23, అక్టోబర్ 2022, ఆదివారం

 తలపుల తలుపులు తెరుచుకున్నాయి


పిల్లల పసితనపు చేష్టలూ, ముద్దు మాటలూ, పాటలూ దాటి.... 


ఒకటి నుండీ పది లెఖ్ఖ పెట్టే సరికి లేవాలి.  ఒకటీ... నాలుగూ... ఎనిమిదీ.. పదీ... ఇంకా లేవలేదా, ఏమిటీ లేటు... అంటున్నట్లే వుంది. 


ఇల్లంతా బట్టలు పడేసి, పుస్తకాలు విరజిమ్మి, షూస్ సాక్స్ విసిరేసి, ఇల్లంతా చెత్త చెత్త చేసేవారు. 


హోమ్ వర్క్ చేసారా, వీణ వాయించుకోండీ, అల్లరి చేయకండీ, కొట్టుకోకండీ, కోర్టు సీన్లు ఎందుకూ? ఇక్కడ పెట్టిన జీడి పప్పూ కిస్మిస్ ఏవీ. ఇదిగో ఈ కొబ్బరి పచ్చడి చేయాలి, తినేయకండి. మూతికి ఏమిటీ అంటుకుందీ హార్లిక్సేనా? ఆ దశా దాటింది. 


 కాలేజ్ కి జాగ్రత్తగా వెళ్ళి రండి, మంచి వాళ్లతో స్నేహం చేయండి, బాగా చదువుకుని పైకి రావాలి. వీణ బాగా వాయించి మన ఇంటి పేరు నిలపాలి.... 


హమ్మయ్యా బాగా స్థిర పడ్డారు. మంచి పిల్లలను చూసి పెళ్ళిళ్ళు.


 అరే! వీళ్ళు మన దగ్గర నుండి దాటుకుని వారి వారి గువ్వలతో మన గూడు విడచి వారి వారి గూళ్ళకు చేరుకున్నారా? 


ఇంకా అరుస్తున్నట్లే వుంది వారి మీద. కాలం వేగంగా కదిలి పోయింది. ఇప్పుడు ఇల్లంతా శుభ్రంగా, ప్రశాంతంగా ఎక్కడి వస్తువులక్కడే మనం కోరుకున్నట్లు. 


కానీ ఆ సందడేదీ,ఆ సంతోషమేదీ. సారాంశం ఏమంటే పిల్లల బాల్యాన్ని ఆస్వాదించండి, ఆనందించండి. వారి బాల్యం "మనకు కూడా" తిరిగి రాదు. 

  ముందు ముందుకు వచ్చేసాం.

 ఇప్పటి ఆనందం ఇప్పటిది. ఇప్పుడూ. అప్పుడూ....ఎప్పుడూ ఆనంద భరితమే జీవితం.

 ఏమీ తోచక మళ్ళీ పాడిందే పాడరా .........పళ్ళ దాసరీ అన్నట్లు పాత చింతకాయ పచ్చడే....... మీ ఇష్టం చదవకపోయినా ఫర్లేదు, ఏహేమీ అనుక్కోను, ఇక మీ ఇష్టమే ఏం చేస్తారో చెయ్యండి......


అల్లిబిల్లి   చందమామ  ఈ  చిన్నారి.............


    చిన్ని  బాలుడే  కానీ..... ఆకాశంలో   ఎగరాలని,   (పక్షిలాగా),  మబ్బులతో  నడయాడాలనీ, కాళ్ళకి  లేపనాలు  పూసుకుని  ఆకాశ  గమనం  చెయ్యాలని,  కుక్కపిల్లల  మీసాలు  పీకాలని,  ఇంటికొచ్చిన  వారి  చెప్పులు  దాచేసి  వారు   వెతుక్కున్టుండగా  మళ్ళీ తెచ్చి  ఇవ్వాలనీ,  ఇలా  ఏవేవో  చిలిపి  తలపులు  ఆ  బాలుడికి  మదిలో  వెల్లి విరిస్తుంటాయి......


      ఇక  అసలు  విషయానికి  వద్దాం......


 ఒక  సారి  ఆ  బాలుడింటికి  వారి  మేనమామ   వచ్చేరు.  ఇక  మన  చిన్నారికి  ఆనందం  హద్దులు  లేకుండా  పొయ్యింది.  ఆ  వచ్చినాయన  బాగ్  లోంచి  పేస్టు  బ్రష్  తీసుకుని,  బ్రష్  మీదా  పేస్టు  పెట్టుకుని,  బ్రష్  చేసుకుందుకు   వెళ్ళేరు.


     మన  బాలుడికి  పేస్టు  వాసన  చూసి  అది స్ట్రాంగ్  పిప్పెర్మేంట్   వాసనలా  ఉంది  అనిపించింది.  అంతే  బుర్ర  పరి పరి  విధాల  ఆలోచించింది. 


 కొంచెం  తీసుకుని అలమారాలో  రౌండ్గా   బిళ్ళల  లాగా  అంటించుకుని  (ఆరేక  స్ట్రాంగ్  పిప్పెర్మేంట్స్ అవుతాయనే  భావన, భ్రమతో) ఆరేక  ఆ   స్ట్రాంగ్  బిళ్ళలు తినచ్చని  భావించాడు.


    ఇంతలో  బుర్రలో  మరో  ఆలోచన   తళుక్కున  మెరిసి  మొహానికి  పూసుకుంటే  తెల్లగా  స్నోలాగా  ఉంటుంది కదా  అని  మొహానికి  పూసుకున్నాడు.


 

  మొహం  మండి  పోతోంది, ఇంతలో  మేనమామ  పని  పూర్తి  చేసుకుని  వచ్చి చూసి విషయం  అర్ధం  చేసుకుని ఒళ్ళు  మండి  కొట్టాలని  పించినా  మళ్ళీ   బాగుండదని  (కాబోయే  అల్లుడని)   నిస్సహాయంగా  చాలా  ఎక్కువగా  ముద్దు  లాడి  ఏడుపు  మొహం  పెట్టుకుని  ఊరుకున్నారు.


  వచ్చిన  గెస్ట్  ఊరుకున్నా,  వాళ్ళ  నాన్నగారూరుకుంటారా?  ఊరుకోలేదంతే...ఊరుకోలేదు......

25, మే 2022, బుధవారం

 నిరంతర స్వర రస వాహిని ..... 


ఆ..... అదేంటి 🤔 ... ఇవాళ పోస్టింగ్ చేయాల్సిన వాళ్ళు మిస్ అయ్యారా😮.. 

మరి మేడం వెంటనే వేరే వాళ్ళతో పోస్ట్ చేయిస్తారు కదా.....అసలు ఏ ఇబ్బంది వల్ల మిస్ అయ్యారో పాపం వాళ్ళు🙁... అయినా మేడం అర్ధం చేసుకుంటారులే.... వెంటనే ఎవరో ఒకళ్ళు backup కూడా ఉంటారూ..... .... 

మరి ఎవరూ పోస్ట్ చేయలేదేంటి చెప్మా.🤔.... ఏవేవో పోస్టులు ఉన్నాయేంటి... 


అమ్మో.... గురువుగారి పోస్ట్ 😳 ..... ఏదో tricky ఆక్టివిటీ ఇచ్చుoటారు... ఈజీ అనిపిస్తుంది కానీ చేయొచ్చేప్పటికి ముందుకు సాగదు... 😒🙈


ఇదీ వరస.... గ్రూప్ ఓపెన్ చేయగానే, ఒక్క క్షణం కాలం పాటు నా ఆలోచనలు పొద్దున్నే గిరా గిరా తిరిగాయి .... ఆ తర్వాత తట్టింది మరి అసలు విషయం .... నిన్ననే వర్ణోత్సవం అయిపోయింది అనీ .... అందరం ఒకళ్లకొకళ్ళు వాళ్ళ మనోభావాల్ని ఆడపిల్ల పెళ్లి అయ్యి వెళ్లిపోయినంత (అంటే బాధ ఆనందం కలగలిసిన భావం) భారంగా ఫీల్ అయ్యి పంచుకున్న సంగతి .... హ్మ్మ్...... 


అయిపోయిందా ..... 


40 రోజుల పాటు ..... కాదు కాదు. ... వాగ్గేయకార కదంబం, వర్ణోత్సవం ..... ఇలా పేర్లు ఏవైనా, దాదాపు 3 నెలల పాటు నిరాటంకంగా శిష్య ప్రశిష్యులతో గురువుగారూ, మేడం గారు చేయించిన నిత్య సంగీత సాధన (కాదు *సంగీత పూజ* *నాద పూజ* ) ...... 

వాగ్గేయకరులకు, రాగములకు సంబంధించిన ఎన్నెన్నో కొత్త కొత్త విషయాలతో, ఎప్పుడూ వినని ఎన్నెన్నో అందమైన వివిధ రకములైన వర్ణాలతో, చక చక్కని చిన్న పిల్లల దగ్గరనుండి vintaged సీనియర్ స్టూడెంట్స్/ఆర్టిస్ట్స్ వరకూ ఎవరికెవ్వరూ తీసిపోనట్టు పాడి, వాయించి, ఈ సమూహాన్ని నాదమయం చేసి, సంగీతం లో ఓలలాడించిన వర్ణోత్సవం అయిపోయిందా ..... హ్మ్మ్.... అయిపోయింది .... ఫైనల్లీ నా మనసుకి అర్ధం అయింది .... 


ఒక మంచి ఆలోచన చేసి, దానికి ప్రాణం పోసి, దానిలో శిష్యులందరిని భాగస్వామ్యులని చేసి, అందరినీ అలరించేలా ఒక కార్యక్రమాన్ని రూపొందించి, ప్రతి నిముషం ఎక్కడా ఏదీ చెదరకుండా, చివరిదాకా అనుకున్నది అనుకున్నట్టు జరిగేలా చూసి సంగీత నాదామృతాన్ని శిష్యులందరికీ సమానంగా పంచిన గురువుగారికి, మేడం గారికి, పాదాభివందనాలు. 


సంగీతానికి సంబంధించిన 3 important aspects, రాగ లక్షణం, నోటషన్, పెర్ఫార్మెన్స్ ఇలా అన్నిటిని అనుసంధాన పరిచేలాగా ఒక అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని రూపొందించి, శిష్యులందరికీ ఒక కష్ట తరమైన ఛాలెంజ్ ఇచ్చి తద్వారా వారి సాధనా పటిమని, ధైర్యాన్ని పెంచి, వాయింపించి, పాడించి, అందరికీ వినిపించి, విని ప్రోత్సహించి, ఎడతెరిపి లేకుండా మాతో నడిచి, మమ్మల్ని నడిపి ఈ సంగీత ప్రయాణంలో ఎన్నోవిషయాల్ని తెలుసుకొనేలా చేసి, ఒక మెట్టు ఎక్కాము అనిపించి ఎంతో ఎంతో తృప్తినిచ్చారు. ఇది ఒక మామూలు గ్రూప్ కాదు, మీరు మామూలు గురువులు కాదు, మాకు మీరొక లైట్ హౌస్ .... సంగీతానికి పవర్ హౌస్ లాంటి వాళ్ళు మీరు గురువుగారూ,మేడం గారు .... 


రైతు నెలల తరబడి కష్టపడి పండించిన పంట చేతికి రాగానే ఎంతో సంతోషపడిపోతాడు ... కానీ అదే పంట ఎప్పటికీ సరిపోదని తనకి తెలుసు .... 

అందుకే వెంటనే తదుపరి పంట గురించి ఆలోచిస్తూ ప్రణాళికలు వేస్తూ ఉంటాడు. అలా మీరు మరొక ప్రాణాళికతో సిద్ధంగా ఉన్నారని కుడా అర్థమయుయింది ..అందుకే సంగీత కృషీవలురు మీరిద్దరూ.... అందుకే మీకు సహస్ర పాదాభివందనాలు... 


ఏదో గ్రూప్ ఉందంటే ఉంది, పాడామంటే పాడాము, వాయించాము అంటే వాయించాము అన్నట్టు ఉన్నాయి కొన్ని గ్రూపులు (నేనున్నాను అలాంటి ఒకటి రెండింటిలో) కానీ మన గ్రూప్ అన్నిటికి మించి ఒక వేరే లెవెల్,.. మమ్మల్ని ఇలా ఇంత వైవిధ్యభరిత్ గా సంగీతం లో ఎంగేజ్ చేస్తూ ఉండే మీ వంటి గురువులు ఉండటం మా జన్మ జన్మల అదృష్టం ... 🙏🙏🙏🙏


లోగోని చేసిన హిమజ నరసింహదేవర గారు, ప్రణాళిక తయారుచేసిన అనురాధ దర్భ గారు ఈ కార్యక్రమానికి తమ వంతు సహాకారాన్ని అందించే అదృష్టం పొందారు ... కృతజ్ఞతాభివందనాలు 


ఇక శోభామాధవి గారు, .. అపురూపమైన రాగ లక్షణాలు ప్రెజెంట్ చేశారు, ఎంతో రీసెర్చ్ చేసి, ఎన్నో కొత్త విషయాలతో, మరెంతో valuable information ని పంచారు, ఎప్పటికి ఉండిపోయేలా నోటషన్ ని digitalise చేసి మరీ అందించారు ... ఈ ప్రోగ్రాం కి ఎనలేని విలువైన contribution ఇది ... మీకు మనఃపూర్వక నమస్సులు ... 


ఇక మిగతా శిష్యులందరూ వారికి అప్పగించిన బాధ్యతల్ని వాయించి, పాడి, విని అభినందనల్ని తెలిపి ఆ కార్యక్రమానికి encouragement ని ఇచ్చారు ... శ్రోతలు లేకపోతే ఎవరికోసం పాడాలి, ఎవరికోసం వాయించాలి ... అందుకే అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 


గురువుగారూ, మేడం గారు, ఈ కార్యక్రమాల ద్వారా మీరు మాకు అందించిన సంగీత జ్ఞానాన్ని మేము నెమరు వేసుకుని మస్తిష్కంలో నిలుపుకుంటాము.... మా కోసం మీరు రూపొందించిన మరొక కార్యక్రమం మొదలయ్యేవరకూ.... 


🙏🙏🙏🙏

4, జనవరి 2022, మంగళవారం

మనసులో మాట....

 వాగర్థావివ  సంపృక్తౌ  వాగర్థ ప్రతి పత్తయే ! జగతః పితరౌ  వందే పార్వతీ పరమేశ్వరౌ !

                  🙏🙏🙏


గుండె  గొంతుకలో కొట్లాడుతోంది ఏమని?                                                 మనస్సులో  కలిగిన  భావం  ఇక్కడ  రాయమని.


50 సంవత్సరాల వైవాహిక ప్రణయ ప్రయాణం. జీవితాన్ని గడప లేదు, జీవితంలో జీవించాం. ఉన్నదానికి సంతృప్తి చెందడం, ఆకాశానికి నిచ్చెనలు వేయకపోడం, ఎవరితోనూ పోల్చి చూసుకోకుండా, అందరితో స్నేహభావంతో, సంస్కృతితో, సంస్కారయుతంగా మెలగడమే మా జీవన విజయ రహస్యము. 


ఎత్తుపల్లాలు లేవు. హాయిగా సాగి పోతోంది. కారణం....... 👇


 నా  జీవన  సహచరుడు,  నేస్తం,  గురువు  అయిన  శ్రీ  శ్యామసుందరం గారు.


 మా  ఇద్దరి  తనువులు  వేరైనా  తలపులూ,   వాక్కూ  ఒకటే.


              నాకు  విద్య  చెప్పి,  విద్యలో  మెళుకువలు  నేర్పి, నన్ను  కళాకారిణిగా  రూపొందించి,  నాకూ ఈ సంగీత  ప్రపంచంలో  చిన్ని  స్థానాన్ని  ఏర్పరిచిన గురువు ఆయన. 


                  అలాగే  నా  జీవన   సహచరుడుగా,  తన  సరసన  కూర్చొని  సన్మాన  సత్కారాలను  అందుకనే  సదవ  కాశం నాకు  ఇచ్చేరు. నాకున్న  అర్హత  కన్నా  మిన్నగా  నాకు  సమాజంలో  గుర్తింపు  నిచ్చేరనేది  నా  భావన.


               అన్నిటికన్నా  మా  భావన “మేమిద్దరం  ఒకరికి ఒకరం  నేస్తాలమని” ఇది  ముమ్మాటికీ నిజం.  అడవిలో  ఉన్నా   ఫరవాలేదు,  మేమిద్దరం  ఉంటే  చాలు  అలా  కబుర్లే   కబుర్లు.   తను  ఎంతటి    పెద్ద  వారో  నాకు  తెలీదు  నా  నేస్తం  అంతే .


             నాకు ఇది  కావాలి  అని  అడిగిన  దాఖలాలు  లేవు.,  తానే  సర్వం  ఏర్పాటు  చేస్తారు. ఇక  జీవితం  నల్లేరు  మీద  బండిలా  ఎంత  సాఫీగా  సాగుతుందో  ఆలోచించండి. 


ఇక పిల్లలు..... 


అందరి తల్లిదండ్రులలాగానే మేము కూడా మా పిల్లలు ధనార్జనలో కన్నా, జ్ఞాన సముపార్జనలో ముందుండాలనీ, సజ్జన సాంగత్యం మెండుగా వుండాలనీ, సంగీత,సంస్కార, సంస్కృతీ, పరులవ్వాలని కోరుకున్నాము.భగవంతుడు అనుగ్రహించాడు.  కుటుంబ సభ్యులందరూ  మా ఆశయాల మేరకూ సదలవాట్లతో,సత్సాంగత్యం కలిగి,  సదాచార పరులుగా జీవిస్తున్నారు.


మనకు పుట్టిన పిల్లలు మనకు కావల్సిన విధంగా పెంచుకోగలం. కానీ మా ఇంటికి పెద్ద కొడుకుగా, పెద్ద కూతురిగా వచ్చిన మా పిల్లలిద్దరూ మంచి విద్యావంతులూ, సంస్కారం, సంస్కృతి, స్నేహభావం కలబోసుకుని మా ఆశయాలకు తగినవారు. 

ఇక మనవలు కూడా అదే బాటలో నడుస్తున్నారు..


మా శిష్యులు ప్రశిష్యులూ, పరిచయమైన ప్రతి ఒక్కరి అభిమాన ధనంతో, మా బాంక్ ఎక్కౌంట్లు పొంగి పొరలుతున్నాయి. ధన్యజీవులమైనాము. ఎంతో మంది అన్యోన్య దంపతుల సరసన నుంచో గలిగాము. ఎనలేని తృప్తిగా వుంది. 


నెల నుండీ ప్రతీ రోజూ నా జీవిత అనుభవాలనూ, అనుభూతులనూ మీతో  పంచుకున్నాను. 


ఇంత మంచి జన్మనిచ్చిన భగవంతునికి నమస్కరిస్తూ.....🙏🙏🙏