన్నివేశం చాలా నవ్వు తెప్పిస్తుంది.... మీ సంగతి నాకు తెలీదు బాబూ. నవ్వుతే నవ్వండి లేకపోతే లేదు మీ ఇష్టం.....నేను మటుకూ నవ్వుతాను, నవ్వుతుంటాను, నవ్వుతూనే వుంటాను.......