27, జూన్ 2019, గురువారం

చిరునవ్వుకు చిరునామా

చిరునవ్వు కు  చిరునామా - చిన్నారి  చిలిపి నవ్వు ల  లాస్య.
అందాల యువతివి  - సార్థక  నామధేయవతివి.
కల్యాణీ క్రృష్ణ ల  గారాల  తనయ  -  జ్యోస్యుల వంశస్థుల  జీవన జ్యోతివి.
సంగీతజ్ణుల  ఇంటి గారాల మనుమరాలివై, " పువ్వు  పుట్ఠగనే  పరిమళించెనట్లు"   సంగీతమే  "ఓనమాలు"  గా
సాక్షాత్తు సరస్వతీ పుత్రులు సంగీత నిథి,  అపర త్యాగబ్రహ్మ , తాతగారు గురుదేవులై   ప్రేమగా  నీచే  వీణ  మీటించగా,
సంగీత సరస్వతి  అమ్మమ్మ  లాలనగా  మథుర  శ్రుతి  పలికించగా,
మాతృదేవత   మమతానురాగాలతో  నిత్యము సాథన చేయించగా,
పిత్రృదేవుని  ప్రేమానురాగాలు పొందుతూ,
సంగీత  జ్ఞాని  మామయ్య  ముద్దుల మేనకోడలివై,
తరతరాల సంగీత కుటుంబ వారసురాలివై,
ఈతరం  యువతరానికి  మార్గదర్శకురాలివై,
సంగీత సరస్వతి వై - తరగని పెన్నిధి వై,
నవ యువతకు  ప్రతినిథివై - దిక్సూచి వై,
అందము‌, సౌజన్య, సౌశీల్యాలు  తొణికిసలాడగా,
సదా చిరునవ్వు తో  వినయ విథెయతలే  నీ చిరునామా గా,
రాబోయే  సంగీత ప్రపంచానికి  మకుటం లేని మహారాణివై,
జగద్విఖ్యాతులు, సంగీత దిగ్గజములైన  తాత - అమ్మమ్మల  పేరు  - ప్రతిష్టలు  మరింత   ఇనుమడింప  చేసేలా   ముందుకు  తీసుకువెళుతూ,  దేదీప్యంగా , లాస్యంగా  వెలుగొందే   తెల్ల గులాబీ  బాల-చిరునవ్వుల  పూబాల  లాస్య.

.....నీరజ హరి.

గులాబీ బాల

మా గులాబీ బాల  kindergarten graduation కి వెళ్ళింది మొన్నీ మధ్యే కదా! అరే అప్పుడే  High school graduation  వచ్చేసిందా ఈ రోజు. రోజులెంత వేగంగా పరుగెడుతున్నాయి.

ఇంకా ఆ పసి పాప స్కూల్ కి వెళ్ళడానికి వున్న బెంగని, నా బెంగగా అభివర్ణిస్తూ, కారు దిగి పోతుండడం,  hug  చేసుకుంటుండడం, నేను తొందరగా వచ్చేస్తాను బెంగపెట్టుకోకు అంటూ ఏడుస్తూ నన్ను ఓదార్చడం.....

మెట్టు తర్వాత మెట్టు మంచి మార్క్స్ తో పూర్తి చేసుకుంటూ ఇవాళ గాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది.

నాకే ఇలా వుంటే తన తల్లితండ్రులకు ఎలా వుండి వుంటుందో?

గ్రాడ్యుయేషన్ వేడుకలో వందల మంది విద్యార్ధుల కేరింతలూ, బేండూ, టీచర్ల చక్కని సందేశాలతో ఉదయం అంతా సందడిగా గడిచి పోయింది.

చిట్టి తల్లీ! నువ్వు పరిపూర్ణమైన సఫలీకృత జీవితం అనుభవించాలని మనః పూర్వక ఆశీస్సులు.

అమ్మమ్మ, తాతగారు

లాస్య వీణ కచేరీ పై

చాలాకాలానికి యివాళ రవీంద్రభారతిలో నాదప్రభ సంస్థవారి దశాబ్ది ఉత్సవాలలో మన జయలక్ష్మి ...శ్యామసుందర్ అయ్యగారి గార్ల మనవరాలు ... లాస్యజోస్యుల వీణావాద్యం గంటపాటు రెప్పవాల్చకుండా...తాళంవేస్తూ .. తాదాత్మ్యంలో తలూపుకుంటూ భలేఎంజాయ్ చేశానండి!

రెప్పవాల్చకుండా సంగీతం వినడమేవిటో... చెవులు పెద్దవిచేసుకునో రిక్కించో అనాలికదా.... అనుకుంటున్నారా?
మీకు సంజాయిషీ యివ్వాల్సిందే!

పదహారేళ్ల లాస్య... అచ్చంగా పదహారణాలతెలుగింటి ముస్తాబులో ముద్దొస్తూనేవుంది.అంతేనా...చంద్రబింబంకన్నా అందమైన ముఖవర్ఛస్సు..
చారెడేసికళ్లు...చెంపలూ చాలావిశాలం.మేకప్పులేకుండా పసిమిచాయతో ఎంత సహజంగా వుందో పిల్ల లావణ్యం.
దానికితోడు అమ్మమ్మ తాతయ్యల లాగే మంచిపొడవు!

ఇవన్నీ అదనపు అసెట్లు .
అసలు మాట... లాస్య కచేరీకి ... గురువుగారు కూడాఅయిన తాతయ్య ...మైకులు దగ్గరుండి అమర్చడం...తిరిగి ఆడియన్స్ లోచేరి .. తాళంచూపిస్తూ ...లాస్యకి కనుసన్నలతోనే యిచ్చిన ప్రోత్సాహం...నాకుసంబరమనిపించింది.

నాట.. కీరవాణి.. ఆనందభైరవి... పూర్వీకల్యాణి..నీలాంబరి రాగాలలో చాలా గంభీరంగా వీణా వాదనం ప్రదర్శించింది.
మధ్యమధ్య ... పక్కవాద్యాలతోనేకాదు ... ప్రేక్షక జనంతోనూ ... దరహాసంతో ఆకట్టుకుంది.

విదేశాలలోనూ లాస్యకు ప్రదర్శనలివ్వడం కొత్తేమీకాదనీ తెలిసింది. వైణికులకుటుంబంలో మరో ముత్యమనుకోండి.పేరుచూశారా ప్రాస కలిగిఎంతబాగుందో!

ఆపుకున్న ముద్దును ..కచేరీ అవగానే వేదికఎక్కి .. కరచాలనంతోపాటూ కానిచ్చేశాను.

గురువులు వేదిక పైనా ... కిందా కూడా ఎంత బిజీ నో వేరేచెప్పాలా??

8, జూన్ 2019, శనివారం

ధన్యవాదాలు

హితులారా, సన్నిహితులారా, స్నేహితులారా!

మీ ప్రేమాస్పదమైన శుభాశీస్సుల, శుభాకాంక్షల జడివానలో తడిసి ముద్దయి పోయాను. మీ అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు.

"ఏనాటి నోము ఫలమో ఏదాన బలమో"
" తొలి నే జేసిన పూజా ఫలమో, నా పూర్వజుల పుణ్య ఫలమో"
ఇంత మంది శ్రేయోభిలాషులను పొంద గలగడం....
మా కుటుంబానికి మీ అందరి ఆశీస్సులు పుష్కలంగా దొరకాలని మనః పూర్వకంగా వాంఛిస్తున్నాను.

మా ఈ మనుగడ ఇలానే సాగాలని ఆకాంక్షిస్తూ,

      జయలక్ష్మి అయ్యగారి

గులాబీ బాల పుట్టింది

2001 మే 15 అర్ధరాత్రి 2.36 నిమిషాలు, JFK Hospital New Jersey. మా పెళ్ళి రోజు, పెళ్ళి ముహుర్తం......

“అరే బాప్రే బాప్! మళ్ళీ మొదలా. నిన్ననేగా పెళ్ళి రోజన్నారు. మళ్ళీ 18 ఏళ్ళ క్రితం పెళ్ళి రోజు తలచుకుంటున్నారు.ఈవిడ ఈ మత్తులోంచి బయట పడదురా నాయనా”  అనుక్కుంటున్నారని బెట్.

మరి విషయం వుంది వినండి. 2001 మే 15  రాత్రి ఇలా కునుకు పట్టిందో లేదో, ఒక సుందర దివ్య విగ్రహం ప్రత్యక్షమై  నీకు పెళ్ళి రోజు కానుకగా గులాబీల బుట్ట కావాలా/ మల్లెల బుట్ట కావాలా అని అడిగారు!  నేను నాకు అందమైన గులాబీల బుట్ట కావాలని కోరేను.

ఇంతలో ఎక్కడో “ఉవ్వా, ఉవ్వా, ఉవ్వా” అని వినిపిస్తోంది, కళ్ళు నులుము కుంటూ టైమ్ చూస్తే 2.36, సరిగ్గా 30 సంవత్సరాల క్రితం మావారు నాకు మంగళ సూత్రధారణ చేస్తున్న సమయం అనుక్కున్నాను మనస్సులో , ఇంతలో మా అమ్మాయి, అమ్మా మంచం కింద చూడూ అంది.మా అమ్మాయి మంచం కింద పెద్ద గులాబీ రంగు గులాబీల బుట్ట.

పేధ్ధ పేధ్ధ గులాబీలు అందంగా పరచబడి సువాసనలు వెదజల్లుతున్నాయి. బయటకి నెమ్మదిగా బుట్ట జరిపాం నేనూ మా అల్లుడూ. అందులోంచి వున్నట్టుండి కాళ్ళూ చేతులూ కదులుతున్నాయి. బాబోయ్!  చాలా భయం వేసింది. ఇంతలో చంద్ర బింబంలాంటి వదనంతో ఒక గులాబీ బాల. ఎఱ్ఱటి పెదవులు, ముద్దుగా వున్న  ఒక ముద్దులొలుకే బొమ్మలాంటి “లాస్య”

ఓహో! ఆ దివ్యసుందర విగ్రహం మాకు ఒసగిన ఈ గులాబీ బాల ఎవరంటే......30వత్సరాల మా వైవాహిక జీవితానికి ఒక తీపి గుర్తు.

మా పెళ్ళి రోజు, పెళ్ళి ముహర్తంలో  ఆ దేవ దేవుడు ప్రసాదించిన ఆ బుజ్జి పాప మనవరాలుగా మాకు అనంతమైన ఆనందం కలగజేసింది, జేస్తుంది, చేస్తూనే వుంటుంది.

మొన్నీమధ్యే పుట్టిన మా మనవరాలు బాగా చదువుకుంటూ, వీణ వాయిస్తూ మమ్మల్ని చాలా ఆనంద పరుస్తోంది.

అప్పుడే 3 గంటల వీణ అరంగేట్రం, ఇచ్చి ఇప్పుడు మంచి కాలేజీలో చేరబోతోంది..భగవద్గీత 18 అధ్యాయాలూ చూడకుండా చదువుతుంది.

మొదటి మనవలు ఎప్పుడూ అపురూపమే....

చిట్టి “లాస్యమ్మా” భగవంతుడు నీకు అఖండ విద్య, ఆయురారోగ్య ఐశ్వర్యాలనిచ్చి, పరిపూర్ణమైన జీవితాన్నివ్వాలని మనఃపూర్వకంగా కోరుకుంటూ........   అమ్మమ్మ, తాతగారు.

మా పెళ్ళి

1971 లో జరిగిన మా పెళ్ళి ఇంటిముందు తాటాకుల పందిరి వేసి, ఉప్మా, లడ్డూ, బూందీ,చక్కటి పప్పు, నెయ్యీ, కూరలూ పులుసూ, మజ్జిగ, ఒడియాలూ, అప్పడాలూ, లాంటి వాటితో 2 1/2 రోజుల జరిగింది.మంచి సుస్వరమైన సన్నాయి, పెళ్ళికి ముందూ వెనుకా కూడా కోటిపల్లి ప్రకాశరావు గారు, నూకల వారూ మొదలైన ఉద్దండులచే కచేరీలు, భావనా కళా సమితి వారితో సినిమా పాటల ప్రోగ్రాం ( అందులో మాధవపెద్ది సురేష్, రమేష్, చంద్రకాంతా మొదలైన లబ్ధ ప్రతిష్టులు పాల్గొన్నారు). అప్పట్లో చాలా తృప్తిగా ఆనందంగా జరిగింది మా పెళ్ళి.

వివాహం కన్నా ఆ తర్వాత గడిపే జీవితమే ముఖ్యమైనది. ఇద్దరూ కలసి మెలసి బాధ్యతలు పంచుకుని, సుఖాలనూ పంచుకుని జీవించాలి. అలకలు కూడా వారిద్దరి మధ్యా సఖ్యతను పెంచుతాయి. కానీ ఆలు మగల మధ్య పొరపొచ్చాలు అద్దం మీద ఆవగింజలా అరక్షణం వుండాలి కానీ పంతాలుగా మారి జీవితాలని పాడుచేసుకోకూడదు. ఇప్పటి పెళ్ళిళ్ళతో చూస్తే మా పెళ్ళి కి ఖర్చు అతి తక్కకవ, ఆడంబరం అసలు లేదు, కానీ అంతు లేని ఆనందం పెళ్ళి జరుగుతున్నప్పుడూ, పెళ్ళి జరిగాక ఈనాటి వరకూ.

అప్పట్లో అందరి పెళ్ళిళ్ళూ అదే స్ధాయిలో జరిగేవి, తరువాత కూడా కొన్ని దశాబ్దాల వరకూ అదే విధంగా కొనసాగింది.

ఇప్పుడు ఎన్ని లక్షలు ఖర్చండీ పెళ్ళంటే? తల్లితండ్రులు కూడా వారి స్థితి గతులు తెలియజేసుకోడానికీ, ఈ పోటీ ప్రపంచంలో నిలవడానికీ వారు సంపాయించింది అంతా ఖర్చు పెడుతున్నారు. పోనీ ఇది కూడా సరే, కొన్ని నెలలు తిరక్కుండానే విడాకులు. తల్లితండ్రులకు ఎంత ఖర్చు, ఎంత శ్రమ, ఎంతటి మన స్థాపం?

వీలయినంతవరకూ సర్దుకోడానికి ప్రయత్నించాలి. మరీ అలవికాని పరిస్థితి అయితే తప్పదు.

ఒక పక్కకొత్త పెళ్ళి కొడుకులూ/ కూతుళ్ళ క్యూ, ప్రక్కనే విడాకుల వారి క్యూ!

ఈ వ్యవస్థ మారి, పెళ్ళి ఖర్చులు, పెట్టుబళ్శూ తగ్గించి, పెళ్ళి తాలూకు అంతరార్ధం అర్ధం చేసుకుని,ఆనందంగా జీవించాలి కొత్త దంపతులందరూ!