4, జనవరి 2022, మంగళవారం

మనసులో మాట....

 వాగర్థావివ  సంపృక్తౌ  వాగర్థ ప్రతి పత్తయే ! జగతః పితరౌ  వందే పార్వతీ పరమేశ్వరౌ !

                  🙏🙏🙏


గుండె  గొంతుకలో కొట్లాడుతోంది ఏమని?                                                 మనస్సులో  కలిగిన  భావం  ఇక్కడ  రాయమని.


50 సంవత్సరాల వైవాహిక ప్రణయ ప్రయాణం. జీవితాన్ని గడప లేదు, జీవితంలో జీవించాం. ఉన్నదానికి సంతృప్తి చెందడం, ఆకాశానికి నిచ్చెనలు వేయకపోడం, ఎవరితోనూ పోల్చి చూసుకోకుండా, అందరితో స్నేహభావంతో, సంస్కృతితో, సంస్కారయుతంగా మెలగడమే మా జీవన విజయ రహస్యము. 


ఎత్తుపల్లాలు లేవు. హాయిగా సాగి పోతోంది. కారణం....... 👇


 నా  జీవన  సహచరుడు,  నేస్తం,  గురువు  అయిన  శ్రీ  శ్యామసుందరం గారు.


 మా  ఇద్దరి  తనువులు  వేరైనా  తలపులూ,   వాక్కూ  ఒకటే.


              నాకు  విద్య  చెప్పి,  విద్యలో  మెళుకువలు  నేర్పి, నన్ను  కళాకారిణిగా  రూపొందించి,  నాకూ ఈ సంగీత  ప్రపంచంలో  చిన్ని  స్థానాన్ని  ఏర్పరిచిన గురువు ఆయన. 


                  అలాగే  నా  జీవన   సహచరుడుగా,  తన  సరసన  కూర్చొని  సన్మాన  సత్కారాలను  అందుకనే  సదవ  కాశం నాకు  ఇచ్చేరు. నాకున్న  అర్హత  కన్నా  మిన్నగా  నాకు  సమాజంలో  గుర్తింపు  నిచ్చేరనేది  నా  భావన.


               అన్నిటికన్నా  మా  భావన “మేమిద్దరం  ఒకరికి ఒకరం  నేస్తాలమని” ఇది  ముమ్మాటికీ నిజం.  అడవిలో  ఉన్నా   ఫరవాలేదు,  మేమిద్దరం  ఉంటే  చాలు  అలా  కబుర్లే   కబుర్లు.   తను  ఎంతటి    పెద్ద  వారో  నాకు  తెలీదు  నా  నేస్తం  అంతే .


             నాకు ఇది  కావాలి  అని  అడిగిన  దాఖలాలు  లేవు.,  తానే  సర్వం  ఏర్పాటు  చేస్తారు. ఇక  జీవితం  నల్లేరు  మీద  బండిలా  ఎంత  సాఫీగా  సాగుతుందో  ఆలోచించండి. 


ఇక పిల్లలు..... 


అందరి తల్లిదండ్రులలాగానే మేము కూడా మా పిల్లలు ధనార్జనలో కన్నా, జ్ఞాన సముపార్జనలో ముందుండాలనీ, సజ్జన సాంగత్యం మెండుగా వుండాలనీ, సంగీత,సంస్కార, సంస్కృతీ, పరులవ్వాలని కోరుకున్నాము.భగవంతుడు అనుగ్రహించాడు.  కుటుంబ సభ్యులందరూ  మా ఆశయాల మేరకూ సదలవాట్లతో,సత్సాంగత్యం కలిగి,  సదాచార పరులుగా జీవిస్తున్నారు.


మనకు పుట్టిన పిల్లలు మనకు కావల్సిన విధంగా పెంచుకోగలం. కానీ మా ఇంటికి పెద్ద కొడుకుగా, పెద్ద కూతురిగా వచ్చిన మా పిల్లలిద్దరూ మంచి విద్యావంతులూ, సంస్కారం, సంస్కృతి, స్నేహభావం కలబోసుకుని మా ఆశయాలకు తగినవారు. 

ఇక మనవలు కూడా అదే బాటలో నడుస్తున్నారు..


మా శిష్యులు ప్రశిష్యులూ, పరిచయమైన ప్రతి ఒక్కరి అభిమాన ధనంతో, మా బాంక్ ఎక్కౌంట్లు పొంగి పొరలుతున్నాయి. ధన్యజీవులమైనాము. ఎంతో మంది అన్యోన్య దంపతుల సరసన నుంచో గలిగాము. ఎనలేని తృప్తిగా వుంది. 


నెల నుండీ ప్రతీ రోజూ నా జీవిత అనుభవాలనూ, అనుభూతులనూ మీతో  పంచుకున్నాను. 


ఇంత మంచి జన్మనిచ్చిన భగవంతునికి నమస్కరిస్తూ.....🙏🙏🙏


           


           

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి