శ్రీ అయ్యగారి సోమేశ్వర రావు గారి విద్యాభ్యాసం
ఎక్కడో పుల్లతో ఖాళీ డబ్బా మీద లయ బధ్ధంగా, సున్నితంగా, వినసొంపుగా వాయిస్తున్నారు ఎవరో. ఎవరా అని వెతకి చూస్తే చాటుగా కూర్చుని వాయిస్తున్నాడు మనవడు.
అమ్మమ్మ తిరగలి విసిరి వెళ్ళాక ఆ బాలుడే అక్కడ కూర్చుని తిరగలి తిప్పుతూ చక్కగా పాడుతున్నాడు.( ఎందుకు అంటే అప్పట్లో రేడియో లేదు గ్రామ్ ఫోన్ రికార్డ్ ప్లేయర్ లో ప్లేట్ తిరగడం చూసి వుంటాడా చిన్ని బాలుడు. దానిని గ్రామ్ ఫోన్ ప్లేట్ గా భావించి దానిని చేతితో తిప్పుతూ తనే పాడుతున్నాడు)
ఇంట సంగీతపు ఛాయలు తక్కువే. తండ్రీ , పెద్ద అన్నగారూ వేద ఘనాపాటీలు. తల్లికి పెద్దగా సంగీతాభిరుచి వున్నట్టుగా తెలీదు. మరి ఈ చిన్నారికి సంగీతాభి రుచి ఎలా కల్గిందో? ముఖే ముఖే సరస్వతి. బహుశః చతుర్వేదాలలోని సామ వేదం నుండి పుట్టింది కదా సంగీతం, తండ్రి గారి అంశ అయ్యుంటుంది.
ఇక అసలు విషయానికి వద్దాం........
ఇక ఆ బాలుని తీసుకుని బాలుని అమ్మమ్మ శ్రీలక్ష్మమ్మగారు "విజయ రామ గాన పాఠశాల" ప్రిన్సిపాల్ శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారి వద్దకు తీసుకెళ్ళి ఈ విషయం అంతా చెప్పేరు. (నారయణదాసు గారు వారి అమ్మమ్మగారికి పిన మామగారు) నారాయణ దాసు గారు ఆ బాలుని కళాశాలలో గాత్రం లో పేరి బాబు గారి వద్ద చేర్చమని, వీణ వాసా వెంకట రావు గారి వద్ద చేర్పించారట. అప్పట్లో డిప్లమో 10 సంవత్సరాలు.
ఇంకా సందేహ మెందుకు ఆ బాలుడే వర్తమానంలో "వీణా కోవిద" "వైణిక శిరోమణి" శ్రీ అయ్యగారి సోమేశ్వర రావు గారు.
శ్రీ సోమేశ్వర రావు గారు కళాశాలలో చేరేటప్పుడు ప్రిన్సిపాల్ గా వున్న నారాయణదాసు గారు రిటైర్ అవ్వడం, ద్వారం వెంకట స్వామి గారు ఆ స్థానం లోకి రావడం అన్నీ ఆ 10 సం।। కాలంలో జరిగింది. ద్వారం వెంకట స్వామి నాయుడు గారు తనతో కూడా వాయించమని సాధన చేయించేవారట.
మహరాజా సత్రంలో 10 సం।। భోజనం, కళాశాలలో బయట దూరంగా వున్న పెద్ద గదిలో (హస్తబల్) స్నేహితులతో కలపి బస.
మేము ఆ మధ్య విజయనగరం వెళ్ళినప్పుడు ఆ గదిని దర్శించి మనస్సులో నమస్కరించుకున్నాం. మహా మహులు నివశించిన చోటు. ఘంటశాల మా మామగారికి జూనియర్. మా మామగారు డిప్లమా అవుతుండగా వారు చిన్న తరగతులలో వుండేవారట. ఇలాగే సత్రం భోజనం, ఆగదిలో వసతి.
అప్పట్లో విజయనగరం సంగీత కళాశాల ఒక్కటే వుండడం వల్ల అన్ని చోట్ల నుండీ విద్యార్ధులు వచ్చి సత్రం భోజనం ఆ గదిలో మకాం.
అన్నట్లు విజయ రామ గాన పాఠశాల చాగంటి గంగ బాబు గారనే అంధ విద్యార్ధి వయోలిన్ నేర్చుకోడం కోసం మహరాజు గారు ఏర్పాటు చేసేరట. అది ఈ నాటి విజయనగరం సంగీత కళాశాలగా వేవేల మంది కళాకారులను తయారుచేసి, ఆంధ్ర దేశానికి అందించింది. మన ఆంధ్ర దేశ చరిత్రకే మకుటాయమానమై , ఆంధ్ర మాతకు కలికి తురాయిగా నిలిచింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి