6, జులై 2016, బుధవారం

తులసీదళం

మీకు తెలుసా  తులసీదళం కుళ్ళింది. ఏమిటీ అప్రాచ్యపు మాటలూ!  అంటున్నారా?  అయితే మీరు ఇది చదివి తప్పక తెలుసుకోవాల్సిందేె.

అనగనగా ఒక 1978. ఉన్నట్టుండి పొద్దున్న 10.30 అయ్యింది. ఒక బుజ్జి గయ్యాళిగంప టీచర్ ఒక చేతిలో స్కేల్, ఒక చేతిలో ఒక తెల్లటి ప్లాస్టిక్ బేగ్ పట్టుకుని ........అరుచుకుంటూ,  శిష్యులను చివాట్లు పెడుతూ, గాలిలో స్కేల్ పెట్టి పిల్లల్ని చావబాదుతూ వీర విహారం చేస్తోంది. ఆ గయ్యాళిగంప ఒక్క ముక్క పిల్లలకి చెప్పిన పాపాన పోట్లేదు, కానీ అరుపులూ కేకలూ, హడావిడీ హంగామా.

ఇక కట్ చేస్తే   ....... ఒక ఇల్లాలు "ఇక్కడే తులసీదళం పెట్టాను" ఎక్కడుంది ? అని    వెతికేసుకుంటోంది. అదే సమయంలో ఆమె భర్త రంగ ప్రవేశం. అదీ అక్కడి సీను.

మీరు నిజమైన తులసీదళం అనుకున్నారు కదా ఒప్పుకోండి.......

కాదండీ బాబూ......అది యండమూరి వారి తులసిదళం.

ఈ పాటికి మీరు ఎవరెవరో ఊహించే ఉంటారు...... తెలుసులేండి. ఇంకెందుకూ  రహస్యం? నేనూ, మా అమ్మాయి కళ్యాణి , మావారు ముగ్గురం ఈ సీనులో ఉన్నది.

నేను మా స్టూడెంటును అడిగి తులసిదళం పుస్తకం కొత్తది తీసుకున్నా, చదివిస్తానని. ఆవిడ ఇస్తూ జయలక్ష్మి గారూ మా వారికి పుస్తకాలు ప్రాణం జాగ్రత్తగా ఇవ్వరూ? అంటూ ఇచ్ఛేరు. నేను సగం చదివి పుస్తకం  అక్కడే టేబుల్ మీద బోర్లించా. ఇంతలో మా అమ్మాయి టీచర్ ఆట కోసం ఫ్రిడ్జ్ లోంచి కొత్తిమీర పెట్టిన ప్లాస్టిక్ సంచీ తీసి అందులో ఈ పుస్తకం పెట్టింది. అందులో కొత్త్తిమీర కుళ్లింది.

వెతగ్గా వెతగ్గా ఈ ప్లాస్టిక్ సంచిలో ఉందేమోనని తీసి చూస్తే ఏముంది పుస్తకం చివర్లంతా ఆకుపచ్చగా కుళ్లు అంటుకుని కనిపించింది.
 నేను వెక్కి వెక్కి ఏడుపు . ఎలా ఇవ్వడం ఆవిడ ఏమైనా అనుకుంటారు, ఆవిడని వాళ్ళాయన కోప్పడతారు అని.

 ఇక మరి మా ఆయన రంగప్రవేశం చేసేరు కదా.. ఆయన మహా ఉపాయమంతుడు, గ్రేట్ రిపేరర్.

.ఛీ ఛీ ఇంత చిన్న దానికి ఏడుపేమిటి అని నన్ను ఊరడించి.. ఏదీ ఆ బుక్  తీసుకురా అని, దాని చివర్లు సున్నితంగా షేవ్ చేసి, ఇంకా కొంచెం మరక ఉంటే దానికి పౌడర్ అద్ది జాగ్రత్తగా మా శిష్యురాలికి అప్పజెప్పమన్నారు.వాళ్ళకి తెలీదు అని భ్రమ పడ్డాను గానీ,వాళ్ళు గ్రహించివుంటారు కదండీ.......

ఇంత కష్టపడి వాళ్ళని మభ్య పెట్టే బదులు, ఇప్పుడైతే కొత్త బుక్ కొనేవాళ్ళం,  తెలీని తనం. తలుచుకుంటే ఆ సన్నివేశం చాలా నవ్వు తెప్పిస్తుంది.... మీ సంగతి నాకు తెలీదు బాబూ. నవ్వుతే నవ్వండి లేకపోతే లేదు మీ ఇష్టం.....నేను మటుకూ నవ్వుతాను, నవ్వుతుంటాను, నవ్వుతూనే వుంటాను.......