17, మే 2015, ఆదివారం

వివాహం........

          బాపట్ల నుండి విజయవాడకు మారేను. కారణాన్తరాలవల్ల ఇంటర్ చేరలేదు. విజయవాడ మా పెద్దమ్మ గారింట ఉండి టైపు రైటింగ్ ఇంగ్లీష్, తెలుగు నేర్చుకుంటూ, దక్షిణ భారతహిందీ ప్రచార సభలో రాష్ట్రభాష చదువుకుంటూ, సంగీత కళాశాలలో మా మామగారి వద్ద సంగీతాభ్యాసం. చాలా బిజిగా గడిచిపోయింది ఎని ఇది నెలలూ. అక్కడ అన్నింటా బెస్టే.

            విజయవాడలో ఎన్ని సినిమాలు చూసానో. గవర్నర్పేట్ సెంటర్లో ఐదు పైసలకి సోడా, ఐదు పైసలకి సన్నజాజిమాల, ఐదు పైసలకి సంపెంగ పువ్వు. ఆశ్చర్యం ఇంత కొంచెం డబ్బుకి అంత విలువైన పూలా?


                 హైదరాబాద్లో ఉండగా మూడునెలల పరీక్ష అయ్యాక, ఆరు నెలల పరీక్షా అయ్యాక, ఏడాది పరీక్ష అయ్యాక ఒక సినిమా చూస్తే, బాపట్ల వచ్చాక నెమ్మదిగా సీనియర్లం అయి " ఆత్మీయులు, సిపాయి చిన్నయ్య, హిందీ బ్రహ్మచారి, సినిమాల స్థాయి కొస్తే, ఇక బెజవాడలో నా సామిరంగా ఎన్ని సినిమాలో...."కధానాయకుడు, గండికోట రహస్యం, అర్ధరాత్రి" సిగ్గు చేటు ఈ మూడు సినిమాలు వరసగా మూడు షోస్. వీటికి ఒకే రిక్షాలో మా రాజేశ్వరి ఓదిన ( రాజేశ్వరీ పరిటి, చికాగొ) ఒళ్ళో నేను, పక్కన మా బావ. తలచుకుంటే సిగ్గేస్తోంది. రాజక్కా గుర్తుందా? దసరా బుల్లోడు, గోపి, కబ క్యో ఔర్ కహా?, పవిత్ర బంధం, కోడలు దిద్దిన కాపురం, ఇలా చాల సినిమాలు.


           నిర్లక్ష్యం చెయ్య లేదండోయ్. మ్యూజిక్ కాలేజీ లో థర్డ్ ఇయర్ ఫస్ట్. రాష్ట్రభాషా స్టేట్ మొత్తం లో 23 డిస్టింక్షన్ వస్తే దానిలో విజయవాడలో వచ్చిన మూడులో నేను ఒకటి. టైపు నేర్చుకున్నా కానీ, నో పరీక్ష!


                        ఇలా పది నెలలు గడిచిపోతుండగానే మే 15 వచ్చేసింది, అయితే గొప్పేమిటి అంటారా? చూడండి ఏమిటో మరి.! అల నాడు మా నాన్నగారు, మా మామగారుతో బాటూ, ఇప్పుడు మా చిన్నారి చిట్టి తల్లి కూడా ఆహ్వానిస్తోందిగా ........ బయలుదేరండి మరి.......


మూడ్..........

        నేను అనుకున్నాను  ఎవరైనా సరే ఏదైనా రాద్దమనుక్కోగానే,   పరా పరా  రాసేయచ్చని  కానే  కాదు,  నాకు  నా డెస్క్ టాప్, నా  గూగుల్  తెలుగు  లాంగ్వేజ్ బార్, నా  కుర్చీ, నా బుజ్జి  సింగిల్  మాన్  ఫాన్  అయితేనే  రాయడానికి మూడ్  వస్తుందని  అర్ధమయ్యింది.  రెండు  రోజులనుండి  తెలుగు  లాంగ్వేజ్  బార్  కనిపించక  రాయ  లేక పోయా.  కాబట్టి  నేను  కూడా  రచయిత్రిని  అయిపోయానోచ్....... (నన్ను  రచయిత్రి  కాదన్నవాణ్ణి   రాయెట్టి  కొడుతా)

         గణపతి  నాటకంలో   చెప్పినట్లు కలిగిన  వాడు  గుర్రమెక్కితే  లేని  వాడు  గాడిద  ఎక్కినట్లు  ఆత్రేయ  గారు  ఊటీ  వెళ్లి  రాస్తే  నేను,  మా డెస్క్ టాప్ దగ్గర  రాస్తా.  ఇదే నా ఊటీ , కొడైకెనాల్. అమ్మయ్య....ఇక  మూడ్  లోకి  వచ్చేసా........

          పెళ్లి  మర్నాడు  మా మ్యూజిక్  కాలేజీ  విజయవాడ  ప్రేమిమిసిస్లో  నూకల  వారి  కచేరీ, (అన్నట్లు  బాపట్లలో  కూడా ప్రకాశరావు  గారి  కచేరి)  తదనంతరం  భావన  కళా సమితి  వారి  సినీ విభావరి. (మా  వారి  స్నేహితులు)  అందులో  ఇప్పటి  మహా  మహులు  పాల్గొన్నారు.)...మాధవపెద్ది  రమేష్,,  మాధవపెద్ది  సురేష్,  చంద్రకాంత,  సర్రాజు  ప్రసన్న కుమార్ (వాలు  జెడా తోలు బెల్టు  మ్యూజిక్ డైరెక్టర్) ఇత్యాదులందరూ  అద్భుతంగా  ఆనందింప  చేసేరు  వచ్చిన  అశేష జనాన్ని.  

          ఇలా  మొదలయ్యింది  వైవాహిక  జీవనం...... మళ్ళీ  రేపు  కలుద్దాం..........

   

14, మే 2015, గురువారం

మా బాపట్ల........


      ఆ  తలపే  ఎంత  హాయి.   నేను  పుట్టింది,  పదవ  తరగతి  చదివింది,  పెళ్లి  మా  బాపట్ల  లోనే. 


      అంతే  కాదు (మా  వారి  ఊరు)   మా మేనత్త  గారు,  మా  అమ్మమ్మగారు  కూడా  బాపట్లలో  ఉండడం (అందువల్లే  కదా మా  అమ్మ  నాన్నగారికీ  పెళ్లి  జరిగింది) వల్ల  మా  ఇద్దరికీ  బాపట్ల  యందు  ఎన లేని   అభిమానం.  గుంటూరు  కాలేజీ  ప్రిన్సిపాల్గా  ఉన్నప్పుడు  టైం  దొరికితే  సినిమా  బదులు  బాపట్ల    మాయాబజార్  వరకూ  రిక్షాలో  ,  అక్కడ  దిగి పోయి,  అక్కడ  నుండి  మాయాబజార్  అంత  వాక్  చేసుకుంటూ  తిరిగి బస్సు  స్టాండ్కి  వచ్చి  బస్సు లో  గుంటూరు  వాపస్. అంత ఇష్టం.


      మద్రాస్  వెళ్తున్నప్పుడు  బాపట్ల  రాత్రి  పూట  వచ్చినా సరే  లేచి  ఉండి  చూద్దామంటే,  ఈ చివర్నించీ  ఆ చివరి  దాక  గూడ్స్  బండి!  తిట్టుకుంటూ  బాపట్ల  సోడా  తాగి  పడుక్కోడం..........


       ఇక  బాపట్ల  ఎంత  అందంగా  ఉంటుందో  మీకెవ్వరికీ  తెలీదు కదా (అన్నట్లు  నారాయణ స్వామి  గారికి  తెలుసు) మల్లె  పూలు,  మంచి  వంకాయలు, చల్లని  సాయంత్రం,  రాత్రి  దూరంగా  ఎక్కడినుంచో  చక్కగా  పాటలు, మంచి  నెయ్యి,  దూరంగా  తాటి  తోపులు. ఆ  తాటి తోపులవతల  స్టువర్టు  పురం.  పిచ్చి  దొంగలు  పాపం  వాళ్ళు  రాత్రి  పూట వచ్చి  ఇంట్లో  ఉన్న  చద్దేన్నం  బావి  గట్టు  మీద  కూర్చుని  తినేసి,  అందరి  చెప్పులూ  కుక్కల  మీద విసురుకుంటూ  వెళ్ళిపోయేవారు (అవి  అరవకుండా). మళ్ళీ  తాటి  తోపుల్లోకి.   ఇంతకీ  వాళ్ళు  ఎందుకొచ్చినట్లో ? చద్దేన్నం  తినడానికా?  లేక  పట్టికెళ్ళే విలువైన  వస్తువులు  దొరక్కా? చిన్న  వాళ్ళం మాకు  తెలీదు, ఆ  భగవంతుడికే  తెలియాలి.  మళ్ళీ  అంటున్నా....పాపం  పిచ్చి  దొంగలు.


      ఇక  బాపట్ల   ప్రశాంతంగా  ఎంతో  అందంగా  పూల  మొక్కలూ,  మేడ మీద  కెళ్తే   మబ్బులూ,  చల్ల  గాలులూ  ఆహా! ఎంత  బాగుండేదో.  అప్పుడు  సీలింగ్  ఫాన్స్  లేవు,  పెడస్టల ఫ్యాన్  ఒక్కటే  ఉంది  ఇంటి  మొత్తానికీ,  అయినా  చాలా  హాయిగా పడుక్కునే  వాళ్ళం.,  మరి  ఇప్పుడో  ఎసి  ఉంటె  కానీ  నడవదు  జీవితం .  ఎందుకో  ఈ  మార్పు.  మనుషుల  వాళ్ళమే  కానీ,  మన  మనస్సులూ ,పరిస్థితులే  మారాయి.  ఉన్నాయని  వాడుకుంటున్నామా?/ అవసరం  ఉందా?  తెలీదు!  సమాధానం  ఇంతే.

     మేము  పదవ  క్లాసు  బాపట్లలో   చేరడానికి  వెళ్తే,  మమ్మల్ని  మహారాణులు/అప్సరసలు  అనుకుని  చూసారు.  మేము హైదరాబాద్ (సిటీ)  నుండి వచ్చాం, పైగా కొంచెం  తెల్ల  తొక్కతో  ఉన్నాం  కదా  అందుకని. నిజం  నేను  గొప్పలు  కొట్టడం  లేదు.  మళ్ళీ  అంటున్నాను  పిచ్చి  వాళ్ళు!  ఎంత  హైదరాబాద్ వాళ్ళం  అవుతేనేమి?  మాకు  చిక్కడపల్లి   నుండి  నారాయణగూడా  వరకే  తెలుసు.. హిందీ  పిచ్చి  పిచ్చిగా  మాట్లాడ్డం రాదు,  ఇంగ్లీష్  మాట్లాడాలంటే  భయం!  ఇంక  వాళ్ళకీ  మాకూ తేడా ఏమిటి?  అదే  భ్రమ అంటే.  నేను  హైదరాబాద్లో తొమ్మిదో  తరగతి  వరకూ  ఇంగ్లీష్  మీడియం లో  చదివి,  పది  మటుకూ  బాపట్లలో   ఇంగ్లీష్  మీడియం  లేక  తెలుగు  మీడియంలో  చదివినా.................ఊరు అంతటికీ  ఫస్ట్.   బుర్ర  ఉందండీ.......రుబ్బడం  కూడా  బాగా  వచ్చు, ఇంకేమి కావాలి...

        అందుకనే  అంటున్నాను  తక్కువేమీ  లేదూ  నాకూ,   తెలివి  ఉంది  చాలూ,,, 

            ఎక్కడ  పెడితే  అక్కడ  బెస్టే............ఒప్పుకుంటారో  లేదో.....మరి...........


బాపట్ల  గూర్చి  చెబుతే  నేను  చాలా....చేట భారతం  రాసేస్తాను,  అందుకని  నన్ను  నేను  నియంత్రించుకుంటూ......రేపటి  వరకూ  శలవా  మరి? 
                                              (సశేషం)

13, మే 2015, బుధవారం

మా బడి.........

     మాడపాటి   బాలికల  విద్యాలయం.... బాలికల  విద్య కోసమే ప్రత్యేకంగా  మహామహులచే  స్థాపింప  బడిన  విద్యాలయము.  తలచుకుంటేనే మనస్సంతా  తీపి  గుర్తులతో  నిండి  పోతుంది..

     బహుశా నేను  కాలేజీ  గుమ్మం  కూడా తొక్క నందువల్ల  అనుక్కుంటాను,  స్కూల్  ఫ్రండ్స్,ని,  టీచర్లనీ  ఇంకా  మరవలేక  పోతున్నా.  చిన్ననాటి  స్నేహితులను  చాలా  మందిని  ఈ మధ్య  రీయూనియన్  ద్వార  కలసుకోడం  చెప్పనలవి  కాని  సంతోషం  కలగ  జేసింది.
 
        మూడు,  నాలుగు,  ఐదు,  ఆరు ,  ఏడూ,  ఎనిమిది ,  తొమ్మిదీ  క్లాస్, అక్కడ  చదవడం,  1968/69  విద్యా  సంవత్సరం   తెలంగాణా  ఆజిటేషన్ వల్ల  చదువు  డిస్త్రబ్   అవ్వడం  తో  బాపట్ల  మా  అమ్మమ్మగారి  ఊళ్ళో పదవ తరగతి  చదువుకోడం జరిగేయి.

       మా స్కూల్  బెస్ట్  స్కూల్.  క్రమశిక్షణతో  మెలగడం, ఆటలూ,  పాటలూ,  లౌకిక  జ్ఞానం,  ఎన్నెన్నో  నేర్పేరు  మా  టీచర్స్.

             క్లాస్స్లో  ఎప్పుడూ  ఫస్ట్  రాడం,  టీచర్కి  కనిపిస్తూ  ఎప్పుడూ ఫస్ట్  బెంచ్లో కూర్చునే  ప్రయత్నం,  టీచర్కి గులాబీ పువ్వులివ్వడం,  ఆవిడ  వెంకటేశ్వర  స్వామి టెంపుల్ దగ్గర  అమ్మే కొబ్బరి  చిప్పలు  తెమ్మంటే  ఎంతో  అపురూపంగా   దొరికిన  అవకాశంగా భావించి,  వినమ్రతతో  తెచ్చివ్వడం,  ఎప్పుడైనా  క్లాసు లీడర్  అయితే  అల్లరి  చేసిన  వాళ్ళ  పేర్లు  రాయమంటే ( టీచర్  ఆబ్సెన్సులో ) ప్రేసిడెన్ట్ అఫ్ ఇండియా  అయిపోయిన  ఫీలింగ్,  మన శత్రువుల  పేర్లన్నీ  ఎక్కించి  టీచర్తో   వాళ్ళని  తిట్టించి  పైశాచిక  ఆనందం  పొందడం. 

        మా  నాన్నగారు అల్లుమినియం  టిఫిన్ బాక్స్  మీద ఉలితో  మా పేర్లు  చెక్కేరు  జమ  లక్ష్మి  ఉయా దేవి” ,  దాంతో  మేమిద్దరం జమ, ఉయా  గా  ప్రసిద్ది  పొందాము.  ఇంతకీ  ఆ టిఫిన్  బాక్స్ని  మేము నాలుగు  ఏళ్ళు  వాడెం.  ఎలా  అంటారా?  ప్రతీ క్లాసు  మారగానే  అది  ఉలితో  కొట్టేసిన  మార్క్,  దాని  పక్కనే  కొత్త  క్లాసు  చెక్కడం.  భలేగా  ఉండేది.  ఆ  టిఫిన్  బాక్స్  పెట్టి   రోడ్  మీద  ఒకళ్ళనొకళ్ళం   కొట్టుకుంటూ రాడం.......  మా  చెల్లి  నేనూ  ఇప్పుడు  ఎంత  మంచి  దోస్తులమో,   కానీ   చిన్నప్పుడు  ప్రియమైన  శత్రువులం..  

     ఉమా!  నా  మీద  చాలా   సార్లు  నీకు  కోపం  వచ్చింది,  సారీనే.!  ఇంకా  ఆరేళ్లలో  కాలం లో  చా.......లా  విషయాలు  కానీ,  చాలా  పేద్ద  చాంతాడవుతుంది. అందుకని  మరి  ఇంక  రేపు  మా పదవ  తరగతి,  బాపట్ల  వగైరా.............. గురించి........ అన్నట్లు  నేనూ  మా  చెల్లీ  ఎంత  దోస్తులమో ఇప్పుడు  చూస్తారా?  చూడండీ..........



 

11, మే 2015, సోమవారం

శ్రీరామచంద్రులు..........


     అవును  మా  ఇంట  ఇరువురు  శ్రీరామచంద్రులు  పుట్టేరు.  వాళ్ళు  పిత్రువాక్య  పరిపాలకులైనా,    మా  పాలిట  కరటక  దమనకులూ / నక్షత్రకులూ.  ఎందుకంటారా?   మరి  చదవండి.......... 

        మేము  ఏడూ, ఆరూ  తరగతులు  చదువుతున్నాం (నేనూ, మా చెల్లీ)  వివేకనగర్  వెల్ఫేర్  సెంటర్కి  ఘంటసాల,  కుట్టి  పద్మిని, రాజసులోచన , సి. స్. రావు  వస్తున్నారని  అందరూ  వెళ్ళబోతున్నారు,  మాకు  తెలిసిన  పిల్లలూ  పెద్దలూ.  ఇందులో  మాకు  నచ్చిన  వారు  ఘంటసాల,  కుట్టి  పద్మిని.

      మా  నాన్నగారిని  ఒక్కరే  అడిగితే   తిట్లన్నీ  వాళ్ళకే  చెందుతాయని......ఇద్దరికీ  చెరి  సగం  పంచుకోడానికి  వీలుగా    నేను  నా    మా చెల్లి  న్న”     మళ్ళీ   నేను  గా  మా  చెల్లి  “రు   ఇలా  కూడ  బలుక్కుంటూ  అడిగేము.  ఏ  కళనున్నారో  కానీ  సరే  అన్నారు.  ఎన్నింటికి  వస్తారు  వాళ్ళు  అని అడిగేరు.  రాత్రి  ఏడూ  గంటలకి  అని  చెప్పేము.   సరే  మాతో  బాటూ  మా  తమ్ముళ్ళిద్దరూ  కాపలాకి  వచ్చి  మమ్మల్ని  అరగంటలో   వెనక్కి  తెచ్చేయ్యాలి,  అదీ  ఒప్పందం......  ఎంత  ఆనందపడ్డమో  చెప్పలేము.

    ఇక  సాయంత్రం  ఆరున్నర........... బయలుదేరి   నలుగురం  నడుచుకుంటూ  వెల్ఫేర్  సెంటర్కి  వెళ్ళాం......అప్పటికే  అక్కడ  ఇసుక   వేస్తే  రాలనంత  జనం.  పాపం  బుజ్జి  గాళ్ళం  ఎలాగోలా  అక్కడ   దూరంగా   కూర్చున్నాం.  ఏడు  అయ్యింది,  రాలేదు............. ఏడున్నర  అయ్యింది  రాలేదు.  ఈ లోగా  మా సాకేతపురవాసులిద్దరూ   చేతికి   వాచీలు  లేక  పోయినా  పక్క  వాళ్ళని  టైం  అడిగి  అరగంట  అయ్యిందని  బయలుదేరమని  రక  రకాలుగా  వొత్తిడి  చేస్తున్నారు.  మేము  పక్కకి  ముఖం  తిప్పం,  వాళ్ళని  చూడం.  ఇంతలో ఎనిమిదిన్నర  అయ్యింది  వచ్చారు,  వచ్చారంటూ  అందరూ  లేచి  నుంచుని  చూస్తున్నారు.  మళ్ళీ  కూర్చోడంలో మా  కాలి  వేళ్ళు,  పాదాలూ  తొక్కి  పడేసారు.  ఏడుపు  ఆపుకుంటూ  నోర్మూసుకుని  కూర్చున్నాం.

     ఘంటసాల  గారు  భలే మంచి రోజు  జరిగిన కధ పాట పాడేరు.   ఈ  కరటక -దమనకులు  కూడా  మాతో  కలసి  పోయి  ఆనందిన్చచ్చు కదా..............  మమ్మల్ని  చంపుకు  తిని  బయలుదేర  దీసేరు... అప్పుడే  అసలు  వాళ్ళందరూ  వచ్చి  ఇదు  నిమిషాలయ్యింది.........  ఏడుపు  మొహాలతో  ఇంటికి  వచ్చేం.


      అందుకనే  అంటున్నా   మా ఇంట  సాకేత  నగర  నాధులు,  దశరధ  నందనులు,   జానకీ  రమణులు  ఇద్దరు  పుట్టేరు.  వారిని  చూస్తారా?  చూడండి మరి..........

6, మే 2015, బుధవారం

దృశ్యం



      దృశ్యం వచ్చి శ్రవణాన్ని, పటనాన్ని (తప్పు రాయక తప్పటం లేదు, No way) పక్కకు నెట్టింది. మీరు ఏమంటారు.?

        నిజం చిన్నప్పుడు ఎంత, ఎంతెంత చదివే వాళ్ళం (క్లాసు బుక్స్ కాకుండా కాదు, క్లాసులో ఫస్ట్ లేక సెకండ్ వచ్చేదాన్నండోయ్ అపార్ధ చేసుకోకండి. పదవ క్లాసు ఊరంతటికీ ఫస్ట్, స్కూల్ లోనే కాదు)

        చిక్కడపల్లిలో చందనా ప్లేస్లో సిటీ సెంట్రల్ లైబ్రరీ ఉండేది. వేసవి సెలవలోస్తే చాలు పొద్దున్నే చద్దేన్నం (తరవాణీ అన్నం) తిని వెళ్లి మధ్యానం భోజనానికి ఇంటికి రావడం. పిల్లల సెక్షన్లో చదివిన ఆ కధల పుస్తకాలు నా బుర్రకు పదును పెట్టి, నా సృజనాత్మకతను పెంచి, నా ఊహా శక్తిని పెంచి, మంచి భాషా పరిజ్ఞానాన్ని పంచింది.

      వింత లోకంలో విమల, బొమ్మల కొలువులో బొమ్మలు ఒకదానితో ఒకటి మాట్లాడుకోడం......చందమామ, బాలమిత్ర........ ఎన్నెన్నో! మళ్ళీ చిన్నగా అయిపోడం ఎలా? ఉండండి మళ్ళీ “వింతలోకంలో విమల” చదివితే చిన్నగా అయ్యే ఉపాయం తెలుస్తుంది.

       ఇక పరేక్షలైనా సరే నేనూ మా కల్పకం నోట్ బుక్ లో పెట్టుకుని నవలలు, ముఖ్యంగా డిటెక్టివ్ నవలలు చదివే వాళ్ళం. వయస్సు 8/9. మద్రాస్ పెళ్ళయ్యాక వెళ్ళినా , డిటెక్టివ్ నవల పరిజ్ఞానం వల్ల గిండీ, పూనమల్లీ హైవే, రేస్కోర్స్ రోడ్ , కాత్య, రాజు,, యుగంధర్ వీళ్లందరూ పరిచయ మయ్యారు.

       ఇక బలిపీట్టం, శంకుతీర్ధం మొదలైన నవలలు ధారా వాహికంగా వస్తున్నప్పుడే క్యాచ్ పట్టి చదివేసాం (చిన్న వయస్సులోనే)..

        ఈ మధ్య కాలంలో నేను పెద్దగా చదవడం లేదు టివిఏ దానికి ముఖ్య కారణం . మళ్ళీ పేస్ బుక్ పుణ్యమాని లక్ష్మి వసంత, మణీ వడ్లమాని, మైథిలి అబ్బరాజు, భావరాజు పద్మిని, జ్యోతి వలబోజు, నారాయణ స్వామి గార్ల వంటి వారి వల్ల చదవడం మొదలు పెట్టా. మీ అందరికీ ధన్యవాదాలు.


     పడక్కుర్చీలో కూర్చుని చక్కటి సంగీతం చిన్నగా విన్పిస్తుండగా , పుస్తకం చదువు కుంటుండగా ఏమైనా ఫరవా లేదు...............

                          ఇప్పుడు చెప్పండి నాతో అంగీకరిస్తారా/లేదా?

2, మే 2015, శనివారం

తీవ్ర నిరాశ


నారాయణ గుడా  స్కూల్  నుండి  చిక్కడపల్లి  ఇంటి  దాకా  పెద్ద  బస్తాడు  పుస్తకాలు  మోసుకుంటూ  ఇంటికి  రాగానే  అమ్మేది  అమ్మేది  అని  వెతుక్కుంటుంటే  అమ్మ  చిట్టి  అత్తయ్యా వాళ్ళింటికి  వెళ్లి  బన్  చేస్తోంది  అని  తెలిసింది.
     నోరు  ఊరి  పోయింది.  దానికి  చాలా  కారణాలున్నాయి.
1)      స్వీట్  చేస్తోంది  మా  అమ్మ. 
2)      ఇంగ్లీష్  వంటకం  బన్  ఇంట్లో  చెయ్యడం  (బన్  కోసం  జ్వరం  అని,  ఎన్ని  దొంగ  వేషాలు  వేసేవాళ్ళం,  ఈ రోజు  అది సర్వ  సాధారణ  తిండి)  
3)       అందులోనూ  స్కూల్  నుండి  రాగానే  వెయ్యి  ఏనుగుల  ఆకలి,  అలసట,  అమ్మ  కోసం  వెతుకులాట.
        సరే! ఇక  వాళ్ళింటికి  పరుగెత్తుకుంటూ  వెళితే  కలిగిన  తీవ్రమైన  నిస్పృహ   ఏమిటో  తెలుసా?
రంగు, రుచీ  వాసన  దేనికీ  సరి  కాని  బన్ అక్కడ  తయారవుతోంది.
    అంతటి  నిరాశా,  నిస్పృహా,  నీరశం  ఇంకెప్పుడూ రాలేదు.

ఇప్పుడు  మీకే  ప్రశ్న అది  ఏమిటి?  నేను  ఆన్సర్  తరవాత  చెబుతా,  ఎవ్వరూ  చెప్పలేక పోతే.................
(అది  జుట్టుతో  చేసే  "ముడి  బన్"  అండి.) 
   అర్ధంయ్యిందనుక్కుంటాను  ఎందుకు  అంత  తీవ్ర  నిరాశో..........