31, అక్టోబర్ 2009, శనివారం

జీవిత సత్యాల వివరణ (నాకు తెలిసినంతలో)

సంతోషం లో వాగ్దానం చెయ్యకు...............


మనకు తెలిసిన చక్కటి ఉదాహరణ దశరధుడు ఒకానొక ఆనంద కరమైన పరిస్థితుల్లో కైకేయికి వాగ్దానం చేయడం.


పసి బాలులయిన రామ లక్ష్మణులు విశ్వామిత్రుడి వెంట యాగ సంరక్షణార్ధం అడవికి వెళ్ళడం,సీతాదేవి తో వివాహం, రామునికి వనవాసం, సీతావియోగం, రామ..రావణ యుద్ధం, పట్టాభిషేకం, సీతాదేవి వనవాసం, రామునికి లవకుశుల బాల్యం ఆనందించడానికి వీలులేకుండాపర్ణశాల లో వారి బాల్యం, చివరికి సీతాదేవి అవని లోఇక్యమవ్వడం (అన్నీ కష్టాలే) ఇవన్నీ సంతోషం లో చేసిన వాగ్దానమే కదా కారణం.
(దానివల్లనే మన అందరికీ అద్భుతమైన రామాయాణాన్నీ , మనందరమూ ఆదర్శం గా తీసుకునే విధం గా రాముని వ్యక్తిత్వం తెలియజేయడం జరిగింది, ఇది పాజిటివ్ థింకింగ్ ......నిజం కూడా ) .
ఆనందానికి అవధులు కానీ, ఆలోచన కానీ లేదు.


అలాగే కోపం లో సమధానం వల్ల చాలా అనర్ధాలు వస్తాయి.............
కోపం సమయం కొద్ది సేపే, కానీ దాని వల్ల జరిగే (ఆ సమయం లో అనే మాటలూ, చర్యలవల్ల) హాని అంతా ఇంతాకాదు.
మాట ఒక్క క్షణం లో అనేస్తాము కానీ, అనిపించుకున్నవారు మాత్రం జీవిత కాలం గుర్తుంచుకుంటారు, అవకాశం వచ్చినప్పుడు దెప్పుతునె వుంటారు. ఎందుకు వచ్చిన తంటా, హాయిగా కోపం వచ్చినప్పుడు మాట్లాడకుండా ఒకటి నుండి వంద వరకూ నంబర్లు లెఖ్ఖ పెట్టుకుంటే , ఈ లోగా కోపం మటుమాయమవుతుంది. సమస్య ఉండదు. అందరమూ మానవ మాత్రులమే. ఏదో ఒక తప్పు ఎప్పుడో ఒకప్పుడు చేస్తూనే ఉంటాము.
నా ఉద్దేశ్యం లో క్షమా గుణం , మరపు, కోపం సమయం లో మాట్లాడకుండా ఉండడం పరిష్కారం గా భావిస్తాను.
కానీ ఇది చాలా కష్టసాధ్యమయిన . ప్రయత్నిస్తే సఫలీక్రుతులమవ్వగలము.


ఇక మూడవది ఒత్తిడి లో నిర్ణయాలు తీసుకోవద్దు.................
ఈ విషయం ఈ మధ్య మాకు తెలిసిన వారి వద్ద ఈ ప్రస్తావన వచ్చినప్పుడు , ఆ అమ్మాయి అన్న మాట నన్ను ఒక నిమిషం ఆలోచింప జేస్తోంది.
ఏమంటే ,నిర్ణయాలు తీసుకునే అప్పుడే కదా ఒత్తిడి ఉండేది .
నిజమే, నిర్ణయం తీసుకునేప్పుడు ఒత్తిడి....ఒత్తిడి ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకూడదు. మరి ఎలా?
ఇది సహజం.
కాబట్టి హాయిగా ప్రశాంతం గా అయి, (ఇష్టమైన వ్యాపకం తో) అప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అసలయిన, మనకి కావలసిన నిర్ణయం చేసుకోగలమని నా భావన.
ఏమయినా ఆనందం కానీ , కోపం గానీ, ఒత్తిడి కానీ అన్నీ తీవ్రమయిన భావాలే. ఆ సమయంలో వాటిని నియంత్రిచుకుని, మనని మనం కూడా నియంత్రించుకుని వ్యవహరిస్తే జీవితం హాయిగా నల్లేరు మీద బండిలా నడుస్తుందని నా భావన.

నాకు తెలిసినది రాసేను. మీ ఎవరైన కూడా మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే వ్రాయండి.

14, సెప్టెంబర్ 2009, సోమవారం

వ్యక్తిత్వం

మంచి వ్యక్తిత్వం ఏర్పరచుకోడం అనేది ఒక వ్యక్తి కోసమో, లేక ఒక వ్యవస్థ కోసమో కాదు. అంటే తండ్రి పేరు నిలబెట్టడం కోసమో, లేక భార్య/భర్త కి మంచి పేరు తేడం కోసమో కానీ, లేక పుట్టినింటికి కానీ అత్తవారింటికి కానీ పేరు తేవడం కోసం కాదు. పుట్టిన ప్రతీ వ్యక్తీ చక్కటి వ్యక్తిత్వం అలవరచుకోవలసిందే. ఇది నిజం. మీరూ ఒప్పుకుంటారు కదా!


వ్యక్తిత్వం అంటే ఏమిటి?


చక్కటి అలవాట్లూ, అభిరుచులూ, ఆశయాలూ, ఆచరణలూ. ఒప్పుకుంటారు కదా.


దీనితో బాటూ చక్కటి వేష ధారణ, చక్కటి ఉచ్చారణతో సంభాషించడం, (ఎదుటవారిని నొప్పించకుండా, ఆహ్లాద పరుస్తూ) చాల ముఖ్యం. ముఖ్యంగా ఎదుటివారు చెప్పింది విని, అప్పుడప్పుడు మన విషయాలు చెప్పే వారే , మంచి స్నేహితులవుతారు అనేది నిర్వివాదాంశం.


ముఖ్యంగా ఆహారపు అలవాట్లు మంచివయ్యి వుండాలి. హితవయ్యింది, మితం గా సకాలం లో భుజించాలి.


ఎదుటివార్తో పంచుకోడానికే ఈ నీతులు. ఆచరణలో చాలా కష్టం. బహుసా కొన్ని ఆచరించ గలము.
ఏమయినా చక్కటి వ్యక్తిత్వం అలవరచుకోడం కష్టం తో కూడిన ఇష్టం అందరికీ.

22, మే 2009, శుక్రవారం

జీవిత సత్యాలు

నేను ఈ మధ్య చదివిన కొన్ని జీవన రహస్యాలు మీ కోసం………

అద్భుతంగా ఉన్నాయని మీరూ ఒప్పుకుంటారనీ, మీ జీవన శైలి లో అన్వయించుకుంటారని భావించి మీ కోసం………………

1. సంతోషంలో వాగ్దానం చెయ్యకండి. (దశరధుడులాగ)

2. కోపంలో సమాధానం చెప్పకండి.

3. ఒత్తిడి లో నిర్ణ యాలు తీసుకోకండి.

20, ఏప్రిల్ 2009, సోమవారం

దొంగా........దొంగా.........దొంగా

మా ఇంట (ఇంటి ) దొంగ పడిన వైనం వింటారా? గుండె చిక్కబట్టుకుని చదవండి..................


అది 1974 . రాత్రి 10 గంటలు. చిమ్మ చీకటి.

నేనూ మా వారూ, మా అబ్బాయి బుజ్జి "ఆదిత్యా" ఫస్ట్ షో సినిమా చూసి ఇంటికి వచ్చాము. అసలయిన కధ ఇక్కడ మొదలవుతోంది.

జాగ్రత్తగా భయపడకుండా చదవండి. ఏమీ భయంలేదు, సరేనా? ఇక ముందుకెళ్దాము…………….

విజయవాడ లో మా ఇల్లు గవర్నమెంట్ క్వార్టర్స్. మేడ మీద ఇల్లు మాది. కింద రెండు , పైన రెండు ఇళ్ళు. పైకి వెళ్ళడానికి మధ్య నుండీ మెట్లు. మెట్ల గదికి కింద చక్కటి తలుపు.

అన్నట్లు ఇక్కడ ఒక విషయంచెప్పలి:- మా మేడ మీద ఎదురు పోర్షను వాళ్ళింట్లోకి, కింద మెట్ల తాలూకు కామను బల్బు కనక్షను ఉంది. పైన ఉన్న కనక్షను మాకు. దాని వల్ల మా ఎదురు ఇంటి ఆయన మెట్ల మీద బల్బ్ పెట్టనిచ్చే వారు కాదు. బిల్లు వాళ్ళు కట్టాల్సి వస్తుందని. మేము సొంతం గా ఏర్పాటు చేసుకోవచ్చని తెలీని అమాయకత. దాంతో మెట్ల తలుపు వేసెయ్యంగానే చిమ్మ చీకటి.
ఎప్పటి లాగానే కింద తలుపు గొళ్ళెం పెట్టి పైకి ఎక్కుతున్నాము, సగం మెట్లు ఎక్కగానే నా కాలు ఎవరో గట్టిగా పట్టుకున్నారు. నేను భయంతో దొంగా. దొంగా……..అని గట్టిగా కేకలు మొదలెట్టేను ఆ దొంగ నా రెండు కాళ్ళూ ఇంకా గట్టిగా పట్టు కున్నాడు.


నా అరుపుకి మా వారు కూడా చాలా………భయ పడి పోతూ ఏమయ్యిందని అరుస్తున్నారు. దొంగ నా కాళ్ళు వదడంలేదు. నేను భయంతో కాళ్ళు విదిలించుకుంటున్నాను.

ఇంతలొ ఈ హడావిడికి మా అత్తగారు ఖంగారు పడిపోతూ, తలుపు తీసేరు……………

దొంగ దొరికేడు.

దొంగ ముద్దుగా, బిత్తర చూపులతో, చిన్నిచిన్ని అరచేతుల తో , చిట్టి చిట్టి పాదాల తో, "అమ్మానన్నంటావా…………..దొంగననీ అంటావా? '' అని ప్రశ్నిస్తూ నుంచుని ఉన్నాడు.

అర్ధమయ్యిందనుక్కుంటాను. దొంగ ఎవరో.

ఎవరో కాదండీ మా అబ్బాయి "బుజ్జి ఆదిత్యే" ఆ ఇంటి దొంగ.

13, ఏప్రిల్ 2009, సోమవారం

నాయకురాలు

మా ముద్దుల పెద్ద మనవరాలు "లాస్య" 2003 లో మా ఇంటికి వచ్చినప్పుడు దాని అల్లరి చేష్టలు చూసి, నోట మాట రాక, ఇలా చేతి రాత రూపం లో రాసిన మైల్….. మళ్ళీ ఒక సారి గుర్తు తెచ్చుకుని మీ కోసం……….


ఆశ్చర్య దాయకం గా మా ఇంటికి ఒక కాబోయే సాఫ్ట్ వేర్ అధినేత, వామన రూపం లో వచ్చింది. ఇది నిజం, నమ్మరా? అయితే మీరు తప్పక ఇది చదవి తీర వలసిందే …………..


నేను గదిలోకి అడుగు పెట్టేసరికి అక్కడ మా మనవరాలు లాస్య , పాండ్స్ పవడర్ డబ్బా తీసి నేల మీద రాసి, మిగతాది అంతా అక్కడ ఉన్న నిలువుట్టద్దం కి రాసింది, ఇంకా పైపైకి రాద్దామంటే దాని చిన్ని చేతులకి అందటం లేదనుకున్నట్లుంది, ముని కాళ్ళతో నుంచుని, మొత్తం అద్దం అంతా పవడర్ పులిమింది.


ఏమిటీ ఇలా చేస్తున్నావంటే? ఏమి చెప్పిందో తెలుసాండీ?


ప్రతీ సారి ముఖం కడుగు కొన్నప్పుడల్లా, పవడర్ రాసుకునే బదులు…………ఇలా అద్దం కే కనక పవడర్ రాస్తే , మనకి ఎంత ఆదా అవుతుంది? అని ప్రశ్నించింది.
నిజమే, అద్దం పవడర్ తో ఉందనుక్కోండి…………….. మనం ఎంచక్కా మొహం కడుక్కున్నాక, టవల్ తో తుడుచుకుని, అద్దం ముందు నుంచుంటే….. మనకి అంతులేని తృప్తి, ఆహా ఏమి అదృ ష్టం…… తెల్లగా బూడిద గుమ్మడి కాయలా ఉన్నాను అని. అప్పుడు మనకి డబ్బు కి డబ్బు ఆదాఏ గాక , అంతులేని తృప్తి. ఏమంటారు?


నిజంచెప్పండి మీకు కూడా ఇప్పుడు ఆ చిన్నారి ఒక ప్రాజెక్ట్ ఇన్వెంటర్ లా కనపడ్డం లేదూ?
ఇంతే కాదు…………ఆ పాప లో నేను నాయకత్వ లక్షణాలు కూడా ఉన్నాయని గ్రహించాను.


ఎలా అంటారా?.......... ముద్దు ముద్దుగా మా గదిలోకి వచ్చింది. రాగానే… వాళ్ళ తాతగారు, ముద్దుల మనవరాలు తన పక్కన పడుక్కుందుకు వచ్చిందని, చాలా సరదా పడిపోతూ, దాన్ని తన పక్కన పడుక్కోబెట్టుకున్నారు.


వెంటనే ఆ చిన్నారి చాలా గారాలు పోతూ, తాతా! ఏసి, తాతా! టిపీ (టీవీ కి వ్చ్చిన తిప్పలు), లై (లైటు) అని వేళ్ళు పెట్టి చూపిస్తూ అన్ని పనులూ చేయించుకుని ఇంక వెళ్ళమని పురమాయించింది తాతాగారిని, ఎందుకంటే వాళ్ళ అమ్మ అక్కడ పడుక్కోవాలిట.
పాపం! తాతాగారు తెల్ల మొహం వేసేరు.


ఇప్పుడు చెప్పండి మంచి గా మాట్లాడి, పని అవ్వగానే కర్కశం గా ఉండడం నాయకత్వ లక్షణమా/ కాదా?


అందుకే అంటున్నాను…………ఆ చిన్నారి లో నేను ఓ సుధా నారాయణ మూర్తి ని (ఇంఫోసిస్) చూసానని, మీరు కూడానా?


అయితే ఆశీర్వదిద్దామా, భవిష్యత్తులో "చిరంజీవి లాస్య" ని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ అధినేతగా చూద్దామని.

11, ఏప్రిల్ 2009, శనివారం

జాబిల్లి

మా ముద్దుల మనవడు చిరంజీవి తేజస్ 2005లో మా ఇంటికి వచ్చినప్పుడు కలిగిన భావ వీచికలు......మీతో పంచుకుందామని చిన్ని ప్రయత్నం ..........


అలనాడు చిన్నరి రాముడికి వాళ్ళ అమ్మ పైడి గిన్నెలో పరవాన్నం పెడుతుండగా, చంద మామ కావాలని మారం చేస్తే, వాళ్ళ నాన్నగారైన దశరధ మహరాజు ఒక అద్దం ఇచ్చి, అది ఆకాశం వైపు చూపిస్తే చందమామ నీ చేతిలో ఉంటుందని చెప్పేరు. అప్పుడు రాముడు అలాగే చేసేడు. నిజంగానే చేతిలో చందమామ.


అప్పుడు అది చూసి రాముడు "అందమైన చందమామ, అందరాని చందమామ, అమ్మా నా చేతిలోని అద్దములో చిక్కినాడె" అని తృప్తి పడవలసి వచ్చింది.


కానీ మా ఇంటికి నిజంగానే జాబిల్లి పుష్పక విమానం లో దిగింది.


మా ఇంటి వెలుగు, మా కంటి పాప అయిన మా మనవడు చిరంజీవి తేజస్ వెండి వెన్నల జలతారు లా మా ఇంట అడుగు పెట్టేడు. మాకు రంగుల హరివిల్లు చూపించేడు.


ఎవ్వరూ కనిపెట్టకపోతే భాష ఎలా పుడుతుంది? కొత్త పదాలు ఎలా వస్తాయి? అని మాయాబజార్ సినీమా లో ఘటోద్గజుడు అన్నాడని తేజస్ కి తెలిసినట్లుంది, నన్ను నానమ్మ అని కాక "benden” అనీ వాళ్ళ అమ్మమ్మని "jabbajjaa" అనీ పిలుస్తున్నాడు. ( పిలుస్తూనే ఉన్నాడింకా).
మరి వేద్దామా తేజస్ కి రెండు "వీర తాళ్ళు".

8, ఏప్రిల్ 2009, బుధవారం

కలల రాణి

మా చిన్న మనవరాలు శ్రియ ఒక నెల మాతో ఉండి వాళ్ళ అమ్మ నాన్నలతో అమెరికా వెళ్ళిన తరవాత కలిగిన భావ ఆవేశం తో రాసిన మైల్ మీ అందరి కోసం……………..


డియర్ చిన్నారి చిట్టి ప్రేయసీ! మా చంటి రాక్షసీ!
మా హృదయాలని దొంగిలించి న్యూ జెర్సీ పారి పోయిన " ఓ శ్రియమ్మా"!
మా ఇంట చక్కగా నడయాడి, నీ బోసి నవ్వులతో మా మనస్సులను దోచి, మా చేత అన్ని సేవలూ చేయించుకుని, కనిపించిన అందరినీ నగుమోముతో పలకరిస్తూ, వారు నీ వేపు చూస్తే చాలు చెంగుమని గెంతి…..వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి పోయి, వాళ్ళని ఆనంద పరుస్తూ, మాకు కొంత స్వాంతన చేకూరుస్తూ, (మా చేతులు నొప్పులు పుట్టకుండా చూసిన ఉపాయమంతురాలా) ఎంత చక్కగా వ్యవహరించేవు!
చివరికి మా హృదయాలని దొంగిలించి వెళ్ళి పోయేవు. మొన్న ఎవరో నిన్ను ఎత్తుకు పోతున్నట్లు కల వచ్చింది. (తీరా చూస్తే అది మీ అమ్మ నాన్నగారు నిన్ను న్యూజెర్సీ తీసుకెళ్ళి నందుకు వచ్చిన తిప్పలన్న మాట)
మరలా ఇవాళ నువ్వు పాకుతూ వస్తున్నట్లు కల.


" ఓ కలల రాణీ! కనికరించు" మమ్మల్ని మా పనులు చేసుకోనీ.


అన్నట్లు మన వారందరికీ చెప్పేవా? ఏమని అంటే :-
"మా అమ్మమ్మ చింత చిగురు పప్పు, ఆవకాయ అన్నం, చారూ, పెరుగూ, చాలా బాగా చేస్తుంది..( ఎలా తెలుసు అంటారా? నాకు అన్నప్రాసన మర్నాడే పెట్టింది కాబట్టి) అన్నట్లు అయిస్ క్రీం కూడా పెట్టింది తెలుసా?
అవును నిజం, మా అమ్మమ్మ నాకు అవన్నీ పెట్టింది. మా అమ్మకి చెప్పద్దు, నన్ను" ప.. ప్ప… ప్పా" అయితే- గియితే అమ్మమ్మని కూడా. కాబట్టి దయ చేసి చెప్పద్దు.
మా అక్క కూడా నన్ను చిట్టి తల్లీ అనీ, పండూ అనీ, ముద్దు లాడు తోంది. (నాకు అర్ధంకాడంలేదు, మా అక్క కూడా చిట్టి తల్లే కదా !నన్ను ఎందుకు అలా అంటోంది? )
అయినా నాకెందుకు లెండి. నేను బహుసా అందరికీ చాలా……….ముద్దు వస్తున్నాననుక్కుంట. " అని అందరికీ చెప్పేవా? లేదా? లేకపోతే ఇది చదివి తెలుసుకోమను.
అమ్మమ్మ 

4, ఏప్రిల్ 2009, శనివారం

అప్పుడప్పుడు నాకు తోచింది వ్రాసి , నా అభిమానులన్దరికీ అందుబాటులో ఉండడానికి ఇలా ఈ బ్లాగు లో పోస్ట్ చేద్దామని.. తెలుగు లో ఇలా వ్రాయగలగడం ఎంత బావుందో!

నా మొదటి పోస్ట్: ఇష్టం

నా అభిమానులందరికీ! ఇది ఒక సారి చూడండి. చొప్పదంటులా ఉంది కదా. నవ్వకండి. తెలుగులో మైల్ రాస్తుంటె ఏదో కవిత్వం కూడా వచ్చేస్తోంది -- జయలక్ష్మి

ఇష్టం


నాకు మా నాన్నగారూ, మా అమ్మా,మా శ్రీవారూ, మా అబ్బాయీ, మా అమ్మాయీ, అల్లుడూ, కోడలూ, మనవరాళ్ళూ, మనవడూ అంటే చాలా ఇష్టం.( ఎవరికి ఇష్టం ఉండదూ, ఇందులో వింతేమీ లేదు.)


వ్యక్తి నైజాన్ని బట్టి, అభిరుచులూ, అభిరుచులతో బాటూ ఇష్టాలూ ఏర్పడతాయి. వ్యక్తుల మీద కావచ్చు, భావాల మీద కావచ్చు, భాష మీద కావచ్చు, వస్తువుల మీద కూడా కావచ్చు. (అప్పుడప్పుడు మారుతూ కూడా వుండచ్చు).


అలా ఏర్పడిన ఇష్టం, ఏదైనా, ఎవరి మీదైనా, దేని మీదైనా కావచ్చు. దానిని ఎందుకు ఇష్ట పడుతున్నారు?, అనే దాన్ని బట్టి ఆ మనిషి నైజమూ, వ్యక్తిత్వమూ ఆధారపడి ఉంటుంది. కాదంటారా?
భావాలను నిర్వచించటం ఒకింత…. కాదు, కాదు… చాలా…. కష్టం.


రెండు భావాలు కలిస్తేనే అక్కడ ఇష్టం అనేది చొటు చెసుకుంటుంది అంటాను నేను.


అసలు దేని వల్ల ఇష్టంఏర్పడుతుంది?
ఇష్టం అంటే అన్ని ఇష్టాలూ ఒకలాంటి వేనా?
దానికి కారణం?
పర్యవసానం? పరాకాష్ట?
దాని వల్ల లాభమా/నష్టమా?
అహ్హ హ్హ హ్హ! ఇష్టం అన్నాక లాభ -నష్టాలేమిటి?.
ఇష్టానికి నిర్వచనం ఇష్టమే. అంతే.