29, ఏప్రిల్ 2016, శుక్రవారం

కల.........
"అమ్మా అమ్మా" అని వెక్కి వెక్కి ఏడుపు వినిపించింది పక్క గదిలో ఉన్న అమ్మకి. అయ్యో అని అర్ధ రాత్రి పరుగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి, బుజ్జి పాప ఏడుస్తోంది!
ఎందుకుట? ఆ బుజ్జి పాప వీధి అరుగు మీద నుంచుని జంతిక తినబోతుండగా , ఒక కుక్క పరిగెత్తుకుని వచ్చి చేతిలోంచి లాక్కుని వెళ్లి పోయింది. అసలే జంతిక అంటే చాలా ఇష్టం, పైగా కుక్కంటే చచ్చే భయం. ఇక చెప్పాలా? రెండూ కలిపి ఏడుపే ఏడుపు.
ఇది ఆ చిన్ని పాపకు గుర్తున్న మొదటి కల. జంతిక తింటున్నట్లు కల వచ్చిందని తిండిపోతు కాదండీ బాబూ!
ఇప్పుడు చెప్పండి ఎవరా పాప?
ఇలాగే మీ మొదటి కల గుర్తుంటే చెప్పండి మీరు కూడా! టైం వేస్ట్ అనుక్కోకండి, ఇవన్నీ మన జ్ఞాపక శక్తిని పెంచుతాయి. లైక్ కొట్టేసి కూర్చోడం కాదు, మీ అనుభవాన్ని గుర్తు చేసుకుని చెప్పండి చూద్దాం.........

25, ఏప్రిల్ 2016, సోమవారం

జోజీ.......జోయ్

  అల్లరి జోజి గాడు, ఉడుకుమోతు జోయమ్మ  పుట్టి ఇప్పటికి 11 సంవత్సరాలు అయ్యింది.
అది 2004 సెప్టెంబర్ 23 అర్ధరాత్రి 12 గంటలు. ఒక్క సెకండ్లో  రెండు కారక్టర్స్  రూపు దిద్దుకుని, జన్మించాయి నా ఊహ  నుండి.

ఎందుకు?
మా చిన్ని మనవరాలు పుట్టే ప్రయత్నం కోసం మా అమ్మాయి అల్లుడూ అర్జెంటుగా హాస్పిటల్ వెళ్తూ, మూడు ఏళ్ల మా పెద్ద మనవరాలు నిద్ర పోతుండగా నాకప్ప చెప్పి వెళ్లి పోయారు. అరగంట అవ్వగానే పాప ఏడ్చింది.  కానీ ఇంట్లో వుడ్ వర్డ్స్ గ్రేప్ వాటర్ లేదు కదా మరి ఎలా? ఇంతలో మా బుజ్జి జోజి జోయ్ పుట్టేసారు.

వాళ్ళిద్దరూ ఎంత అల్లరి వెధవాయలో, ఎన్ని tఅల్లర్లు చేసేరో, మా మనవల్ని ఎలా నిద్ర పుచ్చారో, ఎలా భోజనం చేయించారో. ఎలా మైమరపించారో  ఆశ్చర్యం వేస్తోంది.అన్నట్లు మా మనవల్నే కాదు ఆ వయస్సు వాళ్ళని ఎందరినో నా చుట్టూ  చేర్చి, అవి వింటూ అమ్మల కాళ్ళల్లో పడి పోకుండా ముద్దుగా నా దగ్గరే కూర్చునేట్లు  చేసేరు.

ఒకటి గుర్తుంచుకోవాలి.. ఇవి అమెరికా బుజ్జి కూనలు. అవి వాల్మార్ట్, మేసీస్ , అమెరికా విను వీధుల్లో , గొడుగు లేసుకుని, అల్లరి చేస్తూ తిరుగుతాయి. ఇంతే కాదు అల్లరి బాచ్ గా కొంత మంది కలిసి అమెరికా నుండి ఇండియా ప్రయాణం చేసేరు.
ఈ ఎపిసోడ్స్ కావాలంటే మీరు కూడా చిన్న పిల్లలై పోయి నా చుట్టూ చేరి నేను చెప్పే కధలు వింటారా? వచ్చానండొయ్ కధల అమ్మమ్మ!

కావాలా/ వద్దా? మీ రెస్పాన్స్ బట్టే ఉంటుంది ఎపిసోడ్స్.

17, ఏప్రిల్ 2016, ఆదివారం

స్వామి  సన్నిధి .......

గుమ్మం లోపల "అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు" గుమ్మం బయట గుమ్మానికి ఆనుకుని భక్తుడు, ఆయన సతీమణి... ఇది నా స్వానుభవమ్.  మర్చి పోలేక పోతున్నా .  జన్మ ధన్యమయ్యింది.

 నిజం ఈ బొమ్మలో  చూసిన దేవ దేవుడినే చూసింది .  నిజ రూపం, నేత్ర దర్శనం.
అలంకరణ  రహితంగా  "నల్లని మేని నగవు చూపుల వాడు, తెల్లని కన్నుల దేముడు" "బ్రహ్మ కడిగిన పాదములతో "  "అందరికీ  అభయంబులిచ్చు చేతులతో", ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, అర్ధనిమీలిత నేత్రుడు, ప్రత్యక్షమవుతే కదలకుండా ఉండిపోయాము . జీవితంలో అత్యంత ఆనందానుభూతిని చెంది శటగోపం, తీర్థం,హారతి (తిరుపతి లో ఇటువంటివి దొరకడం కష్టం) తీసుకుని, "వెళ్ళండి" అని  ఎవ్వరితో తోయిన్చుకోకుండా 4 నిమిషాలు అక్కడ నుంచుని మరీ వచ్చామ్.

ఇంత కంటే ఇంకేమి కావాలండి!

అన్నట్లు గురువారం దర్శనం కి ఒక విశేష ముందట ........ ప్రతీ రోజూ  సకల ఆభరణాలతో ఉన్న భగవంతుడిని చూడ్డానికి మనం  వెళ్తామట,  గురువారం మటుకూ  స్వామి తను చూడ దలచుకున్న వారిని రప్పించుకుంటారట . ఎందుకంటే ఆయన నేత్రాలు విప్పారి ఉంటాయట .

మేమంత అదృష్టవంతులమో కదా! అదే మా నాదనీరాజనం అవ్వగానే మాకు దర్శనం మయ్యుంటే మేము అలంకార సహితుడైన దేవ దేవుడుని చూసే వాళ్ళం , అలా కాకుండా వెంకన్న బాబు మమ్ము తన నేత్రాలతో చూసి ఆశీస్సులు అందించడానికి గురువారం దర్శనం ఏర్పాటు చేసేరు. భగవంతుడి చల్లని చూపు మనపై  ప్రసరిస్తే  అంతకంటే ఇంకేమి కావాలి?

"ఓం నమో వేంకటేశాయ"