23, అక్టోబర్ 2022, ఆదివారం

 తలపుల తలుపులు తెరుచుకున్నాయి


పిల్లల పసితనపు చేష్టలూ, ముద్దు మాటలూ, పాటలూ దాటి.... 


ఒకటి నుండీ పది లెఖ్ఖ పెట్టే సరికి లేవాలి.  ఒకటీ... నాలుగూ... ఎనిమిదీ.. పదీ... ఇంకా లేవలేదా, ఏమిటీ లేటు... అంటున్నట్లే వుంది. 


ఇల్లంతా బట్టలు పడేసి, పుస్తకాలు విరజిమ్మి, షూస్ సాక్స్ విసిరేసి, ఇల్లంతా చెత్త చెత్త చేసేవారు. 


హోమ్ వర్క్ చేసారా, వీణ వాయించుకోండీ, అల్లరి చేయకండీ, కొట్టుకోకండీ, కోర్టు సీన్లు ఎందుకూ? ఇక్కడ పెట్టిన జీడి పప్పూ కిస్మిస్ ఏవీ. ఇదిగో ఈ కొబ్బరి పచ్చడి చేయాలి, తినేయకండి. మూతికి ఏమిటీ అంటుకుందీ హార్లిక్సేనా? ఆ దశా దాటింది. 


 కాలేజ్ కి జాగ్రత్తగా వెళ్ళి రండి, మంచి వాళ్లతో స్నేహం చేయండి, బాగా చదువుకుని పైకి రావాలి. వీణ బాగా వాయించి మన ఇంటి పేరు నిలపాలి.... 


హమ్మయ్యా బాగా స్థిర పడ్డారు. మంచి పిల్లలను చూసి పెళ్ళిళ్ళు.


 అరే! వీళ్ళు మన దగ్గర నుండి దాటుకుని వారి వారి గువ్వలతో మన గూడు విడచి వారి వారి గూళ్ళకు చేరుకున్నారా? 


ఇంకా అరుస్తున్నట్లే వుంది వారి మీద. కాలం వేగంగా కదిలి పోయింది. ఇప్పుడు ఇల్లంతా శుభ్రంగా, ప్రశాంతంగా ఎక్కడి వస్తువులక్కడే మనం కోరుకున్నట్లు. 


కానీ ఆ సందడేదీ,ఆ సంతోషమేదీ. సారాంశం ఏమంటే పిల్లల బాల్యాన్ని ఆస్వాదించండి, ఆనందించండి. వారి బాల్యం "మనకు కూడా" తిరిగి రాదు. 

  ముందు ముందుకు వచ్చేసాం.

 ఇప్పటి ఆనందం ఇప్పటిది. ఇప్పుడూ. అప్పుడూ....ఎప్పుడూ ఆనంద భరితమే జీవితం.

 ఏమీ తోచక మళ్ళీ పాడిందే పాడరా .........పళ్ళ దాసరీ అన్నట్లు పాత చింతకాయ పచ్చడే....... మీ ఇష్టం చదవకపోయినా ఫర్లేదు, ఏహేమీ అనుక్కోను, ఇక మీ ఇష్టమే ఏం చేస్తారో చెయ్యండి......


అల్లిబిల్లి   చందమామ  ఈ  చిన్నారి.............


    చిన్ని  బాలుడే  కానీ..... ఆకాశంలో   ఎగరాలని,   (పక్షిలాగా),  మబ్బులతో  నడయాడాలనీ, కాళ్ళకి  లేపనాలు  పూసుకుని  ఆకాశ  గమనం  చెయ్యాలని,  కుక్కపిల్లల  మీసాలు  పీకాలని,  ఇంటికొచ్చిన  వారి  చెప్పులు  దాచేసి  వారు   వెతుక్కున్టుండగా  మళ్ళీ తెచ్చి  ఇవ్వాలనీ,  ఇలా  ఏవేవో  చిలిపి  తలపులు  ఆ  బాలుడికి  మదిలో  వెల్లి విరిస్తుంటాయి......


      ఇక  అసలు  విషయానికి  వద్దాం......


 ఒక  సారి  ఆ  బాలుడింటికి  వారి  మేనమామ   వచ్చేరు.  ఇక  మన  చిన్నారికి  ఆనందం  హద్దులు  లేకుండా  పొయ్యింది.  ఆ  వచ్చినాయన  బాగ్  లోంచి  పేస్టు  బ్రష్  తీసుకుని,  బ్రష్  మీదా  పేస్టు  పెట్టుకుని,  బ్రష్  చేసుకుందుకు   వెళ్ళేరు.


     మన  బాలుడికి  పేస్టు  వాసన  చూసి  అది స్ట్రాంగ్  పిప్పెర్మేంట్   వాసనలా  ఉంది  అనిపించింది.  అంతే  బుర్ర  పరి పరి  విధాల  ఆలోచించింది. 


 కొంచెం  తీసుకుని అలమారాలో  రౌండ్గా   బిళ్ళల  లాగా  అంటించుకుని  (ఆరేక  స్ట్రాంగ్  పిప్పెర్మేంట్స్ అవుతాయనే  భావన, భ్రమతో) ఆరేక  ఆ   స్ట్రాంగ్  బిళ్ళలు తినచ్చని  భావించాడు.


    ఇంతలో  బుర్రలో  మరో  ఆలోచన   తళుక్కున  మెరిసి  మొహానికి  పూసుకుంటే  తెల్లగా  స్నోలాగా  ఉంటుంది కదా  అని  మొహానికి  పూసుకున్నాడు.


 

  మొహం  మండి  పోతోంది, ఇంతలో  మేనమామ  పని  పూర్తి  చేసుకుని  వచ్చి చూసి విషయం  అర్ధం  చేసుకుని ఒళ్ళు  మండి  కొట్టాలని  పించినా  మళ్ళీ   బాగుండదని  (కాబోయే  అల్లుడని)   నిస్సహాయంగా  చాలా  ఎక్కువగా  ముద్దు  లాడి  ఏడుపు  మొహం  పెట్టుకుని  ఊరుకున్నారు.


  వచ్చిన  గెస్ట్  ఊరుకున్నా,  వాళ్ళ  నాన్నగారూరుకుంటారా?  ఊరుకోలేదంతే...ఊరుకోలేదు......