జయా కల్యాణా వైభోగమే
శ్యామా కల్యాణా సౌభాగ్యమే!
సోమసుందర జాత
వైణిక ఘన చరితా
శ్యామసుందర దార
అయ్యగారి వంశధారా॥
జయా కల్యాణా వైభోగమే
శ్యామా కల్యాణా సౌభాగ్యమే॥❤️🥰😘🙏
అప్పుడప్పుడు నాకు తోచింది వ్రాస్తే, నా అభిమానులందరికీ అందుబాటులో ఉండడానికి ఇలా ఈ బ్లాగు లో పోస్ట్ చేద్దామని.. తెలుగు లో ఇలా వ్రాయగలగడం ఎంత బావుందో!
జయా కల్యాణా వైభోగమే
శ్యామా కల్యాణా సౌభాగ్యమే!
సోమసుందర జాత
వైణిక ఘన చరితా
శ్యామసుందర దార
అయ్యగారి వంశధారా॥
జయా కల్యాణా వైభోగమే
శ్యామా కల్యాణా సౌభాగ్యమే॥❤️🥰😘🙏
కొందరు వ్యక్తుల నిష్క్రమణతో కొన్ని గుర్తులు కూడా నిష్క్రమిస్తాయి. పంచుకుందుకు కూడా, తెలిసిన వ్యక్తులు ఉన్నంతవరకే జ్ఞాపకాలు. తరవాత సదరు వ్యక్తులు గోడ మీద బొమ్మలే,కదా!
అంతే కాదు....నెమ్మదిగా అటక మీదకి, అక్కడ నుండి నేటి కాలమాన పరిస్థితుల్లో, digitalise అయ్యి హార్డ్ డిస్క్ లకు.అంతే ( ఓపిక ఉండాలి, technology తెలియాలి,దాచడం అనే అలవాటు ఉండాలి, లేదా మీకు తెలుసు వాటి స్థానం).
స్మృతి సమీరం 2
మౌనముద్రా - యోగనిద్రా !....
"ఓ మునీ !.కనులు మూసుకొన్నావు..మీ దంపతుల కు ముద్దుగా పుట్టిన తనయులం -కారణ జన్ములం - ఇద్దర్నీ కలిసి ఎత్తుకోనే శక్తి - నీకు ఇదే ఇస్తున్నాము - ప్రతిఫలం గా ఎవ్వరూ సంపాదించ లేనంత పుణ్యం - ఇదుగో." అని వీరి తనయులు దీవించారు.
తనయులు తల్లితండ్రులను దీవించడమేమిటని? విడ్డూర పడకండి. అవును! వారిరువురూ పసికూనలైన మునిపుంగవులు. వారిని గడ్డాలు మీసాలూ వచ్చినా అడ్డాలలోని పిల్లల్లా సాకారు, ముద్దుగా వారి ఇష్టాఇష్టాలని ఊహించుకుని వాటిని అమరుస్తూ, వారిని ఒక్క క్షణం కూడా ఏమరుపాటున వదలక,వెన్నంటి చూసుకున్న ఆ తల్లితండ్రులు పరమ పూజ్యులు. వారిలో పెద్ద మౌని భగవంతుని 5 సంవత్సరాల క్రితం చేరుకుని జన్మ రాహిత్యం పొందాడు.
పిల్లల దీవెనల ఫలితంగా ఆ భార్యాభర్తలిరువురూ స్వార్ధ రహితులుగా మారిపోయినారు. ప్రపంచం అంతా వారికి పిల్లలే. నా మటుకు నేను, వారిని నాకూ, నా భర్తకూ, నా తల్లితండ్రులకూ, నా పిల్లలకు కూడా తల్లి తండ్రులుగా భావిస్తాను. అది నిజం కూడా. వారికి తెలిసిన యావన్మందీ ఉమా,మూర్తి దంపతుల గూర్చి ముక్తకంఠంతో ఇలాగే చెప్పితీరుతారు.
వారికి పరిచయస్తు లెవరైనా వారినుండీ కించిత్తైనా ప్రయోజనం పొందకుండా లేరు. (ఈ విషయం బయటకు అన్నా అనలేక పోయినా.)
మేమెవరమైనా వారి కుటుంబానికి ఏదైనా ఆత్మీయంగా వెన్నంటి వున్నామంటే కారణం, మేము కృతజ్ఞులం అనీ, కృతఘ్నులం కాదనీ, ఇంకా మానవత్వం మాలో మిగులున్నదని అర్ధం. ఇది మా గొప్పతనం కాదు. వారిరువురూ సంపాయించుకున్నది డబ్బూ కీర్తి ప్రతిష్టలు కానే కాదు, సర్వ జనాభిమాన ధనం. అనితర సాధ్యమైన ఈ ధనం వారు అప్పనంగా సంపాయించ లేదు, వారు నిస్వార్ధంగా పంచిన అభిమానమే ఈనాడు వారు సంపాయించిన ఈ అభిమానధనం. ఉమా మూర్తీ మీరిరువురూ అన్ని విధాలా ధన్యజీవులు.
ఆ ఇద్దరి అన్యోన్యతా చెప్పనలవి కానిది. అన్యోన్యంగా భార్యాభర్తలు మంచి ఆలోచనా చెయ్యవచ్చు, అప్పుడప్పుడు ఇరువురూ కూడి చెడు ఆలోచనలు కూడా అమలు చెయ్సవచ్చు. కానీ ఈ భార్యాభర్తా కలసికట్టుగా ఇతరుల మంచే ఆలోచించారు, ఇతరులకు మంచే చేసారు.
మూర్తిగారు పరమపదించే ముందు రోజు " ఉమాదేవి చాలా మంచిది, నాకు మరు జన్మలో కూడా తనే భార్యగా రావాలని" చెప్పారట. అంత కన్నా ఒక స్త్రీకి కావల్సిన/రావల్సిన కితాబు ఏముంటుంది భర్త నుండీ?
పిల్లలు ఇరువురూ దీవెనల ఫలితంగా, మూర్తిగారు క్రితం సంవత్సరం ఇదే రోజు,ఉమాదేవి చెయ్యి గట్టిగా పట్టుకుని వుండగానే క్షణంలో భగవంతుని సాన్నిత్యాన్ని చేరేరు.
గొప్పచెప్పుకోడం కాదు........ గొప్పగా చెపుతున్నాను వీరు మా చెల్లెలు ఓరుగంటి ఉమాదేవి, మరిది ఓరుగంటి వేంకట నరశింహ మూర్తి గారు. పవిత్రమైన జీవితం గడిపిన మూర్తిగారికి సద్గతులు ప్రాప్తించు గాక!
స్మృతి సమీరం 1
అప్పుడే సంవత్సరం అయిపోయింది.
ఆ మూర్తిని ఇక చూడలేక పోయినా, అందరి హృదయాలనూ జయించిన అజేయుడు. అతి సామాన్యుడుగా పుట్టి, అసమాన్యుడిగా ఎదిగి, మాన్యుడిగా మారిన స్వయంసిద్ధుడు.కడలిలా కష్టాలను కడుపులో దాచుకుని సముద్ర గాంభీర్యం హృదయంలో నింపుకొని,ఎల్లప్పుడూ చిరు మందహాసం తో అందరిని పలకరిస్తూ, ఎంతో శ్రమ కోర్చి పట్టుదలతో కంపెనీ సెక్రెటరీ, కాస్ట్ అకౌంటన్సీ పరీక్షలను అవలీలగా పాసై, జ్యోతిష్య శాస్త్రం లో అద్భుత ప్రతిభ కనబరిచే శ్రీ మూర్తిగారు సర్వదా అభినందనీయులు. వారు ఈ లోకం విడచి తిరిగిరాని లోకాలకు వెళ్ళి అప్పుడే సంవత్సరం. వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి భగవదనుగ్రహము సంపూర్ణంగా ఉండాలని ఆశిస్తున్నాము
మే 15.. మండుటెండ ..మూడుముళ్లూ...ఏడడగులు...
చక్కని సంసారం... చల్లనిమనసు..కుదురైన పిల్లలు.. ముద్దొలొలికే మనవలు...
విశాలహృదయం .. గృహమంతా సంగీతమయం...
ఇన్నీ ఒక యెత్తు...ఎదిగినకొద్దీ ఒదిగివుండే మనస్తత్వం..
పరులగుణగణాలను పెద్దమనసుతో ప్రశంసించి వూరుకోరు...ప్రోత్సహించి... వెన్నుతట్టి వెన్నంటే వుండే వెన్న
మా
జయలక్ష్మక్కయ్యగారు.
వీరి గురించి యింత ప్రస్తావించే అర్హతనాకు లేదు..అయినా వారి పెళ్లిరోజని బాగా గుర్తుండి పోబట్టి...
వ్రాయకుండా వుండలేకపోయాను.
మాస్టారుగారికీ... జయక్కకూ మనః పూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
శిష్యప్రశిష్యులతో... దిగ్విజయంగా మీరు మరింత ఆనందోత్సాహాలతో .. జైత్రయాత్ర కొనసాగించాలని
హృదయపూర్వకంగా అభిలషిస్తూ .....
మీ వసంత .
మే 15.. మండుటెండ ..మూడుముళ్లూ...ఏడడగులు...
చక్కని సంసారం... చల్లనిమనసు..కుదురైన పిల్లలు.. ముద్దొలొలికే మనవలు...
విశాలహృదయం .. గృహమంతా సంగీతమయం...
ఇన్నీ ఒక యెత్తు...ఎదిగినకొద్దీ ఒదిగివుండే మనస్తత్వం..
పరులగుణగణాలను పెద్దమనసుతో ప్రశంసించి వూరుకోరు...ప్రోత్సహించి... వెన్నుతట్టి వెన్నంటే వుండే వెన్న
మా
జయలక్ష్మక్కయ్యగారు.
వీరి గురించి యింత ప్రస్తావించే అర్హతనాకు లేదు..అయినా వారి పెళ్లిరోజని బాగా గుర్తుండి పోబట్టి...
వ్రాయకుండా వుండలేకపోయాను.
మాస్టారుగారికీ... జయక్కకూ మనః పూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
శిష్యప్రశిష్యులతో... దిగ్విజయంగా మీరు మరింత ఆనందోత్సాహాలతో .. జైత్రయాత్ర కొనసాగించాలని
హృదయపూర్వకంగా అభిలషిస్తూ .....
మీ వసంత .
కాటీ
మీరు sprite, maaza, coco cola, miranda, sugar cane juice, లాంటివి తాగుంటారు కదా! "కాటీ" తాగారా ఎప్పుడైనా ?
లేదు కదా!
అవును మరి ఎప్పుడైనా మా ఇంటికి వస్తేనా? వచ్చుంటే "కాటీ" తాగుండేవారు. మరి కాటీ పెట్టడం ఎలాగబ్బా 🤔🤔🤔!
నేర్చుకోండీ.......
మరి అసలు రంగంలోకి దిగుదాం......
అప్పుడు నా వయస్సు 14. మా ఇంటికి మా పెద్దమ్మగారు వచ్చారు. ఇక మా అమ్మగారూ వాళ్ళక్కా కలసి ముచ్చట్లు.... పరనిందా పరగోష్టి ఆత్మస్తుతి కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది.
చెప్పక చెప్పక నాకే టీ పెట్టమని పురమాయించారు. మనం కాఫీ టీ తాగం. కనీసం తేడా తెలీదు. అమ్మ చెప్పిన పని చెయ్యకపోతే "ప ప్ప ప్పా" అని భయంతో నీళ్ళు కాగ పెట్టి, మరుగుతుండగా పక్క పక్కనే ఒకేలా వున్న స్టీల్ డబ్బా ల్లోంచి కాఫీ పొడి వేసేసాను, వెంటనే వాసన గమనించి బాబోయ్ అమ్మ చంపేస్తుందని వెంఠనే అందులోనే టీ పొడి కూడా వేసేసాను. ఇక తక్కిన ప్రోసెస్ అంతా చేసేసి కాటీ వాళ్ళిద్దరికీ ఇచ్చేసి గర్వంగా నుంచున్నా!
తరవాత ఏమయ్యుంటుందో ఆర్యులందరూ ఊహించగలరు!
ఇప్పుడు చెప్పండి, మా ఇంటికి ఇంకా వద్దామనుక్కుంటున్నారా? చెప్పండీ?............
మధుర జ్ఞాపకం......2018 లో వేదుల సుభద్ర గారి పోస్ట్ నా వాల్ మీద...
మా గురుపత్ని శ్రీమతి జయలక్ష్మి గారికి నమస్కారం. మీరు అప్పుడెప్పుడో నాలాంటి కొందరిని సామెతలకి కధ రాయమన్నారు. విపరీతమైన పని ఒత్తిడి, వరస ప్రయాణాల మధ్య అది కుదరలేదు. ఈ మధ్యన మీకు గురువుగారి చేతుల మీదుగా సన్మానం జరిగిన విషయం తెలిసినప్పటినించీ మీరడిగిన దానికి ఇంతకన్నా మంచి సందర్భం ఉండదు కదాని ఈ చిన్న కథ రాశాను. మీరు స్వతహాగానే సంగీతంలో ఎంతో ప్రతిభ ఉన్నవారు, అద్భుతమైన సంగీత కుటుంబంలో జన్మిచారు, మరో ప్రముఖ విద్వాంసుణ్ణి చేపట్టారు.. మీకు గురువుగారి సాహచర్యం, శిక్షణ లభించడం అంటే బంగారానికి తావి అబ్బినట్టే కదా! ఆ విషయాన్నే దృష్టిలో పెట్టుకుని రాసినదే ఈ చిన్నకధ. మీకు మరో సారి అభినందనలు, గురువుగారికి నమస్కారములు.. కలకాలం మీరిద్దరూ శృతిలయల్లా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటూ..
_________________________________________________
ముదితల్ నేర్వగరాని విద్య- సామెత కథ: దాదాపు నలభై ఏళ్ళ క్రితం.. చిన్న పల్లెటూరిలో పుట్టి పెరిగిన ఇందిర కి చిన్నప్పటినించీ బాగా చదువుకోవాలని కోరిక. ఎప్పుడూ క్లాస్ లో ఫస్ట్ గా ఉండే ఆమె చాలా ఎదుగుతుందనీ, బాగా చదువుకోవాలని ఆమె గురువుల కోరిక కూడా.
కానీ పెద్దల కట్టుదిట్టాల మధ్య, సాంప్రదాయపు పోకడల మధ్యనా ఆవిడ చదువు పెద్దగా సాగలేదు. 'చాకలి పద్దు వేసుకుంటే చాలు, మొగుడికి ఉత్తరం రాయడం వస్తే చాలు’ అన్న తాతా- నాయనమ్మల ధోరణి తో పదో క్లాస్ లోనే ఆగిపోయింది ఆమె చదువు..
కనీసం డిగ్రీ దాకా చదువుకోవాలని, ఇంకా అవకాశం వస్తే మరింత పైకెదగాలన్న ఆమె కోరిక మొగ్గలొనే ఉండిపోయింది. దాన్ని విరిసే కుసుమంగా మార్చుకోగలగడం తన పనే అని తెలిసినా, పాదు చేసి, అంటు కట్టి, నీరు పోసే మాలి అవసరం తెలిసినది కనక ఎదురుచూడడం తప్ప మరో మార్గం లేకపోయింది ఆమెకి.
పదిహేను నిండి పదహారో సంవత్సరం ప్రారంభం కాగానే ఆమె వివాహం వనమాలి తో జరిగింది..
వనమాలి చాల మంచివాడు, అభ్యుదయ భావాలున్నవాడు. పెళ్ళి అయిన తొలినాళ్ళలోనె ఆమె ఆశను గుర్తించాడు. కేవలం ఆశ మాత్రమే కాదనీ, ఆలంబన ఇస్తే సాధించగల తెలివితేటలు, చురుకుతనమూ ఆమెకున్నాయని కూడా గుర్తించాడు. ప్రైవేట్ గా, దూరవిద్య ద్వారా డిగ్రీ చదవడానికి కావలసిన వన్నీ సమకూర్చడమే కాక, ఇంటి పనిలోనూ, వంట పనిలోనూ కూడా ఆమె కి సహాయం చేస్తూ ప్రోత్సహించాడు.
‘చక్కటి భర్త దొరికాడు, హాయిగా ఇంటిపట్టున ఉంటూ సంసారం చేసుకోక, ఇప్పుడు ఈవిడ చదువులు చదివి ఉద్యోగాలు చెయ్యాలా? ఊళ్ళేళాలా? ‘అన్న వారెవ్వరినీ పట్టించుకోవద్దని ఇందిరకి తరచూ చెప్పేవాడు.
అంతే కాదు వారానికి నాలుగురోజులు ఆమెకి ప్రైవేటు చెప్పేవాడు, ఆ తర్వాత ఉద్యోగం లో చేరాకా జీతం ఇచ్చే షరతు మీద..
'ఊరికే వచ్హ్చేదానికి విలువ ఉండదు ఇందూ! పైగా పెరటి తోట సామెత కూడా ఉండనే ఉంది మరి". అంటూ నవ్వేవాడు. దూరవిద్య కావడం వల్ల అప్పుడప్పుడు మాత్రమే తరగతులు ఉండేవి, మిగతా సమయమతా వనమాలి శిక్షణే ఇందిరకి.
" ఇప్పుడు నీ చదువు కోసం నేను పడుతున్న కష్టమంతా ఒకరోజు నీ ముక్కు పిండి మరీ వసూలు చేస్తా" అనే భర్త మాటలకి తనూ నవ్వేది.పరీక్షలప్పుడు తనే స్కూటర్ మీద పరీక్ష హాల్ దగ్గర దింపి తీసుకు వచ్చేవాడు. పరీక్షలో ప్రశ్నలెలా రాసిందో దగ్గరుండి విశ్లేషించేవాడు.. అలా అతని శిక్షణలో ఆమె డిగ్రీ మాత్రమే కాక బీ.యీ.డీ కూడా పాసయి గవర్నమేంట్ టీచర్ గా ఉద్యోగం సంపాదించింది.
భర్తకి అతనికిష్టమైన పుస్తకాలను, తనకిష్టమిన కానుకలనూ ఇచ్చింది.. “ఇంకేం గురుదక్షిణ ఇవ్వమంటారు గురువుగారు?” అని తమషాగా అన్న ఆమె మాటలకి అతను మనసారా నవ్వాడు..
" నువ్వు శ్రద్ధగా చదవాలని అప్పుడలా అన్నాను కానీ ఎంచుకున్న వృత్తిలో నువ్వు రాణిస్తే చాలు, అంత కన్నా నాకు మరే దక్షిణ వద్దు" అన్నాడు..
ఇందిర చాల అంకిత భావం తో పాఠాలు చెప్పేది. గవర్నమెంట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకేమాత్రమూ తీసిపోవని అందరికీ తెలియ చెప్పాలని ఆమె ప్రయత్నించేది.. చాలావరకూ సఫలీకృతురాలైంది కూడా. పిల్ల్లని ఆట పాటలతోనూ, ఇంట్లో ఉచితంగా ప్రైవేట్లు చెప్పి ఎంతో ప్రోత్సహించేది. అలా దాదాపు గా ఆరేళ్ళపాటు ఆమె కనిపెట్టిన ఎన్నో వినూత్న విధానాలకి, పధకాలకి గుర్తింపుగా ప్రభుత్వం ఆమెకి ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డ్ ప్రకటించింది.. ఆ రోజు ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు..
అవార్డ్ తర్వాత జరిగిన సన్మాన సభలో ఆమె పట్టుదలను, కార్యదీక్షను అందరూ పొగుడుతూ ఉంటే వనమాలి సంబరంగా విన్నాడు.
చివరగా ఇందిరను మాట్లాడమన్నప్పుడు ఆమె వినమ్రంగా అందరికీ కృతజ్ఞతలు సమర్పించి ' “ముదితల్ నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించిన" అంటారు కదా, అది నావిషయం లో నిజం..
ఎప్పటికైనా చదువుకోవాలన్న నా కలని సాకారం చేసినది నా భర్త శ్రీ వనమాలి గారు. ఆయన ప్రోత్సాహం, శిక్షణ లేకపోతే నేనీరోజు చూడగలిగేదాన్ని కాదు.. నా అభివృద్ధిని కాంక్షించడమే కాక సదా నా వెన్నంటి నడిచిన సహచరుడయన.. నాకందే ఏ అవార్డైనా,రివార్డైనా మొదట చెందేది ఆయనకే, ఆతర్వాత మాత్రం అంతా నాకే. ఎందుకంటే ఆయన చెప్పినట్టు వింటూ, మంచి విద్యార్ధిలా చక్కగా చదువుకున్నాను కదా మరి! అంటూ నవ్వింది.. సభికుల హర్షధ్వానాల మధ్య..
తలపుల తలుపులు తెరుచుకున్నాయి
పిల్లల పసితనపు చేష్టలూ, ముద్దు మాటలూ, పాటలూ దాటి....
ఒకటి నుండీ పది లెఖ్ఖ పెట్టే సరికి లేవాలి. ఒకటీ... నాలుగూ... ఎనిమిదీ.. పదీ... ఇంకా లేవలేదా, ఏమిటీ లేటు... అంటున్నట్లే వుంది.
ఇల్లంతా బట్టలు పడేసి, పుస్తకాలు విరజిమ్మి, షూస్ సాక్స్ విసిరేసి, ఇల్లంతా చెత్త చెత్త చేసేవారు.
హోమ్ వర్క్ చేసారా, వీణ వాయించుకోండీ, అల్లరి చేయకండీ, కొట్టుకోకండీ, కోర్టు సీన్లు ఎందుకూ? ఇక్కడ పెట్టిన జీడి పప్పూ కిస్మిస్ ఏవీ. ఇదిగో ఈ కొబ్బరి పచ్చడి చేయాలి, తినేయకండి. మూతికి ఏమిటీ అంటుకుందీ హార్లిక్సేనా? ఆ దశా దాటింది.
కాలేజ్ కి జాగ్రత్తగా వెళ్ళి రండి, మంచి వాళ్లతో స్నేహం చేయండి, బాగా చదువుకుని పైకి రావాలి. వీణ బాగా వాయించి మన ఇంటి పేరు నిలపాలి....
హమ్మయ్యా బాగా స్థిర పడ్డారు. మంచి పిల్లలను చూసి పెళ్ళిళ్ళు.
అరే! వీళ్ళు మన దగ్గర నుండి దాటుకుని వారి వారి గువ్వలతో మన గూడు విడచి వారి వారి గూళ్ళకు చేరుకున్నారా?
ఇంకా అరుస్తున్నట్లే వుంది వారి మీద. కాలం వేగంగా కదిలి పోయింది. ఇప్పుడు ఇల్లంతా శుభ్రంగా, ప్రశాంతంగా ఎక్కడి వస్తువులక్కడే మనం కోరుకున్నట్లు.
కానీ ఆ సందడేదీ,ఆ సంతోషమేదీ. సారాంశం ఏమంటే పిల్లల బాల్యాన్ని ఆస్వాదించండి, ఆనందించండి. వారి బాల్యం "మనకు కూడా" తిరిగి రాదు.
ముందు ముందుకు వచ్చేసాం.
ఇప్పటి ఆనందం ఇప్పటిది. ఇప్పుడూ. అప్పుడూ....ఎప్పుడూ ఆనంద భరితమే జీవితం.
ఏమీ తోచక మళ్ళీ పాడిందే పాడరా .........పళ్ళ దాసరీ అన్నట్లు పాత చింతకాయ పచ్చడే....... మీ ఇష్టం చదవకపోయినా ఫర్లేదు, ఏహేమీ అనుక్కోను, ఇక మీ ఇష్టమే ఏం చేస్తారో చెయ్యండి......
అల్లిబిల్లి చందమామ ఈ చిన్నారి.............
చిన్ని బాలుడే కానీ..... ఆకాశంలో ఎగరాలని, (పక్షిలాగా), మబ్బులతో నడయాడాలనీ, కాళ్ళకి లేపనాలు పూసుకుని ఆకాశ గమనం చెయ్యాలని, కుక్కపిల్లల మీసాలు పీకాలని, ఇంటికొచ్చిన వారి చెప్పులు దాచేసి వారు వెతుక్కున్టుండగా మళ్ళీ తెచ్చి ఇవ్వాలనీ, ఇలా ఏవేవో చిలిపి తలపులు ఆ బాలుడికి మదిలో వెల్లి విరిస్తుంటాయి......
ఇక అసలు విషయానికి వద్దాం......
ఒక సారి ఆ బాలుడింటికి వారి మేనమామ వచ్చేరు. ఇక మన చిన్నారికి ఆనందం హద్దులు లేకుండా పొయ్యింది. ఆ వచ్చినాయన బాగ్ లోంచి పేస్టు బ్రష్ తీసుకుని, బ్రష్ మీదా పేస్టు పెట్టుకుని, బ్రష్ చేసుకుందుకు వెళ్ళేరు.
మన బాలుడికి పేస్టు వాసన చూసి అది స్ట్రాంగ్ పిప్పెర్మేంట్ వాసనలా ఉంది అనిపించింది. అంతే బుర్ర పరి పరి విధాల ఆలోచించింది.
కొంచెం తీసుకుని అలమారాలో రౌండ్గా బిళ్ళల లాగా అంటించుకుని (ఆరేక స్ట్రాంగ్ పిప్పెర్మేంట్స్ అవుతాయనే భావన, భ్రమతో) ఆరేక ఆ స్ట్రాంగ్ బిళ్ళలు తినచ్చని భావించాడు.
ఇంతలో బుర్రలో మరో ఆలోచన తళుక్కున మెరిసి మొహానికి పూసుకుంటే తెల్లగా స్నోలాగా ఉంటుంది కదా అని మొహానికి పూసుకున్నాడు.
మొహం మండి పోతోంది, ఇంతలో మేనమామ పని పూర్తి చేసుకుని వచ్చి చూసి విషయం అర్ధం చేసుకుని ఒళ్ళు మండి కొట్టాలని పించినా మళ్ళీ బాగుండదని (కాబోయే అల్లుడని) నిస్సహాయంగా చాలా ఎక్కువగా ముద్దు లాడి ఏడుపు మొహం పెట్టుకుని ఊరుకున్నారు.
వచ్చిన గెస్ట్ ఊరుకున్నా, వాళ్ళ నాన్నగారూరుకుంటారా? ఊరుకోలేదంతే...ఊరుకోలేదు......
నిరంతర స్వర రస వాహిని .....
ఆ..... అదేంటి 🤔 ... ఇవాళ పోస్టింగ్ చేయాల్సిన వాళ్ళు మిస్ అయ్యారా😮..
మరి మేడం వెంటనే వేరే వాళ్ళతో పోస్ట్ చేయిస్తారు కదా.....అసలు ఏ ఇబ్బంది వల్ల మిస్ అయ్యారో పాపం వాళ్ళు🙁... అయినా మేడం అర్ధం చేసుకుంటారులే.... వెంటనే ఎవరో ఒకళ్ళు backup కూడా ఉంటారూ..... ....
మరి ఎవరూ పోస్ట్ చేయలేదేంటి చెప్మా.🤔.... ఏవేవో పోస్టులు ఉన్నాయేంటి...
అమ్మో.... గురువుగారి పోస్ట్ 😳 ..... ఏదో tricky ఆక్టివిటీ ఇచ్చుoటారు... ఈజీ అనిపిస్తుంది కానీ చేయొచ్చేప్పటికి ముందుకు సాగదు... 😒🙈
ఇదీ వరస.... గ్రూప్ ఓపెన్ చేయగానే, ఒక్క క్షణం కాలం పాటు నా ఆలోచనలు పొద్దున్నే గిరా గిరా తిరిగాయి .... ఆ తర్వాత తట్టింది మరి అసలు విషయం .... నిన్ననే వర్ణోత్సవం అయిపోయింది అనీ .... అందరం ఒకళ్లకొకళ్ళు వాళ్ళ మనోభావాల్ని ఆడపిల్ల పెళ్లి అయ్యి వెళ్లిపోయినంత (అంటే బాధ ఆనందం కలగలిసిన భావం) భారంగా ఫీల్ అయ్యి పంచుకున్న సంగతి .... హ్మ్మ్......
అయిపోయిందా .....
40 రోజుల పాటు ..... కాదు కాదు. ... వాగ్గేయకార కదంబం, వర్ణోత్సవం ..... ఇలా పేర్లు ఏవైనా, దాదాపు 3 నెలల పాటు నిరాటంకంగా శిష్య ప్రశిష్యులతో గురువుగారూ, మేడం గారు చేయించిన నిత్య సంగీత సాధన (కాదు *సంగీత పూజ* *నాద పూజ* ) ......
వాగ్గేయకరులకు, రాగములకు సంబంధించిన ఎన్నెన్నో కొత్త కొత్త విషయాలతో, ఎప్పుడూ వినని ఎన్నెన్నో అందమైన వివిధ రకములైన వర్ణాలతో, చక చక్కని చిన్న పిల్లల దగ్గరనుండి vintaged సీనియర్ స్టూడెంట్స్/ఆర్టిస్ట్స్ వరకూ ఎవరికెవ్వరూ తీసిపోనట్టు పాడి, వాయించి, ఈ సమూహాన్ని నాదమయం చేసి, సంగీతం లో ఓలలాడించిన వర్ణోత్సవం అయిపోయిందా ..... హ్మ్మ్.... అయిపోయింది .... ఫైనల్లీ నా మనసుకి అర్ధం అయింది ....
ఒక మంచి ఆలోచన చేసి, దానికి ప్రాణం పోసి, దానిలో శిష్యులందరిని భాగస్వామ్యులని చేసి, అందరినీ అలరించేలా ఒక కార్యక్రమాన్ని రూపొందించి, ప్రతి నిముషం ఎక్కడా ఏదీ చెదరకుండా, చివరిదాకా అనుకున్నది అనుకున్నట్టు జరిగేలా చూసి సంగీత నాదామృతాన్ని శిష్యులందరికీ సమానంగా పంచిన గురువుగారికి, మేడం గారికి, పాదాభివందనాలు.
సంగీతానికి సంబంధించిన 3 important aspects, రాగ లక్షణం, నోటషన్, పెర్ఫార్మెన్స్ ఇలా అన్నిటిని అనుసంధాన పరిచేలాగా ఒక అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని రూపొందించి, శిష్యులందరికీ ఒక కష్ట తరమైన ఛాలెంజ్ ఇచ్చి తద్వారా వారి సాధనా పటిమని, ధైర్యాన్ని పెంచి, వాయింపించి, పాడించి, అందరికీ వినిపించి, విని ప్రోత్సహించి, ఎడతెరిపి లేకుండా మాతో నడిచి, మమ్మల్ని నడిపి ఈ సంగీత ప్రయాణంలో ఎన్నోవిషయాల్ని తెలుసుకొనేలా చేసి, ఒక మెట్టు ఎక్కాము అనిపించి ఎంతో ఎంతో తృప్తినిచ్చారు. ఇది ఒక మామూలు గ్రూప్ కాదు, మీరు మామూలు గురువులు కాదు, మాకు మీరొక లైట్ హౌస్ .... సంగీతానికి పవర్ హౌస్ లాంటి వాళ్ళు మీరు గురువుగారూ,మేడం గారు ....
రైతు నెలల తరబడి కష్టపడి పండించిన పంట చేతికి రాగానే ఎంతో సంతోషపడిపోతాడు ... కానీ అదే పంట ఎప్పటికీ సరిపోదని తనకి తెలుసు ....
అందుకే వెంటనే తదుపరి పంట గురించి ఆలోచిస్తూ ప్రణాళికలు వేస్తూ ఉంటాడు. అలా మీరు మరొక ప్రాణాళికతో సిద్ధంగా ఉన్నారని కుడా అర్థమయుయింది ..అందుకే సంగీత కృషీవలురు మీరిద్దరూ.... అందుకే మీకు సహస్ర పాదాభివందనాలు...
ఏదో గ్రూప్ ఉందంటే ఉంది, పాడామంటే పాడాము, వాయించాము అంటే వాయించాము అన్నట్టు ఉన్నాయి కొన్ని గ్రూపులు (నేనున్నాను అలాంటి ఒకటి రెండింటిలో) కానీ మన గ్రూప్ అన్నిటికి మించి ఒక వేరే లెవెల్,.. మమ్మల్ని ఇలా ఇంత వైవిధ్యభరిత్ గా సంగీతం లో ఎంగేజ్ చేస్తూ ఉండే మీ వంటి గురువులు ఉండటం మా జన్మ జన్మల అదృష్టం ... 🙏🙏🙏🙏
లోగోని చేసిన హిమజ నరసింహదేవర గారు, ప్రణాళిక తయారుచేసిన అనురాధ దర్భ గారు ఈ కార్యక్రమానికి తమ వంతు సహాకారాన్ని అందించే అదృష్టం పొందారు ... కృతజ్ఞతాభివందనాలు
ఇక శోభామాధవి గారు, .. అపురూపమైన రాగ లక్షణాలు ప్రెజెంట్ చేశారు, ఎంతో రీసెర్చ్ చేసి, ఎన్నో కొత్త విషయాలతో, మరెంతో valuable information ని పంచారు, ఎప్పటికి ఉండిపోయేలా నోటషన్ ని digitalise చేసి మరీ అందించారు ... ఈ ప్రోగ్రాం కి ఎనలేని విలువైన contribution ఇది ... మీకు మనఃపూర్వక నమస్సులు ...
ఇక మిగతా శిష్యులందరూ వారికి అప్పగించిన బాధ్యతల్ని వాయించి, పాడి, విని అభినందనల్ని తెలిపి ఆ కార్యక్రమానికి encouragement ని ఇచ్చారు ... శ్రోతలు లేకపోతే ఎవరికోసం పాడాలి, ఎవరికోసం వాయించాలి ... అందుకే అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
గురువుగారూ, మేడం గారు, ఈ కార్యక్రమాల ద్వారా మీరు మాకు అందించిన సంగీత జ్ఞానాన్ని మేము నెమరు వేసుకుని మస్తిష్కంలో నిలుపుకుంటాము.... మా కోసం మీరు రూపొందించిన మరొక కార్యక్రమం మొదలయ్యేవరకూ....
🙏🙏🙏🙏
వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతి పత్తయే ! జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ !
🙏🙏🙏
గుండె గొంతుకలో కొట్లాడుతోంది ఏమని? మనస్సులో కలిగిన భావం ఇక్కడ రాయమని.
50 సంవత్సరాల వైవాహిక ప్రణయ ప్రయాణం. జీవితాన్ని గడప లేదు, జీవితంలో జీవించాం. ఉన్నదానికి సంతృప్తి చెందడం, ఆకాశానికి నిచ్చెనలు వేయకపోడం, ఎవరితోనూ పోల్చి చూసుకోకుండా, అందరితో స్నేహభావంతో, సంస్కృతితో, సంస్కారయుతంగా మెలగడమే మా జీవన విజయ రహస్యము.
ఎత్తుపల్లాలు లేవు. హాయిగా సాగి పోతోంది. కారణం....... 👇
నా జీవన సహచరుడు, నేస్తం, గురువు అయిన శ్రీ శ్యామసుందరం గారు.
మా ఇద్దరి తనువులు వేరైనా తలపులూ, వాక్కూ ఒకటే.
నాకు విద్య చెప్పి, విద్యలో మెళుకువలు నేర్పి, నన్ను కళాకారిణిగా రూపొందించి, నాకూ ఈ సంగీత ప్రపంచంలో చిన్ని స్థానాన్ని ఏర్పరిచిన గురువు ఆయన.
అలాగే నా జీవన సహచరుడుగా, తన సరసన కూర్చొని సన్మాన సత్కారాలను అందుకనే సదవ కాశం నాకు ఇచ్చేరు. నాకున్న అర్హత కన్నా మిన్నగా నాకు సమాజంలో గుర్తింపు నిచ్చేరనేది నా భావన.
అన్నిటికన్నా మా భావన “మేమిద్దరం ఒకరికి ఒకరం నేస్తాలమని” ఇది ముమ్మాటికీ నిజం. అడవిలో ఉన్నా ఫరవాలేదు, మేమిద్దరం ఉంటే చాలు అలా కబుర్లే కబుర్లు. తను ఎంతటి పెద్ద వారో నాకు తెలీదు నా నేస్తం అంతే .
నాకు ఇది కావాలి అని అడిగిన దాఖలాలు లేవు., తానే సర్వం ఏర్పాటు చేస్తారు. ఇక జీవితం నల్లేరు మీద బండిలా ఎంత సాఫీగా సాగుతుందో ఆలోచించండి.
ఇక పిల్లలు.....
అందరి తల్లిదండ్రులలాగానే మేము కూడా మా పిల్లలు ధనార్జనలో కన్నా, జ్ఞాన సముపార్జనలో ముందుండాలనీ, సజ్జన సాంగత్యం మెండుగా వుండాలనీ, సంగీత,సంస్కార, సంస్కృతీ, పరులవ్వాలని కోరుకున్నాము.భగవంతుడు అనుగ్రహించాడు. కుటుంబ సభ్యులందరూ మా ఆశయాల మేరకూ సదలవాట్లతో,సత్సాంగత్యం కలిగి, సదాచార పరులుగా జీవిస్తున్నారు.
మనకు పుట్టిన పిల్లలు మనకు కావల్సిన విధంగా పెంచుకోగలం. కానీ మా ఇంటికి పెద్ద కొడుకుగా, పెద్ద కూతురిగా వచ్చిన మా పిల్లలిద్దరూ మంచి విద్యావంతులూ, సంస్కారం, సంస్కృతి, స్నేహభావం కలబోసుకుని మా ఆశయాలకు తగినవారు.
ఇక మనవలు కూడా అదే బాటలో నడుస్తున్నారు..
మా శిష్యులు ప్రశిష్యులూ, పరిచయమైన ప్రతి ఒక్కరి అభిమాన ధనంతో, మా బాంక్ ఎక్కౌంట్లు పొంగి పొరలుతున్నాయి. ధన్యజీవులమైనాము. ఎంతో మంది అన్యోన్య దంపతుల సరసన నుంచో గలిగాము. ఎనలేని తృప్తిగా వుంది.
నెల నుండీ ప్రతీ రోజూ నా జీవిత అనుభవాలనూ, అనుభూతులనూ మీతో పంచుకున్నాను.
ఇంత మంచి జన్మనిచ్చిన భగవంతునికి నమస్కరిస్తూ.....🙏🙏🙏
"ముక్తి క్షేత్రం"
ఇప్పుడే రమా శాండిల్య గారు రచించిన ముక్తి క్షేత్రం కాశీ గురించి చదవడం అయింది. ముఖ చిత్రం, ముందు మాట కూచి గారు అద్భుతంగా చదవాలనిపించే విధంగా వేసారు, రాసారు. మరో ముందు మాట లక్ష్మి గారు రాసారు. ఇక రమా శాండిల్య గారు ఎంత బాగా రచించారో చెప్పనలవి కాడం లేదు. మొదటి సారి రాసినట్లుగా లేదు. హృదయంలోంచి వచ్చిన మాట, మన పక్కన కూర్చొని చెప్పారు.
ఇప్పటికీ 4,5 ఇప్పటికి నాలుగైదుసార్లు కాశీకి వెళ్ళాం. ఆవిడ పుస్తకంలో చెప్పినట్టుగా (నిజంగా చెప్తున్నాను మనసులో మాట,) వీధులు పరిశుభ్రంగా లేవనే అనుకున్నాను. ఎప్పుడు వెళ్ళినా మేము విశ్వేశ్వరుడి గుడి, అన్నపూర్ణాదేవి గుడిని, గంగా హారతి, కాలభైరవుని గుడి, బెనారస్ హిందూ యూనివర్సిటీ, దుర్గ దేవి గుడి ఇవే చూశాం.ఈరోజు పుస్తకం చదివాక మేము చాలా చూడలేదని తెలుస్తోంది. ఎంత వివరం రాశారు, కాదు కాదు, పక్కనే కూర్చుని చెప్పారు, అనేకంటే దగ్గరుండి చేయి పట్టుకుని చూపించారు అనాలి. సరళమైన భాషలో ఎంత చక్కగా వివరించారో చెప్పలేను. మళ్లీ ఒకసారి వారణాసి వెళ్లాలని ఉంది. ఒకవేళ వెళ్లినా, వెళ్ళలేకపోయినా ఇది చదివితే చూసినంత సంతృప్తిగానే ఉంది.అంత సవివరంగా చెప్పారు.
నేను ఎప్పుడూ పుస్తక సమీక్షలు చేయలేదు.రమా శాండిల్య గారిని కానీ, ముక్తి క్షేత్రం పుస్తకానికి కానీ నేను ప్రోత్సహించడానికి కాదు ఈ రాస్తున్నది.మనసులో కలిగిన భావం చెప్పకపోతే మనసు దొలిచేస్తోంది. ఈ పుస్తకం ప్రమోట్ చేయడానికి నేను ఎంత దానిని అండీ, విశ్వేశ్వరుడు చూసుకుంటాడు.
ఒక పుస్తకం రాయడం సులభం ఏమోగానీ, అది పుస్తక రూపంలోకి తేవడానికి చాలా వ్యయప్రయాసలు ఉంటాయి.అందరూ వీలైతే ఈ పుస్తకం కొనుక్కుని ముక్తి పొందండి .రమ గారికి మరో పుస్తకం రాయడానికి ప్రోత్సాహాన్నీ, ఉత్సాహాన్ని ఇవ్వండి. ఈ ముక్తి క్షేత్రం పుస్తకం ఎక్కడ దొరుకుతుందో నాకు తెలీదు. రమా శాండిల్య గారిని కావాలనుకుంటే మన ఫేస్బుక్ లోనే ఉన్నారు సంప్రదించండి.
పాపం నేను....
ఆ ఇంటి వాళ్ళు లోపలికి వెళ్ళి వచ్చే లోగా ఫోన్ చేసేను మా ఒకానొక ఫ్రెండ్ దేవికా రాణికి. వాళ్ళింట్లో ఫోన్ వుందంటే, నంబరు అడిగి తెచ్చుకున్నాను. అది పట్టుకుని చేసాను గబ గబా..... వినిపించదే.... అస్సలు వినపడ్డం లేదు.
ఎలా వినిపిస్తుందండీ ఎలా వినిపిస్తుందీ? మౌత్ పీస్ చెవి దగ్గరా, ఇయర్ పీస్ మూతి దగ్గర పెట్టు కుంటే. 😄😄😄😄
చాలా రోజులు పాటూ...ముందు మనం హలో అనాలా? వాళ్ళు అనేదాకా ఆగాలా? సందేహంతో తలకిందుల తపస్సు.🤔🤔🤔 .చివరికి అవమానం దిగమింగి, మొహమాటం ఒదులుకుని ఎలాగోలా నా ఆంతరంగిక ప్రియ మిత్రురాలిని రహస్యంగా అడిగితే.... నాకూ తెలీదని సమాధానం. ఎవరింట్లో ఫోన్ వుందని?. చివరికి ఎలాగోలా తెలుసుకున్నాను.
ఇప్పుడు సెల్లు హస్తభూషణం. పైగా మొన్ననే ఎంతో అపురూపంగా సంపాయించుకున్న లాండ్ లైన్ తీయించేసాము.
కాలం పెను మార్పులు తీసుకు రావచ్చు, కానీ జ్ఞాపకాలు మటుకూ మనం వున్నంత వరకూ మనతోనే పదిలంగా వుంటాయి. ఏమంటారు?
(ఆ గతానికి స్వాగతం)....
నేనే ఉమాదేవిని. ఎందుకూ అంత ఆశ్చర్య చకితులవుతున్నారు. ఇంత మంది నా వాళ్ళు నాకిష్టమైన సంగీతం పాడుతుంటే నేను ఎక్కడకెళ్లగలను చెప్పండి, ఇక్కడే మీ మధ్యే తిరుగుతున్నా. మా అక్క మీ అందరినీ పాడమంది కదా, నేను కూడా నా చిన్ని శిష్యుడు బబ్లూతో కలసి పాడుతాను, విని మీ
అభిప్రాయాలు చెప్పాల్సిందే.
నా గురించి...
నాకు ప్రకృతి ఇష్టం, అందమైనవి ఏమైనా ఇష్టం, వంటలిష్టం, పాటలు, మాటలు,చీరలు, నగలు, నవ్వులు, పువ్వులు, మనషులు, మమతలు, ఆటలూ, అందంగా తయారవ్వడం. వేయేల నాకు ఈ మానవ జన్మ ఇష్టం.
కానీ భగవంతుడు నన్ను ( 18 వ ఏటనుండి) కేవలం బాధల్ని భరించడానికే పుట్టించినట్లున్నాడు... అయినా చెదరని చిరునవ్వుతో జీవితపు challenges ని నా భర్త సహకారంతో ఎదుర్కొంటూ.....నలుగురికీ నా సంగీత విద్యనే పంచి.... బాధలని..... భావోద్వేగాలనీ నాతోనే తీసికెళ్ళిపోయాను సెప్టెంబరు 2019 లో ... అంత వరకూ, "మేమే బాధలు పడిపోతున్నాం అనుకునే ఎవ్వరైనా నా నుండి ఎంతైనా నేర్చుకోవాలి" అనే విధంగానే బతికాను. .... అందరికీ ఆనందం పంచి, అందులోంచి నా ఆనందాన్ని వెతుక్కున్నా.
మీ అందరికీ " పుత్తడి బొమ్మ పూర్ణమ్మ" పాట తెలుసుగా. అందులో పూర్ణమ్మలా అడుగుతున్నా " మీ అందరూ కలసి నప్పుడు ఒకసారి ఈ ఉమపిన్నిని తలచుకోండి"......
అది 1972. మా నాన్నగారు నవగ్రహ కీర్తనలూ, కొన్ని సర్వ దేవతలనూ స్తుతిస్తూ కీర్తనలూ రచించారు. ఆయన సంస్కృతమూ, జ్యోతీష్యమూ అభ్యసించడము వలన వాటిని అన్వయిస్తూ కృతులు రచించారు. తరువాత ఒక దశకం పాటూ ఇవి వెలుగు చూడ లేదు.
తరువాత తను వీటిని స్వయముగా వాయించి త్యాగరాజ గాన సభలో ఆవిష్కరించారు.
వీటిని పుస్తక రూపంలో తీసుకు రమ్మని గురువు గారిని పదే పదే కోరేవారు.
కళ్యాణి పెళ్ళి సమయంలో అత్యంత క్లిష్టమైన పనుల ఒత్తిడిలో కూడా గురువు గారు ప్రతీ రోజూ ప్రింటింగ్ ప్రెస్ లో స్వయంగా కూర్చొని కంపోజ్ చేయించి, దానిని పుస్తక రూపంలో ముద్రించి, పెళ్ళిలో పుస్తరావిష్కరణ చేయించారు. కళ్యాణి పెళ్లి రిసెప్షన్ ఒక పండిత సభలా వుంది.
మళ్ళీ ఒక రెండు సంవత్సరాల తర్వాత అవి సిడీ రూపంలోకి తీసుకు వచ్చారు గురువు గారు. మా చెల్వెలు మా అమ్మగారిని " అమ్మా మీకు ఇంకో కూతురు వుంటే పెళ్ళి చేస్తారు కదా" అలా అనుక్కుని ఖర్చు పెట్టు, నాన్నగారు వుండగా బావ లాంటి విద్వాంసుని సహకారంతో వాటికి వెలుగునిప్పిస్తే నాన్నగారు వుండగా విని సంతోషిస్తారు, పాట రూపంలో అయితే సాహిత్యం అర్ధ మవుతుందని సిడీ చెయ్యడానికి ఖర్చు పెట్టించింది. దాని వల్లే ఇంత ప్రాచుర్యం పొందుతున్నాయి.
ఇక అసలు విషయం... అవన్నీ పాడించడానికి గురువుగారు మా నాన్నగారి అంగీకారం తీసుకుని నవగ్రహాల కృతులు మొత్తం రాగాల ముద్దలుగా, పాడటానికి అనువుగా తన బాణీలో మార్చేసారు. వెరసి ఏమైందీ? మా నాన్నగారి సాహిత్యం, వారు సూచించిన రాగంలో గురువుగారి స్వర రచనతో రూపొందాయన్నమాట. విజయవాడలో మల్లాది వాళ్ళూ, మోదుమూడి దంపతులూ, విష్ణుభొట్ల సరస్వతీ, మండా కృష్ణ మోహన్, నర్సమ్మ ( మల్లిక్ గారి మనవరాలు) పాడడం గురువుగారు వీణ, పాలపర్తి వారు వైలిన్, ఫల్గుణ్ మృదంగంతో ముందు నవగ్రహ స్తోత్రంతో అద్భుతమైన నవగ్రహ కృతులు ఏర్పడ్డాయి. దీనికి ముందు మాట బాలమురళీ గారు రచించారు.
దీక్షితార్ కృతులతో సమాన స్థాయిలో, రాగాల ముద్దలు, ఉత్సాహంగా సాగే ఈ నవగ్రహ కృతులు నేర్చుకొనినా,వినినా మీ అందరూ ఆయా గ్రహాల కృపకి పాత్రులవుదురు గాక!
నవగ్రహ కృతులు పరి సమాప్తి అయిన సందర్భంగా మీతో నా అంతరంగం పంచుకున్నాను.
ఇకపై ఎప్పుడో సర్వ దేవతా స్తుతి...
"మౌనమే నీ భాష ఓ మూగ మనసా" అన్నట్లు...... భాష కందని భావం. ఎంతమంది మమ్మల్ని ఆశీర్వదించేరో, ఎంత మంది శుభాకాంక్షలు అందించేరో అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు.
ఆత్రేయ గారు అన్నట్లు "నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళు వస్తాయి" అని, నాకు కూడా కన్నీళ్ళు వస్తున్నాయి. ఏడుపుతో కాదండీ బాబూ! ఆనందంతో. వాటినీ " ఆనంద భాష్పాలు" అంటారు లెండి....
ఈ కార్యక్రమాన్ని ఎంతో సుందరంగా, సుమనోహరంగా తీర్చి దిద్దిన ప్రతీ ఒక్కరికీ (ముఖ్యంగా సంకల్పించిన నా చెల్లెలు ఉమాదేవి, దానిని అందంగా ఆచరణలో పెట్టిన నా భర్త శ్రీ శ్యామసుందర్ గారికి) ధన్యవాదాలు.
ఇంతమంది స్నేహితులు, శిష్యులూ, బంధువులూ ఆత్మీయులను సంపాయిన్చుకున్నామనే భావన చాలా త్రుప్తినిస్తోంది.
ఇంతకనా పరిపూర్ణత ఏముందండి జీవితానికి.
రోజూ రాయడం అలవాటయి పోయి చేతులు...........పుట్టేస్తున్నాయి. ఏం చెయ్యాలబ్బా? సరే ఎదో ఒకటి చేద్దాంలే. అయినా నా వీణో, మళ్ళీ వీణ వాయిన్చుకోవాలి.. అసలే ఈ మధ్య "ఊహూ! అస్సలు......... లేదు" అయినా గురువుగారు ఊరుకోరుగా.
అయినా నాకు మరీ ఉబలాటం ఎక్కువైతే రాసేస్తా, తప్పదు మీరు చదవక............
తృప్తి
అంతులేని తృప్తిగా వుంది. సంకల్ప శుధ్ధి వుంటే సంకల్ప సిధ్ధి కలుగుతుంది.
ఎప్పుడూ ఆకాశానికి నిచ్చెనలు వేయ లేదు. అందరి తల్లిదండ్రులలాగానే మేము కూడా మా పిల్లలు ధనార్జనలో కన్నా, జ్ఞాన సముపార్జనలో ముందుండాలనీ, సజ్జన సాంగత్యం మెండుగా వుండాలనీ, సంగీత,సంస్కార, సంస్కృతీ, పరులవ్వాలని కోరుకున్నాము.భగవంతుడు అనుగ్రహించాడు. ఇద్దరు పిల్లలూ వారి కుటుంటుంబ సభ్యులతో సహా మా ఆశయాల మేరకూ సదలవాట్లతో,సత్సాంగత్యం కలిగి, సదాచార పరులుగా జీవిస్తున్నారు.
చాలు ఈ జన్మకి ఈ వరం భగవంతుడా! నీకు వేవేల ప్రణామాలు 🙏🏽🙏🏽🙏🏽
ఆత్మహత్యా యత్నం.....
మీరు నమ్మరు కదా! నిజం ఒట్టు!
ఈ రోజు మా ఇంట్లో బియ్యం, కుక్కర్ లో వున్న అన్నం గిన్నెలోంచి చుట్టూ వున్న బావి లోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.
అయినా దానికి జవ జీవాలనిచ్చి (మొన్న చెప్పేను కదండీ మన తప్పు మనమే అనుభవించాలని) ముద్ద పప్పు, పులుసన్నం, పెరుగుకు వాడుకున్నాను.
మా వారు అన్నారు....రేపు అన్నం నీ చేజిక్కకుండా కుక్కర్ విజిల్ ఎగిరి పోయి,అన్నం అంతా కన్నం లోంచి మింట కలవాలని, అప్పడెలా దానికి జీవాన్నిచ్చి కాపాడుతావన్నారు?
ఆ పరిస్ధితే కనుక ఎదురవుతే ఏమి చేసి దానికి జీవాన్నివాలో ఉపాయం చెప్పరూ ప్లీజ్!
"ఇల్లు"
మీరందరూ మా ఇంటిని గూర్చి రాస్తాననుక్కుంటున్నారని బెట్. అవునా కాదా? చెప్పండీ...
సర్లెండి నేనే చెప్పేస్తా.... తెల్లవారు ఝూమున 4 గంటలకు మెళుకువ వచ్చి, వెంఠనే యధావిధిగా యూట్యూబ్ తెరిచా....
వసంత వల్లరి (వసంత లక్ష్మీ అయ్యగారి ఛానల్) లో " ఇల్లు" అని కథ చదివారు, కాదు కాదు చెప్పేరు వసంతలక్ష్మీ అయ్యగారి. రాసిన వారెవరో తెలుసా?.తన కథలతో గుండె లోతులలోని భావాలను సృశించే బలభద్రప్రాత్రుని రమణి గారు. ఎంత అద్భుతంగా రాసారో. బహుశః సినీమా స్క్రిప్ట్ రైటర్ గా విశేషానుభవం వల్లనేమో కథ కంటి ముందు కదలాడింది. వీరి ఇతర కథలు కూడా చాలా చదివాను ఎంత సజీవంగా మన అనుభూతులను మేల్కొలుపుతాయో.
రమణిగారూ మీ పేరు కంటే మీ ఇంటి పేరే ఘనంగా వుంది సుమా! ఇంతకీ మీ ఇంటి పేరు సరిగ్గానే రాసానా అని అనుమానం.
ఇక యూట్యూబ్లో "వసంత వల్లరి" ఇంతక ముందు వినని వారుంటే జరూర్ గా జాయినయిపోండి. కథ చదవఖర్లేదు. "మన చెవులకి కళ్ళు వస్తాయి" వసంత వల్లరి వింటుంటే. మన చెవులలో రకరకాల పాత్రలు సజీవంగా ఒకే వ్యక్తి గాత్రంలో వింటూకంటాము. వసంతలక్ష్మీ అయ్యగారి, కధను నాటకీకరణ చేసి వినిపిస్తున్నారు. అంటే అరటిపండు ఒలచి నోట్లో పెడుతున్నారు. కానీండి ఆ ఛానల్ సబ్ స్కైబ్ చేసి వినండి.
నేను ఆస్వాదిస్తున్న విషయం మీరూ ఆనందించాలని తపన.
ఇదిగో మీ కోసం " ఇల్లు" 👇