12, ఏప్రిల్ 2019, శుక్రవారం

చంద్రశేఖర్ వారి.......మా ఇంటి ఆణిముత్యాలు.

చైతన్య స్రవంతి...చిన్మయ రూపుడు..నాదా తన్మయుడీ  శేఖరుడు. చంద్ర శేఖరుడు....
స్మృతి సమీరం..........



   నా సోదరుడు "వైణిక సార్వభౌమ" చిరంజీవి పప్పు చంద్రశేఖర్ నేటికి 18 సంవత్సరాల క్రితం భువి  నుండి దివి కేగాడు. (బహుశా అక్కడ  సుర , కిన్నెర, కింపురుషలను  తన గాంధర్వ విద్య తో ఆనంద పరశుల్ని చేయ్యలనేమో 43 సంవత్సరాల  చిన్న వయస్సులో తొందరపడి వెళ్ళిపోయాడు).

  "జాతస్య మరణం ధ్రువం" అనేది నిజమైనా యశోకాయులయిన నట, గాయక, కవీశ్వరులు, జరా మరణములనతిక్రమించి సర్వదా ప్రకాశించుతారు.

ఏనుగు లక్ష్మణ కవి గారు తన "భర్తృహరి సుభాషితం" లో చెప్పిన ఒక శ్లోకం స్మరించుకున్దాము ఇక్కడ  ............

           "జయంతి తే సుకృతినో రససిధాః కవీశ్వరాః
          నాస్తి తేషాం యశఃకాయే జరామరణజం  భయం"

              కళలకూ, కళాకారులకూ మరణం లేదు.

అతని ఉనికి ఉల్లాస సహితం , ఉత్తేజ భరితం.
సంగీతం ప్రాణం, ఊపిరి.
కఠోర సాధన, నిజాయతి, క్రమశిక్షణ  అతని బాట. 
అనేక పెద్ద సభలలో కచేరీలు, తండ్రి గారితో, స్వతంత్రంగా కచేరీలు.ఆకాశవాణి ఢిల్లీ లో, హైదరాబాద్ లోనూ  స్టాఫ్ ఆర్టిస్ట్ గా ఉద్యోగం. 
అనేక రేడియో, దూరదర్శన్ జాతీయ కార్యక్రమమాలలో పాల్గొనడం. అనేక సన్మానాలూ, సత్కారాలూ పొందడం జరిగింది.

తనకంటూ ఒక ప్రత్యేక మయిన గుర్తింపు  తెచ్చుకుని, ఇంకా ఎంతో బంగారు భవిష్యత్త్తు ముందు ఉండగా  హడావిడి పడి  రాలి పోయాడు. (కాదు కాదు "నవదీప్" సినీ హీరో డ్రైవింగ్కి బలయి పోయాడు) 
అందమయిన, మంచి గుబాళింపు ఇచ్ఛే పూలను భగవంతుడు తన అక్కున చేర్చు కుంటాడుట ముందుగా, అంతే అయింది.
మమ్మల్నదరిని శోక సముద్రంలో ముంచి వెళ్లి పోయాడు.

ఈ దిగువన " వైణిక సార్వభౌమ" శ్రీ పప్పు చంద్ర శేఖర్ వీణ రికార్డింగ్ ఉంది వినండి.......

9, ఏప్రిల్ 2019, మంగళవారం

పప్పు సోమేశ్వర రావుగారు



మా ఇంటి ఆణిముత్యాలు 2:-
నా తండ్రి గారు - శ్రీ పప్పు సోమేశ్వర రావు గారు...
ఆజాను బాహువు, బహుభాషా కోవిదులు, క్రమశిక్షణ, కార్యదీక్ష, నిజాయతీ, దృఢనిర్ణయం వెరసి "పప్పు సోమేశ్వర రావు గారు".
శ్రీ పప్పు సోమేశ్వర రావు గారు విజయనగరం జిల్లా లోని, "లోగీశ" అగ్రహారంలో 1934 లో సంస్కృత పండితులు శ్రీ చంద్రశేఖర్ శాస్త్రి గారు, పేరమ్మ దంపతులకు జన్మించారు.
విజయనగరంలో విద్యాభ్యాసం, BA Bed, వీణా వాద్యం తన బావగారైన "వైణిక రత్న" శ్రీ అయ్యగారి సోమేశ్వర రావు గారి వద్ద నేర్చుకున్నారు.
పేరుకు ఇద్దరూ సోమేశ్వర రావులే. ఇద్దరూ బావ మరుదులూ/ గురు శిష్యులూ/వియ్యంకులూ.
వీరిద్దరివీ ఇంటర్ లింక్ డ్ కుటుంబాలు.
మా మామగారు , తన పెళ్ళి అయినప్పటినుండీ,10 సంవత్సరాల భార్యకు వీణ నేర్పేవారట. అప్పుడు బాల్య వివాహాలు కదా! నిజానికి మా అత్తగారు 7 , మా మామగారు 17 సంవత్సరాల వయస్సులో వారి వివాహం జరిగిందట.
ఒక రోజు మిత్రులు వాసా వారూ, అయ్యగారి వారూ, ఇద్దరూ ఇంటికి వచ్చే సరికి మంచం కింద నుండీ బిలహరి స్వరపల్లవి వీణపై వినిపిస్తోందట. ఎవరా అని చూస్తే 7 సంవత్సరాల వయస్సు బాలుడు. అది చూసినప్పటి నుండీ అయ్యగారి వారు తన భార్యకూ, బావమరిదికీ అప్రతిహతంగా విద్య కొనసాగించేరు.
మా అత్తగారు జయకుమారి, తను నేర్చుకొన్న విద్య తన పిల్లలందరికీ మొదటి దశ చెప్పి మా మామగారుకి అందించే వారు. ఆ విధంగా తన విద్యకు సార్ధకత చేకూర్చుకున్నారు.
మా నాన్నగారు అద్భుతమైన విద్వాంసులుగా రూపొంది, గురువుగారికి గర్వ కారణమై నిలిచారు.
మా నాన్నగారు లౌక్యం తెలీని అమాయకులు. విద్య తప్పితే మరో దృష్టి లేదు. తన 14 వ ఏట బాపట్లలో వున్న మా మామగారితో కలసి విజయవాడ రేడియోకి వస్తే అక్కడ సంధ్యావందనం శ్రీనివాస రావుగారు మా నాన్నగారి వీణ విని ఆడిషన్ లేకుండా రేడియో ప్రోగ్రాం ఇచ్చేసారట.తన 14 వఏట నుండీ 21 ఏళ్ళ వరకూ Radio cheque minority తీరని కారణంగా విజయనగరంలో వున్న వారి నాన్నగారికి వెళ్ళి పోయేదట.
చాలా రోజులు up gradation వుంటుందని తెలియక రేడియో వారు ఇస్తున్నారని b class లో నుండే అనేక రాగం తానం పల్లవి ప్రోగ్రాం లు వాయించారట. తరవాత ఒక duty officer సలహాపై up gradation apply చేసి,A గ్రేడ్ తెచ్చుకొని సంగీత సమ్మేళనం.అఖిల భారత సంగీత కార్యక్రమాలు రేడియో లోనూ దూరదర్శన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు ప్రదర్శించి చాలా చాలా ముందుకు వెళ్ళారు. సంస్కృత ఆంధ్రాలలో అనేక సంగీత రచనలు రచించేరు.
నాన్నగారికి తన 19వ ఏట అత్తగారి శిష్యురాలు .పేరి భానుమతి తో వివాహం జరిగింది.
హైదరాబాదు కు 1955 లో వచ్చి,ముందులో BA Bed teacher గా పని చేసి, అనంతరం జంట నగరాల గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజీలలో వీణా లెక్చరర్ గా పని చేసి పదవీ విరమణ చేసేరు.
హైదరాబాద్ లో సంగీత సేవ చేసిన పాతతరం విద్వాంసులలో ఒకరు. అనేక మంది శిష్యులను తయారు చేసేరు. వారిలో ప్రప్రధమంగా చెప్పుకోవల్సింది మా జ్యేష్ఠ సోదరుడు "వైణిక సార్వభౌమ" చిరంజీవి పప్పు చంద్రశేఖర్ ను. చాలా మంది శిష్యులు రేడియోలలో దూరదర్శన్ లోనూ కళాకారులుగా వున్నారు. నేను వర్ణాల వరకూ వారి వద్ద శిక్షణ పొంది, వివాహానంతరం మా వారి వద్ద నేర్చుకోడం జరిగింది.
సంస్కృత, జ్యోతీష్య శాస్త్రా పండితులవ్వడం వల్ల మంచి సాహితీ సౌరభాలను వెదజల్లే సంగీత రచనలను చేసేరు. నవగ్రహాలనూ జ్యోతీష్య పరంగా అన్వయిస్తూ నవగ్రహ ఆరాధన, సర్వ దేవతా స్తుతి మొదలగు 30 కృతులు పుస్తక రూపం దాల్చాయి. మా వారు పూనుకొని వీటిని గాత్ర ధర్మానికి అనువుగా చిన్న మార్పులూ చేర్పులూ చేసి, మంచి విద్వాంసులతో పాడించి, అవన్నీ సిడి రూపంలో భద్ర పరిచారు.
మా నాన్నగారు తను స్వయాన పండితులే కాక, అల్లుడూ, కొడుకూ ఉద్దండ పండితులు. కూతుర్లు ఇద్దరూ, రెండవ కోడలు, అంతే కాక మనవలూ అందరూ విద్వాంసులే. ఒకరకంగా అయ్యగారి, పప్పూ అని రెండు ప్రత్యేకమైన కుటుంబాలుగా కన్పించినా, అందరూ ఒకే కుటుంబంగా పరిగణించాలి.
శ్రీ పప్పు సోమేశ్వర రావు గారికి అనేక సన్మానాలూ సత్కారాలు జరిగేయి. "వైణిక చక్రవర్తి", వైణిక శిరోమణి" ఇత్యాది బిరుదులు వరించాయి.హైదరాబాద్ లోని త్యాగరాజ గాన సభ వ్యవస్థాపక కార్యవర్గం లో ఒకరు.
వారు 2002 లో పరమపదించారు.

11, జనవరి 2019, శుక్రవారం

టెలీఫోన్

తి తి తి తీ తిక మక......మ మ  మ  మా మక తిక..
అదంటే ఎంత ఇష్టమో, దాని శబ్దం వినగానే చెవుల్లో అమృతం పోసినట్లే,  ఒఖ్ఖ ఉదుటన పరిగెడతాం దాని బాధ్యత  అది నిర్వర్తిస్తుంటే.

నల్లగా ఉంటుంది, నెమ్మదిగా ఎర్రగా, తెల్లగా ఇంకా ఎన్నో రకాలుగా రూపాంతరం చెందింది.
దాని రాకకై మొదట్లో ఏళ్ళ తరబడి ఎదురు చూపులు. మాకు అది వచ్చిందని సంబర పడి  పోయి, ఊరూ వాడా టముకు.
 దాన్ని సందర్శించడానికి అందరూ  వచ్చ్చినప్పుడు మన గర్విష్ఠి  మొహాలూ, మన వెలుగు వాదనాలూ  చూసి తీర వలసిందే., 

నెమ్మదిగా  దాని కోసమే అందరూ రావడం మొదలెట్టగానే , వీళ్ళని ఎలా వొదుల్చుకోవాలా  అని ఎన్నెన్నో దురాలోచనాలూ, దుష్ట బుధ్ధులూ ప్రదర్శించాము. 

నాకైతే దాన్ని వాడాలని చాలా ఉబలాటం. ఒక సారి ఒకరింటికి వెళ్ళినప్పుడు, (మా ఇంట్లో లేదు అప్పటికి అది) ఎలాగోలా సంపాయించుకున్న ఒక దాన్ని ప్రయోగించాను. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళగానే చోర వృత్త్తిలో నా నైపుణ్యాన్ని ప్రదర్శించాను,  

కానీ ప్రయోజనం లేదు, రాడం లేదు , 
ఎందుకూ? ఎందుకూ? చెప్పండి అది ఏమిటో? ఎందుకో?  అంతా  తికమక . మకతిక.. తికమక.

9, జనవరి 2019, బుధవారం

నీటి సన్మానం

నీటి సన్మానం 

అది ఒక సెప్టెంబర్ నెల, స్కూల్ సమయం ఆసన్నమైంది పొద్దున్నించీ సన్న తుంపర.. మేము 5,4 క్లాసులు. (మేము అంటే నేనూ మా చెల్లి) మబ్బు గా ఉంది, చలి గాలి, బహుశా జడి  వాన పడే అవకాశం ఉంది.

మేము స్కూల్ కి వెళ్లాలా వద్దా? మానేస్తే బాగుండు అని మనస్సులో. టీచర్ తిడుతారేమోనని భయం మాది.

మా అమ్మా  వాళ్ళు పోనీ bad weather holiday ఇస్తారా అని అనుమాన పడుతున్నారు. ఇప్పటిలా ఫోన్ చేసి కనుక్కుందుకు ఫోన్స్ లేవు.
కానీ ఇలాటప్పుడే మనం మన సిన్సియారిటీ చూపించి మార్కులు కొట్టాలి అమ్మ నాన్న దగ్గర! ఏమంటారు. పిల్లలు ఎన్ని ట్రిక్కులు వేస్తారో కదా.

సరే మేము స్కూల్ కి వెళ్తామని గొడవ, వాళ్ళ చేతే ఒద్దనిపించుకుని, కూడా వెడితే పడే మార్కులు  ఇంకా ఎక్కువ కదా. మా నాన్నగారు మా ఇద్దరికీ raincoat వేసి oyoma   గాముల్లా  తాయారు చేసి, (వింతగా) షూ వేసుకుంటే తడిసి పోతాయని చెప్పి చెప్పులేసుకుని బయలుదేరామన్నారు. ఎంతో అవమాన భారంతో అందరూ మమ్మల్ని చూసి నవ్వుతున్నారని అని భావిస్తూ తల వంచుకుని చక చకా అడుగులేసాం.

ఇంతలో చిక్కడ పల్లి మెయిన్ రోడ్ మీద గుల్షన్ రెస్టారెంట్  దగ్గర రోడ్ మీద నీళ్లు వరదలై, నదుల్లా ప్రవహిస్తున్నాయి. దానిలో మా చెల్లి చెప్పు చూస్తుండగా కొట్టుకుంటూ వెళ్లి పోతోంది. దాన్ని పట్టుకుందుకు వంగే సరికి, బాగ్ లోంచి కింద బుక్స్ కింద చిందర వందరగా పడి  పోయాయి.  ఆ చెప్పు అందుకుందుకు మేము నది లో ఈదాము తెలుసా? మా బుక్స్ నీళ్ళల్లో పడి  తడిసి పోయినా, లేఖ్ఖ చేయ లేదు. ఇంతలో  పెద్ద పెద్ద తిమింగలాలు మా దగ్గరగా వచ్ఛేయి. మేము వాటిని అవతలికి తోసి  పారేశాము.

 అప్పుడు మాకు చిన్ని చిన్ని గోల్డ్ ఫిష్లు, బ్లాక్ మాలీలూ, ఫైటర్లూ, గప్పిలూ, కిస్సింగ్ గొర్మీలు అన్నీ వఛ్చి మా ఇద్దరికీ thanks చెప్పి, అప్పటికప్పుడు మాకు సన్మానం చేస్తామని కూర్చున్నాయి. మొదటి సారి సన్మానం అని చాల సంబర పడి, సరే నన్నాము. అంత నీళ్ళల్లోనూ కింద కూర్చోబెట్టి మాకు నీళ్ళల్లో, నీళ్లతో అభిషేకం చేసి, నీళ్ల మాల వేసి, నీళ్ల శాలువా కప్పేరు, తెలుసా?

మేము చాలా ఆనందంగా ఉండగా, ఏయ్ ఎంత సేపా నిద్ర, ఇంక లేవండి అని  అని మా మా అమ్మ అరుపు. కళ్ళు నలుపుకుంటూ నెమ్మదిగా పక్క మీంచి లేచాం. వాన లేదూ, పాడు లేదు. మళ్ళీ గంపెడు స్కూల్ బాగ్ బరువు వేసుకుని, చిక్కడ పల్లి నుండి నారాయణగూడా దాకా,స్నానం చేసి, భోజనం చేసి ఏడుపు మొహాలతో బయలుదేరి వెళ్లాం.

ఎందుకూ నవ్వుతున్నారు, అంత నవ్వు వస్తోందా మీకు, మాతో చతురులా మీకు, మాకు ఏడుపుగా ఉంటె?ఫర్లేదు లెండి.

రేపు నవ్విస్తా లెండి ....

.


నాదనిధి



కంచికి వెళ్తే అంతా మంచే
మా గురువుగారికి "నాద నిధి" పురస్కారం

అవునండీ నిజం, ముమ్మాటికీ నిజం. మా గురువు గారు శ్రీ అయ్యగారి శ్యామసుందర్ గారు క్రితం సారి కంచి ఆస్థానవిద్వాంసులుగా నియమితులై రాగానే, ఇంటికి వచ్చే సరికి సంగీత నాటక ఎకాడమీ అవార్డ్ శుభవార్త.

మరి ఈసారో?

మైసూర్ దత్తపీఠం వారు పూజ్య గణపతి సచ్చిదానంద స్వామీజి 75 వ పుట్టిన రోజు వేడుకలలో 9 మంది eminent artists కి "నాద నిధి" పురస్కారంతో సత్కరిస్తున్నారు. వారు...

  1. శ్రీ అంజాద్ అలీఖాన్.. సరోద్
  2. కుమారి అవసరాల కన్యాకుమారి.. వయోలిన్
  3. శ్రీ T.H.వినాయక్ రామ్.. ఘటం
  4. శ్రీ గురువాయూర్ దొరై.. మృదంగం
  5. బోంబే సిస్టర్స్ శ్రీమతులు సరోజా & లలిత.. గాత్రం
  6. శ్రీ అయ్యగారి శ్యామసుందరం .. వీణ
  7. శ్రీ కదిరి గోపాల్ నాథ్.. సాక్సోఫోన్
  8. శ్రీయుతులు రాజన్ మిశ్రా, సాజన్ మిశ్రా హిందుస్థానీ గాత్రం
  9. శ్రీ వెంకటేష్ కుమార్.. హిందుస్థానీ గాత్రం .

  • మా గురువుగారు ఈ అవార్డ్ May 27 th పూజ్య స్వామీజీ కరకమలముల ద్వారా అందుకోబోడం అమితమైన ఆనందం కలగజేస్తోంది. మా శ్రేయోభిలాషులైన మీ అందరితో ఈ శుభ వార్త పంచుకుంటున్నాను..... అయ్యగారి జయలక్ష్మి

కంచి



ఏనాటి నోము ఫలమో ఏ దాన బలమో
గుమ్మం లోపల అమ్మ, గుమ్మం బయట ఆమె కుమారులు, కుమార్తెలు.

ఎంత గొప్ప అనుభూతో చెప్పనలవి కావడం లేదు. హాయిగా కూర్చొని అమ్మని స్తుతిస్తూ ఎన్ని కృతులు పాడుకున్నాం. నిన్న ఉదయం ఏకంగా గంటన్నర అమ్మ సముఖంలో కూర్చొని అభిషేకం. అనంతరం అలంకరణ. అంతసేపూ శ్యామశాస్త్రి కృతులు పాడడం, వినడం. ఇంతకంటే జీవిత సార్ధకత ఏముంటుందండీ?

గుడి, గుడి ప్రాంగణంలో నవరత్న మండపంలో మగ వారి కచేరీలు, ప్రక్కనే కళ్యాణ మండపంలో ఆడవారి కచేరీలు. అక్కడే 4 పూటలా భోజనాలూ వగైరా!

ఇంత కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించిన శ్రీనివాస గోపాలన్ బృందంకు 🙏🏽🙏🏽🙏🏽 ఇంత కంటే చెప్పగలిగింది లేదు.

సంకల్ప శుధ్ధి వున్న చోట తప్పక సంకల్ప సిధ్ధి కలుగుతుంది. మహా సంగీత విద్వాంసులు పాల్గొన్న ఈ ఉత్సవం మున్ముందు మరింత ప్రాచుర్యం పొంది తిరువాయూర్ త్యాగరాజ ఉత్సవం మాదిరిగా విద్వాంసులందరూ పోటీపడి పాల్గొనే రోజు వస్తుంది, రావాలి!🙏🏽🙏🏽🙏🏽

ఓవీఎన్ మూర్తి



స్మృతి సమీరం

అప్పుడే సంవత్సరం అయిపోయింది.
ఆ మూర్తిని ఇక చూడలేక పోయినా, అందరి హృదయాలనూ జయించిన అజేయుడు. అతి సామాన్యుడుగా పుట్టి, అసమాన్యుడిగా ఎదిగి, మాన్యుడిగా మారిన స్వయంసిద్ధుడు.కడలిలా కష్టాలను కడుపులో దాచుకుని సముద్ర గాంభీర్యం హృదయంలో నింపుకొని,ఎల్లప్పుడూ చిరు మందహాసం తో అందరిని పలకరిస్తూ, ఎంతో శ్రమ కోర్చి పట్టుదలతో కంపెనీ సెక్రెటరీ, కాస్ట్ అకౌంటన్సీ పరీక్షలను అవలీలగా పాసై, జ్యోతిష్య శాస్త్రం లో అద్భుత ప్రతిభ కనబరిచే శ్రీ మూర్తిగారు సర్వదా అభినందనీయులు. వారు ఈ లోకం విడచి తిరిగిరాని లోకాలకు వెళ్ళి అప్పుడే సంవత్సరం. వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి భగవదనుగ్రహము సంపూర్ణంగా ఉండాలని ఆశిస్తున్నాము