స్మృతి సమీరం.... నాన్నగారు అనగానే... జీడిపప్పు, సీతాఫలాలు, ఎండాకాలంలో కిటికీలకి తడి పరదాలు కట్టి, వాటికి వట్టివేళ్ళ తడకలు కట్టి...పళ్ళాల్లో నీళ్ళు పోసి, పైనుండి ఫ్యాన్ వేసి, మమ్మల్నదరినీ చుట్టూ పడుక్కోబెట్టి ఎండా కాలం ఏసీ కింద పడుక్కున్న ఎఫెక్ట్ తెప్పించడం, రాత్రి పూట చక్కగా వీణ వాయించి నిద్ర పోగాట్టడం. ( తనకిష్టమయిన జనని నినువిన రీతిగౌళ, కేదారగౌళ లో కృతులు, శహన లో కృతులు, ఇంకా ఎన్నెన్నో). నా చేత రన్ & మార్టిన్ గ్రామర్ బుక్ BA Bed., ఇంగ్లీష్ & సోషల్ టీచర్‌గా వర్క్ చేసేరు చాలా కాలం), వాళ్ళ స్కూల్ గ్రంధాలయం నుండి మంచి మంచి బొమ్మలతో ఉన్న సింద్బాద్ కధలు, అరేబియన్ నైట్స్ తెచ్చి చదివి వినిపించడం.... డాక్టర్ గారి అమ్మాయిలతో కలపి సంగీతం వోకల్ నేర్చుకోడం ఎన్ని జ్ఞాపకాలో. పొద్దున్న వాతావరణ సూచన రేడియోలో విని మా అమ్మగారు గాలిలో తేమను బట్టి వాన పడుతుందో లేదో చెబుతారు. మా నాన్నగారి అమితమైన ప్రేమ వల్ల వాన మొదలవ్వక పోయినా సరే ముందు జాగ్రత్త చర్యగా మాకు రైన్ కోట్స్ వేస్తారు. రైన్ కోట్స్ వేసుకుని చిక్కడపల్లి తోట దగ్గర మా ఇంటి నుండి ,మాడపాటి స్కూల్ దాక రోడ్ మీద వ్యోమగాముల్లాగా నేను మా చెల్లి ఇద్దరమే వింతగా వెళ్ళడం. వద్దంటే కోప్పడతారు, మాకేమో అవమానం. ఏంచేస్తాం కొన్ని సార్లు మాట వినక తప్పదుగా. పుట్టిన రోజని అమ్మ తలంటి పోసి, కంట్లో కుంకుడు కాయ రసం పడి ఏడుస్తుంటే తిడ్తూ ఉప్పు గడ్డ నోట్లో వేసుకొమ్మని ఇచ్చి, మిగతా ముగ్గురుకీ కూడా తలంట్లూ కొత్త బట్టలూ వేస్తే....నాదా వాళ్ళదా పుట్టిన రోజు అని, నా speciality ఏమిటని కుళ్ళి పోయిదాన్ని. అందరి పిల్లల్ని సమానంగా చూడాలనే వారి అన్యాపదేశం తెలుసుకునే వయస్సు లేదప్పుడు.అమ్మ వండే ఆ పులిహారా పరవాన్నానికి ఎదురు చూపులూ లొట్టలూ! మరి ఇప్పుడో మనకి మనమే వండుకుని ఎలా కుదిరిందంటారోనని ఎదురు చూపులు. మ్చ్ మ్చ్ మ్చ్ జమానా బదల్ గయా! ఇక వివాహానంతరం... జయలక్ష్మీ నీకు ఏమిటిష్టం అని అడిగి అవి వండి పెట్టి ముదిదు చేసే అత్తగారు. మంచి కొత్తచీర కొని తెచ్చి, గుడికి, అట్నించటు సినిమాకి తీసుకెళ్ళే భర్త గారు.(వారి ప్రేమానురాగాలు చెప్పనలవి గాదు.) ఎంత వేగంగా గడచి పోతోందో! ఇప్పుడు పిల్లులు, వారి పిల్లలు, అల్లుడూ,కోడలూ, ప్రియాతి ప్రియమైన, మమ్మల్ని తల్లితండ్రులలా భావించే శిష్యులు, మమ్మల్ని అభిమానించే మీరందరూ ,ఇంత మంది శుభాకాంక్షలు అందుకున్న అదృష్టవంతురాలిగా నన్ను నేను అభివర్ణించుకుంటున్నాను.
|
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి